న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఉమ్మడిగా రూ. 2,749 కోట్ల నికర నష్టాలు ప్రకటించాయి. అయితే తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఇవి మరింత అధికమై రూ. 21,201 కోట్లకు చేరాయి. ఇందుకు పెట్రోల్, డీజిల్ తదితర ప్రొడక్టులను తయారీ వ్యయాలకంటే తక్కువ ధరలో విక్రయించడం ప్రభావం చూపింది. అయితే క్యూ2లో ప్రభుత్వం ఎల్‌పీజీ విక్రయాలపై వీటికి ఉమ్మడిగా రూ. 22,000 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. దీంతో క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే క్యూ2లో చమురు పీఎస్‌యూల నష్టాలు పరిమితమయ్యాయి.
వెరసి చమురు పీఎస్‌యూల చరిత్రలో తొలిసారి వరుసగా రెండు త్రైమాసికాలలో నికర నష్టాలు ప్రకటించిన రికార్డు నమోదైంది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్‌ఎం) మెరుగుపడినప్పటికీ 7 నెలలుగా ధరలను సవరించకపోవడంతో నష్టాలు వాటిల్లినట్లు ప్రభుత్వ దిగ్గజాలు పేర్కొన్నాయి. కాగా.. క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,197 కోట్ల నికర నష్టాన్ని హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,263 కోట్లు, ఐవోసీ రూ. 1,995 కోట్లు చొప్పున నష్టాలు నమోదు చేయడం గమనార్హం!
ఎల్‌పీజీ సబ్సిడీ ఇలా
ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌పీజీ విక్రయాల సబ్సిడీని చమురు పీఎస్‌యూలు క్యూ2 ఫలితాలలో పరిగణనలోకి తీసుకున్నాయి. ఐవోసీ అత్యధికంగా రూ. 10,800 కోట్లు అందుకోగా.. హెచ్‌పీసీఎల్‌కు రూ. 5,617 కోట్లు, బీపీసీఎల్‌కు రూ. 5,582 కోట్లు చొప్పున లభించాయి.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టలేదని చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూలకు సబ్సిడీ చెల్లింపుల ద్వారా ఆర్థిక శాఖ నుంచి మద్దతును కోరినట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment