కామన్వెల్త్ గేమ్స్ అనుభూతి గుర్తొచ్చింది
సచిన్ టెండూల్కర్
న్యూఢిల్లీ: రియోలోని ఒలింపిక్స్ విలేజ్‌లో అడుగుపెట్టిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాత రోజులను గుర్తుచేసుకున్నారు. 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ సభ్యుడిగా అడుగుపెట్టినప్పుడు ఎలాంటి ఉద్వేగానికి గురయ్యానో రియోలోనూ అలాగే ఫీలవుతున్నట్టు చెప్పారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్ విలేజ్‌లో ఆటగాళ్లను కలుసుకున్నారు. ‘గేమ్స్ విలేజ్‌లో ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో నేను మరోసారి అనుభవించాను.
1998 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రికెటర్‌గా పాల్గొన్నాను. అయితే ఆ గేమ్స్‌కు దీనికి చాలా వ్యత్యాసమున్నా క్రీడా స్ఫూర్తి, ఉత్సాహం మాత్రం ఒక్కటే. ఇక ఒలింపిక్ క్రీడల్లో నేనేమీ నిపుణుడిని కాను. అందుకే పోటీల్లో ఎలా గెలవాలో వారికి సలహాలివ్వలేను. ఎలా పోరాడాలో ఆటగాళ్లకు తెలుసు. నాకు టెన్నిస్, టేబుల్ టెన్నిస్ అంటే ఇష్టం’ అని సచిన్ అన్నారు.