Gold deposit scheme
-
Telangana: గుడి గోల్డ్.. బాండ్స్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లో 800 కిలోల బంగారు నిల్వలు, దాదాపు 3,750 కిలోల వెండి నిల్వలు ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. ఇందులో నిత్య కైంకర్యాలు, ప్రత్యేక రోజుల్లో దేవుళ్ల అలంకరణకు అవసరమైన బంగారు, వెండి ఆభరణాలు మినహా కానుకల రూపంలో భక్తులు స్వల్ప మొత్తాల్లో సమర్పించే బంగారం, వెండిని వాడటం లేదు. కానీ వాటిని ఆలయాల్లోనే భద్రపరచడం క్షేమం కాదని భావించి బ్యాంకు లాకర్లలో ప్రభుత్వం భద్రపరుస్తోంది. ఇందుకు దేవాదాయ శాఖ లాకర్ చార్జీలు చెల్లిస్తోంది. కొన్నింటికి బీమా చేయించినందున.. బీమా ప్రీమియం సైతం కడుతోంది. వెరసి వినియోగంలో లేని ఆభరణాలు, బంగారు, వెండి ముక్కల వల్ల ఎలాంటి ఆదాయం లేకపోగా ఖర్చే మిగులుతోంది. దీంతో ఆయా ఆలయాల్లో వినియోగించని నగలు, బంగారు, వెండిని (కిలోకన్నా ఎక్కువగా ఉంటేనే) గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయాలని ఇటీవల నిర్ణయించిన దేవదాయ శాఖ... ఆ మేరకు ఆలయాలవారీగా ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకోసం బంగారాన్ని కరిగించి 95 శాతం స్వచ్ఛత స్థాయికి తెచ్చి ఆ రోజు బంగారు ధర ప్రకారం స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలోని గోల్డ్ డిపాజిట్ పథకంలో చేరుస్తోంది. దాని విలువ మేరకు ఐదేళ్ల కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తోంది. ఈ మొత్తంపై బ్యాంకు 2.25 శాతం వడ్డీని ఆయా ఆలయాలకు చెల్లించనుంది. బంగారం, వెండి కరిగింపు చార్జీలను సైతం బ్యాంకే భరిస్తోంది. ఐదేళ్ల తర్వాత ఎఫ్డీని కొనసాగించొచ్చు. కాదంటే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొని దేవాలయాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. ఇప్పటికే బాసర, వేములవాడ, సికింద్రాబాద్ గణేశ్ మందిరం, ఉజ్జయినీ మహంకాళి, కొండగట్టు, కొమురవెల్లి ఆలయాలకు చెందిన బంగారం డిపాజిట్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇక వెండిని కూడా కరిగించి దాన్ని మేలిమి బంగారం విలువతో లెక్కించి ఆ మేరకు నగదులోకి మార్చి బ్యాంకు డిపాజిట్ చేయించుకుంటోంది. -
దాతృత్వ సంస్థలు, ప్రభుత్వాలకూ గోల్డ్ డిపాజిట్ స్కీమ్
ముంబై: పసిడి డిపాజిట్ స్కీమ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక మార్పులు చేసింది. దీనిప్రకారం ఇకపై దాతృత్వం సంస్థలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోగలుగుతాయి. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ స్కీమ్ వ్యక్తులు, జాయింట్ డిపాజిట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దేశంలో గృహాలు, సంస్థల వద్ద అవసరానికి మించి ఉన్న పసిడిని మార్కెట్లోకి తీసుకురావడం, పసిడి దిగుమతులను తగ్గించి దేశాన్ని కరెంట్ అకౌంట్ లోటు తీవ్రత నుంచి తప్పించడం ఉద్దేశ్యంగా 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్ధిష్ట కాలపరిమితుల్లో పసిడి డిపాజిట్ల ఆ మేరకు విలువపై 2.25 నుంచి 2.50 శాతం శ్రేణిలో వడ్డీ పొందే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ పథకం విజయం సాధించలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి. -
విజయవంతంకాని పసిడి పథకాలు!: సర్వే
అహ్మదాబాద్: పసిడి డిపాజిట్ స్కీమ్సహా బంగారానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలు విజయవంతం కావట్లేదని ఒక అధ్యయనం తేల్చింది. ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (ఐజీపీసీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం–ఏ) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం– ఆయా పథకాలు అంతగా విజయవంతం కాకపోవడానికి ప్రజల్లో అవగాహనా రాహిత్యమే ఒక కారణం. సర్వేకు సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే– మహారాష్ట్రలోని కొల్హాపూర్, తమిళనాడులోని కోయంబత్తూర్, పశ్చిమబెంగాల్లోని హూగ్లీ, ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్పూర్లలో దాదాపు 1,000 మంది అభిప్రాయాలను సర్వేకు ప్రాతిపదికగా తీసుకున్నారు. వెయ్యి మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే పసిడి డిపాజిట్ పథకం, గోల్డ్ బాండ్ పథకం, గోల్డ్ కాయిన్ స్కీమ్ వంటి వాటి గురించి అవగాహన ఉంది. ఈ మూడు స్కీములను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తక్షణ గృహ అవసరాలు, రుణ చెల్లింపులకు పసిడి రుణాలను ప్రధానంగా వినియోగించుకుంటున్నట్లు సర్వే పేర్కొందనీ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. తాము పసిడిపై రుణాలను వ్యాపారానికి, విద్యకు, గృహ మరమత్తులకు వినియోగించుకుంటున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది తెలిపారు. -
రీపేమెంటూ పసిడి రూపంలోనే కావాలి
పసిడి డిపాజిట్ పథకంపై టీటీడీ అభిప్రాయం న్యూఢిల్లీ: దీర్ఘకాలానికి తాము గోల్డ్ డిపాజిట్ పథకం కింద దీర్ఘకాలానికి తాము జమ చేసే పసిడిని బ్యాంకులు తిరిగి అదే రూపంలో ఇవ్వాలని, నగదు రూపంలో తమకొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంటోంది. ఇందుకోసం నిబంధనల్లో తగు మార్పులు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. మధ్యకాలిక, దీర్ఘకాలిక బంగారం డిపాజిట్లపై అసలు, వడ్డీని పసిడి రూపంలోనే ఇచ్చేలా సంబంధిత స్కీములో సవరణలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి రాసినట్లు టీటీడీ ఈడీ డి. సాంబశివరావు తెలిపారు. ఇలా మార్పులు చేస్తే దేశవ్యాప్తంగా మిగతా ఆలయాలు కూడా గోల్డ్ డిపాజిట్ పథకంపై ఆసక్తి చూపొచ్చని పేర్కొన్నారు. బంగారం డిపాజిట్ పథకం విజయవంతం కావాలంటే దేవాలయాలు కూడా పాలుపంచుకోవాల్సి ఉంది. అయితే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో డిపాజిట్ పథకం కింద బంగారాన్ని వదులుకుని నగదు రూపంలో తీసుకునేందుకు ఆలయాలు ఇష్టపడటం లేదు. ఇటీవలే 44 కేజీలు డిపాజిట్ చేస్తామని ప్రకటించిన ముంబై సిద్ధి వినాయక ఆలయం వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం టీటీడీ వద్ద దాదాపు 7 టన్నుల పసిడి ఉన్నట్లు అంచనా. గత నెల 1.3 టన్నుల బంగారాన్ని మూడేళ్ల కాల వ్యవధికి 1.75 శాతం వడ్డీ రేటుకి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్లు సాంబశివరావు తెలిపారు. మరో పక్షం రోజుల్లో 1.25 శాతం వడ్డీ రేటుకి 1.4 టన్నుల బంగారాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు. -
మూడవ విడత గోల్డ్ బాండ్ స్కీమ్
తగ్గిన స్పందన! న్యూఢిల్లీ: మూడవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్బీజీ) స్కీమ్‌కు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. దాదాపు రూ.329 కోట్ల విలువైన 1,128 కేజీలకు మాత్రమే డిమాండ్ వచ్చింది. రెండవ విడతతో పోల్చితే ఈ డిమాండ్ దాదాపు సగమే కావడం గమనార్హం. మూడు విడతలూ కలిసి రూ.1,322 కోట్ల విలువ రూ.4,916 కేజీలకు సబ్స్క్రిప్షన్ వచ్చినట్లు గణాంకాలు వెల్లడించాయి. మార్చి 8వ తేదీ నుంచి 14వతేదీ వరకూ మూడవ విడత స్కీమ్ అమలయ్యింది. తొలి సమాచారం ప్రకారం 64,000 మంది నుంచి దరఖాస్తులు అందాయి. బాండ్లు మార్చి 29న జారీ అవుతాయి. 2015 నవంబర్‌లో 916 కేజీలు, ఈ జనవరిలో 2,872 కేజీలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. గోల్డ్ స్కీమ్ విజయానికి కసరత్తు... మరోవైపు గోల్డ్ డిపాజిట్ పథకం విజయవంతం చేయడానికి కేంద్ర కసరత్తు చేస్తోంది. దాదాపు 800 బిలియన్ డాలర్ల విలువ చేసే 20,000 టన్నుల బంగారం బీరువాలకు పరిమితమవుతోందని, దీనిలో సగాన్నైనా మార్కెట్లోకి తీసుకురావాలని భావించిన కేంద్రానికి తీవ్ర నిరాశే ఎదురయ్యింది. కేవలం 3 టన్నుల డిపాజిట్ మాత్రమే ఇప్పటివరకూ నమోదైంది. మరోవైపు, దాదాపు 44 కేజీల బంగారాన్ని.. గోల్డ్ స్కీమ్ కింద డిపాజిట్ చేయాలని యోచిస్తున్నట్లు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయం వర్గాలు తెలిపాయి. ఇందుకోసం వివిధ బ్యాంకుల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, వచ్చే వారం అధికారిక ప్రకటన రాగలదని పేర్కొన్నాయి. సిద్ధి వినాయక దేవాలయం వద్ద దాదాపు 160 కేజీల బంగారం ఉన్నట్లు అంచనా. -
దేవుడి బంగారం.. గాలిలో దీపం!
* గోల్డ్ డిపాజిట్ స్కీంలో పెట్టాలనే ఆదేశానికి తిలోదకాలు * నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు లాకర్లకు తరలింపు * వడ్డీ పొందాల్సిందిపోయి ఎదురు చార్జీల చెల్లింపు * బయటపెట్టిన ఆడిట్ విభాగం * తేరుకొని లెక్కలు సేకరిస్తున్న దేవాదాయశాఖ సాక్షి, హైదరాబాద్: దేవుడి మాన్యానికే కాదు.. స్వామి బంగారానికీ రక్షణ కరువైంది. విరాళాలు, కానుకల రూపంలో భక్తులు సమర్పించిన బంగారం సరైన లెక్కాపత్రం లేకుండా లాకర్లలో మగ్గుతోంది. ఏ లాకర్లో ఎంత పుత్తడి ఉందనే వివరాలు లేకుండా పోయాయి. ఇటీవల బ్యాంకులు, వాటి ఏటీఎంలపై దొంగలు గురిపెడుతున్న నేపథ్యంలో దేవుడి సొత్తు గాలిలో దీపమైంది. బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టొద్దని, కిలోకు మించి స్వర్ణం ఉంటే స్టేట్‌బ్యాంక్ గోల్డ్ డిపాజిట్ బాండ్ స్కీమ్‌లో ఉంచి వడ్డీ పొందాలనే ప్రభుత్వ ఆదేశాన్ని తోసిరాజని ఆలయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆడిట్ తనిఖీలో ఈ విషయం బట్టబయలైంది. ఆడిట్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా మచ్చుకు 12 ఆలయాలను పరిశీలించగా, 9 చోట్ల నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని లాకర్లలో మగ్గబెట్టినట్టు తేలింది. కేంద్రం అమలుచేస్తున్న గోల్డ్ డిపా జిట్ స్కీం గురించి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఆడిట్ విభాగం శ్రీముఖం పంపేసరికి నాలుక్కరుచుకున్న దేవాదాయశాఖ అన్ని ఆల యాల్లో బంగారు నిల్వలపై లెక్కలు సేకరిం చడం మొదలెట్టింది. గుర్తించిన బంగారాన్ని స్టేట్‌బ్యాంకులో డిపాజిట్ చేయాలా, లేదా కేంద్ర పథకం కింద ఉంచాలా అన్న దానిపై స్పష్టత కోసం ప్రభుత్వానికి ఫైల్ పంపింది వడ్డీ గోవిందా! రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో దేవుళ్లకు స్వర్ణాభరణాలున్నాయి. ఇవి కాకుండా భక్తుల కానుకలు, విరాళాల రూపంలో బంగారం సమకూరుతోంది. అది చిన్న ముక్కలు, బిస్కెట్లు, ఇతర ఆకృతుల్లో ఉంటోంది. ఆభరణాల రూపంలో ఉన్నవాటిని వేడుకలు, పండగల సమయంలో అలంకరించాలని, ఇతర రూపంలో ఉన్న బంగారం కిలోకు మించితే స్టేట్‌బ్యాంక్‌లోని గోల్డ్ డిపాజిట్ పథకం కింద జమచేసి వడ్డీ పొందాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2009లో ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని చాలా ఆలయాలు పట్టించుకోలేదు. ఆడిట్ గుర్తించిన ఆలయాలు.. బంగారు నిల్వలు బాసర సరస్వతీ ఆలయం-10.26 కిలోలు, కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం-7.3 కిలోలు, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయం- 5.70 కిలోలు, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం- 3.49 కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం-2.8 కిలోలు, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయం-2.1 కిలోలు, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం-1.8 కిలోలు, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం-1.6 కిలోలు, నల్లగొండ జిల్లా చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం-1.2 కిలోలు. -
కరిగిస్తే.. డిపాజిట్లు ఇవ్వం!
♦ దేవుని బంగారంపై పలు ఆలయ బోర్డుల స్పష్టీకరణ ♦ కేంద్రం ‘బంగారు డిపాజిట్ల పథకం’కు స్పందన అంతంతే ♦ దేశ, సమాజ సేవకే ఈ నిల్వలంటున్న మరికొన్ని ట్రస్టులు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బంగారు డిపాజిట్ల పథకం’కు రాష్ట్ర ప్రభుత్వాలు, దేవాలయాల బోర్డులనుంచి అంతంత మాత్రంగానే స్పందన వస్తోంది. ప్రస్తుతం దేశంలోని వివిధ ఆలయాల్లో ఉన్న బంగారం నిల్వల విలువ ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 6.63 కోట్ల కోట్లు)ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని లేదా.. ఇందులో కొంతైనా ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేయటం ద్వారా బంగారం సరఫరా పెరిగినట్లవుతుందని కేంద్రం ఆలోచన. ఇందుకు దేవాలయాలతోపాటు, ప్రజలు, వివిధ ఆర్థిక సంస్థల వద్దనున్న 22వేల టన్నుల బంగారాన్ని ‘బంగారు డిపాజిట్ పథకం’లోకి మార్చాలని భావిస్తోంది. ఇందుకోసం బంగారాన్ని కరిగించి బిస్కెట్ల రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. దీనిపై అభిప్రాయం తెలపాలంటూ కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయాల బోర్డులను కోరింది. అయితే బంగారాన్ని ఇచ్చేందుకు బోర్డులకు అభ్యంతరం లేకున్నా.. నగలను కరిగించటంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బంగారు ఆభరణాలను కరిగించటం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లవుతుందని.. మత విశ్వాసాలకు భంగం కలుగుతుందంటున్నాయి. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం, మహారాష్ట్రలోని షిర్డీ సాయి దేవాలయాల బంగారు నిల్వలపై సుప్రీం, బాంబే హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కరిగిస్తే ఏమవుతుంది? బంగారు విగ్రహాలు, ఆభరణాలకు కరిగించటం ద్వారా వీటి తూకం తగ్గటంతో పాటు నాణ్యమైన బంగారం మాత్రమే పరిగణనలోకి వస్తుంది. అంటే అంతకుముందున్న బంగారంలో చాలా మట్టుకు తరుగుపోతుంది. దీని వల్ల డిపాజిట్‌కు ముందున్న బంగారం బరువుకు.. కరిగించిన తర్వాత ఉన్న బరువుకు తేడా ఉంటుంది. ఈ పథకంపై కేరళలో గురువాయూర్ దేవాలయం తప్ప మిగిలిన ఆలయ బోర్డులు పథకంలో చేరటంపై ఆసక్తి చూపలేదు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఈ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపాయి. రాజస్థాన్ ప్రభుత్వం అనాసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. త్వరలో టీటీడీ భేటీ ఈ పథకంపై ఏపీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లనుంచి అంగీకారం లభించనప్పటికీ.. సానుకూల వాతావరణం కనబడుతోంది. ఈ విషయంలపై తుది నిర్ణయం తీసుకునేందుకు టీటీడీ బోర్డు (టీటీడీ దేవస్థానం వద్ద వివిధ రూపాల్లో 5.5 టన్నుల బంగారం ఉంది) త్వరలోనే భేటీ కానుండగా.. పథకంలో చేరే ఉద్దేశం లేదని బెజవాడ దుర్గమ్మ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ దక్షిణేశ్వర్ దేవాలయ బోర్డు తమవద్దనున్న బంగారాన్ని కేంద్రం వద్ద డిపాజిట్ చేసేందుకు సుముఖంగా ఉంది. ‘ఇంత బంగారం గుడిలో పెట్టుకుని ఏం లాభం. సమాజానికి, దేశానికి ఉపయోగ పడితేనే బాగుంటుందని భావిస్తున్నాం. తుది నిర్ణయం తీసుకోకున్నా.. ట్రస్టు సభ్యుల అనుకూలంగానే ఉన్నారు’ అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. గుజరాత్‌లోని ద్వారక బోర్డు కూడా సానుకూల సంకేతాలను పంపించింది. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక దేవాలయం కూడా ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే ఉంది. బంగారం డిపాజిట్ అంటే ఏంటి? ఆభరణాల రూపంలో డిపాజిటర్లు తాకట్టు పెట్టిన బంగారం అసలు విలువ లెక్కగట్టాక రశీదు ఇస్తారు. ఆ తర్వాత దీన్ని కరిగించి బిస్కెట్ల రూపంలోకి మార్చేస్తారు. ఆ తర్వాత ఈ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. తాకట్టు పెట్టిన వ్యక్తి భవిష్యత్తులో కావాలనుకుంటే.. ‘995 నాణ్యత ఉన్న బంగారం’ లేదా డిపాజిట్ చేసిన బంగారం బరువుకు సరిపడా డబ్బులను (మార్కెట్ రేటు) అందజేస్తారు. కానీ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఉన్న ఆభరణం మాత్రం కనిపించదు. -
గోల్డ్ డిపాజిట్ స్కీం అట్టర్ ఫ్లాప్
-
ఇప్పుడు తగ్గినా, తర్వాత పెరుగుతుంది
బంగారంపై నిపుణుల అంచనాలు హైదరాబాద్: అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు బలపడటంతో బంగారం ధర ఇప్పుడు క్షీణిస్తున్నా, తదుపరి నెలల్లో నెమ్మదిగా పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర ఏడువారాల కనిష్టస్థాయి 1,088 డాలర్ల వద్దకు పడిపోయింది. ఈ ఏడాది జూలైలో ఐదున్నరేళ్ల కనిష్టస్థాయి అయిన 1,077 డాలర్లకు తగ్గిన తర్వాత, అటునుంచి నెమ్మదిగా 1,200 డాలర్ల వరకూ పెరిగిన బంగారం హఠాత్తుగా రెండు వారాల నుంచి క్షీణిస్తూ వస్తోంది. స్వల్పకాలికంగా ఈ ధర 1,070 డాలర్ల స్థాయికి దిగివచ్చినా, తర్వాతి నెలల్లో పుత్తడి పుంజుకుంటుందని, ఇండియా, చైనాల్లో డిమాండ్ ఇందుకు కారణమవుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. బంగారం గత మూడేళ్ల నుంచి ఇది 1,300-1,070 డాలర్ల శ్రేణిలో కదులుందన్న అంశాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంశం ఇప్పటికే బంగారం ధరలో ఇమిడిపోయినందున, సమీప భవిష్యత్తులో పుత్తడి భారీగా తగ్గే అవకాశం లేదని వారన్నారు. పటిష్టంగానే డిమాండ్... వివిధ కేంద్ర బ్యాంకుల నుంచి బంగారానికి డిమాండ్ పటిష్టంగానే వుందని, అలాగే చైనా, భారత్‌ల్లో పుత్తడి వినియోగం తగ్గలేదని, ఈ అంశాలు తిరిగి ధరల పెరుగుదలకు దోహదపడుతుందని విశ్లేషకులు చెప్పారు. చైనాలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డిమాండ్ తగ్గినా, మూడో త్రైమాసికంలో డిమాండ్ 3 శాతం వృద్ధిచెందింది. షాంఘై స్టాక్ మార్కెట్ పతనం ఫలితంగా అక్కడ తిరిగి బంగారంపై ఆకర్షణ పెరుగుతోందని విశ్లేషకులు చెప్పారు. ఇదే రీతిలో భారత్‌లో ఆభరణాల వినియోగం మెరుగుపడటంతో మూడో త్రైమాసికంలో డిమాండ్ 5 శాతం వృద్ధితో 193 టన్నులకు చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారం డిపాజిట్ స్కీము విజయవంతమైతే, భారత్‌కు దిగుమతులు తగ్గి, అంతర్జాతీయంగా బంగారం ధర బలహీనపడే రిస్క్ వుంటుందని విశ్లేషకులు హెచ్చరించారు. విదేశీ రిజర్వుల్ని వివిధీకరించే దిశగా చైనా, రష్యా కేంద్ర బ్యాంకులు మరింత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని, ఈ ప్రక్రియ కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతుందని విశ్లేషకులు వివరించారు. మూడోవారమూ తగ్గింది... అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల అంశాల కారణంగా దేశీయంగా బంగారం ధర వరుసగా మూడోవారమూ క్షీణించింది. ప్రపంచ మార్కెట్లో ధర 4.7 శాతం తగ్గడంతో ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల పుత్తడిధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 710 తగ్గుదలతో రూ. 26,110 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి అంతేమొత్తం క్షీణించి రూ. 25,960 వద్ద క్లోజయ్యింది. -
‘గోల్డ్ స్కీముల్లో’ శ్రీవారి స్వర్ణం
♦ టన్ను బంగారం డిపాజిట్‌కు టీటీడీ యోచన ♦ లాభదాయకమని అధికారుల భావన సాక్షి, తిరుమల: కేంద్రం ప్రకటించిన గోల్డ్ డిపాజిట్ స్కీములపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధార్మిక సంస్థ మొగ్గుచూపుతోంది. ఇప్పటికే వివిధ జాతీయ బ్యాంకుల్లో 6 టన్నుల గోల్డ్ డిపాజిట్లు ఉండగా, తాజాగా మరో టన్ను బంగారాన్ని కేంద్ర స్కీముల్లో పెట్టే యోచనలో ఉంది. టీటీడీ నిబంధనలకు అనుగుణంగా.. కేంద్రం ప్రకటించిన గోల్డ్ డిపాజిట్ స్కీములు టీటీడీ నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇందులో 5 నుంచి 7ఏళ్లు, 12 నుంచి 15 ఏళ్ల దీర్ఘకాలిక స్కీముల కంటే 1నుంచి 3 ఏళ్ల మధ్యకాలిక స్కీములపై సంస్థ మొగ్గు చూపుతోంది. స్వల్పకాలిక డిపాజిట్లపై ప్రస్తుతం టీటీడీకి అందుతున్న 1.61శాతం (ఏడాదికి) వడ్డీ కంటే ఎక్కువగా వస్తే టన్ను బంగారాన్ని డిపాజిట్ చేయాలని సంస్థ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంలో టీటీడీకి ఆర్థిక సలహాలు అందజేసే కమిటీ సభ్యులు...ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, సెబీ ప్రతినిధి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, యూనిట్ ట్రస్టు ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల బృందంతో త్వరలోనే సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. ఏటా 1,500 కిలోల బంగారం భక్తుల కానుకల రూపంలో టీటీడీకి ఏటా 1,000 నుంచి 1,500 కిలోల బంగారం వస్తోంది. 2008-2009 ఆర్థిక సంవత్సరం వరకు ఆ బంగారాన్ని టీటీడీ సొంతంగా ముంబయిలోని మింట్‌లో కరిగించి డాలర్లుగా మార్చి భక్తులకు విక్రయిస్తూ వచ్చింది. అలా సమకూరిన నగదును టీటీడీ కరెంట్ ఖాతాకు జమ చేస్తూ వచ్చారు. ఈ ప్రక్రియ వల్ల అకౌంటింగ్ ఇబ్బందులున్నట్టు నిపుణులు గుర్తించడంతో కొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు బ్యాంకుల్లో.. శ్రీవారికి కానుకగా అందిన బంగారాన్ని స్వయం గా జాతీయ బ్యాంకులే సొంత ఖర్చులతో బీమాచేసి మింట్‌కు తరలించి శుద్ధి చేసి స్వచ్చమైన బంగారాన్ని డిపాజిట్‌గా చేసుకుంటున్నాయి. ఇలా ఇప్పటివరకు సుమారు 6 టన్నుల బంగారాన్ని టీటీడీ మూడు జాతీయ బ్యాంకులు...కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఎస్బీఐలో డిపాజిట్ చేసింది. ప్రస్తుతం దీనిపై టీటీడీకి 1.61 శాతం వడ్డీ బంగారం రూపంలోనే అందుతోంది. ఇలా ఆరేళ్లలో 220 కిలోలకు పైగా బంగారం వడ్డీ రూపంలో వెంకన్న ఖాతాకు చేరింది. -
ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్...
ఆర్థిక సంస్కరణల అమలుపై ప్రధాని మోదీ * సంస్కరణలు సమ్మిళితంగా ఉండాలని వ్యాఖ్య * జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యం కావాలి న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలనేవి ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, విస్తృత స్థాయిలో ప్రయోజనాలు కల్పించేలా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సంస్కరణల లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే తప్ప.. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడం కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం 6వ ఢిల్లీ ఎకనామిక్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. సంస్కరణలను పరుగుపందెంతో పోలుస్తూ.. వీటి అమలనేది స్వల్పదూరం వేగంగా పరుగెత్తి పూర్తి చేసే స్ప్రింట్ కాదని నిలకడగా సుదీర్ఘ దూరాన్ని అధిగమించాల్సిన మారథాన్ లాంటిదని మోదీ చెప్పారు. ప్రభుత్వం సమ్మిళిత సంస్కరణలను అమలు చేసే లక్ష్యంతో ముందుకెడుతోందన్నారు. తాము అధికారంలోకి రాకముందుతో పోలిస్తే.. అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో భారత్ ఎంతో మెరుగుపడిందని ప్రధాని చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి, విదేశీ పెట్టుబడులు, ఆదాయాలు పెరగ్గా.. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం తగ్గిందని ఆయన వివరించారు. అవినీతికి చెక్..: వృద్ధికి ప్రతిబంధకాలైన అవినీతి, పన్ను ఎగవేతలు, మనీ లాండరింగ్ మొదలైన వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంద ని ప్రధాని చెప్పారు. ఈ దిశగా చేపట్టిన చర్యలవల్లే విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న సుమారు రూ.10,500 కోట్లు నల్లధనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. గోల్డ్ స్కీములపై 3వేల కాల్స్..: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసిడి పథకాలకు మంచి స్పందన కనిపించిందని, వీటి వివరాల కోసం టోల్ ఫ్రీ నంబరుకు 3,000 పైచిలుకు కాల్స్ వచ్చాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. గోల్డ్ డిపాజిట్ పథకాన్ని దశలవారీగా దేశమంతటా అమల్లోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రారంభించిన ప్రధాని మోదీ
-
బంగారం ఇంట్లో దాచుకుందామన్నా...
న్యూఢిల్లీ: దేశంలో నిరుపయోగం పడివున్న బంగారం నిల్వలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు బంగారం డిపాజిట్ల పథకాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... దేశంలో 20 వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇంత బంగారం ఉన్న భారత్ పేద దేశం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బంగారం నిల్వలను వెలికితీసి డిమాండ్ తగ్గించే చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బంగారం డిపాజిట్ల పథకాలతో మహిళలు ఆర్థికంగా సాధికారత సాధికారత సాధిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల కారణంగానే ఇలాంటి పథకాలు విజయవంతం అవుతున్నాని అన్నారు. బంగారాన్ని ఇంట్లో దాచుకుందామన్న భయపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. బంగారం డిపాజిట్ పథకంలో బాండ్ల రూపంలో భద్రత ఉంటుందని భరోసాయిచ్చారు. బాండ్లు దొంగిలించినా పెద్దగా ప్రయోజనం ఉండదని వివరించారు. -
గోల్డ్ బాండ్ల జారీ ఇలా..
ఆర్బీఐ మార్గదర్శకాలు * నేటి నుంచే ఆఫర్.. ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి నిర్వహణా పరమైన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీచేసింది. గోల్డ్ డిపాజిట్ పథకం, గోల్డ్ కాయిన్ అండ్ బులియన్ స్కీమ్‌లతోపాటు సావరిన్ గోల్డ్ బాండ్లను గురువారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్న సంగతి విదితమే. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం... వాణిజ్య బ్యాంకుల శాఖల్లోనూ, నిర్దేశిత పోస్టాఫీసు శాఖల్లోని బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవొచ్చు. నవంబర్ 5వ తేదీ నుంచీ 20వ తేదీ వరకూ సాధారణ పనివేళల్లో నిర్దిష్ట శాఖలలో బాండ్లకు సంబంధించిన దరఖాస్తును ఇన్వెస్టర్లు సమర్పించాల్సి ఉంటుంది. కావల్సిన అదనపు సమాచారాన్ని అధికారులు అడిగి తెలుసుకుంటారు. * బాండ్లు చేతికి వచ్చే వరకూ ఇన్వెస్టర్ చెల్లించిన నిర్దిష్ట మొత్తంపై సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటును దరఖాస్తుదారుకు చెల్లించడం జరుగుతుంది. దరఖాస్తును దాఖలు చేసిన బ్యాంక్ బ్రాంచీలో సంబంధిత ఇన్వెస్టర్‌కు అకౌంట్ నంబర్ లేకపోతే... సదరు వ్యక్తి అందించిన అకౌంట్ సమాచారం ఆధారంగా ఎలక్ట్రానిక్ ఫండ్ బదలాయింపు ద్వారా వడ్డీ జమవుతుంది. * తమ తరఫున దరఖాస్తులను తీసుకోవడానికి బ్యాంకులు అవసరమైతే ఎన్బీఎఫ్సీ, ఎన్ఎస్సీ ఏజెంట్లు తదితరులను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. * అప్లికేషన్‌ను రద్దుచేసుకునే సౌలభ్యం ఉంది. అయితే ఇష్యూ ముగింపు తేదీ 20 వరకూ ఈ వీలు ఉంటుంది. రద్దును పాక్షికంగా అనుమతించరు. పూర్తిగా రద్దుపర్చుకోవాల్సివుం టుంది. అప్లికేషన్ రద్దు చేసుకుంటే... ఇందుకు సంబంధించి వడ్డీ చెల్లింపు ఉండబోదు. * ఈ బంగారం బాండ్లు 26వ తేదీన జారీ అవుతాయి. బాండ్లపై వడ్డీ రేటు 2.75 శాతం. బాండ్ రేటు గ్రాముకు రూ. 2,684. -
దీపావళికి పుత్తడి పథకాలు: ప్రధాని
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా బంగారం డిపాజిట్ స్కీమ్‌తో సహా పుత్తడి సంబంధిత పలు పథకాలు ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బంగారం డిపాజిట్ స్కీమ్ ఆర్థిక అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దీంతోపాటు సావరిన్ గోల్డ్ బాండ్స్, ఆశోక చక్రతో కూడిన బంగారు నాణేలను ధన్‌తేరాస్ రోజు కల్లా అందుబాటులోకి తెస్తామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నెలవారీ రేడియో ప్రసంగం(మన్ నీ బాత్)లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సామాజిక జీవితంలో భాగం మన దేశంలో సామాజిక జీవితంలో బంగారం ఒక భాగమైందని పేర్కొన్నారు.ఆర్థిక భరోసానిచ్చేదిగా, సంక్షోభ సమయాల్లో ఆదుకునేదిగానూ పుత్తడికి ముఖ్యమైన స్థానం ఉందని వివరించారు. పుత్తడి పట్ల ప్రజలకున్న ప్రేమను ఎవరూ తగ్గించలేరని చెప్పారు. అయితే బంగారాన్ని వృధా సొమ్ములుగా వదిలివేయడం ఈ కాలానికి తగదనిహితవు పలికారు. బంగారంలో పరోక్షంగా పెట్టుబడి చేయాలని సూచించారు. బంగారం దేశ ఆర్థిక ఆస్తిగా మారుతోందని, ప్రతి భారతీయుడు ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లో పాలుపంచుకునేలా చేయాలని సూచించారు. పుత్తడికి సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా గోల్డ్ స్కీమ్‌ను తెస్తున్నందుకు సంతోషంగా ఉందని వివరించారు. బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే ధన్తేరస్ రోజు ఈ బంగారం స్కీమ్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లో మీ దగ్గరున్న బంగారాన్ని ఏ బ్యాంక్‌లోనైనా డిపాజిట్ చేసి, ఆ డిపాజిట్లపై వడ్డీని పొందవచ్చని మోదీ చెప్పారు. గతంలో బంగారాన్ని లాకర్లలో దాచుకునేవారని, ఇలా దాచుకునేందుకు బ్యాంక్‌లకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉండేదని చెప్పారు. ఇప్పుడు అలా కాదని, బంగారాన్ని డిపాజిట్ చేసి, దానిపై వడ్డీ పొందవచ్చని వివరించారు. ఇలా బంగారం ఒక ఆస్తి అని వివరించారు. బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవదన్దని, బ్యాంకులో డిపాజిట్ చేయాలని సూచించారు. ఇలా డిపాజిట్ చేయడం వల్ల భద్రతకు భద్రత, వడ్డీకి వడ్డీ కూడా లభిస్తుందని తన 35నిమిషాల ప్రసంగంలో మోదీ వివరించారు. ఇక పుత్తడి బాండ్ల పథకం గురించి వివరిస్తూ.. బంగారం విలువకు సమానమైన పత్రం ఈ బాండ్ల కొనుగోలు ద్వారా లభిస్తుందని, బంగారం కొని, దాని భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ కాగితాన్ని ఎవరూ తస్కరించలేరన్నారు. పసిడి విలువకు సమానంగా వుండే ఈ పత్రాన్ని అవసరమైనపుడు నగదులోకి మార్చుకుని, పుత్తడిని కొనుక్కోవచ్చన్నారు. ఈ పథకం వచ్చే కొద్దివారాల్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. అశోక చక్ర తో కూడిన బంగారు నాణాలను కూడా అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. మనకు స్వాతంత్య్రం వచ్చి 70 వసంతాలొచ్చినా, ఇప్పటికీ విదేశాలు తయారు చేసే బంగారు నాణాలే మనకు దిక్కని వాపోయారు. 5,10, 20 గ్రాముల్లో అశోక చక్ర చిహ్నంతో కూడిన బంగారు నాణేలు అందిస్తామని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న రూ.20,000 టన్నుల బంగారంలో కొంత భాగాన్ని సమీకరించేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్‌లు తెస్తోందని వివరించారు. -
గోల్డ్ డిపాజిట్, బాండ్లపై వడ్డీరేటు 3% లోపే!
న్యూఢిల్లీ: పసిడి డిపాజిట్ స్కీమ్, బాండ్లపై వడ్డీరేట్లు ఎంత ఉండవచ్చన్న అంశంపై ఆర్థికశాఖ సీనియర్ అధికారుల నుంచి కొన్ని సంకేతాలు అందాయి. పసిడి డిపాజిట్‌పై ఈ రేటు 1.5 శాతం నుంచి 2 శాతం వరకూ ఉండవచ్చని ఆ వర్గాల కథకం. గోల్డ్ బాండ్లపై వడ్డీరేటు 2 నుంచి 3 శాతం వరకూ ఉండే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీపావళి నాటికి కొత్త స్కీమ్‌లను ప్రారంభించడానికి కసరత్తు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం రూ.15,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ రెండు స్కీమ్‌లను బుధవారం కేంద్రం కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లో ఈ పథకాలు నోటిఫై అవుతాయని, ప్రజల స్పందన ఎలా ఉందన్న అంశాన్ని ఏడాది అనంతరం సమీక్షించడం జరుగుతుందని సీనియర్ ఆర్థికశాఖ అధికారి తెలిపారు. -
బ్యాంకింగ్ ‘పరపతి’ సాధనంగా ‘పసిడి’ ప్రశ్నేలేదు!
న్యూఢిల్లీ: ద్రవ్య, పరపతి సాధనంగా బంగారం సరికాదన్న అభిప్రాయానికే కేంద్రం ఓటు చేస్తున్నట్లు కనబడుతోంది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) అవసరాలకు- ప్రతిపాదిత ‘బంగారం డిపాజిట్’ పథకం ద్వారా సమీకరించిన మెటల్‌ను వినియోగించుకోవాలన్న ఆలోచనను కేంద్రం విరమించుకున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయానికి విరుద్ధమైన నిర్ణయాన్ని తీసుకోరాదన్న ఉద్దేశమే దీనికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. రెండు వారాల్లో బంగారం డిపాజిట్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుందని సమాచారం. సెప్టెంబర్ మొదటి వారం నుంచీ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. -
‘బంగారం’ లాంటి పథకం..!
- పసిడి డిపాజిట్‌తో లాభాలు అధికమే - ఆభరణాలు పెడితే ప్రతికూలతలూ ఉన్నాయ్ ప్రజలు, సంస్థల దగ్గర ఉత్పాదకత లేకుండా పడి ఉన్న పసిడిని చలామణిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం మరోసారి బంగారం డిపాజిట్ స్కీమ్‌ను ప్రకటించింది. 1999లో ఈ తరహా పథకాన్నే ప్రవేశపెట్టినప్పటికీ .. అప్పట్లో దీనికి అంతగా ఆదరణ దక్కలేదు. గోల్డ్ డిపాజిట్ చేసేవారికి పన్నులపరంగా ప్రయోజనాలు లభించేలా చూస్తామంటున్నప్పటికీ, గతానికి భిన్నంగా 1% కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఇస్తే తప్ప ఇది వర్కవుట్ కాదంటున్నారు విశ్లేషకులు. ఈ వడ్డీ కూడా నగదు రూపంలో ఉంటుందా.. పసిడి రూపంలో ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. స్కీముపై ప్రస్తుతం ముసాయిదా మార్గదర్శకాలనే ప్రకటించింది ప్రభుత్వం. వీటిపై జూన్ 2 లోగా ప్రజలు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకుని ఆ తర్వాత తుది నిబంధనలను ఖరారు చేయనుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, ఇందులోని ప్రతికూలతల్లో కొన్ని.. ప్రయోజనాలు.. - గతంలో కనీసం 500 గ్రాములు డిపాజిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు కనిష్టంగా 30 గ్రాముల బంగారమైనా డిపాజిట్ చేయొచ్చు. - ఉత్తినే బ్యాంకు లాకర్లలోనో.. ఇంట్లో బీరువాల్లోనో ఉంచే బదులు డిపాజిట్ చేయడం వల్ల ఏడాదికి ఎంతో కొంత వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. ఈలోగా బంగారం రేటు పెరి గితే ఆ ప్రయోజనం ఉండనే ఉంటుంది. - మీ బంగారం మీ అకౌంట్లోనే ఉంటుంది. అమ్మకుండానే వడ్డీ ఆదాయం వస్తుంది. పైగా దీనిపై పన్ను కూడా ఉండదు. - ఇలా వచ్చే ఆదాయాన్ని ఏ రికరింగ్ డిపాజిట్ స్కీమో లేదా ఏ పెన్షన్ స్కీములోనో ఇన్వెస్ట్ చేస్తే అదనంగా మరికాస్త ప్రయోజనమూ దక్కుతుంది. ప్రతికూలతలూ ఉంటాయ్ .. - మీరు ఆభరణాలు డిపాజిట్ చేస్తే బంగారం మీ అకౌంట్లోనే ఉంటుంది కానీ.. ఆభరణాల రూపంలో ఉండదు. వాటిని కరిగించేసి ఆ మేర పసిడి బరువును మాత్రమే మీ ఖాతాలో చూపిస్తుంది బ్యాంకు. దీనివల్ల బంగారంపై మీకు వడ్డీ ఆదాయం వచ్చినా.. ఆ ఆభరణాన్ని అలాగే మీరు వాడుకోలేరు. - డిపాజిట్ చేసిన బంగారం మొత్తాన్ని కాల వ్యవధి తీరాక విత్‌డ్రా చేసుకున్నాక.. మరోసారి అభరణాలు చేయించుకోవాలంటే ఆ మేర మేకింగ్ చార్జీలు వగైరాలు మళ్లీ తప్పకపోవచ్చు. రెండు వారాల లాభాలకు బ్రేక్... విదేశీ మార్కెట్లలో నెగటివ్ ధోరణుల కారణంగా ఇటు దేశీ బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి రేట్లు గత వారం తగ్గాయి. పసిడి రెండు వారాల పరుగుకు బ్రేక్ పడింది. వారం ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతుతో పుత్తడి రేట్లు పుంజుకున్నప్పటికీ .. వారాంతానికల్లా తగ్గాయి. సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ సాధనంగా అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్ పెరగడం, ఇటు దేశీయంగా జ్యుయెలర్లు, రిటైలర్ల నుంచి బంగారానికి డిమాండ్ తగ్గడం వంటివి పసిడి పరుగుకు బ్రేక్ వేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. పెరుగుతున్న ఈక్విటీ మార్కెట్ల వైపు నిధులు మళ్లడం కూడా పసిడిపై ప్రభావం చూపిందని తెలిపాయి. అంతర్జాతీయంగా చూస్తే వారంలో బంగారం ధర 1.7 శాతం క్షీణించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వారాంతానికి పసిడి ధర 10 గ్రాములకు రూ.350 మేర తగ్గి, మేలిమి బంగారం రేటు రూ.27,450, ఆభరణాల బంగారం ధర రూ. 27,300 వద్ద ముగిసింది. అటు వెండి కూడా లాభనష్టాల్లో ఊగిసలాడి ఆఖరుకు కిలోకి రూ. 850 తగ్గి రూ. 38,800 వద్ద క్లోజయ్యింది. -
వడ్డీపై పన్ను మినహాయింపు
బంగారం డిపాజిట్ స్కీమ్... ముసాయిదా పథకం, మార్గదర్శకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ⇒ కనీస డిపాజిట్ 30 గ్రాములు.. ⇒ డిపాజిట్లకు కనీన వ్యవధి ఏడాది న్యూఢిల్లీ: దేశంలో ప్రజలు, వివిధ సంస్థల వద్ద ఉత్పాదకత లేకుండా పడిఉన్న బంగారంలో కొంత మొత్తాన్నైనా చలామణీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చర్యల్లో భాగంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ముసాయిదాను, సంబంధిత మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసే బంగారంపై వచ్చే వడ్డీపై ఎలాంటి పన్నులూ ఉండవు. ఆదాయపు పన్ను(ఐటీ)తో పాటు మూలధన లాభాల పన్ను నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ప్రజలు/సంస్థలు కనిష్టంగా 30 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేసే వీలుంటుంది. ఈ స్కీమ్‌పై వచ్చే నెల 2వ తేదీకల్లా ప్రజలు, సంబంధిత వర్గాలంతా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే, ప్రతిపాదిత స్కీమ్‌ను తొలుత కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. పథకం ఎలా పనిచేస్తుందంటే... ⇒ ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తి లేదా సంస్థ తమవద్దనున్న బంగారాన్ని ముందుగా బీఐఎస్ ధ్రువీకృత హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో విలువ కట్టించాలి. ⇒ ఆతర్వాత బ్యాంకుల్లో ఒక ఏడాది కనీస కాలపరిమితితో గోల్డ్ సేవింగ్స్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతాలో తమ దగ్గరున్న బంగారాన్ని డిపాజిట్ చేయాలి. ⇒ డిపాజిట్ చేసిన పసిడి విలువకు అనుగుణంగా వడ్డీని నగదు లేదా బంగారం యూనిట్ల రూపంలో పొందొచ్చు. ఖాతా తెరిచిన 30/60 రోజుల తర్వాత ఖాతాదారులకు వడ్డీ లభిస్తుంది. అయితే, వడ్డీ ఎంత ఉండాలో నిర్ణయించే అధికారం బ్యాంకులకు వదిలేయాలని స్కీమ్‌లో ప్రతిపాదించారు. ⇒ అదేవిధంగా గోల్డ్ డిపాజిటర్లకు అసలు, వడ్డీ చెల్లింపు అనేది బంగారం రూపంలోనే బ్యాంకులు విలువకడతాయి. ⇒ మెచ్యూరిటీ తర్వాత లేదా ముందైనా కస్టమర్లు తాము ఖాతా నుంచి నగదు రూపంలో లేదా బంగారం రూపంలోగాని డిపాజిట్లను వెనక్కితీసుకునే(రిడంప్షన్) ఆప్షన్ ఉంటుంది. అయితే, ఈ ఆప్షన్‌ను డిపాజిట్ చేసేటప్పుడే ఎంచుకోవాలి. ⇒ స్కీమ్ కనీస కాలపరిమితి ఏడాది. ఫిక్సిడ్ డిపాజిట్ల మాదిరిగానే లాక్-ఇన్ వ్యవధికి ముందే తీసుకునే వెసులుబాటు ఇస్తారు. ⇒ ఉదాహరణకు ఒక కస్టమర్ 100 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేసిన పక్షంలో వడ్డీరేటు 1 శాతంగా గనుక నిర్ణయిస్తే.. నిర్దేశిత కాల వ్యవధి తర్వాత(మెచ్యూరిటీ) ఖాతాలో 101 గ్రాముల పసిడి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ⇒ బ్యాంకులు ఇతర డీలర్లు ఈ విధంగా లభించిన బంగారాన్ని కరిగించి చలామణీలోకి తీసుకొచ్చేందుకు వీలవుతుంది. నాణేల రూపంలో కస్టమర్లకు విక్రయించగలుగుతాయి. ⇒ అదేవిధంగా డిపాజిట్ల రూపంలో వచ్చే పసిడిని విక్రయించి విదేశీ కరెన్సీని కూడా బ్యాంకులు పొందగలుగుతాయి. ఎగుమతి/దిగుమతిదారుల అవసరాలకు ఈ విదేశీ కరెన్సీని ఉపయోగించొచ్చు. బంగారం దిగుమతులు తగ్గి.. దేశీయంగా ఉన్న పసిడినే మళ్లీ వ్యవస్థలోకి తీసుకురావాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. బ్యాంకులకూ సీఆర్ఆర్ వెసులుబాటు! బ్యాంకులకు కూడా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కొన్ని ప్రోత్సాహకాలను అందించనుంది. డిపాజిట్లద్వారా వచ్చిన బంగారం నిల్వలను ఆర్బీఐ నిర్దేశించిన నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)/చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) నిబంధనల్లో భాగంగా చూపించుకునేందుకు అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్బీఐ దగ్గర ఉంచాల్సిన మొత్తాన్ని సీఆర్ఆర్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ బాండ్లు ఇతరత్రా సాధనాల్లో పెట్టుబడిగా ఉంచాల్సిన నిధుల పరిమాణం ఎస్ఎల్ఆర్. ప్రస్తుతం సీఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 21.5%గా ఉన్నాయి. అంటే బ్యాంకులు సమీకరించిన మొత్తం డిపాజిట్లలో 25.5% ఈ రెండింటిలో లాక్ అయిపోయినట్లే. ఇప్పుడు బంగారం డిపాజిట్లను వీటిలో భాగంగా పరిగణిస్తే.. బ్యాంకులకు అదనంగా రుణాలివ్వడానికి నగదు లభ్యత పెరుగుతుంది. 20,000 టన్నుల పైనే... దేశవ్యాప్తంగా ఎలాంటి లావాదేవీలూ జరగకుండా, వ్యవస్థలోకి తిరిగిరాని బంగారం పరిమాణం 20 వేల టన్నులకు పైనే ఉంటుందని అంచనా. ఇలా ఉత్పాదకత రహితంగా ఉన్న పుత్తడి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.60 లక్షల కోట్లు ఉండొచ్చని నిపుణులు లెక్కగడుతున్నారు. ముఖ్యంగా అధిక మొత్తంలో పసిడి గుడులు, మతపరమైన లేదా ధార్మిక సంస్థల వద్ద ఉంది. అయితే, ముసాయిదా స్కీమ్‌లో ఎలాంటి సంస్థలకు అనుమతి ఉంటుందన్న విషయాన్ని నిర్ధిష్టంగా పేర్కొనలేదు. ప్రపంచంలో అత్యంత భారీగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ముందువరసలో ఉంది. మన దేశంలోకి ఏటా 800-1,000 టన్నుల పుత్తడి దిగుమతి అవుతోంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలను అధికంగా వెచ్చించాల్సి రావడంతోపాటు రూపాయి మారకం విలువపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. -
బంగారానికీ ఎక్స్ఛేంజ్!
⇒జాతీయ పసిడి విధానం అవసరం ⇒పసిడి పొదుపు ఖాతాలు రావాలి.. ⇒అలంకారప్రాయంగా ఉన్న 22 వేల టన్నుల పుత్తడిని చలామణీలోకి తేవాలి ⇒ప్రభుత్వానికి డబ్ల్యూజీసీ-ఫిక్కీ నివేదిక న్యూఢిల్లీ: భారతీయుల వద్ద అలంకారప్రాయంగా మాత్రమే ఉంటున్న 22,000 టన్నుల పైచిలుకు బంగారాన్ని ఉపయోగంలోకి తెచ్చే దిశగా పలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఫిక్కీ-డబ్ల్యూజీసీ ఒక నివేదికలో సూచించాయి. ఇందులో భాగంగా జాతీయ పసిడి విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నాయి. స్టాక్ ఎక్స్చేంజీల తరహాలో బంగారానికీ ఎక్స్చేంజీని ఏర్పాటు చేయాలని, పసిడి పొదుపు ఖాతాలు వంటి పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి తేవాలని తెలిపాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ మేరకు రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేశాయి. అటు దిగుమతి, ఎగుమతుల నిర్వహణ కోసం గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయడం, అధీకృత రిఫైనరీల ఏర్పాటు, పసిడి స్వచ్ఛత నిర్ధారణకు సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయడం, బ్యాంకులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పసిడిని చలామణీలోకి తేవడం తదితర అంశాలను సైతం ప్రభుత్వం పరిశీలించవచ్చని నివేదిక పేర్కొంది. గడిచిన అయిదేళ్లుగా బంగారం వినియోగం సగటున 895 టన్నుల మేర ఉంటోందని వివరించింది. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న పసిడిలో చాలా తక్కువ పరిమాణాన్ని బైటికి తేగలిగినా.. పుత్తడి దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవచ్చని డబ్ల్యూజీసీ, ఫిక్కీ పేర్కొన్నాయి. ఆర్థిక వృద్ధికి వనరులను సమకూర్చుకోవడానికి ఈ చర్యలు అనివార్యమని డబ్ల్యూజీసీ ఎండీ సోమసుందరం పీఆర్ అభిప్రాయపడ్డారు. నివేదికలో ముఖ్యాంశాలు.. పోత్సాహకాలు ఇవ్వడం ద్వారా బ్యాంకులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. బంగారం ఆధారిత పెట్టుబడి పథకాలు మరిన్ని ఆవిష్కరించేలా ప్రోత్సహించాలి. ఇప్పుడున్న వాటి గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. ‘బ్రాండెడ్ ఇండియా గోల్డ్ కాయిన్స్’ను ప్రభుత్వం తయారు చేయించవచ్చు. పసిడి అమ్మకాలకు అధీకృత డీలర్లను ఎంపిక చేయొచ్చు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లను (జీడీఎస్) మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. వడ్డీ వస్తుందంటే బంగారాన్ని డిపాజిట్ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చే అవకాశాలున్నాయని సర్వే చెబుతోంది. బ్యాంకులు కనీస డిపాజిట్ పరిమాణాన్ని తగ్గించాలి. సులభంగా అర్థమయ్యే పసిడి పొదుపు పథకాలు ప్రవేశపెట్టాలి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల తరహాలోనే గోల్డ్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా ఆదాయ పన్ను ప్రయోజనాలు లభించేలా చూడాలి. బంగారం ఆధారిత పింఛను, బీమా పథకాలనూ ప్రవేశపెట్టవచ్చు. పసిడిని నగదుపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి భారతీయ వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం ధర, నాణ్యత నిర్ధారణ మొదలైన వాటికి సరైన ప్రమాణాలను ఉండేలా చూడగలిగితే మరింత బంగారం చలామణీలోకి రావడానికి వీలుంటుంది. పసిడికి జాతీయ స్థాయిలో ధరల విధానం ఉండేలా గోల్డ్ ఎక్స్చేంజీని ఏర్పాటు చేయాలి. దీని వల్ల రేట్లలో పారదర్శకత పెరుగుతుంది. బంగారం డిమాండ్, సరఫరాలను అంచనా వేయడం సాధ్యపడుతుంది. పసిడి ఎక్స్చేంజీ కోసం అత్యంత పటిష్టమైన వాల్ట్‌ను నిర్మించాల్సి ఉంటుంది. సంతులిత, సమ్మిళిత పసిడి విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించేలా గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయాలి. బంగారం దిగుమతుల నిర్వహణ, ఎగుమతులకు ఊతమిచ్చే చర్యలు రూపొందించడం, దేశీ పసిడి మార్కెట్ సమర్థంగా పనిచేసేలా చూడటం వంటి బాధ్యతలు అప్పగించాలి. అన్ని రకాల బంగారానికి నాణ్యతా సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలి. ప్రపంచ మార్కెట్లో పుత్తడి పరుగు.. ముంబై/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో, దీనికి అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో మంగళవారం రాత్రి పసిడి పరుగులు తీసింది. వెండి కూడా దీనిని అనుసరించింది. కడపటి సమాచారం అందే సరికి న్యూయార్క్‌లో నెమైక్స్ కమోడిటీ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న ఔన్స్ బంగారం (31.1గ్రా) కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 38 డాలర్లు (3 శాతానికి పైగా) ఎగిసి 1,233 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది ఐదు వారాల గరిష్ట స్థాయి. వెండి కూడా ఇదే బాటలో దాదాపు 5.5 శాతం పెరుగుదలతో 17 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తూ మంగళవారం రాత్రి దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధర క్రితం ధర కంటే రూ.823 అధికంగా (3% పైగా) రూ.27,184 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ కాంట్రాక్ట్ ధర రూ.2,005 (5% పైగా) అధికంగా రూ.38,600 వద్ద ట్రేడవుతోంది. దేశీయ స్పాట్ ధరపై ప్రభావం! ప్రపంచ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా బుధవారం దేశీయ స్పాట్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్ ట్రేడర్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రధాన ఈక్విటీ మార్కెట్లు క్షీణించడం, డాలర్ మారకం రేటు తగ్గుదల వంటి అంశాలు ఈ విలువైన లోహాల ధరలు అధికంగా పెరగడానికి కారణమని విశ్లేషకులు చెపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో సోమవారం నాడు 100 బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది. 10 ప్రధాన దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం విలువ నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. వచ్చే వారంలో ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం, కనిష్ట స్థాయికి క్రూడ్ ధరలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఎగబాకడం గమనార్హం. బంగారం దిగుమతులపై భారత్ కొంత సరళతరం విధానం పాటిస్తున్నట్లు వచ్చిన వార్తలతో ఈ మెటల్ రేటు పెరగడం ప్రారంభమైనట్లు బులియన్ నిపుణులు చెబుతున్నారు. -
గోల్డ్ డిపాజిట్లకు కొత్త స్కీమ్!
న్యూఢిల్లీ: పసిడి డిపాజిట్ పథకాన్ని ఆధునీకరించి, పునఃప్రారంభించాలని గోల్డ్ అండ్ సిల్వర్ రిఫైనర్ ఎంఎంటీసీ పీఏఎంపీ సూచించింది. ప్రభుత్వరంగ ఎంఎంటీసీ- స్విట్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రపంచ ప్రముఖ గోల్డ్ రిఫైనర్ పీఏఎంపీ జాయింట్ వెంచర్ (జేవీ)గా ‘ఎంఎంటీసీ పీఏఎంపీ’ ఏర్పాటయ్యింది. ఏ విధంగా ప్రతిపాదిత పథకాన్ని పునఃప్రారంభించాలన్న అంశాన్ని కూడా జేవీ వివరించింది. జేవీ ఎండీ రాజేష్ ఖోస్లా తెలిపిన ఈ వివరాల ప్రకారం... కనీసం 40 గ్రాములు డిపాజిట్ చేయగలిగిన విధంగా పథకాన్ని మార్చాలి. దేశ వ్యాప్తంగా బీరువాల్లో దాదాపు 25,000 టన్నుల పసిడి నిల్వలు నిక్షిప్తమయ్యాయి. ఇలాంటి పథకం ద్వారా మొత్తం నిల్వల్లో ఒక శాతం సమీకరించగలిగినా... కనీసం ఒక యేడాదిలో 250 టన్నుల పసిడి దిగుమతులను కట్టడికి చేయవచ్చు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి ఈ చర్య దోహదపడుతుంది. దేశ వ్యాప్తంగా 500 గృహాల సర్వే ప్రాతిపదికన తాజా ప్రతిపాదనను జేవీ చేసింది. 1999లో ప్రారంభించిన ప్రస్తుత గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం కనీస పసిడి డిపాజిట్ 500 గ్రాములు. ఇందువల్ల ఈ పథకం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ఈ పథకం వల్ల కేవలం దేవాలయాలు, ట్రస్టులు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతున్నాయి. ఆర్బీఐ ఇలాంటి ప్రతిపాదన ఒకటి ఇప్పటికే చేసింది. దీనిపై నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్నాం. దిగుమతులపై నిబంధనలను మరింత కఠినతరం చేసినా, భారత్‌లో పసిడి డిమాండ్ ప్రస్తుత స్థాయి (వార్షికంగా దాదాపు 850 టన్నులు) దిగువకు పడిపోయే అవకాశం లేదు. {పతిపాదిత గోల్డ్ కొత్త పథకాన్ని ప్రవేశపెడితే, దీని ద్వారా లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ధ్రువీకరణ పొందిన ఏకైక రిఫైనరీగా ఎంఎంటీసీ పీఏఎంపీ మంచి ప్రయోజనం పొందగలుగుతుంది. బ్యాంకులు నిర్దేశించిన విధంగా సమీకరణ, నాణ్యత నిర్ధారణ, రవాణా, రిఫైనింగ్, రి-ట్రాన్స్‌పోర్ట్‌సహా దేశంలో పసిడి సర్క్యులేషన్‌కు సంబంధించి విస్తృతస్థాయిలో సేవలను జేవీ నిర్వహిస్తుంది. -
పసిడి డిపాజిట్లు జిగేల్!
బంగారు ఆభరణాలను డిపాజిట్ చేయడం ద్వారా ఇకపై ఇన్వెస్టర్లు 3% వరకూ వడ్డీని పొందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా పన్ను రహితంగా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు దేశంలోనే అత్యధికంగా పసిడిని దిగుమతి చేసుకునే బ్యాంక్ ఆఫ్ నోవా స్కాటియా ప్రణాళికలు సిద్ధం చేసింది. గోల్డ్ డిపాజిట్ పథకంకింద ఇన్వెస్టర్ల నుంచి ఆభ రణాలను సమీకరించేందుకు ఆభరణ వర్తకులతో జత కట్టే యోచనలో ఉంది. ఈ పథకం అమలుకోసం రిజర్వ్ బ్యాంక్‌తోపాటు, వజ్రాలు, ఆభరణ వర్తక ఫెడరేషన్(జీజేఎఫ్)తోనూ నోవా స్కాటియా చర్చలు నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ఎండీ రాజన్ వెంకటేష్ చెప్పారు. ఈ పథకంలో భాగంగా బంగారు ఆభరణాలను డిపాజిట్ చేసే ఇన్వెస్టర్లకు వడ్డీ కింద కూడా బంగారాన్నే ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ మాత్రమే... ప్రస్తుతం దేశీయంగా ఇలాంటి పథకాన్ని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ అందిస్తోంది. అయితే గోల్డ్ డిపాజిట్ పథకానికి వడ్డీ నామమాత్ర స్థాయిలో 0.75% నుంచి 1% వరకూ అందిస్తోంది. కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) పెరిగిపోతుండటంతో కొంతకాలంగా ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ బంగారం దిగుమతులపై పలు ఆంక్షలను అమలు చేస్తున్న విషయం విదితమే. దీంతో నోవా స్కాటియాకు అవసరమైనమేర పసిడిని దిగుమతి చేసుకోవడం సమస్యగా పరిణమించింది. దేశీయ ఆభరణ వర్తకులకు కూడా బంగారం సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. పెళ్లిళ్లు, పండుగలు వంటి సీజన్ల కారణంగా ధర పెరిగినప్పటికీ దేశంలో బంగారానికి డిమాండ్ మెరుగుపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయుల దగ్గర ఆభరణాల రూపంలో ఉన్న 20,000 టన్నుల బంగారం అంచనాలపై నోవా స్కాటియా బ్యాంక్ వర్గాలకు దృష్టి మళ్లింది. అయితే గోల్డ్ డిపాజిట్ పథకంపై చర్చలు తుది దశలో ఉన్నాయని, కొన్ని అంశాలను పరిష్కరించుకోవలసి ఉన్నదని వెంకటేష్ చెప్పారు. ఇవి పూర్తయితే పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, ఈ పథకానికి త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు జీజేఎఫ్ చైర్మన్ హరేష్ సోనీ చెప్పారు. ఈ పథకానికి 2.5-3% వడ్డీ రేటును తాము ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా పసిడి డిపాజిట్ కాలపరిమితిని రెండు నుంచి ఏడేళ్ల కాలానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. స్టేట్‌బ్యాంక్‌లో గోల్డ్ డిపాజిట్లకు కాలపరిమితి మూడు నుంచి ఐదేళ్లుగా ఉంది.