ఎన్హెచ్పీసీ వాటా విక్రయం సక్సెస్
ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తొలి డిజిన్వెస్ట్‌మెంట్, ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయం విజయవంతమైంది. గురువారం రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విక్రయానికి మంచి స్పందనే లభించింది. వాటా విక్రయంలో భాగంగా 125.76 కోట్లు(11.36 శాతం వాటా) షేర్లను ఒక్కో షేర్ రూ.21.75 బేస్ ధరపై ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 156.79 కోట్ల షేర్లకు బిడ్‌లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన 25.15 కోట్ల షేర్లకు గాను 41.45 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి.
సంస్థాగత వాటా ఇన్వెస్టర్ల విభాగం 1.58 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విభాగం 1.65 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. మొత్తం మీద ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరాయి. ఎన్‌హెచ్‌పీసీలో ప్రభుత్వ వాటా 85.96 శాతం నుంచి 74.6 శాతానికి తగ్గుతుంది. ఫ్లోర్ ప్రైస్(రూ.21.75)లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాటా విక్రయం నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ షేర్ ధర బీఎస్‌ఈలో 1.8 శాతం క్షీణించి రూ.21.15 వద్ద ముగిసింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.