
న్యూఢిల్లీ: భారత్‌లో లిస్టింగ్‌పై ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఇండియా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కంపెనీ మాతృ సంస్థ ఎల్‌జీ కార్పొరేషన్ చైర్మన్ ‘క్వాంగ్ మో కూ’ భారత పర్యటనకు వచ్చినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ఎండీతో పాటు పలు సీనియర్ అధికారులతో ఆయన భేటీ అవుతారని, ఐపీవో సన్నాహాల గురించి తెలుసుకుంటారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే పెట్టుబడుల ప్రణాళికలను చర్చించవచ్చని వివరించాయి.
గ్రేటర్ నోయిడాలోని కంపెనీ ప్లాంటును ఆయన సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాలతో కూడా భేటీ అవుతారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐపీవో ద్వారా ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ 1.5 బిలియన్ డాలర్ల వరకు సమీకరించనున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి కంపెనీ రోడ్‌షోలు కూడా నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ఆదాయం రూ. 64,088 కోట్లుగా నమోదైంది.