
వేలానికి ఐవోసీ వాటాలు
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడంలో యూపీఏ సర్కారు కంటే రెండు రెట్లు వేగంతో వెళుతోన్న మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)లో 10 శాతం వాటాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం (ఆగస్టు 24న) స్టాక్ మార్కెట్లలో ఈ వాటాలను విక్రయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విక్రయాల ద్వారా దాదాపు రూ. 9, 500 కోట్ల ధనం ప్రభుత్వానికి సమకూరుతుంది.
ప్రస్తుతం ఐవోసీలో కేంద్ర ప్రభుత్వానికి 68.57 శాతం వాటా ఉంది. విడదలవారీగా పెట్టుబడుల ఉపసంహరణను అమలు చేయాలనుకుంటున్న సర్కారు.. రూ.69, 500 కోట్లను సమకూర్చుకోవాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే సోమవారం 10 శాతం వాటాను విక్రయిస్తున్నది. ఇలా ప్రభుత్వం ఐవోసీ వాటాలను విక్రయించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
ఆర్థిక, చమురు శాఖల మంత్రులు అరుణ్ జైట్లీ, ధర్మేంద్రప్రధాన్ లు విక్రయానికి సంబందించిన అన్ని వ్యవహారాలను ఇప్పటికే పూర్తిచేశారు. మరోవైపు ఓఎన్ జీసీ, ఎన్ఎండీసీ, నాల్కొ, పీఎస్యూ లాంటి డజనుకుపైగా ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ కసరత్తులు చేస్తున్నది.