అవినీతి మా వైఖరి మారదు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చార్జిషీట్ దాఖలైన వ్యక్తులు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఐఓఏ అభ్యంతరాలు పట్టించుకుంటే ఒలింపిక్ చార్టర్‌ను బలహీనపరిచినట్టవుతుందని తెలిపింది. పలు సూచనలతో ఇటీవలే భారత ఒలింపిక్ సంఘం రాజ్యాంగాన్ని ఐఓసీ సవరించింది.
దీంట్లో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారిపై ఉక్కుపాదం మోపింది. వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఐఓసీ ఎన్నికల్లో పాల్గొనే వీల్లేదని తేల్చింది. అయితే ఈ నిబంధనను ఐఓసీ వ్యతిరేకిస్తోంది. భారత న్యాయ వ్యవస్థలో ఇలాంటి ఆరోపణలు తదనంతరం తేలిపోవచ్చని వాదిస్తోంది. అయితే ఐఓఏ మాత్రం తన వైఖరిపై గట్టిగానే ఉంది. అలాగే సవరించిన ఐఓఏ రాజ్యాంగ ముసాయిదాలో తమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను కుదించుకోవాలని ఐఓసీ సూచించింది. ఈ సంఖ్యను 19కి తగ్గిస్తే, మంచి పాలన వీలవుతుందని ఐఓసీకి రాసిన లేఖలో పేర్కొంది.
‘బలవంతం చేయకూడదు’
ఈ వ్యవహారంపై మరోసారి ఐఓసీకి లేఖ రాయాలనే ఆలోచనలో ఐఓఏ ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 25న జనరల్ బాడీ సమావేశం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని అడగనుంది. ‘ఒకటి రెండు రోజుల్లో ఐఓసీకి మరో లేఖ రాయాలని అనుకుంటున్నాం. వారి చర్యపై ఎవరైనా కోర్టుకెక్కే అవకాశం ఉంది. చార్జిషీట్‌ను ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదని భారత చట్టం కూడా అడ్డుచెప్పడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలాంటి వారు పోటీ చేస్తున్నారు’ అని ఐఓఏ అధికారి ఒకరు తెలిపారు.
ఐఓసీ నిర్ణయంపై బింద్రా హర్షంభారత ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో అవినీతి మచ్చ పడిన వారికి చోటు లేదన్న ఐఓసీ నిర్ణయంపై ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా హర్షం వ్యక్తం చేశాడు.