రష్యా బతికిపోయింది...
‘సంపూర్ణ నిషేధం’ లేదని ప్రకటించిన ఐఓసీ
* షరతులతో అథ్లెట్లకు ఒలింపిక్స్‌లో అనుమతి
* డోపీలకు స్థానం లేదని స్పష్టీకరణ
లుసానే: రియో ఒలింపిక్స్‌లో అగ్ర దేశం రష్యా పాల్గొనడంపై ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. ఈ క్రీడల్లో ఆ దేశ క్రీడాకారులు పాల్గొనేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అనుమతి ఇచ్చింది. రష్యాను చుట్టుముట్టిన భారీ డోపింగ్ వివాదం నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధించే పరిస్థితి కనిపించింది. అయితే చివరకు సుదీర్ఘ చర్చల అనంతరం ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రష్యా దేశంపై పూర్తిగా నిషేధం విధించకపోయినా...
ఆ జట్టు అథ్లెట్లపై మాత్రం నిఘా నేత్రం పెట్టింది. ఆటగాళ్లకు వేర్వేరు షరతులు పెట్టిన ఐఓసీ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కొన్ని నిర్దేశిత ప్రమాణాలు కూడా సూచించింది. వాటిని అందుకునే అథ్లెట్లకే అవకాశం లభిస్తుందని స్పష్టం చేసింది. ‘రష్యాకు అనుమతి ఇస్తూనే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మేం కొన్ని కఠిన ప్రమాణాలను రూపొందించాం. రియోలో పోటీ పడాలనుకునే ప్రతీ ఒక్కరు వీటిని అందుకోవాలి. ఒకవైపు హెచ్చరిక జారీ చేస్తూనే, మరోవైపు ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకునే ప్రతీ అథ్లెట్ హక్కును భంగం కలగకుండా మేం సమన్యాయం పాటించాం’ అని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ వ్యాఖ్యానించారు.
* రియో ఒలింపిక్స్‌లో రష్యా ఆటగాళ్లను అనుమతించే విషయంపై ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యలే తుది నిర్ణయం తీసుకుంటాయి. అర్హత గల ఆటగాళ్లను తమ వివరాలను సమాఖ్యకు పంపించాలి. వాటిని పరిశీలించిన తర్వాత సం తృప్తి చెందితేనే ఆడేందుకు అవకాశం ఇస్తారు.
* ఒక్కో ఆటగాడి వ్యక్తిగత రికార్డును పరీక్షిస్తారు. గతంలో ఒక్కసారైనా డోపింగ్‌లో పట్టుబడిన అథ్లెట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ రియోకు అనుమతి లేదు. డోపింగ్ ఆరోపణలపై శిక్షకు గురై, శిక్షా కాలం పూర్తి చేసుకున్నా సరే... అవకాశం లేదు.
* డోపింగ్ వివాదాన్ని బయటపెట్టడంలో కీలక పాత్ర పోషించి, విచారణకు సహకరించిన రష్యా అథ్లెట్ యూలియా స్టెపనోవాను ప్రత్యేకంగా అభినందించిన ఐఓసీ... ఆమె ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మాత్రం అనుమతించలేదు. గతంలో డోపింగ్ పరీక్షలో విఫలమైన స్టెపనోవాకు తాజా నిబంధనల ప్రకారం అర్హత లేదు.
వివాద క్రమం...
రష్యా జట్టులో 99 శాతం మంది అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతున్నట్లు, వారికి అధికారులే అండగా నిలుస్తున్నట్లు 2014 డిసెంబర్‌లో తొలిసారిగా జర్మనీ మీడియా సంస్థ ఒక వీడియో డాక్యుమెంటరీలో బయటపెట్టింది. దాంతో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) స్వతంత్ర విచారణ అనంతరం గత ఏడాది నవంబర్‌లో రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం విధించారు.
గత జూన్ నెలలో డోపింగ్‌లో తమకు సంబంధం లేదని, రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని 67 మంది రష్యా అథ్లెట్లు విడిగా చేసిన అభ్యర్థనను కూడా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (కాస్) కొట్టివేసింది. అయితే రష్యాను ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధించాలని ‘వాడా’ స్వతంత్ర నివేదిక ఇచ్చినా... చివరకు ఐఓసీ దానిని పక్కన పెడుతూ రష్యాకు ఉపశమనం కలిగించింది. ఒలింపిక్స్ చరిత్రలో రష్యా ఇప్పటివరకు 132 స్వర్ణాలతో కలిపి మొత్తం 395 పతకాలు సాధించింది.