'ఇక్కడ రాజకీయాలకు ఆస్కారం లేదు'
రియో డి జనీరియో: రియో ఒలింపిక్స్లో పాల్గొనే రష్యన్ అథ్లెట్ల విషయంలో ఎటువంటి రాజకీయాలకు ఆస్కారంలేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) స్పష్టం చేసింది. అంతా ఆయా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల నివేదిక ఆధారంగానే రష్యా క్రీడాకారుల ప్రాతినిథ్యంపై తుది నిర్ణయం తీసుకుంటున్నామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. డోపింగ్ ఉదంతంలో ఎటువంటి ప్రమేయం లేని వారి హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉన్నందున ఆ దేశంపై పూర్తిగా నిషేధం విధించలేదన్నారు. దానిలో భాగంగానే యావత్ దేశంపై కాకుండా క్రీడాకారుల వ్యక్తిగత డోపింగ్ రికార్డును పరిశీలించిన అనంతరం రియోకు అనుమతిస్తున్నట్లు బాచ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అంతా ఒక నియమం ప్రకారం నిజాయితీగా జరుగుతుందన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యాలకు ఆస్కారం ఉండబోదని ఆయన పేర్కొన్నారు.
రియో క్రీడల్లో రష్యా క్రీడాకారులు పాల్గొనేందుకు ఐఓసీ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రష్యాను చుట్టుముట్టిన భారీ డోపింగ్ వివాదం నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధించే పరిస్థితి కనిపించింది. అయితే చివరకు రష్యా దేశంపై పూర్తిగా నిషేధం విధించకపోయినా ఎటువంటి డోపింగ్ రికార్డు లేని వారిని రియోకు అనుమతించాలని ఐఓసీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు రియోలో పాల్గొనే రష్యన్ అథ్లెట్ల బాధ్యతను అప్పగించింది.