ఎన్హెచ్పీసీ వాటా విక్రయానికి మంచి స్పందన
♦ నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయం
♦ కట్ ఆఫ్ ధర లో 5 శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయానికి మంచి స్పందన లభించింది. ఈ ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి కంపెనీలో 11.36 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. వ్యవస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా షేర్లు మూడు గంటలలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. వ్యవస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 1.58 రెట్లు అంటే 156.79 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి.
ఈ బిడ్స్ విలువ రూ.3,410 కోట్లు. అత్యధిక బిడ్‌లు ఎల్‌ఐసీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చాయని సమాచారం. గురువారం మిగిలిన 25.15 కోట్ల షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఆఫర్‌కు ఫ్లోర్‌ప్రైస్ రూ. 21.75కాగా, రిటైల్ ఇన్వెస్టర్లకు కట్ ఆఫ్ ధరకు 5 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. కాగా ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నిధులు లభిస్తాయని అంచనా. వాటా విక్రయ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 5.8 శాతం నష్టపోయి రూ.21.70 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం పీఎస్‌యూల్లో తొలి డిజిన్వెస్ట్‌మెంట్ ఇది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.