
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు(Laureus World Sports Awards)కు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ వెల్లడించింది. అత్యుత్తమ పునరాగమనం(బెస్ట్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్) విభాగంలో అతడిని నామినేట్ చేసినట్లు తెలిపింది. ఈ అవార్డు కోసం పంత్‌తో పాటు మరో ఐదుగురు పోటీపడుతున్నారు.
పంత్ భావోద్వేగం
ఇక తన పేరు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అవడం పట్ల రిషభ్ పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఆ దేవుడు మనకు ఇచ్చిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలని నేను విశ్వసిస్తాను. కారు ప్రమాదంలో దాదాపు చావు అంచుల దాకా వెళ్లిన నేను ఆ దేవుడి దయ వల్లే బయటపడ్డాను.
ఆ తర్వాత నాలో చాలా పరివర్తన వచ్చింది. పిచ్‌పై తిరిగి పరుగుల వరద పారించాలనే కసి మరింతగా పెరిగింది. అదంత సులువు కాదని తెలుసు. అయినా.. సరే నేను పోరాడాలనే నిర్ణయించుకున్నా. తిరిగి ఫిట్‌నెస్ సాధించి టీమిండియాకు మళ్లీ ఆడాలనే కలను నెరవేర్చుకున్నాను.
అయితే, నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. నాతో నేను ఓ యుద్ధమే చేశా. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా. లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ అవార్డుకు నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవం.
నేను మళ్లీ సాధారణ జీవితం గడపడానికి నా కుటుంబం, బీసీసీఐ, వైద్యులు, నా వైద్య బృందం, మా జట్టు సహాయక సిబ్బంది, ట్రెయినర్లు.. ముఖ్యంగా నా అభిమానులు కారణం. నాకు దక్కిన గొప్ప గౌరవంగా దీనిని భావిస్తున్నా. ఎప్పుడూ ఓటమిని అంగీకరించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నది నేను నేర్చుకున్న పాఠం. మానసికంగా బలంగా ఉంటే మునుపటి సంతోషాలు అవే వెతుక్కుంటూ వస్తాయి’’ అని రిషభ్ పంత్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.
తీవ్రంగా గాయపడి
2022, డిసెంబరు 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న క్రమంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.
అయితే, అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో డెహ్రాడూన్ ఆస్పత్రిలో ప్రాథమిక చికత్స అనంతరం బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందించింది.
ఈ నేపథ్యంలో క్రమక్రమంగా కోలుకున్న 27 ఏళ్ల పంత్.. ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో టెస్టుల సందర్భంగా టీమిండియా తరఫున పునరాగమనం చేయడంతో పాటు టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులోనూ భాగమయ్యాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్లకు(లక్నో సూపర్ జెయింట్స్) అమ్ముడుపోయి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడుతున్న భారత జట్టులో పంత్ భాగం. ఇదిలా ఉంటే పంత్‌తో పాటు బ్రెజిల్ జిమ్నాస్ట్ రెబెక ఆండ్రడే, అమెరికా స్విమ్మర్ సెలెబ్ డ్రెసెల్, స్విట్జర్లాండ్‌కు చెందిన లారా గట్- బెహ్రామీ, స్పెయిన్‌మోటార్ సైక్లిస్ట్ మార్క్ మార్కేజ్, ఆస్ట్రేలియా స్విమ్మర్ అరియానే టైట్మస్ కమ్‌బ్యాక్ అవార్డు పోటీలో నిలిచారు.
ఇక భారత్ నుంచి లారెస్ వరల్డ్ స్పోర్ట్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్లలో సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని పంత్ ఆక్రమించాడు. కాగా ఏప్రిల్ 21న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఈ అవార్డు వేడుక జరుగనుంది.
చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment