- బీఆర్‌జీఎఫ్ నిధుల్లో వెలుగుచూసిన అవకతవకలు
- పభుత్వ ఖాతాలో జమకాని రూ.27.88 లక్షలు
- అదనపు చెల్లింపులు రూ.3.83 లక్షలు
- గ్రామాలు, మండల పరిషత్‌లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం
- 147 పంచాయతీల్లో రికార్డులే లేవు
- 3,314 పనులపై ముగిసిన ఆడిట్
- 2013-14 ఆడిట్ రిపోర్ట్‌లో గుర్తించిన లోపాలు
నల్లగొండ : 2013-14 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌జీఎఫ్ (వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి) కింద రూ.32.02 కోట్లు ఖర్చు చేశారు. ఆయా నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్ నిర్వహించగా రూ.31.71 లక్షల నిధుల వ్యయానికి సంబంధించి ఆడిట్ అధికారులు అభ్యంతరాలు తెలిపారు. దీంట్లో మండల పరి షత్, గ్రామపంచాయతీ స్థాయిలో ఖర్చు చేస్తున్న నిధులకు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. రూ.3.83 లక్షలు అడ్వాన్స్ చెల్లింపులు చేయగా.. ఆ నిధుల వినియోగానికి సంబంధించి లెక్కలు చూపలేదు. బీఆర్‌జీఎఫ్ పనులు చేపట్టిన వారినుంచి వివిధ రకాల పన్నుల రూపంలో మినహాయించిన రూ.27.88 లక్షలు ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదు. మరో 147 పంచాయతీల్లో క్యాష్‌బుక్‌లు, ఎంబీ రికార్డులు లేవు. దీంతో ఆ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించలేదు. రికార్డులు లేని పంచాయతీలకు నోటీసులు జారీ చేయాలని ఆడిట్ శాఖనుంచి జిల్లా పరిషత్ కు లేఖ అందినట్లు తెలిసింది. పంచాయతీలు, మండల పరిషత్‌ల బాటలోనే మున్సిపాల్టీల్లో కూడా అవకతవకలు బయటపడ్డాయి. మిర్యాలగూడ మున్సిపాల్టీలో చేపట్టిన అభివృద్ధి పనులనుంచి రూ.1.65 లక్షల పన్నులు మినహాయించారు కానీ ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదు.
అనేక అంశాలపై అభ్యంతరాలు..
అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాలు, రోడ్లు, గ్రామీణ, మండల, అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీఆర్‌జీఎఫ్ నిధులు ఖర్చు చేస్తారు. దీనిలో భాగంగా జిల్లాకు ప్రతి ఏడాది సుమారు రూ.33 కోట్ల వరకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. దీంట్లో జిల్లా పరిషత్, మున్సిపాల్టీలకు 20 శాతం, మండల పరిషత్ 30 శాతం, పంచా యతీలకు 50 శాతం నిధులు కేటాయిస్తారు. 2013-14 సంవత్సరానికి గాను జిల్లాకు రూ. 32.02 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం 3,314 పనులకు సంబంధించిన ఆడిట్ గతేడాది నవంబర్‌లో పూర్తి చేశారు. ఈ ఆడిట్ రిపోర్ట్ ఇటీవలే జిల్లా పరిషత్‌కు సమర్పించారు. దీంట్లో నిధులు వినియోగంలో జరిగిన లోతుపాట్లు, రికార్డుల నిర్వహణతో పాటు పలు అంశాలపై ఆడిట్ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
వెలుగుచూసిన లొసుగులు కొన్ని..
- బీఆర్‌జీఎఫ్ పనులు చేపట్టిన వారి నుంచి మినహాయించిన వాట్, ఆదాయ పన్ను, సీన రేజ్, సంబంధిత శాఖలకు జమ చేయడం లేదు.
- మినహాయించిన పన్నుల సొమ్మును మండల పరిషత్, పంచాయతీలు, మున్సిపాల్టీలు తమ వద్దనే ఉంచుకుంటున్నాయి.
- నిబంధనల ప్రకారం ప్రతి మూడు మాసాలోకోసారి ఈ పన్నులు జమ చేయాలి. కానీ అలా చేయకుండా ఆ నిధులను మరొక అవసరాలకు వినియోగిస్తున్నారు.
- బీఆర్‌జీఎఫ్ నిధులు ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తుండటంతో మినహాయించిన పన్నులు కూడా అభివృద్ధి పనులకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.
- పనులు పరీక్షించేందుకు క్వాలిటీ కంట్రోల్ ఏర్పాటు చేయడం లేదు..రికార్డుల్లో క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ సమర్పించడం లేదు.
- పూర్తయిన పనుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం లేదు.
- నిధుల వినియోగం వివరాలకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) జిల్లా పరిషత్‌కు సమర్పించడం లేదు.
- పంచాయతీ స్థాయిలో క్యాష్‌బుక్‌లు, ఓచర్లు, ఎంబీ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదు.
- బీఆర్‌జీఎఫ్ పనులు జరిగిన ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేయడం లేదు.
లెక్కలు.. తప్పాయ్!
Published Sat, Apr 18 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM
Advertisement
Advertisement