ఓఎన్‌జీసీ, ఐఓసిలకు ‘సబ్సిడీ’ ఊరట
న్యూఢిల్లీ: దేశీయంగా చమురు, గ్యాస్ అన్వేషణకు ఊతమిచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ (వంటగ్యాస్) సబ్సిడీలను చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపునిచ్చింది. 2015-16లో ప్రభుత్వమే ఈ భారం పూర్తిగా మోస్తుందని చమురు శాఖ కార్యదర్శి సౌరభ్ చంద్ర తెలిపారు. హైడ్రోకార్బన్స్ అంశంపై మంగళవారం జరిగిన ఫిక్కీ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ సబ్సిడీ భారం వల్ల ఓఎన్‌జీసీ, ఆయిల్ సంస్థల లాభాలు తగ్గిపోతుండటం వల్ల అవి కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి నెలకొంది. త్వరలో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు సంబంధించిన 69 చిన్న చమురు బ్లాకులను వేలం వేయనుందని సౌరభ్ చంద్ర తెలిపారు. ఈ చిన్న చమురు బ్లాకులను అభివృద్ధికి ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలునిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని, అందువలనే వాటికి సంబంధించిన బ్లాకులను వేలం వేయాలని భావిస్తున్నామని వివరించారు.