Financial experts
-
డిజిన్వెస్ట్మెంట్కు ఆర్బీఐ దన్ను
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) భారీ డివిడెండును అందించడంతో ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం పెరగకపోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి ఈ నెలలో వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్లో రూ. 50,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రకటించవచ్చని రేటింగ్స్ దిగ్గజం కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. ఎన్నికల ముందు తీసుకువచి్చన మధ్యంతర బడ్జెట్లో ఇదే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల ప్రభుత్వానికి ఆర్బీఐ రూ. 2.1 లక్షల కోట్ల డివిడెండును అందించిన నేపథ్యంలో కేర్ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మారినట్లు కేర్ పేర్కొంది. ఫలితంగా పీఎస్‌యూలలో భారీ స్థాయి వాటా విక్రయ పరిస్థితులు తలెత్తకపోవచ్చని తెలియజేసింది. ఒకవేళ వనరుల అవసరాలు ఏర్పడితే.. ఆస్తుల మానిటైజేషన్‌పై దృష్టి పెట్టే అవకాశమున్నట్లు వివరించింది. జాబితాలో.. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ) విక్రయం పూర్తికావచ్చని అంచనా. దీంతో ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి వీలు చిక్కవచ్చని కేర్ రేటింగ్స్ పేర్కొంది. ఎస్సీఐకి గల భూములను విడదీయడంతో ఈ ఏడాది కంపెనీ విక్రయానికి మార్గమేర్పడనున్నట్లు తెలియజేసింది. ఇందుకు సానుకూల స్టాక్ మార్కెట్ పరిస్థితులు సైతం తోడ్పాటునివ్వనున్నట్లు అభిప్రాయపడింది. ఎస్‌సీఐలో పూర్తి వాటాను విక్రయిస్తే ప్రభుత్వానికి రూ. 12,500–22,500 కోట్లు సమకూరే వీలుంది.ఈ బాటలో ఇతర దిగ్గజాలు కంకార్, పవన్ హన్స్ ప్రయివేటీకరణకు సైతం తెరతీయవచ్చని పేర్కొంది. గత పదేళ్లలో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 5.2 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. పీఎస్‌యూలలో 51 శాతానికికంటే తగ్గకుండానే వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 11.5 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు వీలున్నట్లు కేర్ మదింపు చేసింది. పీఎస్‌యూల నుంచి రూ. 5 లక్షల కోట్లు, బ్యాంకులు, బీమా సంస్థలలో వాటాల విక్రయం ద్వారా మరో రూ. 6.5 లక్షల కోట్లు చొప్పున అందుకునే వీలున్నట్లు అంచనా వేసింది. -
సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి
సాక్షి, అమరావతి: కోవిడ్ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో కంటే వైఎస్సార్ సీపీ పాలనలో సంపద పెరగడంతోపాటు అప్పులు తగ్గాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గణాంకాలతో సహా మీడియాకు గురువారం వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రి, కాగ్ చెప్పినవి వాస్తవాలని తెలిపారు. కొందరు స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లు అంటూ చేస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదన్నారు. ఎల్లో మీడియా, విపక్షాల మాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులపై పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కలు, అసెంబ్లీలో సీఎం వెల్లడించిన గణాంకాలు మాత్రమే వాస్తవాలన్నారు. రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఇంత తక్కువ ఎలా చెబుతారంటూ ఎల్లో మీడియాతో పాటు విపక్ష నేతలు బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. కేరళను అప్పులకు అనుమతించకుండా ఏపీకి మాత్రం ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు ప్రచురించడం విచిత్రంగా ఉందన్నారు. ♦ గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎల్లో మీడియా ఏనాడైనా కథనాలు ప్రచురించిందా? ఇప్పుడు రూ.వెయ్యి కోట్ల అప్పులపై ఐదుసార్లు వార్తలు రాసి రూ.ఐదు వేల కోట్ల అప్పుల తరహాలో చిత్రీకరిస్తోంది. బడ్జెట్ బయట చూసినా లోపల చూసినా అప్పులు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఆయన హయాంలో పరిమితికి మించి రూ.16,418 కోట్లు అప్పులు చేయడంతో ఇప్పుడు ఆ మేరకు కోత పడింది. అనుమతి ఉన్నా సరే మేం రూ.28,466 కోట్లు తక్కువ అప్పులు చేశాం. ♦ చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం కాగా ఇప్పుడు 12.4 శాతం మాత్రమే ఉంది. మేం అప్పులు చేసినా డీబీటీ రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరవేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు ఎటు వెళ్లినట్లు? టీడీపీ అధికారంలో ఉండగా సంపద పెరగలేదు కానీ అప్పులు మాత్రం పెరిగాయి. తాను సంపద పెంచే నిపుణుడినంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. కర్నాటక, తమిళనాడుతో పాటు వైఎస్సార్సీపీ పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టోలను ప్రకటించుకున్నారు. ♦ గత ఎన్నికల ముందు ఏప్రిల్‌లో పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు రూ.5,500 కోట్లు అప్పు చేయలేదా? వచ్చే ప్రభుత్వం పాలన చేయలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయలేరు. ఇక అప్పులు పుట్టకుండా చేశామంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించలేదా? అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఏ సంక్షేమ పథకాన్నీ ఆపకుండా నిర్విఘ్నంగా అమలు చేస్తోంది. పరిమితికి లోబడే అప్పులు చేస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు పార్లమెంట్‌లోనూ ప్రశి్నంచారు. కేంద్రం వాస్తవాలను వెల్లడించడంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలకు దిక్కు తోచట్లేదు. ♦ దేశంలో రాష్ట్రానికో నిబంధన ఉండదు. పరిమితికి లోబడి కేంద్రం అప్పులను అనుమతిస్తోంది. ♦ రాష్ట్ర అప్పులపై మాట్లాడుతున్న వారు, కథనాలను ప్రచురిస్తున్న వారు అసలు మన రాష్ట్రంలోనే ఉండరు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ అప్పుల గురించి దు్రష్పచారం చేస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు అప్పులు చేస్తే ఇప్పుడు రూ.10 వేల కోట్లు మాత్రమే అప్పు చేశాం. విద్యుత్ సంస్థలకు భారీగా పెట్టిన బకాయిలను సైతం తీరుస్తున్నాం. రెవెన్యూ రాబడులు, వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధిని గమనిస్తే సంపద ఎవరి హయాంలో ఎంత పెరిగిందో స్పష్టమవుతుంది. ♦ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ వయసులో తాను కొదమ సింహం అంటూ జంతువులతో పోల్చుకోవడం ఎందుకు? సింహం అంటే సింగిల్‌గా వస్తుంది. మరి ఆయన ఎప్పుడైనా సింగిల్‌గా పోటీ చేశారా? చంద్రబాబు పొత్తులు పెట్టుకోని పార్టీ లేదు. ఒకే పారీ్టతో రెండేసి సార్లు పొత్తులు పెట్టుకున్న ఘనత ఆయనదే. ♦ కొత్తగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించినవారు ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు అంటే ఏమిటో అధ్యయనం చేశాక మాట్లాడాలి. నాబార్డు నుంచి రూ.7,992 కోట్లు అప్పులు చేయలేదు. తీసుకున్నది రూ.3,281 కోట్లు మాత్రమే. కంటిన్జెన్సీ ఫండ్ గవర్నర్ వద్ద అత్యవసరాల కోసం ఉంటుంది. కొత్తగా వచి్చన వారు దాన్ని కూడా అప్పు కింద లెక్కించారు. పబ్లిక్ అకౌంట్ పద్దు నుంచి గత ప్రభుత్వం రూ.36,241 కోట్లు వాడుకోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3,475 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, వైఎస్సార్ హయాంతోపాటు విభజన అనంతరం మరోసారి టీడీపీ పాలనలో, వైఎస్సార్సీపీ వచ్చాక బడ్జెట్ బయట, లోపల చేసిన అప్పులు, రెవెన్యూ రాబడులు, వడ్డీల శాతం గణాంకాలను బుగ్గన వెల్లడించారు. ఆ వివరాలివీ... ♦ 2014–15 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,22,605 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 23.35 శాతం) ♦ 2018–19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 30.27 శాతం) ♦ 2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.5 శాతం) ♦ చంద్రబాబు పాలనలో అప్పులు ఏడు శాతానికిపైగా పెరగగా ఇప్పుడు నాలుగేళ్లల్లో మూడు శాతం మాత్రమే పెరిగాయి. ♦ 2014 – 2019 అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం ♦ 2019 నుంచి 2022–23 వరకు అప్పుల వార్షిక వృద్ధి రేటు 12.4 శాతం ♦ చంద్రబాబు హయాం కంటే ఇప్పుడు అప్పుల వృద్ధి రెండు శాతం తక్కువగానే ఉంది ♦ 1999 – 2004 రెవెన్యూ రాబడులు వృద్ధి 12.4 శాతం (ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాం) ♦ 2004 – 2009 రెవెన్యూ రాబడులు వృద్ధి 21.6 శాతం (వైఎస్సార్ హయాం) ♦ 2014 – 2019 రెవెన్యూ రాబడులు వృద్ధి 6 శాతం ♦ 2019 – 2023 రెవెన్యూ రాబడులు వృద్ధి 16.7 శాతం ♦ వైఎస్సార్ హయాంతో పోలిస్తే చంద్రబాబు జమానాలో రెవెన్యూ రాబడులు 15.6 శాతం క్షీణించగా ఇప్పుడు 10.7 శాతం పెరిగాయి ♦ 2014 – 2019 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,95,000 కోట్లు ♦ 2019 – 2023 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11,00,000 కోట్లు ♦ రాష్ట్ర విభజన నాటికి గ్యారెంటీలు, గ్యారెంటీలు ఇవ్వని అప్పులు రూ.35,000 కోట్లు ♦ 2019 మే నాటికి ఆ అప్పులను చంద్రబాబు రూ.1,40,500 కోట్లకు పెంచారు. అంటే 21.8 శాతం పెంచారు. ♦ వైఎస్సార్సీపీ వచ్చాక రూ.2,09,000 కోట్లకు పెరిగాయి. అంటే 12.6 శాతమే పెరిగాయి. -
ఆశావహ స్వరం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలూ పదేళ్ల తర్వాత మళ్లీ పుంజుకుంటున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018–19 ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాన బడ్జెట్‌కు ముందు ఏటా లాంఛనంగా ప్రవేశపెట్టే ఈ సర్వే దేశ ఆర్థిక స్థితిగతులెలా ఉన్నాయో, వివిధ రంగాల పనితీరు ఎలా ఉన్నదో చెబుతుంది. ఎలా ఉండ బోతున్నదో అంచనా వేస్తుంది. అందులో ఆశావహం కలిగించేవీ ఉంటాయి. బెంబే లెత్తించేవీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, అది తీసుకున్న వివిధ చర్యలు ఎలాంటి ఫలితాలిచ్చాయో సర్వే గణాంకాలు సమగ్రంగా వెల్లడిస్తాయి. దేశ సాంఘికార్థిక పరిస్థితుల గురించి కూడా ఆర్థిక సర్వే ఏకరువు పెడుతుంది. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సి ఉన్నా అవి ఇంకా ముందే ఉండొచ్చునని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందువల్లే కావొచ్చు... ఆర్థిక సర్వే మరీ నిరాశాపూరిత అంచనాల జోలికి పోలేదు. కొన్ని రంగాల్లో పరిస్థితులు సక్రమంగా లేవని చెప్పినా వాటిని అధిగమించడానికి అవకాశాలున్నాయనే ధ్వనించింది. ముఖ్యంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7–7.5 శాతం మధ్య ఉండొచ్చునని అది చెప్పిన మాట మార్కెట్లో ఉత్సాహం నింపింది. గత ఆర్థిక సంవత్సరం కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, ఇప్పుడు ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలో సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు నిర్ణయం అత్యంత కీలకమైనవి. ఈ రెండూ దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించిన చర్యలు. అయితే ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థలు మెరుగవుతున్న సూచనలు కనిపిస్తుండగా, మనం మాత్రమే వెనకబడి ఉండటానికి కారణం ఈ రెండు నిర్ణయాల ప్రభావమేనన్న మాట వాస్తవం. ఈ సర్వే పెద్ద నోట్ల రద్దు ప్రభావం గురించి నేరుగా ప్రస్తావించలేదు. జీఎస్టీ అమలు సాహ సోపేతమైన నిర్ణయమని, అది విజయవంతంగా అమలవుతున్నదని చెప్పినా... స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)పైనా, ఉపాధి కల్పనపైనా దాని ప్రభావమేమిటో వివరించలేకపోయింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల అదనంగా 18 లక్షలమంది పన్ను చెల్లింపుదారులు వచ్చిచేరినా వారిలో అత్యధికులు తక్కువ స్లాబ్‌లో ఉన్నవారే. కాబట్టి వీరి వల్ల ఇప్పటికైతే సర్కారుకు ఆదాయం పెద్దగా పెరిగే అవకాశం లేదు. వీరి వార్షికాదాయం రాగల సంవత్సరాల్లో పెరగాలంటే ఆరోగ్య వంతమైన ఆర్థిక వ్యవస్థ అవసరమవుతుంది. మెరుగైన ప్రభుత్వ విధానాలు మాత్రమే అలాంటి ఆర్థిక వ్యవస్థలకు దోహదపడగలవు. నిరుటి ఆర్థిక సర్వే పెద్ద నోట్ల రద్దు వల్ల జీడీపీపై 0.5 శాతం కోత పడి 6.5 శాతంగా ఉన్నదని చెప్పింది. 2017–18లో తిరిగి సాధారణ స్థితి ఏర్పడి జీడీపీ 7.5 శాతానికి ఎగబాకుతుందని జోస్యం చెప్పింది. ఆ తదుపరి రెండేళ్లలో 8 నుంచి 10 శాతం వరకూ తీసుకెళ్తామని కూడా భరోసా ఇచ్చింది. కానీ జరిగిందేమిటి? అది 6.75 ఉండొచ్చునని ప్రస్తుత ఆర్థిక సర్వే భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పర్యవసానాలను సరిగా గుర్తించలేదని నిరుటి ఆర్థిక సర్వేపై అప్పట్లో ఆర్థిక నిపుణులు విమర్శించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7–7.5 శాతం మధ్య ఉండొ చ్చునంటున్న అంచనాలు ఏమేరకు సాకారమవుతాయో వేచిచూడాలి. మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించిన రెండు నిర్ణయాలూ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదని సర్వే చూస్తే అర్ధమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతూ పోతున్న చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థపై చూపబోయే ప్రభావాన్ని గురించి ఈ ఆర్థిక సర్వే పలుమార్లు ప్రస్తావిం చిన సంగతిని మరిచిపోకూడదు. ఒక బ్యారెల్ చమురు ధర 10 డాలర్లు పెరిగితే వృద్ధిని అది 0.2 నుంచి 0.3 శాతం వరకూ తగ్గిస్తుందని సర్వే వివరిస్తోంది. ముగు స్తున్న ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు సగటున 14 శాతం పెరిగాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ పెరుగుదల 10–15 శాతం వరకూ ఉండొచ్చునని అంటు న్నది. ఈ సవాళ్లను సర్కారు ఎలా అధిగమిస్తుందో చూడాలి. అయితే ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి సంబంధించి నిరాశాజనకమైన అంచనాలే ఇస్తోంది. వాతావరణ మార్పుల పర్యవసానంగా ఆ రంగంలో వార్షిక ఆదాయం సగటున 15 నుంచి 18 శాతం వరకూ పడిపోవచ్చునని లెక్కేస్తోంది. నీటిపారుదల సౌకర్యం సక్రమంగా లేని ప్రాంతాల్లో ఇది 20 నుంచి 25 శాతం మధ్య ఉండొచ్చునని కూడా చెబుతోంది. కష్టాల సేద్యం చేస్తున్న రైతాంగానికి ఇది దుర్వార్తే. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సరిగా పండకపోవడం ఒకపక్క కనబడుతుంటే పంటలు పండిన సందర్భాల్లో సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం మరోపక్క ఉంటుంది. ఈమధ్యకాలంలో ఉల్లిపాయలు, ఆలు గడ్డలు, టమోటాల వగైరా «ధరలు భారీగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితులు రైతాంగాన్ని రుణ ఊబిలోకి నెడుతున్నాయి. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగుమందుల వరకూ అన్నిటి ధరలూ ఆకాశాన్నంటడంతో సాగు వ్యయం అపరిమితంగా పెరిగింది. దిగుబడుల ధరలు మాత్రం దిగజారుతున్నాయి. దిగు బడికైన వ్యయానికి 50 శాతాన్ని జోడించి గిట్టుబాటు ధరను నిర్ణయించాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫార్సును పాలకులు మరిచారు. చిత్రంగా ఆర్థిక సర్వే దాని ఊసే లేకుండా విద్యుత్, ఎరువులు సబ్సిడీలను ఎత్తేసి నగదు బదిలీ ప్రవే శపెట్టమని చెబుతోంది. బిందుసేద్యం, తుంపర సేద్యంవంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నది. ఇవి అమలు చేస్తే 2022నాటికి సాగు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెబుతోంది. సాగు రంగానికొచ్చేసరికి మన విధాన నిర్ణేతలు ఎప్పుడూ బోర్లాపడుతుంటారు. సర్వేలో ప్రస్తావించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఆలోచనలేమిటో, ఆర్థికరంగ జవసత్వాలకు అది తీసుకోబోయే చర్యలేమిటో మరో మూడురోజుల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తేటతెల్లం చేస్తుంది. -
మహిళ.. మనీ.. మేనేజ్మెంట్!
(సాక్షి, బిజినెస్ విభాగం) : మగవారితో పోలిస్తే దేశంలో ఆర్థిక విషయాల గురించి పట్టించుకునే మహిళలు తక్కువ. ముఖ్యంగా వివాహం తరవాత కుటుంబంలో ఆర్థిక అంశాలు, ప్రణాళికలన్నీ పురుషులే చూస్తుంటారు. తక్కువ శాతం ఇళ్లలోనే మహిళలు ఆ పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి కుటుంబానికి ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు ఏంటన్నదానిపై మహిళలకు మంచి అవగాహనే ఉంటుంది. కాకపోతే ఆర్థిక అంశాలు, పెట్టుబడుల విషయం మనకెందుకులే అని దూరంగా ఉండిపోతారు. ఈ ధోరణే భవిష్యత్తులో వారు ఒంటరిగా, తమ కాళ్లపై తాము జీవించాల్సి వస్తే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కారణాలేవైనప్పటికీ తాము ఒంటరిగా పిల్లలతో కలసి జీవించాల్సి వస్తే తమ అవసరాలకు, లక్ష్యాలకు, ఆర్థిక భద్రతకు ఏం చేయాలన్న అంశాల గురించి తెలియకపోవటం సమస్యలకు దారితీస్తుందంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్లు. తమకెందుకులేనన్న ధోరణి తప్పు! ‘‘ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొనే మహిళల్లో అధిక శాతం భారీ నగదు నిర్వహణ తెలియని వారే ఉంటారు. నగదు నిర్వహణ వ్యవహారం తమ ఉద్యోగం కాదులేనన్న ధోరణి చాలా మంది మహిళల్లో, కుటుంబాల్లో ఉండటమే దీనికి కారణం. కనీసం సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు తెలియని వివాహిత మహిళలు కూడా చాలా మందే ఉంటారు. ఈ విధమైన సందర్భాలు ఎదురైనప్పుడు వారు అచేతనంగా కొన్నాళ్ల పాటు ఏమీ చేయకుండా అలానే ఉండిపోతారు. లేదంటే ఆ నిధుల్ని తప్పుగా ఇన్వెస్ట్ చేస్తారు. పైపెచ్చు ఇలాంటి సందర్భాల్లో వారు విశ్వసనీయత లేని సన్నిహితులు, స్నేహితులపై ఆధారపడతారే గానీ ఫైనాన్షియల్ ప్లానర్ల సాయం తీసుకునేందుకు ముందుకు రారు. ఫైనాన్షియల్ ప్లానర్ల గురించి తెలియకపోవడం కూడా ఓ కారణం’’ అని హమ్‌ఫౌజి ఇనీషియేటివ్స్ సీఈవో సంజీవ్ గోవిల చెప్పారు. సమాన బాధ్యత ఉండాలి... ఒంటరి మహిళలు ముఖ్యమైన అన్ని ఆర్థిక లక్ష్యాల పట్ల సమాన బాధ్యత వహించాలని ఉమంత్ర సహ వ్యవస్థాపకురాలు మ్రిణ్ అగర్వాల్ సూచించారు. ఎక్కువగా పిల్లల విద్యకే ప్రాధాన్యమిస్తుంటారని, అదే సమయంలో తమ రిటైర్మెంట్ అవసరాల గురించి నిర్లక్ష్యం వహించడం లేదా పూర్తిగా మర్చిపోతారని ఆమె చెప్పారు. వ్యక్తిగత బీమా రక్షణకు టర్మ్ ప్లాన్, కుటుంబం కోసం ఆరోగ్య బీమా అన్నవి ఒంటరి మహిళలకు అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యాలని ఆమె సూచించారు. పలు సమస్యలుంటాయి... భర్తకు దూరమైన ప్రతి మహిళకు సాధారణంగా పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. జీవనం ఎలా, తన భర్త ఏవిధంగా సంపాదించేవారు, తను ఏ విధంగా ఇన్వెస్ట్ చేసేవారు అనేవి ఎక్కువగా ఎదురయ్యేవని జైపూర్‌కు చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ వినితా బరయా తెలియజేశారు. ‘‘ఒకవేళ తన భర్త మరణంతో బీమా పరిహారం అందితే గనుక దాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు పెట్టుబడులు, ఆర్థిక అంశాల గురించి నేర్చుకోవాలి. ఆదాయం, ఖర్చులు, పొదుపు, మదుపు, బాధ్యతల గురించి స్పష్టత వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాలి’’ అని సూచించారు. పెట్టుబడులు ప్రారంభించాలి ► ఒంటరి మహిళలు భర్తకు దూరమైనప్పుడు తమ నిధుల నిర్వహణను బంధువులకు ఇవ్వకూడదు. ► ఆర్థికాంశాల గురించి పెట్టుబడుల గురించి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఉన్న నిధుల్ని బ్యాంకులో ఎఫ్డీ చేయడమే బెటర్. ► ఆ తర్వాత పెట్టుబడులు, రాబడుల గురించి కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి. ► ఆర్థిక ప్రణాళిక గురించి తెలుసుకోవాలి. అవసరం అనుకుంటే ఫైనాన్షియల్ ప్లానర్లను ఆశ్రయించాలి. ► ఒకసారి ఆర్థికాంశాలు, పెట్టుబడుల గురించి అవగాహన వచ్చాక క్రమంగా దాన్ని ఆచరణలో పెట్టాలి. బ్యాంకు ఎఫ్డీలో నుంచి కొంత మొత్తంతో పెట్టుబడులు ప్రారంభించాలి. మరింత అవగాహన, విషయ పరిజ్ఞానం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ప్రణాళికను అమల్లో పెట్టాలి. ఫైనాన్షియల్ ప్లానర్ ఎంపికలో.. ► సంబంధిత వృత్తిలో కొన్నేళ్లయినా అనుభవం కలిగి ఉండాలి. ► ఫీజులు, చార్జీల గురించి ముందే విచారించాలి. కమిషన్‌పై సలహాలిస్తారా లేక వార్షిక ఫీజు తీసుకుంటారా? లేక ప్రతీసారి నిర్ణీత ఫీజు తీసుకుని సూచనలిస్తారా అన్నది తెలుసుకోవాలి. ► కేవలం ఏం చేయాలన్నది సూచిస్తారా లేక మన తరఫున వారే లావాదేవీలు నిర్వహిస్తారా? ► ఆర్థిక అంశాల గురించి సంపూర్ణంగా తెలియజేస్తారా... లేదా అన్నది కనుక్కోవాలి. – మ్రిణ్ అగర్వాల్, ఉమంత్ర సహ వ్యవస్థాపకురాలు దీర్ఘకాలం పాటు పెట్టుబడులకు కావాల్సినవి... ► పొదుపు, మదుపులకు క్రమశిక్షణ తప్పనిసరి. ► ఆర్థిక లక్ష్యాల పట్ల స్పష్టత అవసరం. ఉదాహరణకు పిల్ల ఉన్నత విద్య, పదవీ విరమణ అనంతరం అవసరాలు ఈ విధమైన లక్ష్యాలకు సంబంధించి చేయాల్సిన పెట్టుబడుల్లో స్పష్టత ఉండాలి. ► మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నేళ్ల సమయం ఉందన్నది కీలకం. ► పెట్టుబడుల్లో మార్కెట్ స్వల్పకాల ఆటుపోట్లను పట్టించుకోవద్దు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ► మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిప్పై విశ్వాసం ఉంచాలి. దీనివల్ల కొనుగోలు వ్యయాలు సగటుగా మారి, ప్రతికూల రిస్క్‌లు పరిమితం అవుతాయి. – వినితా బరాయా, వెల్త్ మేనేజర్ వ్యవధిని బట్టి పెట్టుబడి.. ► పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. మీరు భరించే రిస్క్‌కు అనువైన సాధనంలో ఆర్థిక లక్ష్యాలకు అవసరమైన మేర ఇన్వెస్ట్ చేయాలి. ► వచ్చే రెండు, మూడేళ్ల కాల అవసరాల కోసం అయితే సురక్షితమైన డెట్ సాధనాల్లో పెట్టాలి. ► చాలా ఏళ్ల తర్వాతే అవసరం అనుకుంటే ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ► కేవలం సురక్షిత సాధనాలనే ఆశ్రయిస్తే భవిష్యత్తు అవసరాలకు గండిపడినట్టే. ► బంగారం అయినా, రియల్ ఎస్టేట్ అయినా మీకు అవసరం అయితేనే కొనుగోలు చేయాలి. ► బీమా అన్నది పెట్టుబడి సాధనం కాదు. జరగరానిది జరిగితే రక్షణ కల్పించేది. – సంజీవ్గోవిల, హమ్‌ఫౌజి ఇనీషియేటివ్స్ సీఈవో -
తలసరి అప్పు రూ.35,373
రెండేళ్లలో రెండింతలు అవుతున్న అప్పులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అప్పుల కుప్పలా మారుతోంది. ఏటికేడు అప్పులు, వడ్డీల భారం రాష్ట్రాన్ని వణికిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో రూ.70 వేల కోట్ల అప్పులు ఉండగా... 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.23 లక్షల కోట్లకు చేరుతున్నాయి. అంటే రుణభారం రెట్టింపవుతోంది. ఇదే సమయంలో మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసుపత్రుల నిర్మాణాన్ని బడ్జెటేతర వనరుల ద్వారా చేపడతామని ప్రభుత్వం పేర్కొంది. మిషన్ భగీరథకు రూ.30 వేల కోట్లు, ఈ ఏడాది నిర్మించే 2.60 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.15 వేల కోట్లు, హైదరాబాద్‌లో నాలుగు ఆసుపత్రుల నిర్మాణానికి రూ.5వేల కోట్లు అవసరమని అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.50 వేల కోట్ల దాకా అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో అప్పుల భారం వచ్చే ఏడాది రూ.2 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గతేడాది వడ్డీల కోసమే ప్రభుత్వం రూ.7,162 కోట్లు వ్యయం చేసింది. 2016-17లో వడ్డీల చెల్లింపులకు రూ.7,706 కోట్లు కావాలని తాజా బడ్జెట్లో అంచనా వేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. ప్రభుత్వం చేసిన అప్పులను పంచితే తలసరి అప్పు రూ.35,373 చేరుతోంది. -
‘గోల్డ్ స్కీముల్లో’ శ్రీవారి స్వర్ణం
♦ టన్ను బంగారం డిపాజిట్‌కు టీటీడీ యోచన ♦ లాభదాయకమని అధికారుల భావన సాక్షి, తిరుమల: కేంద్రం ప్రకటించిన గోల్డ్ డిపాజిట్ స్కీములపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధార్మిక సంస్థ మొగ్గుచూపుతోంది. ఇప్పటికే వివిధ జాతీయ బ్యాంకుల్లో 6 టన్నుల గోల్డ్ డిపాజిట్లు ఉండగా, తాజాగా మరో టన్ను బంగారాన్ని కేంద్ర స్కీముల్లో పెట్టే యోచనలో ఉంది. టీటీడీ నిబంధనలకు అనుగుణంగా.. కేంద్రం ప్రకటించిన గోల్డ్ డిపాజిట్ స్కీములు టీటీడీ నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇందులో 5 నుంచి 7ఏళ్లు, 12 నుంచి 15 ఏళ్ల దీర్ఘకాలిక స్కీముల కంటే 1నుంచి 3 ఏళ్ల మధ్యకాలిక స్కీములపై సంస్థ మొగ్గు చూపుతోంది. స్వల్పకాలిక డిపాజిట్లపై ప్రస్తుతం టీటీడీకి అందుతున్న 1.61శాతం (ఏడాదికి) వడ్డీ కంటే ఎక్కువగా వస్తే టన్ను బంగారాన్ని డిపాజిట్ చేయాలని సంస్థ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంలో టీటీడీకి ఆర్థిక సలహాలు అందజేసే కమిటీ సభ్యులు...ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, సెబీ ప్రతినిధి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, యూనిట్ ట్రస్టు ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల బృందంతో త్వరలోనే సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. ఏటా 1,500 కిలోల బంగారం భక్తుల కానుకల రూపంలో టీటీడీకి ఏటా 1,000 నుంచి 1,500 కిలోల బంగారం వస్తోంది. 2008-2009 ఆర్థిక సంవత్సరం వరకు ఆ బంగారాన్ని టీటీడీ సొంతంగా ముంబయిలోని మింట్‌లో కరిగించి డాలర్లుగా మార్చి భక్తులకు విక్రయిస్తూ వచ్చింది. అలా సమకూరిన నగదును టీటీడీ కరెంట్ ఖాతాకు జమ చేస్తూ వచ్చారు. ఈ ప్రక్రియ వల్ల అకౌంటింగ్ ఇబ్బందులున్నట్టు నిపుణులు గుర్తించడంతో కొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు బ్యాంకుల్లో.. శ్రీవారికి కానుకగా అందిన బంగారాన్ని స్వయం గా జాతీయ బ్యాంకులే సొంత ఖర్చులతో బీమాచేసి మింట్‌కు తరలించి శుద్ధి చేసి స్వచ్చమైన బంగారాన్ని డిపాజిట్‌గా చేసుకుంటున్నాయి. ఇలా ఇప్పటివరకు సుమారు 6 టన్నుల బంగారాన్ని టీటీడీ మూడు జాతీయ బ్యాంకులు...కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఎస్బీఐలో డిపాజిట్ చేసింది. ప్రస్తుతం దీనిపై టీటీడీకి 1.61 శాతం వడ్డీ బంగారం రూపంలోనే అందుతోంది. ఇలా ఆరేళ్లలో 220 కిలోలకు పైగా బంగారం వడ్డీ రూపంలో వెంకన్న ఖాతాకు చేరింది.