అడిట్ సిబ్బందికి సూచనలు ఇస్తున్న రాష్ట్ర అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ రాజేష్‌కన్నా,సిబ్బంది
సాక్షి, బాపట్ల(గుంటూరు) : ఏరియా వైద్యశాలలో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతుంది. విజయవాడ ఫైనాన్స్ ఆఫీసర్ మాధవిలత, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె.లతారాణి, అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్ రాజేష్‌కన్నా గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో మరోసారి ఆడిట్ నిర్వహించారు. ఏరియా వైద్యశాలలో 2017 నుంచి 2018 సంవత్సరంలోపే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది స్వామి, చిరంజీవిలను అడ్డుపెట్టుకుని భారీ అవినీతికి ఏరియా వైద్యశాల యంత్రాంగం చక్రం తిప్పారు. ఈ ఆరోపణలతో జిల్లా ఏరియా వైద్యశాల కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ ఉన్నతాధికారుల దృష్టికి నెలరోజుల కిందట తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు విచారణకు గత నెల 24వ తేదిన ప్రత్యేక అధికారులను పంపించారు. నాలుగురోజులు పాటు అకౌంట్స్ పుస్తకాలు, రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. రూ.80 లక్షలకుపైగానే అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
శాఖపరమైన విచారణ పూర్తి...
రాష్ట్ర ఆడిట్ విభాగం చేపట్టిన విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాలు మేరకు జిల్లా వైద్య విధాన పరిషత్ జిల్లా అకౌంటింగ్ అధికారి వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ అడిట్ అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 1వతే దీన మళ్లీ ఆడిట్ నిర్వహించారు. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన అడిట్ అధికారులు అవినీతి జరిగిన మాట వాస్తవమేని తేల్చారు. కానీ ఏ మేరకు జరిగిందో చెప్పటంలేదు.
కొనసాగుతున్న ఆడిట్
గత నెల 24వతేదీన ఆడిట్ చేసిన బృందం మళ్లీ గురువారం వచ్చారు. గతంలో సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ, సిబ్బందిని విచారణ చేశారు. తాజాగా ఏరియావైద్యశాలకు అభివృద్ధి కమిటీ పాలకవర్గాన్ని కూడా విచారణ చేపట్టారు. బిల్లులపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.
నివ్వెరపోతున్న ఆడిట్ బృందం..
ఏరియావైద్యశాల సూపరిండెంట్, ఆర్‌ఎంఓ, అభివృద్ధి కమిటీ చైర్మన్ సంతకాలు లేకుండా రూపాయలు కూడా బయటకు తీసేందుకు అవకాశం లేకపోవటంతో ఎంచక్కా తీర్మానాలు రూపొందించి మరీ అవినీతికి పాల్పడినట్లు ఆడిట్ అధికారులు ప్రాథమిక విచారణలో పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఏరియా వైద్యశాలకు సంబంధించిన అభివృద్ధి ఫండ్ నిధులు, స్పెషల్ గదుల అద్దెలు, జననీ సురక్షిత పథకం నిధులు, ఉద్యోగుల పీఎఫ్, ఈపీఎఫ్, ప్రత్యేక నిధులు సైతం హాస్పిటల్ కమిటీ నిధులు నుంచి కొత్త అకౌంట్లులోకి బదిలీ చేసి మరీ అవినీతికి పాల్పడారు.
వీటితోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు సైతం రూ.50 వేలు ఉంచి రూ.90 వేలు కూడా వేసి డ్రా చేసిన రికార్డులలో ఉండటం కొసమెరుపు. వీటితో పాటు బాపట్ల ఏరియా వైద్యశాలలో ఉన్న పాత ఇనుము మూడు టన్నులకుపైగా ఉండగా వాటిని విక్రయించిన యంత్రాంగం ఆ లెక్కలను ఖాతాలో కూడా చూపించలేదనే విషయంపై విచారణ చేపట్టారు. హాస్పిటల్‌లో కూడా కొన్ని పరికరాలు లేకపోవటంపై కూడా దృష్టి సారించారు. ఏదిఏమైనప్పటికి ఈ విచారణలో ఏరియా వైద్యశాలలో పలువురిపై వేటుపడటంతోపాటు జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని బాపట్లలో తీవ్రచర్చానీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment