దేవుడి బంగారం.. గాలిలో దీపం!
* గోల్డ్ డిపాజిట్ స్కీంలో పెట్టాలనే ఆదేశానికి తిలోదకాలు
* నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు లాకర్లకు తరలింపు
* వడ్డీ పొందాల్సిందిపోయి ఎదురు చార్జీల చెల్లింపు
* బయటపెట్టిన ఆడిట్ విభాగం
* తేరుకొని లెక్కలు సేకరిస్తున్న దేవాదాయశాఖ
సాక్షి, హైదరాబాద్: దేవుడి మాన్యానికే కాదు.. స్వామి బంగారానికీ రక్షణ కరువైంది. విరాళాలు, కానుకల రూపంలో భక్తులు సమర్పించిన బంగారం సరైన లెక్కాపత్రం లేకుండా లాకర్లలో మగ్గుతోంది.
ఏ లాకర్‌లో ఎంత పుత్తడి ఉందనే వివరాలు లేకుండా పోయాయి. ఇటీవల బ్యాంకులు, వాటి ఏటీఎంలపై దొంగలు గురిపెడుతున్న నేపథ్యంలో దేవుడి సొత్తు గాలిలో దీపమైంది. బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టొద్దని, కిలోకు మించి స్వర్ణం ఉంటే స్టేట్‌బ్యాంక్ గోల్డ్ డిపాజిట్ బాండ్ స్కీమ్‌లో ఉంచి వడ్డీ పొందాలనే ప్రభుత్వ ఆదేశాన్ని తోసిరాజని ఆలయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆడిట్ తనిఖీలో ఈ విషయం బట్టబయలైంది. ఆడిట్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా మచ్చుకు 12 ఆలయాలను పరిశీలించగా, 9 చోట్ల నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని లాకర్లలో మగ్గబెట్టినట్టు తేలింది.
కేంద్రం అమలుచేస్తున్న గోల్డ్ డిపా జిట్ స్కీం గురించి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఆడిట్ విభాగం శ్రీముఖం పంపేసరికి నాలుక్కరుచుకున్న దేవాదాయశాఖ అన్ని ఆల యాల్లో బంగారు నిల్వలపై లెక్కలు సేకరిం చడం మొదలెట్టింది. గుర్తించిన బంగారాన్ని స్టేట్‌బ్యాంకులో డిపాజిట్ చేయాలా, లేదా కేంద్ర పథకం కింద ఉంచాలా అన్న దానిపై స్పష్టత కోసం ప్రభుత్వానికి ఫైల్ పంపింది
వడ్డీ గోవిందా!
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో దేవుళ్లకు స్వర్ణాభరణాలున్నాయి. ఇవి కాకుండా భక్తుల కానుకలు, విరాళాల రూపంలో బంగారం సమకూరుతోంది. అది చిన్న ముక్కలు, బిస్కెట్లు, ఇతర ఆకృతుల్లో ఉంటోంది. ఆభరణాల రూపంలో ఉన్నవాటిని వేడుకలు, పండగల సమయంలో అలంకరించాలని, ఇతర రూపంలో ఉన్న బంగారం కిలోకు మించితే స్టేట్‌బ్యాంక్‌లోని గోల్డ్ డిపాజిట్ పథకం కింద జమచేసి వడ్డీ పొందాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2009లో ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని చాలా ఆలయాలు పట్టించుకోలేదు.
ఆడిట్ గుర్తించిన ఆలయాలు.. బంగారు నిల్వలు
బాసర సరస్వతీ ఆలయం-10.26 కిలోలు, కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం-7.3 కిలోలు, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయం- 5.70 కిలోలు, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం- 3.49 కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం-2.8 కిలోలు, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయం-2.1 కిలోలు, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం-1.8 కిలోలు, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం-1.6 కిలోలు, నల్లగొండ జిల్లా చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం-1.2 కిలోలు.