illegal works
-
ప్రైవేట్ హాస్పిటల్ లో వసూళ్ల దందా
-
టీడీపీ అనుచరగణం అరాచకం
సాక్షి, నరసరావుపేట (గుంటూరు) : అధికారాన్ని అడ్డంపెట్టుకొని అవినీతికి పాల్పడిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల అక్రమాల పుట్ట పగులుతోంది. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడి అవినీతిని ఆదర్శంగా తీసుకున్న తమ్ముళ్లు గత ప్రభుత్వ హయాంలో అరాచకాలకు తెగబడ్డారు. ప్రభుత్వం మారటంతో బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తుండటంతో వారి అక్రమ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. నష్టపోయిన బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధితో పాటు ఇద్దరు మాజీ కౌన్సిలర్లను అదుపులోకి తీసుకున్నారు. అనేక మోసాలు: అధికారం అడ్డంపెట్టుకొని టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయ విజయలక్ష్మికి చెప్పి విద్యుత్ సబ్ స్టేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లి ఆంజనేయులు లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితుల్లో ఒకరు ఆళ్ల శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు నెల రోజుల కిందట చీటింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పాటు కోడెల కుమారుడు శివరామ్‌కు కే ట్యాక్స్ చెల్లించాలని దివ్యాంగుడైన కృష్ణారావును బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు చేయించిన అభియోగంపై రూరల్ పోలీస్ స్టేషన్లో కొల్లి ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసులు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కొల్లి ఆంజనేయులును శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. భూముల కబ్జా.. అదే విధంగా గుంటూరు రోడ్డులో ఉన్న తన పొలాన్ని కోడెల శివరామ్ అండదండలతో టీడీపీ మాజీ కౌన్సిలర్ కొవ్వూరి బాబు కబ్జాకు పాల్పడ్డాడని చిరుమామిళ్ల బసవయ్య ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు కొవ్వూరు బాబు జమిందార్ ఫంక్షన్ హాల్ ఎదుట గతంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కొనుగోలుకు సంబంధించి లక్షలాది రూపాయలు అడ్వాన్స్‌లు తీసుకొని, దుకాణాలు తమకు ఇవ్వకుండా ఇతరులకు విక్రయించి మోసం చేశాడని బాధితులు టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అలాగే నమ్మకంగా వ్యాపారం చేస్తూ వ్యాపారులు, ఖాతాదారుల నుంచి సుమారు రూ.8 కోట్ల నగదు, బంగారం అప్పుగా తీసుకొని బంగారు వ్యాపారి మారం శ్రీనివాసరావు కుటుంబంతో సహా సుమారు 30 రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నష్టపోయిన బాధితులు సుమారు 80 మంది డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కాల్ లిస్ట్ వివరాలను పరిశీలించగా, టీడీపీ మాజీ కౌన్సిలర్‌తో తరచూ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలియవచ్చింది. కాగా మాజీ స్పీకర్ కోడెల కుమారుడు, కుమార్తె, వారి అనుచరగణం చేసిన అవినీతి, అక్రమ దందాలపై బాధితుల ఫిర్యాదుతో పలు స్టేషన్లలో కేసులు నమోదవ్వగా, వారంతా పరారీలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
పట్టించుకోని ప్రభుత్వ ఆదేశాలు
జిల్లాలోని తెలుగుగంగ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను ధిక్కరించారు. టీడీపీ హయాంలో ఇష్టారీతిన అంచనాలు వేసి, కమీషన్లు దండుకుని ఎక్సెస్ టెండర్ అనుమతించిన సదరు అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను సైతం డోంట్ కేర్ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారైన ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో ఇప్పటి వరకు 25 శాతం కూడా పూర్తి కాని ప్రాజెక్ట్‌లను నిలిపివేసి టెండర్లను పునః పరిశీలనకు పంపి, అందులో అక్రమాలు జరిగి ఉంటే రివర్స్ టెండరింగ్ విధానంలో మరోసారి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేశారు. 5 శాతం కూడా జరగని ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో టీడీపీ కీలక నేత, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఉన్నతాధికారులు రిజర్వాయర్ పనులు నిలిపి వేయకుండా తమ పర్యవేక్షణలో చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ∙సాక్షి, నెల్లూరు : వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి ప్రాంతంలో సాగునీటి అవసరాల కోసం 2016లో ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సాయి గంగ కెనాల్ (ఎస్జీకే) నుంచి 34.100 కిలో మీటరు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఆల్తూరుపాడులో ఒక టీఎంసీ నీరు సామర్థ్యాన్ని నిల్వ చేసేలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు అంచనా వేశారు. నిల్వ చేసిన నీటి ద్వారా దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించేలా ప్రతిపాదనలు చేశారు. దీంతో ఎస్జీకే కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.114 కోట్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం రూ.189.90 కోట్లు అంచనాలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్‌లకు తొలి విడతగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు 2.05 కోట్లు, రిజర్వాయర్ నిర్మాణానికి రూ.26.18 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ పలు సాంకేతిక కారణాలు, టీడీపీ పెద్దల కమీషన్ల కక్కుర్తి కారణంగా టెండర్లకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మరో కీలక నేత కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనాలు భారీగా పెంచారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ రూ.280 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ రూ.130 కోట్ల వరకు అంచనాలు పెంచి టెండర్లకు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపెనీ రిజరాయర్ బ్యాలెన్సింగ్ పనులు, లిఫ్ట్ పనులు మరో బడా కంపెనీకి 4.9 ఎక్సెస్ రేటుకు టీడీపీ పెద్దలు టెండర్ ఖరారు చేయించారు. ఆయా టెండర్లకు ఇతర కంపెనీలు పాల్గొనకుండా తీవ్ర ఒత్తిడి పెంచి ఎక్సెస్ రేటుకు ఖరారు చేయించారు. ఓటమి చెందితే కమీషన్ రాదని.. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు ఎన్నికల లోపు ప్రారంభించకుంటే కమీషన్లు రావనుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు రావడంతో హడావుడిగా ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేశారు. బహుళ ప్రయోజనాలు చేకూర్చే ఆ ప్రాజెక్ట్‌ను ఈ ప్రాంత రైతులకు కూడా తెలియకుండా శంకుస్థాపన చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు పనులు ప్రారంభం కాకపోతే కమీషన్లు ఎగనామం పెడుతారన్న కారణంతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులకు అందని భూ పరిహారం ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం కోసం సాగు భూములు వదులుకున్న రైతులకు మాత్రం భూ పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. రిజర్వాయర్ కోసం సేకరించిన భూములకు రైతు వారీ పట్టా భూమికి ఎకరాకు రూ.7.8 లక్షలు, ప్రభుత్వ డీ–ఫారం పట్టా భూమికి రూ.7.5 లక్షల వంతున పరిహారం నిర్ధారించి కొంత వరకు భూ పరిహారం అందించారు. ఇంకా 40 శాతం వరకు భూములకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్తూరుపాడు వెల్లంపల్లిలో సుమారుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు సంబంధించి 150 కుటుంబాలు దాదాపు 200 ఎకరాల భూములను 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆయా భూముల్లో బోరు బావులు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అవి ప్రభుత్వ భూములు కావడంతో పరిహారం ఇచ్చేది లేదంటూ కాంట్రాక్టర్ బలవంతగా పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో గతంలో రైతులు పనులను అడ్డుకున్నారు. ఇప్పటికే గ్రామ పొలిమేర్లలో దాదాపు రూ.15 లక్షల వ్యయంతో భూములు చుట్టూ రాళ్లు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటుంటే రాళ్లను తొలగించడంపై రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ టీడీపీ హయాంలో మంజూరైన ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో 25 శాతం పూర్తి కాని వాటిని నిలిపివేసి పునః పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ అంచనాల్లో అక్రమాలు ఉన్నా వెంటనే రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కానీ తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు, టీడీపీ పెద్దలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 5 శాతం కూడా పూర్తి చేయని పనులను నిలిపి వేయకుండా నిర్మాణాలు చేయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్థానిక టీడీపీ పెద్దలు అస్మదీయులకు సబ్‌కాంట్రాక్టర్ ద్వారా ప్రాజెక్ట్ పనులు ఇచ్చి ఉండడంతో అంచనాల్లో భారీ తేడాలున్నా కనీస పరిశీలన చేయకుండా టీడీపీ పెద్దలతో ఉన్న లోపాయి కారి ఒప్పందంతో ఉన్నతాధికారి ఆయా పనులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆయా పనులను అడ్డుకోవడంతో నాలుగు రోజులుగా నిలిపి వేసినట్లు తెలుస్తోంది. -
తవ్వేకొద్దీ అవినీతి బహిర్గతం
సాక్షి, బాపట్ల(గుంటూరు) : ఏరియా వైద్యశాలలో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతుంది. విజయవాడ ఫైనాన్స్ ఆఫీసర్ మాధవిలత, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె.లతారాణి, అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్ రాజేష్‌కన్నా గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో మరోసారి ఆడిట్ నిర్వహించారు. ఏరియా వైద్యశాలలో 2017 నుంచి 2018 సంవత్సరంలోపే ఔట్సోర్సింగ్ సిబ్బంది స్వామి, చిరంజీవిలను అడ్డుపెట్టుకుని భారీ అవినీతికి ఏరియా వైద్యశాల యంత్రాంగం చక్రం తిప్పారు. ఈ ఆరోపణలతో జిల్లా ఏరియా వైద్యశాల కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ ఉన్నతాధికారుల దృష్టికి నెలరోజుల కిందట తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు విచారణకు గత నెల 24వ తేదిన ప్రత్యేక అధికారులను పంపించారు. నాలుగురోజులు పాటు అకౌంట్స్ పుస్తకాలు, రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. రూ.80 లక్షలకుపైగానే అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. శాఖపరమైన విచారణ పూర్తి... రాష్ట్ర ఆడిట్ విభాగం చేపట్టిన విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాలు మేరకు జిల్లా వైద్య విధాన పరిషత్ జిల్లా అకౌంటింగ్ అధికారి వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ అడిట్ అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 1వతే దీన మళ్లీ ఆడిట్ నిర్వహించారు. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన అడిట్ అధికారులు అవినీతి జరిగిన మాట వాస్తవమేని తేల్చారు. కానీ ఏ మేరకు జరిగిందో చెప్పటంలేదు. కొనసాగుతున్న ఆడిట్ గత నెల 24వతేదీన ఆడిట్ చేసిన బృందం మళ్లీ గురువారం వచ్చారు. గతంలో సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, సిబ్బందిని విచారణ చేశారు. తాజాగా ఏరియావైద్యశాలకు అభివృద్ధి కమిటీ పాలకవర్గాన్ని కూడా విచారణ చేపట్టారు. బిల్లులపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. నివ్వెరపోతున్న ఆడిట్ బృందం.. ఏరియావైద్యశాల సూపరిండెంట్, ఆర్ఎంఓ, అభివృద్ధి కమిటీ చైర్మన్ సంతకాలు లేకుండా రూపాయలు కూడా బయటకు తీసేందుకు అవకాశం లేకపోవటంతో ఎంచక్కా తీర్మానాలు రూపొందించి మరీ అవినీతికి పాల్పడినట్లు ఆడిట్ అధికారులు ప్రాథమిక విచారణలో పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఏరియా వైద్యశాలకు సంబంధించిన అభివృద్ధి ఫండ్ నిధులు, స్పెషల్ గదుల అద్దెలు, జననీ సురక్షిత పథకం నిధులు, ఉద్యోగుల పీఎఫ్, ఈపీఎఫ్, ప్రత్యేక నిధులు సైతం హాస్పిటల్ కమిటీ నిధులు నుంచి కొత్త అకౌంట్లులోకి బదిలీ చేసి మరీ అవినీతికి పాల్పడారు. వీటితోపాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు సైతం రూ.50 వేలు ఉంచి రూ.90 వేలు కూడా వేసి డ్రా చేసిన రికార్డులలో ఉండటం కొసమెరుపు. వీటితో పాటు బాపట్ల ఏరియా వైద్యశాలలో ఉన్న పాత ఇనుము మూడు టన్నులకుపైగా ఉండగా వాటిని విక్రయించిన యంత్రాంగం ఆ లెక్కలను ఖాతాలో కూడా చూపించలేదనే విషయంపై విచారణ చేపట్టారు. హాస్పిటల్లో కూడా కొన్ని పరికరాలు లేకపోవటంపై కూడా దృష్టి సారించారు. ఏదిఏమైనప్పటికి ఈ విచారణలో ఏరియా వైద్యశాలలో పలువురిపై వేటుపడటంతోపాటు జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని బాపట్లలో తీవ్రచర్చానీయాంశమైంది. -
‘పేట’ నిండా ‘బట్టీ’లే!
శివ్వంపేట(నర్సాపూర్): మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇటుకబట్టీలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన ఇటుకబట్టీలపై సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీరి వ్యాపారం దర్జాగా కొనసాగుతోంది. మండలంలోని కొత్తపేట గ్రామంలో సుమారు 30నుంచి 40వరకు ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి పనులు చేస్తున్నా పట్టించుకున్న అధికారులే లేరు. నిబంధనలకు పాతర నిబంధనల ప్రకారం ఇటుకబట్టీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా సంబంధిత వ్యాపారులు ఇవేమీ పట్టించుకోకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. బట్టీల్లో వాడేందుకు కలపతోపాటు తయారీకోసం మట్టిని స్థానిక చెరువులు, కుంటలు, పొలాల్లో నుంచి తరలిస్తున్నారు. సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, మైనింగ్ శాఖల సిబ్బంది కనుసైగల్లోనే వీరి వ్యాపారం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉచిత విద్యుత్ దుర్వినియోగం వ్యవసాయ బోరుబావుల కోసం ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ అక్రమ దారి పడుతోంది. బట్టీల సమీప ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బోర్లను యథేచ్ఛగా ఇటుక బట్టీల కోసం వినియోగించుకుంటున్నారు. ఆయా బోర్లకు వచ్చే ఉచిత విద్యుత్ ద్వారానే వీటికి నీటి సరఫరా జరుగుతోంది. అయినా సంబంధిత విద్యుత్‌శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శిఖం భూమి నుంచి దర్జాగా మట్టిని తరలిస్తున్నా సంబంధిత ఇరిగేషన్ శాఖ చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. పట్టా, ప్రభుత్వ భూముల్లో బట్టీల నిర్వహిస్తున్నా రెవెన్యూ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విలువైన కలప బట్టీల్లో వినియోగిస్తున్నా సంబంధిత అటవీశాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల కూలీలతో.. ఇటుకబట్టీల వ్యాపారులు ఒడిశా, చత్తీస్‌గఢ్, బీహార్ ప్రాంతాలకు చెందిన కూలీలతో బట్టీల్లో పనిచేయించుకుంటున్నారు. వీరి కుటుంబాల్లో ఉన్న బాలకార్మికులతో సైతం పనులు చేయించుకుంటున్నారు. వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన రోడ్డుకు ఆనుకొని బట్టీలు ఏర్పాటు చేయడంతో వాటిని కాల్చేటప్పుడు వచ్చే కాలుష్యంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఆనుకొని అక్రమ వ్యాపారం జరుగుతున్నా సంబంధిత శాఖల సిబ్బంది ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బట్టీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దృష్టికి రాలేదు : మండలంలో అక్రమంగా వెలసిన ఇటుక బట్టీల గురించి నా దృష్టికి రాలేదు. కొత్తపేటలో వెలసిన ఇటుక బట్టీలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. – తహసీల్దార్ భానుప్రకాష్ -
ఆయనొస్తున్నారని..
► సీఎం పర్యటన పేరుతో నిధుల పందేరానికి రంగం సిద్ధం ► బాగా ఉన్న రోడ్డుపైనే మళ్లీ నిర్మాణం ► శిల్పారామంలో రూ.15.50 లక్షలతో ప్రహరీ ► రూ.90 లక్షల పనులకు రంగం సిద్ధం ► కార్పొరేషన్ తీరుపై సర్వత్రా విమర్శలు నగర పాలక సంస్థ పాలకవర్గం, అధికారుల వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల అవసరం లేకున్నా పనులు చేయడం, నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తుండటంపై ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు ప్రజలు మండిపడుతున్నారు. నగర సమగ్రాభివృద్ధిని ఏమాత్రమూ పట్టించుకోకుండా తమకు ‘నగదు’ మిగిలే పనులపైనే దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అనంతపురం న్యూసిటీ : ముఖ్యమంత్రి పర్యటన పేరుతో మరోసారి నిధుల పందేరానికి నగర పాలక సంస్థ సిద్ధమైంది. గత పర్యటన సందర్భంగా విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేసి విమర్శల పాలైన పాలకవర్గం, అధికారులు.. ఈసారి కూడా అదే పంథాలో వెళుతుండడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల 6, 15వ తేదీల్లో ‘అనంత’ పర్యటనకు రానున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం రంగం సిద్ధం చేశారు. నగరంలో బాగా ఉన్న రోడ్డుపైనే మళ్లీ వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం వివాదాస్పదమవుతోంది. శిల్పారామంలో రూ.15 లక్షలతో ప్రహరీ ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి శిల్పారామం నగరపాలక సంస్థ పరిధిలోకి రాదు. అయినా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడడం విమర్శలకు తావిస్తోంది. రూ 28.10 లక్షలతో అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఎస్పీ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి డీఆర్డీఏ కార్యాలయం, డీఆర్డీఏ నుంచి ఉపాధ్యాయ భవన్ వరకు, రూ.20 లక్షలతో పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ) నుంచి కొవ్వూర్నగర్ నాగులకట్ట వరకు బీటీ రోడ్లు వేసేందుకు టెండర్లను ఆహ్వానించనున్నారు. సైనిక్ భవన్ నుంచి లేపాక్షి ఎంపోరియం షాపింగ్ కాంప్లెక్స్ వరకు రూ.6 లక్షలతో సీసీ రోడ్డు వేయనున్నారు. ఎస్పీ, ఆర్అండ్బీ కార్యాలయం ముందు రోడ్లు బాగా ఉన్నప్పటికీ ఎందుకు టెండర్లు పిలుస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. పరిధిలో లేకున్నా.. నగరపాలక సంస్థ పరిధిలోకి రాని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టాలని పాలకవర్గం, అధికారులు నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది. ప్రజాధనాన్ని నగరపాలక సంస్థ పరిధిలోనే ఖర్చు చేయాలి. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారనడానికి శిల్పారామంలో చేపట్టనున్న పనులే నిదర్శనం. శిల్పారామం వద్ద గతంలోనూ నగరపాలక సంస్థ నిధులు రూ.40 లక్షలతో మ్యూజికల్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. ఈ పనులకు బిల్లు చేయబోమని మొదట్లో అధికారులు చెప్పారు. చివరకు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గారు. జేఎన్టీయూ నుంచి ఆడిటోరియం వరకు రూ 9.68 లక్షలతో బీటీ రోడ్డు వేయనున్నారు. ఇది కూడా కార్పొరేషన్ పరిధిలోకి రాదు. కౌన్సిల్ ఆమోదం తీసుకుంటాం : – సురేంద్రబాబు, ఎస్ఈ, నగర పాలక సంస్థ శిల్పారామం నగరపాలక సంస్థ పరిధిలోకి రాదు. ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రహరీ ఏర్పాటుకు టెండర్లను పిలవనున్నాం. ఎస్పీ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథిగృహం ముందున్న రోడ్లు దెబ్బతిన్నాయి. అందుకే కొత్తగా వేయాలని నిర్ణయించాం.