Audit Department
-
నిమ్స్ ఆసుపత్రికి లోకాయుక్త నోటీసులు
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రికి తెలంగాణ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. వార్షిక ఆదాయ వ్యయాలపై లెక్కలు సరిగా లేవని, ఆడిటింగ్‌కు సహకరించడం లేదని ఆడిట్ శాఖ ఈమేరకు లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. దీంతో నిమ్స్ లెక్కలపై డొల్లతనం బయటపడుతోంది. ♦ నిమ్స్‌లో ఆదాయం-వ్యయాలపై యాజ మాన్యం ఆజమాయిషీ ఉండడం లేదు. దీంతో చెల్లింపులు అడ్డగోలుగా జరుగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు ఒక అధికారికి ఒకే నెలలో రెండుమార్లు వేతనం జమ అయినట్లు తెలుస్తోంది. ♦ లాగే ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.5 లక్షలు రెండుమార్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ♦ మ్యాన్‌పవర్ ఏజెన్సీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా సరిగా ఉండడం లేదు. ఇప్పటికి నాలుగుసారు ఈ–టెండర్లు పిలవడం..రద్దు చేయడం ద్వారా వృథా ఖర్చులు పెంచుతున్నారు. ♦ ఇక వార్షిక గణాంకాలను సక్రమంగా నిర్వహించని కారణంగా టీడీఎస్ రూపంలో నిమ్స్ ఖజానాకు గండి పడుతోంది. సరైన లెక్కలు చూపిస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో 10 శాతం నిధులు టీడీఎస్ రూపంలో మిగిలే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ♦ ఆస్పత్రికి ఏటా రూ.250 నుంచి 280 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ఈ నిధుల ఖర్చుపై నియంత్రణ లేదు. ఆజమాయిషీ..రోజు వారి లెక్కలు చూసే నాథుడే లేడు. ♦ క్రమం తప్పకుండా లెక్కలు చూపితే.. టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉండదని, వాస్తవానికి ఆస్పత్రులకు టీడీఎస్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని, నిమ్స్‌లో మాత్రం టీడీఎస్ చెల్లిస్తున్నారని ఓ సీనియర్ అధికారి వాపోయారు. ♦ ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ శాఖ లెక్కల విషయంలో నిమ్స్ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా పరిగణించింది. ఆడిట్ నిర్వహణకు అధికారులు సహకరించడం లేదని ఆడిట్ అధికారిగా వ్యవహరిస్తున్న పి.కోటేశ్వరరావు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన (ఫిర్యాదు నెం.1771/14/బి1) లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో వచ్చే నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు జమాఖర్చుల నివేదికతో హాజరు కావాల్సిందిగా నిమ్స్ యాజమాన్యానికి లోకాయుక్త నోటీసు(నెం.1771/2014/బి1/లోక్/5571/2021) జారీ చేసింది. ఆడిట్ అధికారుల వైఫల్యమా? ఇదిలా ఉండగా ఆడిట్ అధికారుల వైఫల్యం కారణంగానే నిమ్స్ లెక్కల వ్యవహారం అస్తవ్యస్థంగా తయారైందని ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఓ అధికారి ఆరోపించారు. ఆడిట్ చేసేందుకు ముందుకు రాకుండా నిమ్స్ లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ఆ అధికారి నిలదీయడం గమనార్హం. -
అభ్యంతరాలపై చర్యలేవీ?
సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని పలు శాఖల్లో ఆడిట్ అభ్యంతరాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. అధికారులు ఇష్తానుసారం ఖర్చు చేయడం... వాటిపై జమాఖర్చుల శాఖ అభ్యంతరం చెప్పడం పరిపాటిగా మారిం ది. వీటికి సరైన లెక్కలు చూపించడం లేదు సరికదా... వెచ్చించిన నిధులు వెనక్కు చెల్లించకపోవడంతో ప్రభుత్వ నిధులు వృధా అవుతున్నాయి. జిల్లాలో కొన్నేళ్లలో చేసిన ఆడిట్ ద్వారా కోట్లాది రూపాయల ఖర్చుపై భారీ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక సంస్థలకు సంబం ధించి ఆడిట్‌ను జిల్లా ఆడిట్‌శాఖ అధికారులు ఏటా చేపడుతుంటారు. ఈ సందర్భం గా అధికారులు కొన్ని రకాల ఖర్చులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటికి సరైన లెక్కలు చూపించాల్సిన బాధ్యత సంబంధి త అధికారులపై ఉంటుంది. అలా కానప్పు డు ఖర్చు చేసిన మొత్తాన్ని సంబంధిత అధికారి తిరిగి చెల్లించాలి. లేకుంటే వారి వేతనం, ఇతర ఖాతాల నుంచి రికవరీ చే యాలి. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు చూ స్తే జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం రూ.307.80కోట్లకు సంబంధించి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రికవరీపై కానరాని శ్రద్ధ.. అడిట్ అధికారులు సాధారణంగా 19రకాల ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. ఇందులో అకౌంట్ అంకెల్లో తేడా, అధిక నిధుల వినియోగం, నిధుల పక్కదారి, నిధులు ఖర్చు చేయకపోవడం, అనవసర ఖ ర్చు, అడ్వాన్సుల పెండింగ్ సర్దుబాటు, నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం, అధిక చెల్లింపులు, నిరుపయోగ ఖర్చు ఇలా అనేక రకాల అంశాలపై ఆడిట్లో చూస్తారు. సక్రమంగా లేని అంశాలపై అభ్యంతరాన్ని సంబంధిత అధికారికి పంపిస్తారు. వాటిపై ఆ అధికారి వివరణ ఇచ్చుకుని, సరైన లెక్కలు చూపాలి. లేకుంటే బాధ్యత వహించి వాపసు చేయాలి. కానీ ఈ విషయంలో అధికారులు ఎక్కువమంది సరైన లెక్కలు చూపడం లేదు. అప్పట్లో ఉన్న అధికారులు బదిలీ కావడమో... రిటైర్ కావడమో... అయితే ఇక రికవరీకి అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు వీటిపై లెక్కలు తేలిస్తే ప్రభుత్వ నిధులు వృధా అయ్యే అవకాశం ఉండదు. ఈ విధంగా వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో సుమారు రూ.20కోట్ల వరకు ఉంటుంది. వీటిని రికవరీ చేయక పోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం కలుగుతోంది. జిల్లా కలెక్టర్ వంటివారు సైతం వీటిని పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. మూడు నెలలకోసారి సమీక్ష.. ఆడిట్ చేసి ఖర్చులో లోపాలుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయడం మా విధి. ఇలా ప్రతి ఏడాది చేస్తున్నాం. వాటిని పరిష్కరించుకో వాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. అందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తాం. ఆ రోజు సరైన లెక్కలు చూపించిన వాటిని తీసేస్తాం. ఇంకా పరిష్కరించుకోనప్పుడు సర్‌ఛార్జి నోటీసులు ఇచ్చి రికవరీకి ఆదేశిస్తాం. ఆ సమాచారం మా శాఖ ఉన్నతాధికారులకు పంపిస్తాం. అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళుతుంది. ఉన్నతస్థాయి నుంచి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలొస్తాయి. – ఆర్.మల్లికాంబ, జిల్లా ఆడిట్ అధికారి -
తవ్వేకొద్దీ అవినీతి బహిర్గతం
సాక్షి, బాపట్ల(గుంటూరు) : ఏరియా వైద్యశాలలో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతుంది. విజయవాడ ఫైనాన్స్ ఆఫీసర్ మాధవిలత, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె.లతారాణి, అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్ రాజేష్‌కన్నా గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో మరోసారి ఆడిట్ నిర్వహించారు. ఏరియా వైద్యశాలలో 2017 నుంచి 2018 సంవత్సరంలోపే ఔట్సోర్సింగ్ సిబ్బంది స్వామి, చిరంజీవిలను అడ్డుపెట్టుకుని భారీ అవినీతికి ఏరియా వైద్యశాల యంత్రాంగం చక్రం తిప్పారు. ఈ ఆరోపణలతో జిల్లా ఏరియా వైద్యశాల కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ ఉన్నతాధికారుల దృష్టికి నెలరోజుల కిందట తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు విచారణకు గత నెల 24వ తేదిన ప్రత్యేక అధికారులను పంపించారు. నాలుగురోజులు పాటు అకౌంట్స్ పుస్తకాలు, రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. రూ.80 లక్షలకుపైగానే అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. శాఖపరమైన విచారణ పూర్తి... రాష్ట్ర ఆడిట్ విభాగం చేపట్టిన విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాలు మేరకు జిల్లా వైద్య విధాన పరిషత్ జిల్లా అకౌంటింగ్ అధికారి వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ అడిట్ అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 1వతే దీన మళ్లీ ఆడిట్ నిర్వహించారు. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన అడిట్ అధికారులు అవినీతి జరిగిన మాట వాస్తవమేని తేల్చారు. కానీ ఏ మేరకు జరిగిందో చెప్పటంలేదు. కొనసాగుతున్న ఆడిట్ గత నెల 24వతేదీన ఆడిట్ చేసిన బృందం మళ్లీ గురువారం వచ్చారు. గతంలో సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, సిబ్బందిని విచారణ చేశారు. తాజాగా ఏరియావైద్యశాలకు అభివృద్ధి కమిటీ పాలకవర్గాన్ని కూడా విచారణ చేపట్టారు. బిల్లులపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. నివ్వెరపోతున్న ఆడిట్ బృందం.. ఏరియావైద్యశాల సూపరిండెంట్, ఆర్ఎంఓ, అభివృద్ధి కమిటీ చైర్మన్ సంతకాలు లేకుండా రూపాయలు కూడా బయటకు తీసేందుకు అవకాశం లేకపోవటంతో ఎంచక్కా తీర్మానాలు రూపొందించి మరీ అవినీతికి పాల్పడినట్లు ఆడిట్ అధికారులు ప్రాథమిక విచారణలో పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఏరియా వైద్యశాలకు సంబంధించిన అభివృద్ధి ఫండ్ నిధులు, స్పెషల్ గదుల అద్దెలు, జననీ సురక్షిత పథకం నిధులు, ఉద్యోగుల పీఎఫ్, ఈపీఎఫ్, ప్రత్యేక నిధులు సైతం హాస్పిటల్ కమిటీ నిధులు నుంచి కొత్త అకౌంట్లులోకి బదిలీ చేసి మరీ అవినీతికి పాల్పడారు. వీటితోపాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు సైతం రూ.50 వేలు ఉంచి రూ.90 వేలు కూడా వేసి డ్రా చేసిన రికార్డులలో ఉండటం కొసమెరుపు. వీటితో పాటు బాపట్ల ఏరియా వైద్యశాలలో ఉన్న పాత ఇనుము మూడు టన్నులకుపైగా ఉండగా వాటిని విక్రయించిన యంత్రాంగం ఆ లెక్కలను ఖాతాలో కూడా చూపించలేదనే విషయంపై విచారణ చేపట్టారు. హాస్పిటల్లో కూడా కొన్ని పరికరాలు లేకపోవటంపై కూడా దృష్టి సారించారు. ఏదిఏమైనప్పటికి ఈ విచారణలో ఏరియా వైద్యశాలలో పలువురిపై వేటుపడటంతోపాటు జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని బాపట్లలో తీవ్రచర్చానీయాంశమైంది. -
ఆడిటర్ల ఆటలు..
మహిళలపై ఇద్దరు సీనియర్ల వేధింపులు ఆడిట్ శాఖలో ఇష్టారాజ్యం అది ఆడిట్ శాఖ.. వారు ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోయిన సీనియర్లు.. తాము చేసే అక్రమాలకు తలూపితే ఓకే.. లేకపోతే ఎంప్లాయి డేటాలో భర్త పేరుదగ్గర మరొకరి పేరు నమోదు చేస్తారు.. దాన్ని సదరు మహిళ భర్తకు చూపుతామంటూ బ్లాక్మెయిల్ చేస్తారు.. ఏడి కళ్లావేళ్లా పడితే మళ్లీ పేరు సాధారణ స్థితికి తెస్తారు. ఇదేమని ప్రశ్నించిన అధికారిని సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీరి చేష్టలకు విసిగిపోయిన మహిళా సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ కాపీ ‘సాక్షి’కి చిక్కింది. నెల్లూరు (అర్బన్): నెల్లూరు జిల్లా గూడూరులో ఆడిటర్లుగా పని చేస్తున్న ఇద్దరు సీనియర్లు 2006 లో డిప్యుటేషన్‌పై నెల్లూరుకు వచ్చారు. డిప్యుటేషన్‌పై వచ్చిన వారిని మూడేళ్లకు మించి ఉంచకూడదు. ఈ నిబంధన ఆ ఇద్దరికి వర్తించలేదు. అప్పటి నుంచి వారి అవినీతికి అంతం లేకుండా పోయింది. 2012లో కార్పొరేషన్ చిరుద్యోగులు సుబ్బులు, జయరాం, మరో మహిళ తమ పెన్షన్ ఫైలు విషయంలో లంచం అడుగుతున్నారంటూ పత్రికలకు ఎక్కారు. దీంతో విచారణ చేసిన అధికారులు వారిద్దరినీ మళ్లీ గూడూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. వీరు 2014 బదిలీల్లో మళ్లీ నెల్లూరుకే వచ్చారు. వీరి మీద అభియోగాలున్న దృష్ట్యా ఒకరిని మండల పరిషత్ ఆడిట్ శాఖలో, మరొకరిని జిల్లా పరిషత్ ఆడిట్ శాఖలో నియమించారు. అక్కడా ఇదే పంథా కొనసాగిస్తున్నారు. జిల్లా కార్యాలయంలో సీటు కోసం కుస్తీ వీరు రంగనాయకుల పేటలోని జిల్లా ఆడిట్ కార్యాలయంలో కుర్చీలపై కన్నేశారు. నిత్యం ఇతరులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎలాగైనా ఆదాయం తెచ్చి పెట్టే పాత సీట్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. 500 ఫిర్యాదులు వెళ్లినా చర్యలేవి? వీరిలో ఒకరిపై 500ల ఫిర్యాదులు వెళ్లినా చర్యల్లేవ్. విచారణ మూడేళ్లుగా సాగుతోంది. ఓ సీనియర్ ఏటా కార్పొరేషన్లో ఆడిట్ చేస్తారు. గతేడాది 12 మందితో కమిటీ వేసినా ఆయన ఒక్కరే ఆడిట్ చేశారు. వాటిలో అభ్యంతరాలున్నా లేనట్టు చూపించి డబ్బులు వసూలు చేసినట్టు విమర్శలున్నాయి. ఆడిట్లో అభ్యంతరాలున్నాయంటూ ఒంగోలు డిప్యూటీ డెరైక్టర్ ఫైలుపై ఆరు నెలలు సంతకాలు చేయకుండా ఆపారు. ప్రస్తుతం కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగానికి ఆడిట్ పూర్తి చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. సొంత ఇంట్లో ఉంటూ ఇన్‌కంటాక్స్ కోసం అద్దె ఇంట్లో ఉన్నట్టు రికార్డు చూపినట్టు ఆరోపణలున్నాయి. విజిలెన్స్ విచారణ ఏమైందో? మరొక అవినీతి ఆడిటర్‌పై కూడా విజిలెన్స్ విచారణ జరిగింది. జిల్లా ఆడిట్ అధికారి నివేదిక తయారు చేసి 2015లో ఒంగోలు డిప్యూటీ డెరైక్టర్‌కు పంపారు. అయినా ఆయనపై చర్యలు లేవు. ఆయన జెడ్పీ ఆడిటర్‌గా పని చే స్తూ మండల పరిషత్ ఆడిటింగ్ పనులను ఒకరికి బదులుగా చేసినట్టు ఆరోపణలున్నాయి. గతంలో వీరిపై డిప్యూటీ డెరైక్టర్ చిన్నపరెడ్డి విచారణ చేపట్టారు. సాక్షికి చిక్కిన బాధితురాలి ఫిర్యాదు కాపీ వీరి బాధలు పడలేని తోటి సీనియర్ ఆడిటర్ అయిన ఓ మహిళ తనను ఎలా మానసికంగా వేధిస్తున్నారో వివరిస్తూ రాష్ట్ర డెరైక్టర్‌తో పాటు డీడీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. భర్తలేని తాను బిడ్డలతో గుట్టుగా ఉంటే తనను వేధిస్తున్నారని వివరించింది. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకొని మహిళా ఆడిటర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ డెరైక్టర్-ఒంగోలుకు పంపిన కాపీ ‘సాక్షి’కి చిక్కింది. వేధింపులకు గురిచేసిన కాపీ అందింది ఆడిట్ శాఖలో మహిళలను వేధిస్తుని మహిళ చేసిన ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టాం. డెరైక్టర్ పరిశీలించి చర్యలు తీసుకోవాలి. అదేంటి మీరే చర్యలు తీసుకుని డెరైక్టర్‌కు నివేదిక పంపాలి కదా? అని సాక్షి ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. -రాధాకృష్ణ, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్, ఒంగోలు చర్యలు తీసుకోవాల్సింది డీడీనే నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టా. వారిపై చర్యలు చేపట్టేందుకు అధికారం లేదు. రీజినల్ డిప్యూటీ డైరె క్టర్ చర్యలు తీసుకోవాలి. -షణ్ముఖం, జిల్లా ఆడిట్ అధికారి -
దేవుడి బంగారం.. గాలిలో దీపం!
* గోల్డ్ డిపాజిట్ స్కీంలో పెట్టాలనే ఆదేశానికి తిలోదకాలు * నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు లాకర్లకు తరలింపు * వడ్డీ పొందాల్సిందిపోయి ఎదురు చార్జీల చెల్లింపు * బయటపెట్టిన ఆడిట్ విభాగం * తేరుకొని లెక్కలు సేకరిస్తున్న దేవాదాయశాఖ సాక్షి, హైదరాబాద్: దేవుడి మాన్యానికే కాదు.. స్వామి బంగారానికీ రక్షణ కరువైంది. విరాళాలు, కానుకల రూపంలో భక్తులు సమర్పించిన బంగారం సరైన లెక్కాపత్రం లేకుండా లాకర్లలో మగ్గుతోంది. ఏ లాకర్లో ఎంత పుత్తడి ఉందనే వివరాలు లేకుండా పోయాయి. ఇటీవల బ్యాంకులు, వాటి ఏటీఎంలపై దొంగలు గురిపెడుతున్న నేపథ్యంలో దేవుడి సొత్తు గాలిలో దీపమైంది. బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టొద్దని, కిలోకు మించి స్వర్ణం ఉంటే స్టేట్‌బ్యాంక్ గోల్డ్ డిపాజిట్ బాండ్ స్కీమ్‌లో ఉంచి వడ్డీ పొందాలనే ప్రభుత్వ ఆదేశాన్ని తోసిరాజని ఆలయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆడిట్ తనిఖీలో ఈ విషయం బట్టబయలైంది. ఆడిట్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా మచ్చుకు 12 ఆలయాలను పరిశీలించగా, 9 చోట్ల నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని లాకర్లలో మగ్గబెట్టినట్టు తేలింది. కేంద్రం అమలుచేస్తున్న గోల్డ్ డిపా జిట్ స్కీం గురించి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఆడిట్ విభాగం శ్రీముఖం పంపేసరికి నాలుక్కరుచుకున్న దేవాదాయశాఖ అన్ని ఆల యాల్లో బంగారు నిల్వలపై లెక్కలు సేకరిం చడం మొదలెట్టింది. గుర్తించిన బంగారాన్ని స్టేట్‌బ్యాంకులో డిపాజిట్ చేయాలా, లేదా కేంద్ర పథకం కింద ఉంచాలా అన్న దానిపై స్పష్టత కోసం ప్రభుత్వానికి ఫైల్ పంపింది వడ్డీ గోవిందా! రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో దేవుళ్లకు స్వర్ణాభరణాలున్నాయి. ఇవి కాకుండా భక్తుల కానుకలు, విరాళాల రూపంలో బంగారం సమకూరుతోంది. అది చిన్న ముక్కలు, బిస్కెట్లు, ఇతర ఆకృతుల్లో ఉంటోంది. ఆభరణాల రూపంలో ఉన్నవాటిని వేడుకలు, పండగల సమయంలో అలంకరించాలని, ఇతర రూపంలో ఉన్న బంగారం కిలోకు మించితే స్టేట్‌బ్యాంక్‌లోని గోల్డ్ డిపాజిట్ పథకం కింద జమచేసి వడ్డీ పొందాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2009లో ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని చాలా ఆలయాలు పట్టించుకోలేదు. ఆడిట్ గుర్తించిన ఆలయాలు.. బంగారు నిల్వలు బాసర సరస్వతీ ఆలయం-10.26 కిలోలు, కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం-7.3 కిలోలు, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయం- 5.70 కిలోలు, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం- 3.49 కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం-2.8 కిలోలు, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయం-2.1 కిలోలు, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం-1.8 కిలోలు, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం-1.6 కిలోలు, నల్లగొండ జిల్లా చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం-1.2 కిలోలు. -
లెక్కలు.. తప్పాయ్!
- బీఆర్జీఎఫ్ నిధుల్లో వెలుగుచూసిన అవకతవకలు - పభుత్వ ఖాతాలో జమకాని రూ.27.88 లక్షలు - అదనపు చెల్లింపులు రూ.3.83 లక్షలు - గ్రామాలు, మండల పరిషత్‌లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం - 147 పంచాయతీల్లో రికార్డులే లేవు - 3,314 పనులపై ముగిసిన ఆడిట్ - 2013-14 ఆడిట్ రిపోర్ట్‌లో గుర్తించిన లోపాలు నల్లగొండ : 2013-14 ఆర్థిక సంవత్సరంలో బీఆర్జీఎఫ్ (వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి) కింద రూ.32.02 కోట్లు ఖర్చు చేశారు. ఆయా నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్ నిర్వహించగా రూ.31.71 లక్షల నిధుల వ్యయానికి సంబంధించి ఆడిట్ అధికారులు అభ్యంతరాలు తెలిపారు. దీంట్లో మండల పరి షత్, గ్రామపంచాయతీ స్థాయిలో ఖర్చు చేస్తున్న నిధులకు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. రూ.3.83 లక్షలు అడ్వాన్స్ చెల్లింపులు చేయగా.. ఆ నిధుల వినియోగానికి సంబంధించి లెక్కలు చూపలేదు. బీఆర్జీఎఫ్ పనులు చేపట్టిన వారినుంచి వివిధ రకాల పన్నుల రూపంలో మినహాయించిన రూ.27.88 లక్షలు ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదు. మరో 147 పంచాయతీల్లో క్యాష్‌బుక్‌లు, ఎంబీ రికార్డులు లేవు. దీంతో ఆ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించలేదు. రికార్డులు లేని పంచాయతీలకు నోటీసులు జారీ చేయాలని ఆడిట్ శాఖనుంచి జిల్లా పరిషత్ కు లేఖ అందినట్లు తెలిసింది. పంచాయతీలు, మండల పరిషత్‌ల బాటలోనే మున్సిపాల్టీల్లో కూడా అవకతవకలు బయటపడ్డాయి. మిర్యాలగూడ మున్సిపాల్టీలో చేపట్టిన అభివృద్ధి పనులనుంచి రూ.1.65 లక్షల పన్నులు మినహాయించారు కానీ ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదు. అనేక అంశాలపై అభ్యంతరాలు.. అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాలు, రోడ్లు, గ్రామీణ, మండల, అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీఆర్జీఎఫ్ నిధులు ఖర్చు చేస్తారు. దీనిలో భాగంగా జిల్లాకు ప్రతి ఏడాది సుమారు రూ.33 కోట్ల వరకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. దీంట్లో జిల్లా పరిషత్, మున్సిపాల్టీలకు 20 శాతం, మండల పరిషత్ 30 శాతం, పంచా యతీలకు 50 శాతం నిధులు కేటాయిస్తారు. 2013-14 సంవత్సరానికి గాను జిల్లాకు రూ. 32.02 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం 3,314 పనులకు సంబంధించిన ఆడిట్ గతేడాది నవంబర్‌లో పూర్తి చేశారు. ఈ ఆడిట్ రిపోర్ట్ ఇటీవలే జిల్లా పరిషత్‌కు సమర్పించారు. దీంట్లో నిధులు వినియోగంలో జరిగిన లోతుపాట్లు, రికార్డుల నిర్వహణతో పాటు పలు అంశాలపై ఆడిట్ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వెలుగుచూసిన లొసుగులు కొన్ని.. - బీఆర్జీఎఫ్ పనులు చేపట్టిన వారి నుంచి మినహాయించిన వాట్, ఆదాయ పన్ను, సీన రేజ్, సంబంధిత శాఖలకు జమ చేయడం లేదు. - మినహాయించిన పన్నుల సొమ్మును మండల పరిషత్, పంచాయతీలు, మున్సిపాల్టీలు తమ వద్దనే ఉంచుకుంటున్నాయి. - నిబంధనల ప్రకారం ప్రతి మూడు మాసాలోకోసారి ఈ పన్నులు జమ చేయాలి. కానీ అలా చేయకుండా ఆ నిధులను మరొక అవసరాలకు వినియోగిస్తున్నారు. - బీఆర్జీఎఫ్ నిధులు ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తుండటంతో మినహాయించిన పన్నులు కూడా అభివృద్ధి పనులకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. - పనులు పరీక్షించేందుకు క్వాలిటీ కంట్రోల్ ఏర్పాటు చేయడం లేదు..రికార్డుల్లో క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ సమర్పించడం లేదు. - పూర్తయిన పనుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం లేదు. - నిధుల వినియోగం వివరాలకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) జిల్లా పరిషత్‌కు సమర్పించడం లేదు. - పంచాయతీ స్థాయిలో క్యాష్‌బుక్‌లు, ఓచర్లు, ఎంబీ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదు. - బీఆర్జీఎఫ్ పనులు జరిగిన ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేయడం లేదు.