పట్టించుకోని ప్రభుత్వ ఆదేశాలు | Telugu ganja Projects Officers Neglects Government Directions | Sakshi
Sakshi News home page

పట్టించుకోని ప్రభుత్వ ఆదేశాలు

Published Thu, Jul 11 2019 11:36 AM | Last Updated on Thu, Jul 11 2019 11:36 AM

Telugu ganja Projects Officers Neglects Government Directions - Sakshi

ఆల్తూరుపాడు రిజర్వాయర్‌లో సీపేజ్‌ రాకుండా నడికట్ట పనులు చేస్తున్న దృశ్యం

జిల్లాలోని తెలుగుగంగ ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను ధిక్కరించారు.  టీడీపీ హయాంలో ఇష్టారీతిన అంచనాలు వేసి, కమీషన్లు దండుకుని ఎక్సెస్‌ టెండర్‌ అనుమతించిన సదరు అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను సైతం డోంట్‌ కేర్‌ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారైన ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల్లో ఇప్పటి వరకు 25 శాతం కూడా పూర్తి కాని ప్రాజెక్ట్‌లను నిలిపివేసి టెండర్లను పునః పరిశీలనకు పంపి, అందులో  అక్రమాలు జరిగి ఉంటే రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో మరోసారి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్ట్‌ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్‌ చేశారు. 5 శాతం కూడా జరగని ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో టీడీపీ కీలక నేత, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఉన్నతాధికారులు రిజర్వాయర్‌ పనులు నిలిపి వేయకుండా తమ పర్యవేక్షణలో చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, నెల్లూరు : వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి ప్రాంతంలో సాగునీటి అవసరాల కోసం 2016లో ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సాయి గంగ కెనాల్‌ (ఎస్‌జీకే) నుంచి 34.100 కిలో మీటరు నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి ఆల్తూరుపాడులో ఒక టీఎంసీ నీరు సామర్థ్యాన్ని నిల్వ చేసేలా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అధికారులు అంచనా వేశారు. నిల్వ చేసిన నీటి ద్వారా దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించేలా ప్రతిపాదనలు చేశారు. దీంతో ఎస్‌జీకే కెనాల్‌ నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.114 కోట్లు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కోసం రూ.189.90 కోట్లు అంచనాలతో అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఇచ్చారు.

ఆ ప్రాజెక్ట్‌లకు తొలి విడతగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంకు 2.05 కోట్లు, రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.26.18 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ  పలు సాంకేతిక కారణాలు, టీడీపీ పెద్దల కమీషన్ల కక్కుర్తి కారణంగా టెండర్లకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మరో కీలక నేత కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌తో పాటు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అంచనాలు భారీగా పెంచారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్‌ రూ.280 కోట్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ రూ.130 కోట్ల వరకు అంచనాలు పెంచి టెండర్లకు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపెనీ రిజరాయర్‌ బ్యాలెన్సింగ్‌ పనులు, లిఫ్ట్‌ పనులు మరో బడా కంపెనీకి 4.9 ఎక్సెస్‌ రేటుకు టీడీపీ పెద్దలు టెండర్‌ ఖరారు చేయించారు. ఆయా టెండర్లకు ఇతర కంపెనీలు పాల్గొనకుండా తీవ్ర ఒత్తిడి పెంచి ఎక్సెస్‌ రేటుకు ఖరారు చేయించారు.  

ఓటమి చెందితే కమీషన్‌ రాదని..
ఆల్తూరుపాడు రిజర్వాయర్‌ పనులు ఎన్నికల లోపు ప్రారంభించకుంటే కమీషన్లు రావనుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు రావడంతో హడావుడిగా ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేశారు. బహుళ ప్రయోజనాలు చేకూర్చే ఆ ప్రాజెక్ట్‌ను ఈ ప్రాంత రైతులకు కూడా తెలియకుండా శంకుస్థాపన చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోపు పనులు ప్రారంభం కాకపోతే కమీషన్లు ఎగనామం పెడుతారన్న కారణంతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

రైతులకు అందని భూ పరిహారం 
ఆల్తూరుపాడు రిజర్వాయర్‌ నిర్మాణం కోసం సాగు భూములు వదులుకున్న రైతులకు మాత్రం భూ పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. రిజర్వాయర్‌ కోసం సేకరించిన భూములకు రైతు వారీ పట్టా భూమికి ఎకరాకు రూ.7.8 లక్షలు, ప్రభుత్వ డీ–ఫారం పట్టా భూమికి రూ.7.5 లక్షల వంతున పరిహారం నిర్ధారించి కొంత వరకు భూ పరిహారం అందించారు. ఇంకా 40 శాతం వరకు భూములకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్తూరుపాడు వెల్లంపల్లిలో సుమారుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు సంబంధించి 150 కుటుంబాలు దాదాపు 200 ఎకరాల భూములను 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆయా భూముల్లో బోరు బావులు, విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అవి ప్రభుత్వ భూములు కావడంతో పరిహారం ఇచ్చేది లేదంటూ కాంట్రాక్టర్‌ బలవంతగా పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో గతంలో రైతులు పనులను అడ్డుకున్నారు. ఇప్పటికే గ్రామ పొలిమేర్లలో దాదాపు రూ.15 లక్షల వ్యయంతో భూములు చుట్టూ రాళ్లు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటుంటే రాళ్లను తొలగించడంపై రైతులు ఆందోళనకు దిగారు.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌ 
టీడీపీ హయాంలో మంజూరైన ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల్లో 25 శాతం పూర్తి కాని వాటిని నిలిపివేసి పునః పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్‌ అంచనాల్లో అక్రమాలు ఉన్నా వెంటనే రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కానీ తెలుగుగంగ ప్రాజెక్ట్‌ ఉన్నతాధికారులు, టీడీపీ పెద్దలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 5 శాతం కూడా పూర్తి చేయని పనులను నిలిపి వేయకుండా నిర్మాణాలు చేయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్థానిక టీడీపీ పెద్దలు అస్మదీయులకు సబ్‌కాంట్రాక్టర్‌ ద్వారా ప్రాజెక్ట్‌ పనులు ఇచ్చి ఉండడంతో అంచనాల్లో భారీ తేడాలున్నా కనీస పరిశీలన చేయకుండా టీడీపీ పెద్దలతో ఉన్న లోపాయి కారి ఒప్పందంతో ఉన్నతాధికారి ఆయా పనులు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయకుండా ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆయా పనులను అడ్డుకోవడంతో నాలుగు రోజులుగా నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement