సర్కారీ షేర్ల మేళా!
కేంద్రం నుంచి కొత్త ఈటీఎఫ్ ‘భారత్–22’
► ఆరు రంగాలకు చెందిన షేర్లతో కూర్పు
► ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ తదితర 22 షేర్లతో ఏర్పాటు
న్యూఢిల్లీ: ‘భారత్–22’ పేరుతో కొత్త ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరు రంగాల నుంచి ఎంపికచేసిన షేర్లు ఇందులో వుంటాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటుచేసి, మూడు విడతలుగా ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 8,500 కోట్లు సమీకరించిన ప్రభుత్వం తాజాగా రెండో ఈటీఎఫ్‌కు శ్రీకారం చుట్టింది. ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్, బేస్ మెటల్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీస్–ఈ ఆరు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్లతో భారత్–22ను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారంనాడిక్కడ మీడియాకు చెప్పారు.
ఈ 22 షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వానికి వ్యూహాత్మక వాటా కలిగిన ప్రైవేటు కంపెనీలు వున్నాయి. ఎస్‌యూయూటీఐ (గతంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగం) ద్వారా ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీల్లో వ్యూహాత్మక వాటా వుంది. తాజా ఈటీఎఫ్‌కు ఆయా రంగాలను ఎంపికచేసేటపుడు, ఆ రంగాల్లో జరిగిన సంస్కరణల్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఆయా షేర్ల విలువలపై సంస్కరణల సానుకూల ప్రభావం పడుతుందని ఆయన వివరించారు.
ప్రభుత్వ బ్యాంకులు కూడా...
భారత్–22 జాబితాలో పైన పేర్కొన్న ప్రైవేటు దిగ్గజాలే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు వున్నాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పీఎస్‌యూ బ్యాంకుల్ని భారత్–22లో చేర్చినట్లు జైట్లీ తెలిపారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను అవసరమైన సమయంలో 52 శాతానికి తగ్గించుకుంటామని ఆయన చెప్పారు. కొత్త ఈటీఎఫ్‌లో ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్, కోల్, మైనింగ్ ప్రభుత్వ కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కోలు వున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌జేవీఎన్‌ఎల్, గెయిల్, పీజీసీఐఎల్, ఎన్‌ఎల్‌సీలు కూడా చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొద్దికొద్దిగా ప్రభుత్వ వాటాను ఈటీఎఫ్‌లోకి మళ్లిస్తామని ఆయన వివరించారు. తొలి ఫండ్ ద్వారా ఈటీఎఫ్ ప్రయోగాన్ని ఇండియా విజయవంతంగా అమలుచేసిందని జైట్లీ చెపుతూ ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్‌ల కింద 4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయన్నారు. పలు పెన్షన్ ఫండ్స్, ప్రభుత్వ ఫండ్స్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నందున, వచ్చే నాలుగేళ్లలో ఈ ఆస్తుల విలువ 7 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చన్నది అంచనా అని ఆయన వివరించారు. ఈటీఎఫ్‌లో పెట్టుబడికి రిస్క్ తక్కువని ఆయన అన్నారు.
మ్యూచువల్ ఫండ్ తరహాలోనే...
మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లే..ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలుచేయడం ద్వారా 22 బ్లూచిప్ కంపెనీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ప్రభుత్వం తొలుత ప్రవేశపెట్టిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా ఇదేతరహాలో ఇన్వెస్టర్ల నుంచి 3 దశలుగా రూ. 8,506 కోట్లు సమీకరించింది.
తొలి ఈటీఎఫ్‌లో ఓఎన్‌జీసీ, కోల్‌ఇండియా, ఐఓసీ, గెయిల్, ఆయిల్ ఇండియా, పీఎఫ్‌సీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆర్‌ఈసీ, ఇంజనీర్స్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్‌లు వున్నాయి. భారత్–22 యూనిట్లను ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా వివిధ దశల్లో ఇన్వెస్టర్లకు విక్రయించనున్నట్లు కేంద్ర పెట్టుబడుల శాఖ కార్యదర్శి నీరజ్ గుప్తా వెల్లడించారు. దీని ద్వారా సేకరించబోయే నిధులకు పరిమితి ఏదీ విధించుకోలేదన్నారు.