‘గోల్డ్ స్కీముల్లో’ శ్రీవారి స్వర్ణం
♦ టన్ను బంగారం డిపాజిట్‌కు టీటీడీ యోచన
♦ లాభదాయకమని అధికారుల భావన
సాక్షి, తిరుమల: కేంద్రం ప్రకటించిన గోల్డ్ డిపాజిట్ స్కీములపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధార్మిక సంస్థ మొగ్గుచూపుతోంది. ఇప్పటికే వివిధ జాతీయ బ్యాంకుల్లో 6 టన్నుల గోల్డ్ డిపాజిట్లు ఉండగా, తాజాగా మరో టన్ను బంగారాన్ని కేంద్ర స్కీముల్లో పెట్టే యోచనలో ఉంది.
టీటీడీ నిబంధనలకు అనుగుణంగా..
కేంద్రం ప్రకటించిన గోల్డ్ డిపాజిట్ స్కీములు టీటీడీ నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇందులో 5 నుంచి 7ఏళ్లు, 12 నుంచి 15 ఏళ్ల దీర్ఘకాలిక స్కీముల కంటే 1నుంచి 3 ఏళ్ల మధ్యకాలిక స్కీములపై సంస్థ మొగ్గు చూపుతోంది. స్వల్పకాలిక డిపాజిట్లపై ప్రస్తుతం టీటీడీకి అందుతున్న 1.61శాతం (ఏడాదికి) వడ్డీ కంటే ఎక్కువగా వస్తే టన్ను బంగారాన్ని డిపాజిట్ చేయాలని సంస్థ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంలో టీటీడీకి ఆర్థిక సలహాలు అందజేసే కమిటీ సభ్యులు...ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్, సెబీ ప్రతినిధి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, యూనిట్ ట్రస్టు ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల బృందంతో త్వరలోనే సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు.
ఏటా 1,500 కిలోల బంగారం
భక్తుల కానుకల రూపంలో టీటీడీకి ఏటా 1,000 నుంచి 1,500 కిలోల బంగారం వస్తోంది. 2008-2009 ఆర్థిక సంవత్సరం వరకు ఆ బంగారాన్ని టీటీడీ సొంతంగా ముంబయిలోని మింట్‌లో కరిగించి డాలర్లుగా మార్చి భక్తులకు విక్రయిస్తూ వచ్చింది. అలా సమకూరిన నగదును టీటీడీ కరెంట్ ఖాతాకు జమ చేస్తూ వచ్చారు. ఈ ప్రక్రియ వల్ల అకౌంటింగ్ ఇబ్బందులున్నట్టు నిపుణులు గుర్తించడంతో కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే మూడు బ్యాంకుల్లో..
శ్రీవారికి కానుకగా అందిన బంగారాన్ని స్వయం గా జాతీయ బ్యాంకులే సొంత ఖర్చులతో బీమాచేసి మింట్‌కు తరలించి శుద్ధి చేసి స్వచ్చమైన బంగారాన్ని డిపాజిట్‌గా చేసుకుంటున్నాయి. ఇలా ఇప్పటివరకు సుమారు 6 టన్నుల బంగారాన్ని టీటీడీ మూడు జాతీయ బ్యాంకులు...కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బీఐలో డిపాజిట్ చేసింది. ప్రస్తుతం దీనిపై టీటీడీకి 1.61 శాతం వడ్డీ బంగారం రూపంలోనే అందుతోంది. ఇలా ఆరేళ్లలో 220 కిలోలకు పైగా బంగారం వడ్డీ రూపంలో వెంకన్న ఖాతాకు చేరింది.