రూ. 50,000 కోట్లకు పరిమితం!
బడ్జెట్‌లో ప్రతిపాదనపై అంచనాలు
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ డివిడెండును అందించడంతో ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం పెరగకపోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి ఈ నెలలో వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్‌లో రూ. 50,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రకటించవచ్చని రేటింగ్స్ దిగ్గజం కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. ఎన్నికల ముందు తీసుకువచి్చన మధ్యంతర బడ్జెట్‌లో ఇదే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇటీవల ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ. 2.1 లక్షల కోట్ల డివిడెండును అందించిన నేపథ్యంలో కేర్ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మారినట్లు కేర్ పేర్కొంది. ఫలితంగా పీఎస్‌యూలలో భారీ స్థాయి వాటా విక్రయ పరిస్థితులు తలెత్తకపోవచ్చని తెలియజేసింది. ఒకవేళ వనరుల అవసరాలు ఏర్పడితే.. ఆస్తుల మానిటైజేషన్‌పై దృష్టి పెట్టే అవకాశమున్నట్లు వివరించింది.
జాబితాలో..
ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్‌సీఐ) విక్రయం పూర్తికావచ్చని అంచనా. దీంతో ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి వీలు చిక్కవచ్చని కేర్ రేటింగ్స్ పేర్కొంది. ఎస్‌సీఐకి గల భూములను విడదీయడంతో ఈ ఏడాది కంపెనీ విక్రయానికి మార్గమేర్పడనున్నట్లు తెలియజేసింది. ఇందుకు సానుకూల స్టాక్ మార్కెట్ పరిస్థితులు సైతం తోడ్పాటునివ్వనున్నట్లు అభిప్రాయపడింది. ఎస్‌సీఐలో పూర్తి వాటాను విక్రయిస్తే ప్రభుత్వానికి రూ. 12,500–22,500 కోట్లు సమకూరే వీలుంది.
ఈ బాటలో ఇతర దిగ్గజాలు కంకార్, పవన్ హన్స్ ప్రయివేటీకరణకు సైతం తెరతీయవచ్చని పేర్కొంది. గత పదేళ్లలో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 5.2 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. పీఎస్‌యూలలో 51 శాతానికికంటే తగ్గకుండానే వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 11.5 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు వీలున్నట్లు కేర్ మదింపు చేసింది. పీఎస్‌యూల నుంచి రూ. 5 లక్షల కోట్లు, బ్యాంకులు, బీమా సంస్థలలో వాటాల విక్రయం ద్వారా మరో రూ. 6.5 లక్షల కోట్లు చొప్పున అందుకునే వీలున్నట్లు
అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment