వేగంగా వంటగ్యాస్ సరఫరా
చెన్నై, సాక్షి ప్రతినిధి: వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో తరచూ ఏర్పడుతున్న జాప్యానికి చెక్‌పెట్టబోతున్నారు. బుక్ చేసుకున్న వారం రోజుల్లోనే ఇంటికి సిలిండరు సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సిద్ధమవుతోంది. రాష్ట్రం మొత్తం మీద 1.12 కోట్ల గ్యాస్ సిలిండర్లు సరఫరాలో ఉండగా, ఒక్క చెన్నైలోనే రూ.12 లక్షలు ఉన్నాయి. అట్టడుగు వర్గాలు సైతం వంటగ్యాస్ వినియోగానికి అలవాటుపడిన తరుణంలో సక్రమంగా సరఫరా జరగని పక్షంలో సతమతమవుతున్నారు. వంటగ్యాస్ కంపెనీల నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్న వారం రోజుల్లోగా గ్యాస్ సిలిండర్ చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 20 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటున్నారు. చెన్నైలో ఇటీవల ఒక మహిళ ఎంతకూ గ్యాస్ సరఫరా జరగక పోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీస్ జోక్యంతో సిలిండరు పొందాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ జాప్యానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్య పెరిగిపోవడం, వాటి స్థానంలో కొత్త సిలిండర్లు లేకపోవడం వంటివి కొన్ని కారణాలు. అయితే కొన్ని ఏజన్సీల్లోని ఉద్యోగులు సిలిండర్ల సరఫరాలో గోల్‌మాల్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లోడు రాలేదు, ఇంకా జాప్యం కావచ్చు వంటి మాటలతో గ్యాస్ కంపెనీలపై నిందలు మోపి తమకు నచ్చిన వారికి సిలిండర్లు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. సిలిండర్ల సంఖ్యలో తగ్గుదల ఏజెన్సీలకు అవకాశంగా మారకుండా ఐవోసీ దృష్టి సారించింది. పదేళ్ల వినియోగకాలాన్ని దాటిన సిలిండర్లను ముందుగా తనిఖీ చేసే పనిలో పడింది. ఐవోసీ చెన్నై మండలం పరిధిలోని తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోని పాత సిలిండర్లను సేకరించి రోజుకు 5 వేల నుంచి 10 వేల చొప్పున తనిఖీలు నిర్వహిస్తోంది.
సరఫరాలో జాప్యానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఒక వైపు కాలం చెల్లిన సిలిండర్లను లెక్కకడుతూనే రెండు లక్షల కొత్త సిలిండర్లను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంపై ఐఓసీ అధికారి ఒక మీడియాతో మాట్లాడుతూ, వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఏర్పడిన డిమాండ్ మరో రెండు వారాల్లో సర్దుకుంటుందన్నారు. బుక్ చేసిన వారంలోగా సిలిండర్లు చేరేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ ఏజెన్సీలు మోసానికి పాల్పడుతున్నట్లు రాతపూర్వక ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెన్నై ఆళ్వారుపేటకు చెందిన ఒక గృహిణి ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి గ్యాస్ ఏజన్సీపై క్రమశిక్షణ చర్యను చేపట్టామని అన్నారు.