యునెటైడ్ నేషన్స్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లాంటి ప్రపంచ స్పోర్ట్స్ బాడీలు... స్వలింగ సంపర్క అథ్లెట్లకు మరింత మద్దతు ఇవ్వాలని అమెరికా టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా, ఎన్‌బీఏ ప్లేయర్ జాసన్ కొలిన్స్ కోరారు. ఈ అంశంలో ఐఓసీ మరింత స్వేచ్ఛగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నవ్రతిలోవా వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కులపై జరుగుతున్న హింస, వివక్షపై ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్రచార కార్యక్రమానికి ఈ ఇద్దరు ప్లేయర్లు మద్దతుగా నిలిచారు. ‘ఇది ఒక్క దేశానికే పరిమితం కాలేదు. అన్ని దేశాల్లో ఇది కొనసాగుతోంది. అయినా దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. 2022 ఫిఫా వరల్డ్‌కప్ ఖతార్‌లో జరగనుంది. అక్కడి నిబంధనల ప్రకారం స్వలింగసంపర్క చర్యకు జైలు శిక్ష వేస్తారు’ అని నవ్రతిలోవా ఆందోళన వ్యక్తం చేశారు.
రాబోయే ఒలింపిక్స్, సోచీలో జరగనున్న పారాలింపిక్స్‌లో స్వలింగ సంపర్కుల పట్ల కొంత మంది అధికారులు చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు. అయితే దీనిపై స్పందించిన కొలిన్స్ మాట్లాడుతూ... ‘స్థానికంగా ఉండే స్వలింగ సంపర్కులు, లెస్బియన్స్, లింగమార్పిడి వ్యక్తులపై దృష్టిపెడితే బాగుంటుంది. కానీ క్రీడలు ఆడేందుకు వచ్చే వారిపై ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని కొలిన్స్ వివరించారు.