telugu ganga project
-
విషాదం మిగిల్చిన విహారం
మైదుకూరు/దువ్వూరు: విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. తెలుగుగంగ రిజర్వాయర్‌లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలో జరిగింది. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన పఠాన్ రహంతుల్లా(23), ఎస్కే ముదాతీర్(22), వేంపల్లి షాహిద్(23) ఆదివారం సాయంత్రం మైదుకూరు మండల పరిధిలోని తెలుగు గంగ సబ్సిడరీ రిజర్వాయర్–1 వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న పార్కులో కొద్దిసేపు గడిపిన తర్వాత రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఈత వేసేందుకని రిజర్వాయర్‌లోకి దిగి గల్లంతయ్యారు. రాత్రయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు.. ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఉదయాన్నే వారి స్నేహితులను వాకబు చేశారు. ముగ్గురు యువకులూ విహార యాత్రకని తెలుగు గంగ రిజర్వాయర్‌కు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. ఆ వెంటనే అక్కడికి వెళ్లగా.. రిజర్వాయర్ కట్టపై యువకుల దుస్తులు, చెప్పులు, సెల్ ఫోన్లు ఉండటంతో చుట్టుపక్కల వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైదుకూరు, దువ్వూరు పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకొని.. యువకుల కోసం గాలించారు. మైదుకూరు అర్బన్, రూరల్ సీఐలు మస్తాన్, శ్రీనాథ్‌రెడ్డి అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు రిజర్వాయర్‌లో గాలించి సోమవారం మధ్యాహ్నానికి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. రిజర్వాయర్ గేట్లకు సమీపంలో.. 30 అడుగుల లోతు ఉండటంతో యువకులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. -
యుద్ధప్రాతిపదికన హంద్రీ-నీవా, గాలేరు-నగర, తెలుగుగంగ పనులు
-
50 వేల ఎకరాలకు సాగు నీరు
-
సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: కడలి పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు దివంగత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా వరుసగా నాలుగేళ్లు ఖరీఫ్, రబీలో కోటి ఎకరాలకు నీళ్లందించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం వరుసగా నాలుగేళ్లు ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో ఏటా సగటున 50 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. నాడు దుర్భిక్షం.. నేడు సుభిక్షం ♦ టీడీపీ హయాంలో 2014–19 దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం సుభిక్షంగా మారింది. ♦ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల (45.77 టీఎంసీలు), గండికోట (26.85 టీఎంసీలు), చిత్రావతి (పది టీఎంసీలు), సోమశిల (78 టీఎంసీలు), కండలేరు(68.03 టీఎంసీలు), గోరకల్లు (12.44 టీఎంసీలు), అవుకు (4.15 టీఎంసీలు) రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. ♦ తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్‌లో 2019 నుంచే ఏటా గరిష్ట స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020లో గరిష్ట స్థాయిలో 17.74 టీఎంసీలను నిల్వ చేశారు. తద్వారా తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా మార్గం సుగమం చేశారు. ♦ శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులను నింపేలా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలను ఆధునికీకరించే పనులను చేపట్టారు. మహోజ్వల ఘట్టం సాగునీటి ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత క్రమంలో చకచకా పూర్తి చేస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. ఈ రెండు బ్యారేజ్‌ల ద్వారా నెల్లూరు జిల్లాలో 4,84,525 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా పరీవాహక ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయంగా రూపుదిద్దుకున్న పోలవరం పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ మహానేత వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. వంద శాతం వ్యయం భరించి పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్ల దాహంతో 2013–14 ధరలకు తామే పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు చెప్పడంతో 2016 సెపె్టంబర్ 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. ఆ తర్వాత లాభాలు వచ్చే పనులను చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు గాలికి వదిలేశారు. కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం. చంద్రబాబు పాపాల ఫలితంగా గోదావరి వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు. -
రికార్డు స్థాయిలో తెలుగు గంగ ప్రాజెక్టు కింది నీళ్లు
-
తెలుగుగంగ.. రికార్డు మురవంగ
సాక్షి, అమరావతి: తెలుగుగంగ ప్రాజెక్టు కింద ప్రస్తుత నీటి సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఐదు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు రాష్ట్ర ప్రభుత్వం నీటిని అందించింది. ప్రాజెక్టు చరిత్రలో ఈ స్థాయిలో నీళ్లందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువ లైనింగ్ పనులను రూ.460 కోట్లతో చేపట్టి దాదాపు పూర్తి చేయడంతోపాటు రూ.90 కోట్లతో డయాఫ్రమ్‌వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసింది. ఫలితంగా బ్రహ్మంసాగర్‌లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు రికార్డు స్థాయిలో నీళ్లందించగలిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నాడు వైఎస్సార్ కృషితో.. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో తరలించే 29 టీఎంసీల కృష్ణా జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలను జతచేసి 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా దుర్భిక్ష ప్రాంతాలైన ఉమ్మడి కర్నూలు (1.08 లక్షల ఎకరాలు), వైఎస్సార్ కడప (1.67 లక్షల ఎకరాలు), నెల్లూరు (2.54 లక్షల ఎకరాలు), చిత్తూరు జిల్లా (46 వేల ఎకరాలు)ల్లో మొత్తం 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగు గంగ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. 2004 నుంచి 2009 మధ్య దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో అప్పట్లోనే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించగలిగారు. నిర్వహణపై టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ 7.80 కిలోమీటర్ల పొడవున 15 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తెలుగుగంగ లింక్ కెనాల్‌ను తవ్వారు. అయితే ఈ కాలువకు లైనింగ్ చేయకపోవడంవల్ల 2019 వరకు కేవలం 6 – 7 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించారు. దీనివల్ల వెలిగోడు రిజర్వాయర్ సకాలంలో నిండని దుస్థితి నెలకొంది. ఇక వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు 42.566 కి.మీల పొడవున ఐదు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తెలుగుగంగ ప్రధాన కాలువను తవ్వారు. దీనికి కూడా లైనింగ్ చేయకపోవడంతో 2,500 – 3,000 క్యూసెక్కులు కూడా తరలించలేని పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీ (ఊట) ఏర్పడటంతో 17.745 టీఎంసీలకుగానూ కేవలం నాలుగైదు టీఎంసీలను మాత్రమే నిల్వచేసేవారు. మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీలను (పిల్ల కాలువలు) పూర్తి చేయడం, ప్రధాన కాలువ నిర్వహణను టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం చేయడంతో ఐదేళ్లలో ఎన్నడూ రెండు మూడు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాల్లేవు. సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువలకు లైనింగ్ చేయడం, డయాఫ్రమ్ వాల్‌తో బ్రహ్మంసాగర్ లీకేజీలకు అడ్డకట్ట వేయడం వల్లే ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది ఐదు లక్షల ఎకరాలకుపైగా నీళ్లందించగలిగాం. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పనులను పూర్తి చేయించారు. దీనివల్లే సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు నింపగలిగాం. తద్వారా గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించగలిగాం. – హరినారాయణరెడ్డి, సీఈ, తెలుగుగంగ యుద్ధప్రాతిపదికన లైనింగ్.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తెలుగుగంగ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకు తెలుగుగంగ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచేలా లైనింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దీంతో 2020, 2021, 2022లో వెలిగోడును సకాలంలో నింపగలిగారు. ఆయకట్టుకు నీళ్లందిస్తూ పంటలు పూర్తయ్యాక వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్ పనులను చేపట్టి ఇప్పటికే 90% పూర్తి చేశారు. ఫలితంగా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం ఐదు వేల క్యూసెక్కులకు పెరిగింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టలో ఊటనీరు వచ్చే ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి లీకేజీలకు గతేడాది అడ్డుకట్ట వేశారు. దీంతో 2021, 2022లో బ్రహ్మంసాగర్‌లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. కాలువల ప్రవాహ సామర్థ్యం పెంచి సోమశిల, కండలేరు జలాశయాలలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వచేయడానికి మార్గం సుగమం చేశారు. ఈ ఏడాది వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో ఖరీఫ్.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో లేట్ ఖరీఫ్ కింద ఆయకట్టులో ఐదు లక్షల ఎకరాలకుపైగా నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. మిగతా డిస్ట్రిబ్యూటరీ పనులను వేగంగా పూర్తిచేసి మిగిలిన 75 వేల ఎకరాలకు కూడా నీళ్లందించే దిశగా అడుగులు వేస్తున్నారు. -
తెలుగుగంగ, వెలిగొండ విస్తరణను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం అక్రమంగా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల విస్తరణ చేపట్టిందని, వాటిని అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టులను చేపట్టారని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కుందూ నది నుంచి 8 టీఎంసీలు ఎత్తిపోసేలా కడప జిల్లా దువ్వూరు మండలం జొన్నవరంలో ఎత్తిపోతల పథకం చేపట్టారని, దానికి రూ.564.6 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారని లేఖలో వివరించారు. వాస్తవానికి చెన్నై నగరానికి తాగునీటి కోసం తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారని, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చారని తెలిపారు. అంతేగాకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ, గాలేరు– నగరి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకొని పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 88వేల క్యూసెక్కులు తరలించేలా గ్రావిటీ కాల్వల పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉందని.. ఏటా పోతిరెడ్డిపాడు ద్వారా 179 టీఎంసీలు తరలిస్తూ చెన్నైకి 10 టీఎంసీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకునే పేరిట వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారని, రిజర్వాయర్‌లో 875 అడుగులపైన నీటిమట్టం ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునేలా ఏపీని కట్టడి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఏపీ చేపట్టిన ఈ ప్రాజెక్టులతో శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
తెలుగు గంగ.. ఆయకట్టు మురవంగ
సాక్షి, అమరావతి: తెలుగు గంగ (టీజీ) ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో గల 5.75 లక్షల ఎకరాలకు పూర్తిగా నీళ్లందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడం.. బ్రహ్మం సాగర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయకపోవడం.. డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులను పూర్తి చేయకపోవడం వల్ల ప్రస్తుతం 4,28,846 ఎకరాలకు మాత్రమే నీళ్లందుతున్నాయి. మిగిలిన 1,46,154 ఎకరాలకు నీళ్లందడం లేదు. పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా నీళ్లందని ఆయకట్టునూ సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టింది. మిగిలిన పనులను పూర్తి చేయడానికి ఇప్పటికే రూ.152.90 కోట్లను ఖర్చు చేసింది. మిగతా పనులను వచ్చే సీజన్‌లోగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. లక్ష్యం ఇదీ: కృష్ణా, పెన్నా నదుల వరద జలాల్లో 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగు గంగ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ 7.80 కిలోమీటర్ల పొడవున నిర్మించిన లింక్ కెనాల్‌కు లైనింగ్ చేయకపోవడం.. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మం సాగర్ వరకూ 18 కిలోమీటర్ల పొడవున తవ్విన ప్రధాన కాలువ సక్రమంగా లేకపోవడం, బ్రహ్మం సాగర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 17.745 టీఎంసీలను నిల్వ చేయకపోవడం.. డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేయకపోవడం వల్ల ప్రస్తుతం 4,28,846 ఎకరాలకు మాత్రమే నీళ్లందుతున్నాయి. పూర్తి ఆయకట్టుకు నీళ్లందించే దిశగా.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. కాలువ సక్రమంగా లేకపోవడం వల్ల 8 వేల క్యూసెక్కులు కూడా ప్రవహించడం లేదు. దాంతో 16.95 టీఎంసీల సామర్థ్యం ఉన్న వెలిగోడు రిజర్వాయర్‌ను వేగంగా నింపలేని దుస్థితి నెలకొంది. వెలిగోడు రిజర్వాయర్ నుంచి తెలుగు గంగ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం 5 వేల క్యూసెక్కులు. కాలువ సక్రమంగా లేకపోవడం వల్ల కనీసం 3,500 క్యూసెక్కులను కూడా తరలించలేని పరిస్థితి. దాంతో 17.745 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్రహ్మం సాగర్‌ను వేగంగా నింపడం సాధ్యకావడం లేదు. ఈ నేపథ్యంలో కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచటం ద్వారా రిజర్వాయర్లను శరవేగంగా నింపేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి మిగతా 1,46,154 ఎకరాలకు నీళ్లందించాలని దిశానిర్దేశం చేశారు. దాంతో ఈ కాలువ లైనింగ్ పనులను రూ.280 కోట్లతో చేపట్టారు. తెలుగు గంగ కాలువలో ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకూ నీటి ప్రవాహం ఉంటుంది. 4 నెలలు మాత్రమే పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రబీలో ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించిన అధికారులు.. వేగంగా పనులు చేస్తున్నారు. బ్రహ్మం సాగర్‌ను పటిష్టం చేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసేలా చర్యలు తీసుకంటున్నారు. డిస్ట్రిబ్యూటరీల పనులనూ వేగవంతం చేశారు. -
ఇక జలకళ
ఆరు నెలల పాలనలో ప్రభుత్వం జిల్లాకు రెండు కొత్త సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారంఉత్తర్వులు వెలువడ్డాయి. రూ. 1921.70 కోట్లతో కుందూ నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్టులకు డిసెంబరు 23, 24 తేదీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వీటి ద్వారా 2.69 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరుఅందనున్నాయి. సాక్షి ప్రతినిధి కడప : జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో రూ. 1.77 లక్షల ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రభుత్వం కుందూ–తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. రూ. 564.60 కోట్లతో దీనిని చేపడుతోంది. కుందూ నదిపై దువ్వూరు మండలం జొన్నవరం వద్ద ఆనకట్టను నిర్మించనున్నారు. కుందూ వరద సమయంలో రోజుకు 1,425 క్యూసెక్కుల చొప్పున ఎనిమిది టీఎంసీలు దువ్వూరు చెరువులోకి ఎత్తి పోస్తారు. అక్కడి నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ 107 కిలోమీటరు వద్ద సబ్సిడరీ రిజర్వాయర్–1లోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ జలాశయాన్ని నింపి అక్కడి నుంచి బ్రహ్మంసాగర్‌కు నీటిని తరలిస్తారు. దీని ద్వారా ఆయకట్టుకు సాగునీరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో ప్రజలకు తాగునీటిని సైతం అందిస్తారు. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌తోపాటు ఎస్ఆర్–1, ఎస్ఆర్–2లకు కలిపి 20 టీఎంసీలు అందించాల్సి ఉంది. కానీ బ్రహ్మంసాగర్‌కు పది టీఎంసీలు వచ్చిన దాఖలాలు అరుదు. ఈ ఏడాది ఎగువన భారీ వర్షాలు కురిసి పలుమార్లు శ్రీశైలం నిండినా తెలుగుగంగ ప్రాజెక్టుకు అనుకున్న స్థాయిలో నీరు చేరలేదు. ప్రధాన కాలువ సామర్థ్యం పేరుకు ఐదు వేల క్యూసెక్కులు అయినా రెండు వేల క్యూసెక్కులకు మించి దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఏడాది బ్రహ్మంసాగర్‌కు 6.5 టీంఎసీలు కూడా చేరలేదు. దివంగత నేత వైఎస్సార్ హయాం మినహా సాగర్ ఆయకట్టుకు నీరిచ్చిన పరిస్థితి లేదు. దీంతో తెలుగుగంగ ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కుందూ వరద నీటిని తెలుగుగంగకు లిఫ్ట్ చేసి ఆయకట్టుకు సాగు, తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. రూ. 1357.10 కోట్లతో రాజోలి ఆనకట్ట కడప సరిహద్దులో కర్నూలు జిల్లా పరిధిలోని చాగలమర్రి మండలంలో కుందూనదిపై రూ. 1357.10 కోట్లతో రాజోలి ఆనకట్ట నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2.95 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తద్వారా 92 వేల ఎకరాల కేసీ ఆయకట్టు స్థిరీకరణతోపాటు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలన్నది ఉద్దేశం. కరువు నేపథ్యంలో ఎగువన వర్షాలు కురవకపోతే శ్రీశైలం ప్రాజెక్టుకు సకాలంలో నీరు చేరుతుందన్న పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండితేనే జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు నీరు చేరే పరిస్థితి ఉంటుంది. ప్రతి యేటా కుందూనదికి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నీరు నిరుపయోగంగా సముద్రం పాలవుతోంది. వరద సమయంలో కుందూ నీటిని నిల్వ ఉంచుకునే విధంగా ప్రాజెక్టులను నిర్మిస్తే కేసీ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చవచ్చన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. ఈనెల 23, 24 తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. 2008 డిసెంబరులో అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణంతో అది మూలనపడింది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైంది. దీంతోపాటు ఈనెలలో జిల్లాలో వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులతోపాటు ఇతర అభివృద్ధి పథకాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. -
నాడు వెలవెల.. నేడు జలకళ
సాక్షి, కడప: వరుణుడు కరుణించడంతో ఈ ఏడాది దిగువ సగిలేరు ప్రాజెక్టుకు తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దిగువ సగిలేరు కింద ఉన్న చెరువుల్లో జలకశ ఉట్టిపడుతోంది. కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 36 గొలుసు చెరువులు ఉండగా ఇప్పటికే 20 చెరువులకు నీటిని వదిలారు. ఈ నీటిని వదిలేందుకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యలతోపాటు అధికారులు తీవ్ర ప్రయత్నం చేయడం వల్లనే సాధ్యమైంది. దీంతోపాటు రైతుల సహకారం కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో దిగువ సగిలేరుకు ఉన్న రెండవ గేటు కొట్టుకునిపోవడంతో వృథాగా నీళ్లు సముద్రం పాలైంది. అంతకుముందు కూడా ఈ స్థాయిలో చెరువులను నింపిన దాఖలాలు లేవు. అప్పట్లో మంజూరైన జైకా నిధులను నిర్మాణాత్మక పనులకు ఉపయోగించకుండా అనవసరమైన పనులకు వినియోగించి అక్రమాలకు ఒడిగట్టినట్లు ఆరోపణలు మిన్నంటాయి. ఈ ఏడాది వర్షాలు బాగా పడడంతో తెలుగుగంగ నుంచి దిగువ సగిలేరుకు రోజుకు 700 క్యూసెక్కుల దాక నీరు చేరడంతో కుడి, ఎడమ కాలువలకు సంబంధించిన చెరువులకు నీటిని తరలిస్తున్నారు. త్వరలో మిగిలిన చెరువులతో పాటు బద్వేలు చెరువును కూడా నీటితో నింపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలు... బద్వేలు నియోజకవర్గంలోని బి.కోడూరు మండల పరిధిలో వడ్డెమాను చిదానందం దిగువ సగిలేరు జలాశయం ఉంది. గతంలో తెలుగుగంగ నుంచి బొక్కినేరు ద్వారా దీనికి నీటిని వదిలారు. కుడి, ఎడమ కాలువలు ఉండగా, వీటి కింద 36 గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. దాదాపు 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. బ్రహ్మంగారిమఠం, బద్వేలు, అట్లూరు, గోపవరం మండలాలకు చెందిన రైతులు ఈ జలాశయంపై ఆధారపడి పంటలు పండించుకుంటున్నారు. ఈ జలాశయానికి నింపిన 0.115 ఎంసీఎఫ్‌టీ నీరు దాదాపు ఐదు వేల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ రెండవ గేటు కొట్టుకుపోయిన కారణంగా సాగు, తాగునీటి అవసరాలు తీరకుండా పోయాయి. సక్రమంగా నీటిని అందిస్తే ఈ గొలుసు చెరువుల ద్వారా రూ. 40 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు అందే పరిస్థితి ఉంటుంది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రెండవ గేటు కొట్టుకుపోవడంతో ఉన్న నీరంతా సోమశిలకు చేరింది. గత ప్రభుత్వంలో రెండవ గేటు కొట్టుకుపోయి వృథాగా పోయిన నీరు (ఫైల్) జైకా నిధుల్లో ఇష్టారాజ్యం.. ఇదే జలాశయానికి సంబంధించి గతంలో జైకా (జపాన్ ఎయిడెడ్ క్రెడిట్ అసోసియేషన్) కింద రూ. 19 కోట్లు వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేటాయించారు. తొలుత కొత్త గేట్లు మార్చాలన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత అధికారులు మళ్లీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిర్మాణాత్మక పనులు చేపట్టకుండా కట్టపైకి మట్టి తరలింపు, రాతి కట్టడం, ఇతరత్రా పనులు చేసి అక్రమార్జనకు తెర లేపారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదంతా ఓ ఉన్నతాధికారి బినామి కాంట్రాక్టర్‌ను పెట్టుకుని అంతా తానై పనులు చేసినట్లు ఆరోపణలు వినవచ్చాయి. గేటు కొట్టుకునిపోయిన తర్వాత విచారణ కమిటీ పేరిట విచారణ జరిపారే గానీ ఆ తర్వాత చర్యలు ఏమాత్రం లేవు. అంతేకాకుండా ప్రైజ్ ఎక్స్లేషన్ (అంచనా వ్యయం పెంచడం) ద్వారా రూ.2.5 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అంటే పనులు పూర్తయిన తర్వాత మళ్లీ ప్రభుత్వానికి సిమెంటు, కడ్డీల ధరలు పెరిగాయని నివేదికలు పంపి అదనంగా నిధులు మంజూరు చేయించుకోవడం. ఇది అధికారులు చొరవ చూపితేనే సాధ్యమవుతుంది. దీంతో అప్పట్లో ఉన్న కలెక్టర్ సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. నీటిని వదిలిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.. తెలుగుగంగ ఎస్ఈ శారదను తెలుగుగంగ నుండి దిగువ సగిలేరు జలాశయానికి కనీసం రెండు టీఎంసీల నీటిని అందజేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ జలాశయానికి నీటిని వదిలేందుకు సానుకూలంగా ఆమె స్పందించారు. ప్రస్తుతం ఒక టీఎంసీ నీటిని ఈ జలాశయానికి అందించేందుకు సిద్దపడ్డారు. ఇటీవల తెలుగుగంగ నుండి బొక్కిలేరు వాటర్ ట్యాంకుకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితోపాటు ఎస్ఈ శారద, నీటిపారుదలశాఖ ఈఈ వెంకట్రామయ్య తదితర అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. రామసముద్రం వాటర్ ట్యాంకు వద్దకూడా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అధికారులతో కలిసి పూజలు నిర్వహించి నీటిని వదిలారు. తెలుగుగంగ నుంచి వీలైనంత మేర రెండు టీఎంసీల నీటిని ఈ జలాశయానికి అందిస్తే 36 గొలుసు చెరువులను నింపి ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి ఉండేలా చూడాలని మరోసారి సూచించారు. ఈ ఏడాది చెరువుల్లో జలకళ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, నెల్లూరు : తెలుగుగంగ ప్రాజెక్ట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ నరసింహం ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ సోదాలు చేపట్టింది. లక్ష్మీనరసింహం నివాసంతోపాటు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిగాయి. నెల్లూరు, కావలి, రాజమండ్రి, ఒంగోలులో సోదాలు నిర్వహించారు. రాజమండ్రి, ఒంగోలులో పొలాలు, ఇళ్ల స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. సోదాల సందర్భంగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 1989 ఆగస్టు 9వ తేదీన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రామ అభివృద్ధి అధికారి (విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్)గా ప్రకాశం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన రెవెన్యూశాఖకు బదిలీ అయి నెల్లూరు జిల్లాకు వచ్చారు. 1995లో నెల్లూరు జిల్లా పొదలకూరు డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. 2002లో తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. నెల్లూరు, జలదంకి, వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో పనిచేశారు. 2011లో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజేషన్ (భూ సేకరణ) విభాగంలో సోమశిలలో పనిచేశారు. 2012లో రాజంపేట, 2014–17 వరకు కావలి ఆర్డీఓగా విధులు నిర్వహించారు. 2018 నుంచి తెలుగుగంగ ప్రాజెక్ట్ రాపూరు ఎస్డీసీగా పనిచేస్తూ బుధవారం జరిగిన బదిలీల్లో చిత్తూరు జిల్లా కేఆర్ఆర్సీకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు డైకస్‌రోడ్డులో నివాసం ఉంటున్నారు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన వైనం రెవెన్యూ శాఖలో అడుగిడిన అనంతరం ఆయన తన అక్రమార్జనకు తెరలేపారు. పనిచేసిన ప్రతిచోట భారీగా ఆస్తులను కూడబెట్టారు. ప్రధానంగా తహసీల్దార్, ఆర్డీఓగా ఉన్న సమయాల్లో పెద్ద ఎత్తున ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు భార్గవ్ పేర్లుపై ఆస్తులను కొనుగోలు చేశారు. అక్రమ ఆస్తుల విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్‌శాంతో నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు గురువారం తెల్లవారుజామున ఆరు బృందాలుగా విడిపోయి నెల్లూరు డైకస్‌రోడ్డులోని ఆయన ఇంటితో పాటు, బాలాజీనగర్‌లోని స్నేహితుడు కృష్ణారెడ్డి, జలదంకి మండలం అగ్రహారంలోని స్నేహితుడు ప్రభాకర్ ఇంట్లో, స్వగ్రామం కలవల్ల గ్రామంలోని ఆయన కుటుంబ సభ్యుల ఇంట్లో, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలోని ఆయన అత్త ఇళ్లు, నెల్లూరులోని కార్యాలయంలో ఏకకాలంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. దీంతో ఏసీబీ అధికారులు విస్తుపోయారు. రూ.కోట్లలో ఆస్తులు గుర్తింపు.. ఏసీబీ సోదాల్లో లక్ష్మీనరసింహం, ఆయన భార్య, కుమారుడి పేరుపై ప్రభుత్వ మార్కెట్ ధరల ప్రకారం రూ.4,14,80,000 మేర ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 25 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. గుర్తించిన ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనరసింహం నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో 2008లో రూ.33,075 విలువ చేసే 252 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు ప్రకాశం జిల్లా కందుకూరులో 2006లో రూ.34 వేల వంతున ఎకరా వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. భార్య పేరుతో.. లక్ష్మీనరసింహం భార్య విజయలక్ష్మి పేరుతో 2013లో నెల్లూరు డైకస్‌రోడ్డులో రూ 26,30,200లతో జి+2 హౌస్ నిర్మాణం చేశారు. విజయలక్ష్మి పేరుతో 1999లో నెల్లూరు రూరల్ మండలం గుండ్లపాళెంలో రూ.27వేలు విలువ చేసే 33 అంకణాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. విజయలక్ష్మి పేరుతో 2018లో గుంటూరు జిల్లా తుళ్లూరులో రూ .8.55 లక్షలు విలువ చేసే ప్లాటును కొనుగోలు చేశారు. 2007లో కందుకూరులో రూ.52 వేలు విలువ చేసే వ్యవసాయభూమి కొనుగోలు చేశారు పొదలకూరు మండలం భోగసముద్రంలో 2006లో రూ.1.29 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు పొదలకూరు మండలం భోగసముద్రంలో 2007లో రెండు దఫాలుగా రూ .2.04 లక్షల విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు పొదలకూరు మండలం బోగసముద్రంలో 2012లో రూ. 30 వేలు విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. కుమారుడు పేరుతో.. లక్ష్మీనరసింహం కుమారుడు భార్గవ్ పేరుపై కావలిలో రూ. 2,98,57,000 విలువతో 605 గజాల స్థలంలో జి+5 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.10 లక్షలు అడ్వాన్స్‌ను సైతం చెల్లించారు. 2013లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.18.20 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 2013లో నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులో రూ.2.14 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 2012లో రూ. 6 లక్షలు వెచ్చించి టాటా ఇండికా విస్టా కారు కొన్నారు. అదే ఏడాది రూ.45 వేలు వెచ్చించి మహీంద్ర డ్యూరో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించి వాటి తాలుకు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 18 లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లు, రూ.4.50 లక్షల నగదు, రూ.15 లక్షలు విలువ చేసే 650 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంక్‌లో రూ.2 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో సంచలనం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బదిలీ ఉత్తర్వులు అందుకునే లోపే.. ఇదిలా ఉంటే ఈ నెల 9వ తేదీన జరిగిన బదిలీల్లో లక్ష్మీనరసింహం చిత్తూరు జిల్లా కేఆర్ఆర్సీకి బదిలీ అయ్యారు. గురువారం ఆయన బదిలీ ఉత్తర్వులు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో దాడులు చేయడం, ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ సోదాల్లో నెల్లూరు ఏసీబీ ఇన్స్పెక్టర్ బి.రమేష్‌బాబు, తిరుపతి ఇన్స్పెక్టర్ ప్రసాద్‌రెడ్డి, విజయశేఖర్, ప్రకాశం ఇన్స్పెక్టర్ ఎన్. రాఘవరావు, తూర్పుగోదావరి ఇన్స్పెక్టర్ తిలక్, తిరుపతి ఎస్సై విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల కోసం నిరీక్షణ
సాక్షి, బ్రహ్మంగారిమఠం (కడప): తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం బ్రహ్మంగారిమఠం సమీపంలోని ఓబులరాజుపల్లె పంచాయతీలోని 6 గ్రామాలు సాగర్‌లో ముంపునకు గురయ్యాయి. 1983– 1987లో ఆ గ్రామాల పరిధిలో 1980 కుటుంబాలకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అవార్డులు పొందిన కుటుంబాలలో చదువుకున్నవారికి నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. అవార్డులు పొందిన వారిలో చదువుకోనివారు ఉంటే అలాంటి కుటుంబాలకు ఆర్అండ్ఆర్ కింద 5ఎకరాలు వ్యవసాయపొలం, ఇళ్లు వంటివి కేటాయించారు. అప్పటి ప్రభుత్వం కేవలం 480 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించింది. 2005లో ముంపు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన వైఎస్సార్ నిబంధనల ప్రకారం నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని అప్పటి కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో అప్పట్లో అధికారులు నిరుద్యోగుల జాబితా తయారు చేశారు. అయ్యినా నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు దక్కలేదు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 420 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు బ్రహ్మంసాగర్ ముంపు వాసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జీఓలు ఉన్నా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముంపు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వలేదు. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోయాయి. చివరకు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. – రాజోలి జగన్నాథరెడ్డి (సాగర్ ముంపు నిరుద్యోగ కమిటీ చైర్మన్ బి.మఠం మండలం) అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు గత మూడు సంవత్సరాలుగా తెలుగుగంగ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఏఒక్క అధికారి స్పందించడంలేదు. అర్హతలు ఉన్నా ఉద్యోగం కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. చదువుకున్నా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. – బి.రామసుబ్బయ్య (కమిటీ వైస్‌చైర్మన్, బి.మఠం మండలం) ముఖ్యమంత్రిపైనే ఆశలు పెట్టుకున్నాం ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్రహ్మంసాగర్ ముంపు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్నాం. మా సమస్యలు ముఖ్యమంత్రికి తెలుపుకొనేందుకు అధికారులు అవకాశం కల్పించాలి. – యు.పెంచలరత్నం( సాగర్ ముంపు నిరుద్యోగి) -
ఎందుకు అలా చేశారు?
సాక్షి, నెల్లూరు : నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్టు సర్కిల్లోని ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నిబంధనలు మేర పారదర్శకంగా జరగాల్సిన బదిలీలను ఆ శాఖ ఉన్నతాధికారి ఇష్టానుసారంగా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్లపాటు విధులు నిర్వహిస్తున్న వారిని తప్పక బదిలీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. ఆ శాఖలో దీర్ఘకాలంగా తిష్టవేసి, ఉన్నతాధికారి కనుసన్నల్లో మెలిగిన వారిని మాత్రం బయట ప్రాంతాలకు పంపించకుండా లోకల్‌గా బదిలీ చేసి నిబంధనలను తుంగలో తొక్కారు. బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ ఉద్యోగులు ఉన్నతా««ధికారిపై తిరుగుబాటు చేశారు. ఏం జరిగిందంటే.. తెలుగుగంగ ప్రాజెక్టు ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఉద్యోగుల బదిలీల విషయమై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించి పారదర్శకత పాటించాలని ఆదేశాలు జారీచేసింది. ఒకేచోట ఐదేళ్లపాటు విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలి. మెడికల్ గ్రౌండ్, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ తెలుగుగంగ ప్రాజెక్టు సర్కిల్లో జరిగిన బదిలీల్లో ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోలేదని, ఎస్ఈ వెంకటేశ్వర్లు ఇష్టానుసారంగా చేపట్టారని స్థానిక ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎస్ఈకు అనుకూలమైన వారికి లోకల్ పోస్టింగ్‌లు ఇచ్చారని చెబుతున్నారు. ఒకేచోట ఆరేళ్లపాటు పనిచేస్తున్నా వారిని బదిలీలు చేయలేదని ఆరోపిస్తున్నారు. అక్రమాల నేపథ్యంలో ఉద్యోగులు ఉన్నతాధికారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలిలా.. ► నెల్లూరు సర్కిల్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ వరకు సుమారు 30 ఏళ్లుగా వి«ధులు నిర్వహిస్తున్న ఎంవీ రమణకుమార్‌ను బదిలీ చేయలేదు. అలాగే డివిజన్ 1, 3ల్లో పనిచేస్తున్న పి.శ్రీనివాసులురెడ్డి, పి.రామయ్యలను నిబంధలకు విరుద్ధంగా లోకల్‌గా బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. డివిజన్–4లో ఆరేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వైవీవీ సత్యనారాయణకు బదిలీ జరగలేదు. ► సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో నెల్లూరు సర్కిల్ పరిధిలో డివిజన్–2లో పనిచేస్తున్న కమలను నిబంధలకు విరుద్ధంగా గూడూరు డివిజన్‌కు బదిలీ చేశారు. కండలేరు సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న రత్నయ్యకు ఐదేళ్లు పూర్తయినా కూడా బదిలీ జరగలేదు. టెక్నికల్ ఆఫీసర్స్ విభాగంలో ఒకేచోట 20 ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులను లోకల్‌గా బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. రిక్వెస్ట్, మెడికల్ గ్రౌండ్ పరిగణలోకి తీసుకోకుండా ఎస్ఈ ఇష్టానుసారంగా బదిలీలు చేశారన్న ఆరోపణలున్నాయి. అసిస్టెంట్ టెక్నికల్ విభాగంలో 11 ఏళ్లపాటు ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరుద్ధంగా స్థానిక బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. గూడూరు డివిజన్లో పనిచేస్తున్న మునిరెడ్డి రిక్వెస్ట్ బదిలీ పెట్టుకున్నా పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది. ► సబార్డినేట్ విభాగంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నెల్లూరు సర్కిల్లో పనిచేస్తున్న టి.గంగిరెడ్డి గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో మెడికల్ గ్రౌండ్లో బదిలీ చేయకూడదనే నిబంధన ఉన్నా గూడూరు డివిజన్‌కు బదిలీ చేశారు. అలాగే నెల్లూరు డివిజన్–2లో పనిచేస్తున్న బి.నాగమణి తల్లికి క్యాన్సర్ ఉంది. ఆమె బదిలీ వద్దని చెప్పినా డివిజన్–3 పరిధిలోని ఆదూరుపల్లికి బదిలీ చేశారు. బదిలీలు సక్రమంగానే జరిగాయి తెలుగుగంగ సర్కిల్ పరిధిలో బదిలీలు సక్రమంగా జరిగాయి. ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేస్తాం. కొందరు ఉద్యోగులు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. – ఎం.వెంకటేశ్వర్లు, తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ, నెల్లూరు సర్కిల్ -
పట్టించుకోని ప్రభుత్వ ఆదేశాలు
జిల్లాలోని తెలుగుగంగ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను ధిక్కరించారు. టీడీపీ హయాంలో ఇష్టారీతిన అంచనాలు వేసి, కమీషన్లు దండుకుని ఎక్సెస్ టెండర్ అనుమతించిన సదరు అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను సైతం డోంట్ కేర్ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారైన ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో ఇప్పటి వరకు 25 శాతం కూడా పూర్తి కాని ప్రాజెక్ట్‌లను నిలిపివేసి టెండర్లను పునః పరిశీలనకు పంపి, అందులో అక్రమాలు జరిగి ఉంటే రివర్స్ టెండరింగ్ విధానంలో మరోసారి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేశారు. 5 శాతం కూడా జరగని ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో టీడీపీ కీలక నేత, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఉన్నతాధికారులు రిజర్వాయర్ పనులు నిలిపి వేయకుండా తమ పర్యవేక్షణలో చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ∙సాక్షి, నెల్లూరు : వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి ప్రాంతంలో సాగునీటి అవసరాల కోసం 2016లో ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సాయి గంగ కెనాల్ (ఎస్జీకే) నుంచి 34.100 కిలో మీటరు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఆల్తూరుపాడులో ఒక టీఎంసీ నీరు సామర్థ్యాన్ని నిల్వ చేసేలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు అంచనా వేశారు. నిల్వ చేసిన నీటి ద్వారా దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించేలా ప్రతిపాదనలు చేశారు. దీంతో ఎస్జీకే కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.114 కోట్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం రూ.189.90 కోట్లు అంచనాలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్‌లకు తొలి విడతగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు 2.05 కోట్లు, రిజర్వాయర్ నిర్మాణానికి రూ.26.18 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ పలు సాంకేతిక కారణాలు, టీడీపీ పెద్దల కమీషన్ల కక్కుర్తి కారణంగా టెండర్లకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మరో కీలక నేత కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనాలు భారీగా పెంచారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ రూ.280 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ రూ.130 కోట్ల వరకు అంచనాలు పెంచి టెండర్లకు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపెనీ రిజరాయర్ బ్యాలెన్సింగ్ పనులు, లిఫ్ట్ పనులు మరో బడా కంపెనీకి 4.9 ఎక్సెస్ రేటుకు టీడీపీ పెద్దలు టెండర్ ఖరారు చేయించారు. ఆయా టెండర్లకు ఇతర కంపెనీలు పాల్గొనకుండా తీవ్ర ఒత్తిడి పెంచి ఎక్సెస్ రేటుకు ఖరారు చేయించారు. ఓటమి చెందితే కమీషన్ రాదని.. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు ఎన్నికల లోపు ప్రారంభించకుంటే కమీషన్లు రావనుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు రావడంతో హడావుడిగా ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేశారు. బహుళ ప్రయోజనాలు చేకూర్చే ఆ ప్రాజెక్ట్‌ను ఈ ప్రాంత రైతులకు కూడా తెలియకుండా శంకుస్థాపన చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు పనులు ప్రారంభం కాకపోతే కమీషన్లు ఎగనామం పెడుతారన్న కారణంతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులకు అందని భూ పరిహారం ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం కోసం సాగు భూములు వదులుకున్న రైతులకు మాత్రం భూ పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. రిజర్వాయర్ కోసం సేకరించిన భూములకు రైతు వారీ పట్టా భూమికి ఎకరాకు రూ.7.8 లక్షలు, ప్రభుత్వ డీ–ఫారం పట్టా భూమికి రూ.7.5 లక్షల వంతున పరిహారం నిర్ధారించి కొంత వరకు భూ పరిహారం అందించారు. ఇంకా 40 శాతం వరకు భూములకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్తూరుపాడు వెల్లంపల్లిలో సుమారుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు సంబంధించి 150 కుటుంబాలు దాదాపు 200 ఎకరాల భూములను 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆయా భూముల్లో బోరు బావులు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అవి ప్రభుత్వ భూములు కావడంతో పరిహారం ఇచ్చేది లేదంటూ కాంట్రాక్టర్ బలవంతగా పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో గతంలో రైతులు పనులను అడ్డుకున్నారు. ఇప్పటికే గ్రామ పొలిమేర్లలో దాదాపు రూ.15 లక్షల వ్యయంతో భూములు చుట్టూ రాళ్లు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటుంటే రాళ్లను తొలగించడంపై రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ టీడీపీ హయాంలో మంజూరైన ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో 25 శాతం పూర్తి కాని వాటిని నిలిపివేసి పునః పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ అంచనాల్లో అక్రమాలు ఉన్నా వెంటనే రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కానీ తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు, టీడీపీ పెద్దలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 5 శాతం కూడా పూర్తి చేయని పనులను నిలిపి వేయకుండా నిర్మాణాలు చేయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్థానిక టీడీపీ పెద్దలు అస్మదీయులకు సబ్‌కాంట్రాక్టర్ ద్వారా ప్రాజెక్ట్ పనులు ఇచ్చి ఉండడంతో అంచనాల్లో భారీ తేడాలున్నా కనీస పరిశీలన చేయకుండా టీడీపీ పెద్దలతో ఉన్న లోపాయి కారి ఒప్పందంతో ఉన్నతాధికారి ఆయా పనులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆయా పనులను అడ్డుకోవడంతో నాలుగు రోజులుగా నిలిపి వేసినట్లు తెలుస్తోంది. -
అంచనాల్లోనే వంచన!
సాక్షి, కర్నూలు సిటీ : ఇటీవలి ఎన్నికల ముందు వరకు టీడీపీ నాయకులు ఆడిందే ఆట..పాడిందే పాట. ప్రభుత్వ నిబంధనలు సైతం వారికి అనుకూలంగా మారుతూ వచ్చేవి. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధిలో పారదర్శకత అనేవి ఏ కోశానా ఉండేవి కాదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యం నడిచింది. అంచనాలు అమాంతం పెరిగిపోయేవి. తమ వారికి పనులు దక్కేలా టెండర్ నిబంధనలను ఎలా పడితే అలా మార్చేసే వారు. అధికార అండతో పనులు దక్కించుకుని రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. తెలుగు గంగ లైనింగ్ పనుల విషయంలోనూ ఇదే తరహా దోపిడీకి ఎత్తుగడ వేశారు. అమాంతం పెరిగిన అంచనాలు తెలుగుగంగ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువ ప్రారంభం నుంచి 18.20 కి.మీ. వరకు లైనింగ్, 18.20 కి.మీ నుంచి 42.566 కి.మీ. వరకు గతంలో లైనింగ్ చేయని పనుల పూర్తి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు రిజర్వాయర్ వరకు 7.380 కి.మీ మేర లైనింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 2014 ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు మాత్రమే. అయితే.. 2018 మార్చి 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో రూ.180.48 కోట్లుగా అప్పటి ప్రభుత్వం ఖరారు చేసింది. అంతటితో వ్యవహారం ఆగలేదు. స్వయాన అప్పటి సీఎం చంద్రబాబు ఇంజినీర్లపై ఒత్తిడి చేసి మరీ అంచనాలను రూ.280.27 కోట్లకు పెంచేలా చేశారు. ఈ మేరకు 2018 జూన్ 8వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే అంచనాలను ఏకంగా రూ.99.79 కోట్లు పెంచారంటే గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీకి ఏ స్థాయిలో గేట్లు ఎత్తిందో అర్థం చేసుకోవచ్చు. అంచనాల పెంపునకు జల వనరుల శాఖ ఇంజినీర్లు కొందరు అభ్యంతరం చెప్పినా ఆనాడు చంద్రబాబు ఏ మాత్రమూ పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. రూ.7 కోట్లతో అయ్యే పనులకు రూ.12.16 కోట్లు తెలుగుగంగ ప్రధాన కాలువకు 18.20 కి.మీ. వరకు మాత్రమే కొత్తగా లైనింగ్ చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాత 18.20 కి.మీ. నుంచి 42.566 కి.మీ. మధ్యలో కేవలం 800–900 మీటర్లు, బీసీఆర్ నుంచి లింక్ చానల్(వెలుగు రిజర్వాయర్ వరకు ఉన్న కాలువ)లో 650 మీటర్లు మాత్రమే లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. మొత్తం 19.650 కి.మీ. పొడవు మాత్రమే లైనింగ్ చేయాలి. వాస్తవానికి కి.మీ. లైనింగ్ పనులకు రూ.7 కోట్లకు మించి ఖర్చు కాదని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ఏకంగా రూ.12.16 కోట్లు కేటాయించింది. దీంతో పాటు కాంట్రాక్టర్‌కు జీఎస్టీ, లేబర్ సెస్, సీనరేజీ చార్జీల రూపంలో రూ.36.29 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తమ్మీద సుమారు రూ.100 కోట్ల అదనపు దోపిడీకి ‘అధికారిక’ అనుమతి ఇచ్చింది. సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా.. చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా తెలుగుగంగ లైనింగ్ టెండర్ల వ్యవహారం సాగింది. మొదటి సారి టెండర్లు పిలిచినప్పుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టస్ తప్పుడు పత్రాలు దాఖలు చేసింది. ఈ విషయం బహిర్గతం కావడంతో వివాదాస్పదంగా మారింది. అయితే.. రిత్విక్కే టెండర్ దక్కేలా మరోసారి నోటిఫికేషన్ జారీ చేయాలని చంద్రబాబు సూచించిన మేరకు ఇంజనీర్లు 2018 జూలైలో ఓపెన్ టెండర్ పిలిచారు. వాస్తవానికి టెండర్ నిబంధనల్లో ‘పేపర్’ అనే యంత్రంతో కాలువ లైనింగ్ చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లే బిడ్ దాఖలు అర్హులని పేర్కొనాలి. కానీ పేపర్‌తో పాటు ‘షార్ట్ క్రీటింగ్’ విధానంలో పనులు చేసిన అనుభవం ఉండాలనే నిబంధన కూడా పెట్టి సీఎం రమేష్ కంపెనీకి దక్కేలా చేశారు. ఆ కంపెనీతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అంటే ఈ ఏడాది మార్చి 7వ తేదీన అగ్రిమెంట్ చేసుకున్నారు. మూడు నెలలు గడిచినా ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. దీంతో ఇంజినీర్లు ఇటీవలే నోటీసులు ఇచ్చారు. పనులు మొదలు పెట్టకపోవడంతో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల టెండర్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
పుత్తూరుకు తెలుగుగంగ
సాక్షి, పుత్తూరు: పుత్తూరు జనాభా ఏటా పెరుగుతోంది. తాగునీటి అవసరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2008లో పుత్తూరులో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో చిన్నరాజుకుప్పం మీదుగా వెళుతున్న గాలేరు నగరి కాలువ నుంచి నీటిని తరలించే విధంగా పుత్తూరు చెరువునే సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకుగా నిర్మించేశారు. దీనిపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయినప్పటికీ రాజకీయ ఒత్తిడితో పనులు పూర్తి చేశారు. గాలేరు నగరి పూర్తికాకపోవడంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిరుపయోగంగా మారిపోయింది. తెరపైకి తెలుగుగంగ ప్రాజెక్ట్ రోజురోజుకూ పట్టణంలో తాగునీటి కష్టాలు తీవ్రతరం అవుతుండడం, గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభమైంది. ఈ సమయంలో ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రుణం మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది. పుత్తూరు మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి పైపులైన్ ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరాకు గత ఏడాది రూ.137 కోట్లు రుణం మంజూరు చేసింది. శ్రీకాళహస్తి నుంచి పైపులైన్ శ్రీకాళహస్తి మండల పరిధిలోని లక్ష్మీపురం నుంచి (తెలుగు గంగ ప్రాజెక్ట్ 91వ కిలోమీటరు) పైపులైన్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. లక్ష్మీపురం వద్ద ఒక సంపు, కేవీబీ పురం వద్ద మరొక సంపు నిర్మించనున్నారు. 58 కిలోమీటర్ల పైపులైన్ పుత్తూరు సమ్మర్‌స్టోరేజ్‌కు నీటిని తరలించనుంది. అక్కడి నుంచి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేసి, నీరు సరఫరా చేయనున్నారు. కేవలం సంవత్సరం వ్యవధిలో పైపులైన్ ప్రాజెక్ట్ పూర్తికానుంది. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2020 సెప్టెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెండర్ దక్కించుకున్న ఎన్సీసీ కంపెనీ రెండు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. శుభపరిణామం పుత్తూరుకు తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ 1.3 టీఎంసీల నీటిని కేటాయించడం శుభపరిణామం. పట్టణ వాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. నా విజ్ఞప్తిని మన్నించి తెలుగు గంగ నుంచి పైపులైన్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేయిస్తాను. పుత్తూరుకు నీటి కేటాయింపు ఫైల్‌పై తొలి సంతకం చేసిన రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు నా కృతజ్ఞతలు. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, నగరి -
సీఎం రమేష్ చెప్పినట్టు వినాలి
సాక్షి, అమరావతి: తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్ద.. తప్పు చేసిన వారికే పనులు అప్పగించాలని అధికారులపై తీవ్ర స్థాయిలోఒత్తిడి తెచ్చారు. ఈ వ్యవహారానికి తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనుల టెండర్ వేదికైంది. వివరాల్లోకి వెళితే.. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ. 4,460.64 కోట్లుగా ఖరారు చేస్తూ మార్చి 20, 2007న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో 2009 నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉండగా అంచనా వ్యయాన్ని రూ. 6,671.62 కోట్లకు పెంచేస్తూ 2018 మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో.. మిగిలిన పనులను బినామీ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదిలోనే స్కెచ్ వేశారు. తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ నుంచి 18.20 కి.మీ వరకు లైనింగ్ చేయడం, 18.200 కి.మీ నుంచి 42.566 కిమీ వరకు గతంలో లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులు, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్ ఛానల్ 0.00 కి.మీ నుంచి 7.380 కి.మీ వరకు లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ.. మార్చి 9, 2018న జారీ చేసిన ఉత్తరులలో ఈ పనుల విలువను రూ. 180.48 కోట్లుగా ఖరారు చేశారు. ఆ పనుల వ్యయాన్ని మళ్లీ పెంచాలని ముఖ్యనేత ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన అధికారులు ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ. 280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8, 2018న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులకు రూ. 239.03 కోట్లను అంతర్గత విలువగా నిర్ణయించిన అధికారులు.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థకు ఆ పనులు దక్కేలా నిబంధనలతో జూలై 16న ఎల్ఎస్–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నెలల్లో ఈ పనులకు పూర్తి గడువు విధించారు. జూలై 31న టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థతో పాటు ష్యూ, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రాలు బిడ్లు దాఖలు చేశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో.. పనులు చేసిన అనుభవం లేకున్నా ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను చూపి.. అధికార బలంతో పనులు దక్కించుకోవడంలో రిత్విక్‌ది అందెవేసిన చేయిగా జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలుగు గంగ లైనింగ్ పనుల టెండర్లో టెక్నికల్ బిడ్‌ను తెరిచిన సమయంలో రిత్విక్ సంస్థ తప్పుడు అర్హత పత్రాలు సమర్పించినట్లు ష్యూ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్, అలహాబాద్ జిల్లాల పరిధిలో బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టు పనులను రిత్విక్ సంస్థ సబ్ కాంట్రాక్టర్లతో చేయించిందని.. కానీ ఆ పనులు తానే చేసినట్లు తప్పుడు పత్రాలు సమర్పించిందని, ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని కోరారు. కానీ, ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆగస్టు 6న ప్రైస్ బిడ్ తెరిచారు. 2.88% అధిక ధర (ఎక్సెస్)కు రిత్విక్ (ఎల్–1), 3.61% ఎక్సెస్‌కు ష్యూ (ఎల్–2), 4.31 శాతం ఎక్సెస్‌కు హెచ్‌ఈఎస్ (ఎల్–3) సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఎల్–1గా నిలిచిన రిత్విక్ సంస్థకు పనులు అప్పగించాలని సీవోటీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేసింది. టెండర్‌ను ఖరారు చేసి సీఎం రమేష్‌కు అప్పగించాలని నవంబర్ 30న సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ అంశాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. దాంతో సీవోటీ అధికారులు టెండర్‌ను రద్దు చేశారు. అయినా తీరు మారలేదు.. తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనులకు రూ. 239.03 కోట్ల అంచనా వ్యయంతో జనవరి 14న రెండోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం రమేష్ సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు పెట్టారు. ఇతర సంస్థలు టెండర్లో షెడ్యూళ్లు దాఖలు చేయకుండా ఇప్పటికే తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఈ క్రమంలో సీఎం రమేష్ చెప్పినట్టు విని.. పనులు ఆయనకు చెందిన సంస్థకే అప్పగించాలని జలవనరుల శాఖ అధికారులు, తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈనెల 11లోగా షెడ్యూల్ దాఖలు చేసుకోవచ్చు. 12న టెక్నికల్ బిడ్.. 16న ఫైనాన్స్ బిడ్ ఖరారు చేసి సుమారు 4.85 శాతం అధిక ధర (ఎక్సెస్)కు సీఎం రమేష్ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్‌ను ఆమోదించి.. పనులు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. -
‘తెలుగుగంగ’లో రూ.100 కోట్లకు ఎసరు!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అందినకాడికి దిగమింగడమే ప్రభుత్వ పెద్దలు పనిగా పెట్టుకున్నారు. రూ.172.99 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.180.48 కోట్లకు పెంచేస్తూ ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత అంచనా వ్యయాన్ని రూ.280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కేవలం మూడు నెలల్లోనే రూ.99.79 కోట్ల మేర పెంచినట్లు స్పష్టమవుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల్లో ముఖ్యనేత సాగిస్తున్న అక్రమాలకు ఇదో తార్కాణం. ఈ వ్యవహారంలో రూ.100 కోట్ల మేర ముడుపులు చేతులు మారనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంచనాల్లో వంచన తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ.4,460.64 కోట్లుగా ఖరారు చేస్తూ 2007 మార్చి 20న రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అంచనా వ్యయాన్ని రూ.6,671.62 కోట్లకు పెంచేస్తూ ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో మిగిలిపోయిన పనులను సన్నిహిత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారు. ఈ క్రమంలో తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ. నుంచి 18.20 కి.మీ. వరకూ లైనింగ్ చేయడం, 18.200 కి.మీ. నుంచి 42.566 కి.మీ. వరకూ గతంలో లైనింగ్ చేయకుండా మిగిలిన పనులు, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్ చానల్ 0.00 కి.మీ. నుంచి 7.380 కి.మీ. వరకూ లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ, మార్చి 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ పనుల విలువను రూ.180.48 కోట్లుగా ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యనేత హుకుం తెలుగుగంగ కాలువ లైనింగ్ పనుల అంచనా వ్యయాన్ని మళ్లీ పెంచేయాలంటూ అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. దాంతో అంచనా వ్యయాన్ని రూ.280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8న జల వనరుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంచనా వ్యయంతో తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యనేత హుకుం జారీ చేశారు. ఈ పనుల అంతర్గత విలువను రూ.239.03 కోట్లగా నిర్ణయించిన అధికారులు.. ఈ నెల 16న ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల 30వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. 31న టెక్నికల్ బిడ్, ఆగస్టు 6న ప్రైస్ బిడ్ తెరిచి టీడీపీ రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. కి.మీ.కు రూ.12.16 కోట్లు ఖర్చు చేస్తారట! టెండర్లు పిలిచిన పనుల్లో తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ. నుంచి 18.20 కి.మీ. వరకూ లైనింగ్ పనులు మాత్రమే కొత్తగా చేపట్టాల్సినవి. ప్రధాన కాలువ 18.200 కి.మీ. నుంచి 42.566 కి.మీ. వరకూ.. కేవలం 800 నుంచి 900 మీటర్ల పొడవున మాత్రమే లైనింగ్ పనులు మిగిలిపోయాయి. బీసీఆర్ లింక్ చానల్లో 650 మీటర్ల పనులు మాత్రమే గతంలో చేయకుండా వదిలేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కేవలం 19.650 కి.మీల. పొడవున మాత్రమే లైనింగ్ చేయాలి. ప్రభుత్వం ఖరారు చేసిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే కి.మీ.కు సగటున రూ.12.16 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి కిలోమీటర్‌కు రూ.7 కోట్లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక జీఎస్టీ, లేబర్ సెస్, సీనరేజీ చార్జీల రూపంలో మరో రూ.36.29 కోట్లు కాంట్రాక్టర్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. టీడీపీ ఎంపీ సంస్థకు పనులు దక్కేందుకే.. అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించడం గమనార్హం. సాధారణంగా ‘పేవర్’ అనే యంత్రంతో కాలువల లైనింగ్ చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లే బిడ్ దాఖలుకు అర్హులని నిబంధన పెడతారు. కానీ, పేవర్తోపాటు ‘షార్ట్ క్రీటింగ్’ విధానంలో చేసి పనులు ఉండాలనే నిబంధన పెట్టడం గమనార్హం. ఈ విధానంలో పనులు చేసిన అనుభవం టీడీపీ రాజ్యసభ సభ్యుడి సంస్థకు ఉండటం వల్లే.. ఆ నిబంధనను ప్రత్యేకంగా పెట్టారని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
22 ఏళ్లుగా పోరాటం
సాక్షి, కడప : ఏళ్ల తరబడి ఓ పెద్దాయన కొడుకు ఉద్యోగం కోసం పోరాటం చేస్తున్నాడు. ఒక నెల కాదు...మూడు నెలలు కాదు..దాదాపు 22 ఏళ్లుగా ఉద్యోగం కోసం తిరగని కార్యాలయం లేదు...కలవని అధికారి లేడు. నిరంతరం తిరుగుతున్నా ఉద్యోగం మాత్రం అందని ద్రాక్షలా మారింది. ఎన్నో ఏళ్లుగా తప్పని నిరీక్షణ ప్రాజెక్టు విషయంలో సహకరించిన ప్రజలను ఎప్పటికీ మరిచిపోకూడదు. పది మందికి నీళ్లందించే రిజర్వాయర్ నిర్మాణానికి ఇళ్లను....భూములను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వం నష్టపోయిన బాధితులకు పరిహారంతోపాటు ఉద్యోగం ఇచ్చేలా నిర్ణయించింది. అంతేకాకుండా జీఓలను కూడా జారీ చేశారు. ఇల్లు, భూములు కోల్పోయిన అనేక మందికి ఉద్యోగాలిచ్చారు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ బ్రహ్మంగారిమఠం మండలం ఓబులరాజుపల్లెకు చెందిన మేకల శంకరయ్య కుటుంబానికి మాత్రం ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. శంకరయ్యకు చెందిన పది సెంట్ల స్థలంలో ఉన్న ఇల్లు తెలుగుగంగ ప్రాజెక్టులో ముంపునకు గురైంది. 1995 ప్రాంతంలో నివాస ప్రాంతాన్ని వదిలిపెట్టి శంకరయ్య కుటుంబం బయటికి వచ్చిం ది. కుమారుడికి ఉద్యోగం వస్తుందని ఆశించినా ఇప్పటివరకు నెరవేరలేదు. అనేక మందికి అవకాశాలు కల్పించినా.... బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఓబులరాజులపల్లెతోపాటు మరికొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు అనేక మందికి పరిహారంతోపాటు ఉద్యోగాలు కల్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంతోపాటు తర్వాత దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో కూడా అనేక మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే శంకరయ్యకు సీరియల్ నెంబరు 518 ఇచ్చారు. అయితే నెంబరుకు అటు, ఇటు సీరియల్ నెంబర్ల వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయని... తమకు మాత్రమే ఇవ్వలేదని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో కూడా తెలుగుగంగ కార్యాలయంలోని కొంతమంది నగదు మొత్తాలను అడిగారని, ఇవ్వకపోవడంతోనే ఉద్యోగం విషయంలో లిస్టులో పెట్టకుండా పక్కదారి పట్టిస్తూ తమ కుటుంబంతో ఆడుకుంటున్నారని శంకరయ్య ఆరోపిస్తున్నారు. 22 ఏళ్లుగా న్యాయ పోరాటం బి.మఠం మండలం ఓబులరాజుపల్లెకు చెందిన శంకరయ్య 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు. 1990–95 మధ్య ప్రాజెక్టులోకి ఇల్లు కోల్పోవడంతో తర్వాత కాలం నుంచి ఉద్యోగం కోసం తిప్పలు పడుతున్నాడు. ప్రతిసారి కలెక్టరేట్‌కు రావడం...జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించడం జరుగుతోంది. అంతేతప్ప రైతుకు ఎందుకు ఉద్యోగం కల్పించలేదో చెప్పలేదు. కలెక్టరేట్‌తోపాటు జీఎన్ఎస్ఎస్ అధికారులను శంకరయ్య కలుస్తూ వస్తున్నారు. అయితే తెలుగుగంగ కార్యాలయ పరి««ధిలోని అధికారులు కూడా ఉద్యోగ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే మీ కోసంలో సుమారు 75 నుంచి 100 వినతిపత్రాలు సమర్పించారు. ఇంతవరకు అధికారులు ఉద్యోగం మాత్రం కల్పించలేదని పేర్కొంటున్నారు. శంకరయ్య కుమారుడు విశ్వనాథ్ కూడా డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఏదిఏమైనా శంకరయ్య కుటుంబానికి ఎప్పుడు న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే! -
తెలుగు గంగ సీఈగా బి. సుధాకర్‌బాబు
హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం సూపరిండెంట్ ఇంజనీర్ బి.సుధాకర్‌బాబుకు ప్రభుత్వం తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల తెలుగు గంగ సీఈ సుధాకర్ పదవీ విరమణ చేశారు. అనంతపురం జిల్లా సీఈ జలంధర్ ఇప్పటివరకూ తెలుగుగంగ సీఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుగంగకు పూర్తిస్థాయి సీఈ నియమించాలని భావించిన ప్రభుత్వం.. ఆ బాధ్యతలను బి.సుధాకర్‌బాబుకు అప్పగించింది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ విభాగంలో సీఈగా పనిచేస్తోన్న నారాయణరెడ్డిని కర్నూల్ సీఈగా నియమించింది. క్వాలిటీ కంట్రోల్(రాయలసీమ) విభాగం సీఈగా కె.వరదరాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జలవనరుల విభాగం సంయుక్త కార్యదర్శి బి.వేదవ్యాసకు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ విభాగం సీఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
గంగ కోసం బెంగ
తెలుగు గంగ కాల్వ గండ్లు పూడ్చేందుకు ఖరారు కాని టెండర్లు 50 వేల ఎకరాల్లో పంటలకు దెబ్బ రైతుల్లో తీవ్ర ఆందోళన తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం పడిన గండ్లను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపు 50 వేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. తిరుపతి: ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అన్న చందాన తయారైంది తెలుగుగంగ ఆయకట్టు రైతుల పరి స్థితి. భారీవర్షాలు కురిసినా రైతులకు మాత్రం కష్టాలు తీరడం లేదు. ఇప్పటికే పలు చెరువులకు గండ్లు పడి నీరు వృథాగా పోయాయి. తొట్టంబేడు మండలం కనపర్తి గ్రామ సమీపంలో 71వ కిలోమీటరు వద్ద తెలుగుగంగ కాలువకు రెండ్లు గండ్లు పడ్డాయి. రెండు నెలలు గడిచినా వాటిని పూడ్చిన పాపాన పోలేదు. దీంతో తెలుగు గంగ కాలువ ద్వారా నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. గంగ నీటిపై ఆధారపడి శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజక వర్గాల రైతులు దాదాపు 50 వేల ఎకరాల్లో వరి, చెరుకు, వేరుశెనగ పంటలు సాగు చేశారు. పలుచోట్ల తెలుగు గంగ నీరు అందకపోవడంతో వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయే స్థితికి చేరుకుంది. మూడు, నాలుగు రోజుల్లో నీరు విడుదల కాకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కండలేరు జలాశయం నుంచి తెలుగుగంగ కాలువల ద్వారా, చెరువుల్లో నీటిని నింపి ఆయకట్టుకు విడుదల చేస్తారు. నెల్లూరు జిల్లా సరిహద్దు వెంకటగిరి వరకు కాలువ 61వ కిలోమీటరు వరకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే భారీ వర్షాలకు జిల్లాలోని 71వ కిలోమీటరు వద్ద గండ్లు పడటంతో ఆయకట్టుకు నీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉండగా తాత్కాలికంగా మరమ్మతులు చేసి నీటిని విడుదల చేస్తే కేవలం 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. పట్టించుకోని ప్రభుత్వం.. కాలువల మరమ్మతుల కోసం అధికారులు రూ.1.86 కోట్లతో అంచనాలు రూపొం దించారు. అయితే ఇంకా టెండర్ల దశలోనే ఉండటం గమనార్హం. టెండర్లలకు తుది గడువు ఈనెల 25గా నిర్ణయించారు. తాత్కాలికంగా కాలువల మరమ్మతులు చేపడితే నీరు విడుదలచేసే అవకాశం ఉంది. అయితే రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందని భావించిన అధికారులు మొక్కుబడిగా పనులు చేపడుతున్నారు. -
పైరుకాడా రాజకీయమే!
సాక్షి ప్రతినిధి, కడప: ‘సత్రం కూటికి అయ్యంగార్ సిఫార్సులు’ అన్నట్లుగా అధికార తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. రైతన్నల పంటలు కళ్లెదుటే పాడైపోతున్నా పచ్చ నాయకుల కనుసైగలకే ప్రాధాన్యం ఇవ్వడంలో తెలుగుగంగ ప్రాజెక్టు (టీజీపీ) యంత్రాంగం నిమగ్నమైంది. కోడిగుడ్డుపై ఈకలు పీకే చందంగా కుంటిసాకులు వెతుక్కుంటున్నారు. ఫలితంగా 4వేల ఎకరాల ఆయకట్టుదారులకు తీరని నష్టం వాటిల్లుతోంది. సబ్సిడరీ రిజర్వాయర్-2 కింద పప్పనపల్లె, మిట్టమానుపల్లె, ఆదిరెడ్డిపల్లె, ఎర్రబల్లె, వనిపెంట, జీవీసత్రం పంచాయితీల పరిధిలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, టమోటా సాగుచేశారు. ఇప్పటికీ నెలరోజుల పైరు అయింది. నీరు విడుదల చేయాల్సిన యంత్రాంగం అధికార ఒత్తిడిలో నలుగుతోంది. అధికారపార్టీ కనుసైగలతోనే.... ఎస్ఆర్-2 పరిధిలో రైతుల దుస్థితిని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నవంబర్‌లో టీజీపీ సీఈ దృష్టికి తీసుకెళ్లారు. పంటలు ఏపుగా ఉన్నా సకాలంలో నీరు లభ్యం కావడంలేదని రైతుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని తెలుగుగంగ సీఈ, ఎస్ఈ లకు వివరించారు. అందుకు సమ్మతించిన అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుడు పుట్టా సుధాకర్‌యాదవ్ చేతుల మీదుగా నీరు విడుదల చేయించారు. ప్రజాప్రతినిధుల్ని విస్మరించి, ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి యంత్రాంగాన్ని ప్రశ్నించారు. దీంతో ‘అత్తమీద కోపం దుత్తమీద’ చూపించినట్లుగా నీటి విడుదలను నిలిపేశారు. అధికారపార్టీ నేతలు కనుసైగలే అందుకు కారణంగా తెలుస్తోంది. పంటలు ఎండుతున్న నేపధ్యంలో నీరు విడుదల కాాకపోవడంపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డి గతవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిసెంబర్ 1లోపు తప్పకుండా నీరు విడుదల చేస్తామని యంత్రాంగం తెలిపింది. అయితే ఎస్ఆర్-2 నుంచి నీరు విడుదల చేస్తే తామే విడుదల చేయాలి, లేదంటే అలాగే ఉండాలనే అధికార దర్పం కారణంగా యంత్రాంగం మౌనమంత్రం పాటిస్తోంది. ఓ వైపు నీరు విడుదల చేయాలని టీజీపీ సీఈ వరదరాజ స్వయంగా ఆదేశించారు. ఆమేరకు నీరు విడుదల చేసినట్లుగా కొద్దిగా షట్టర్ ఎత్తి, ఆపై షట్టర్ బేరింగ్ పాడైందనే సాకు చెప్పినట్లు తెలుస్తోంది. నిజంగా బేరింగ్లు పాడైనా గంటలో రిపేరు చేయవచ్చుని రైతుల విమర్శిస్తున్నారు. ఇప్పటికే వందలాది ఎకరాలు నీరు అందని కారణంగా ఎండిపోయాయని, మిగిలినవి కూడా ఒకటి రెండు రోజుల్లో అదేస్థితికి చేరుకుంటాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. డోలయమానంలో కిందిస్థాయి సిబ్బంది... ఎస్ఆర్-2 కింద నీరు విడుదల చేయాలంటూ రైతుల నుంచి ఒత్తిడి, తమ అనుమతి లేనిదే విడుదల చేయరాదంటూ తెలుగుదేశం పార్టీ నేతల బెదిరింపులతో కింది స్థాయి సిబ్బంది తీవ్ర మనోవేదనకు గురైతోన్నట్లు సమాచారం. ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’అన్నట్లుగా పరిస్థితి ఉత్పన్నమైందని సంబంధిత ఏఈ ఒకరు సహచరులతో ఆవేదన చెందినట్లు సమాచారం. రైతుల న్యాయమైన కోర్కెను తీర్చలేని పరిస్థితిల్లో ఉద్యోగం చేయడం కంటే, తప్పుకోవడం శ్రేయష్కరమని వాపోయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సహచర ఉద్యోగికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలతోనే నీరు విడుదల చేయాలని, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆ నేతలు వచ్చేంతవరకూ సాకులు చూపించాలనే నిర్ణయం కారణంగా నీరు విడుదలకు నోచుకోలేదని సమాచారం. ఈఈ ప్రతాప్ ఏమన్నారంటే.... ఎస్ఆర్-2 నుంచి నీరు విడుదల చేయాలని సీఈ ఆదేశించిన మాట నిజమే. ఆమేరకు విడుదల చేశాం. అంతలోనే షట్టర్ బేరింగ్ పాడైంది. దాంతో నీరు విడుదల ఆపాం. అధికారపార్టీ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం. త్వరలో నీరు విడుదల చేస్తాం. అయితే ఎప్పుడు నీరు విడుదల చేస్తామన్న విషయంపై ఈఈ ప్రతాప్ స్పష్టత ఇవ్వలేదు. -
వరద కాలువలో అవినీతి పరవళ్లు
సిమెంట్ లైనింగ్లో బయటపడిన నాణ్యత ప్రమాణాలు అడుగడుగునా పగుళ్లు రూ.175 కోట్లు నీటి పాలు సోమశిల-కండలేరు కాలువ లైనింగ్ భవితవ్యం ప్రశ్నార్థకం కలువాయి : తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన సోమశిల-కండలేరు వరద కాలువ లైనింగ్ నిర్మాణంలో నాణ్యత కొట్టుకుపోయి అవినీతి పరవళ్లు తొక్కుతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన లైనింగ్ ఆరేళ్లకే కొట్టుకుపోతోంది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యతకు నీళ్లొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.175 కోట్ల వ్యయంతో నిర్మితమైన సిమెంట్ లైనింగ్ క్రమక్రమంగా నీటి పాలవుతోంది. కాలువ దుస్థితి కళ్ల ముందే కనబడుతుంటే.. అదేమీ పట్టనట్లు రేపో.. మాపో పనులకు సంబంధించిన ఫైనల్ బిల్లులను కూడా కాంట్రాక్టర్‌కు అందజేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ప్రజల దాహార్తి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో రైతాంగానికి తాగు, సాగునీటిని అందించేందుకు సోమశిల-కండలేరు వరద కాలువను నిర్మించారు. కాలువ లీకేజీలను అరికట్టేందుకు, నీటి ప్రవాహాన్ని పెంచేందుకు కాలువకు ఇరువైపులా 44.450 కిలోమీటర్లు స్లోబ్లు, బెడ్ కాంక్రీట్ లైనింగ్ పనులు చేసేందుకు జలయజ్ఞం పథకంలో ప్యాకేజీ నంబర్ 9 కింద రూ.175 కోట్లు మంజూరు చేశారు. పనులను సోమశిల జలాశయం సమీపంలోని కిలో మీటరు 2.35 వద్ద నుంచి కాలువకు ఇరువైపులా సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులను చేపట్టి 2008 నాటికి పూర్తి చేశారు. కుల్లూరు, కలువాయి, చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి సబ్ డివిజన్ల పరిధిలో ఈ పనులు చేపట్టారు. కాలువకు ఇరువైపులా మట్టిని చదును చేసి నీటితో క్యూరింగ్ చేసిన తర్వాత కాంక్రీట్ స్లోబ్లు వేయాల్సి ఉంది. కానీ పనుల్లో ఆ విధంగా జరిగిన దాఖలాలు లేవు. కాంక్రీట్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పనులు పూర్తయి 6 ఏళ్లు కూడా గడవకముందే. ఎక్కడికక్కడ లైనింగ్‌కు అప్పుడే పగుళ్లు ఏర్పడుతున్నాయి. కాంక్రీట్ చేసిన తర్వాత సిమెంట్ లైనింగ్‌కు నీటితో క్యూరింగ్ చేయకుండా కూలింగ్ పౌడర్‌ను చల్లి సరిపెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. కాలువ పూర్తి సామర్థ్యం 12 వేల క్యూసెక్కులు. పనులు పూర్తయిన తర్వాత సోమశిల జలాశయం నుంచి కండలేరుకు కాలువ ద్వారా 5 విడతలుగా నీటిని విడుదల చేశారు. అయితే 9 నుంచి 10 వేల క్యూసెకుల వరకే నీటి కాలువకు విడుదల చేశారు. ఈ నీటి ప్రవాహానికే సిమెంట్ లైనింగ్ ఎక్కడికక్కడ కొట్టుకుపోతూ వస్తోంది. కాలువలో కాంక్రీట్ లైనింగ్ చేసేటప్పుడు లీడ్ మిక్స్‌తో స్లోబ్లను లైవల్ చేసి ఆ తర్వాత కాంక్రీట్ చేయాల్సి ఉంది. కానీ అలా చేయకుండా లూజుమట్టితో చదును చేసి, కనీసం దిమ్మెసే కూడా చేయకుండా కాంక్రీట్ వేయడం వల్ల నీటి ప్రవాహానికి స్లోబులు లైనింగ్ కుంగి పగళ్లు ఏర్పడటంతో పాటు కొట్టుకుపోతోంది. కాంక్రీట్‌కు ఏర్పడిన పగుళ్లలోకి నీళ్లు వెళ్లి ప్రవాహానికి సిమెంట్ పెచ్చులు పెచ్చులుగా లేచిపోతున్నాయి. కాలువకు పూర్తిసామర్థ్యంలో నీటిని విడుదల చేస్తే లైనింగ్ పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. సోమశిల-కండలేరు వరద కాలువ 2.35 కిలో మీటర్ నుంచి 15 వరకు కూల్లూరు, 15 నుంచి 33 వరకు కలువాయి, 33 నుంచి 44.450 వరకు ఆదూరుపల్లి సబ్డివిజన్ల పరిధిలోకి వస్తుంది. సిమెంట్ కాంక్రీట్ లైనిం గ్ దారుణంగా దెబ్బతింటున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. నాణ్యతా లోపంపై చర్యలు తీసుకోకుండా తుది బిల్లును కూడా మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు కాలువను పర్యక్షించి దెబ్బతిన్న కాంక్రీట్ పనులను తిరిగి చేయించాల్సిన అవసరం ఉంది జారి పోయిన లైనింగ్‌లకు మరమ్మతులు చేయిస్తాం కండలేరు వరద కాాలువలో జారిపోయిన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్‌కు మరమ్మతులు చేయిస్తాం. కాలువకు నీటిని విడుదల చేసేలోపు పనులన్నీటిని పూర్తి చేయిస్తాం. కాంట్రాక్టర్ ద్వారానే ఈ పనులు చేయించి తుది బిల్లులు అందిస్తాం. అప్పటి వరకు బిల్లుల చెల్లింపులు నిలిపి వేస్తాం. కేవీ రమణ, ఇన్చార్జి ఈఈ తెలుగుగంగ ప్రాజెక్టు -
అటవీ అధికారుల మెరుపు దాడులు
రుద్రవరం, న్యూస్‌లైన్: అటవీ అధికారులు రుద్రవరం, చలిమ రేంజ్ పరిధిలో శుక్రవారం మెరుపు దాడులు చేశారు. దాడుల వివరాలను జిల్లా స్కాడ్ డీఎఫ్ఓ చంద్రశేఖర్ విలేకరులకు వివరించారు. ఈ మేరకు.. మొదట చాగలమర్రి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు ట్రాస్క్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఫారెస్ట్ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి 28 ఎర్రచందనం, 175 నానాజాతి దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని పెద్దకంబాలూరు, పందిర్లపల్లె గ్రామాల మధ్య వాగులో దాచి ఉంచిన 63 దుంగలు లభించాయి. వీటిలో 8 ఎర్రచందనం దుంగలు, 29 రేలా, 13 ఏగ, 8 సండ్ర, 2 బట్టగెనుపు, 2 ఎర్ర బుటెకె, 1 చిండుగ జాతులకు చెందిన దుంగలు ఉన్నాయి. అలాగే పెద్దకంబలూరు, చిన్నకంబలూరు, పందిర్లపల్లె గ్రామాలకు చెందిన నలుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగలను రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. అలాగే అహోబిలం, దొర కొట్టాల గ్రామాల మధ్య తెలుగు గంగ ప్రధాన కాల్వ సమీపంలోని ముల్లపొదల్లో దాచిన 20 ఎర్రచందనం దుంగలను స్పెషల్ పార్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అహోబిలం కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. చలిమ రేంజ్ పరిధిలోని గాజులపల్లె సమీపంలోని అంకిరెడ్డి చెరువులో దాచిన 120 సండ్ర జాతికి చెందిన దుంగలను స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ ట్రాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఎర్రచందనం దుంగలతోపాటు నానాజాతికి చెందిన దుంగలను ఎర్రచందనం దుంగలుగా విక్రయిస్తున్నారు. మొత్తం 203 దుంగలను ఎర్రచందనం దుంగలగా విక్రహిస్తే రూ. 50 లక్షలు విలువ ఉంటుందని డీఎఫ్ఓ తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల్లో తిరుపతి టాస్క్‌పోర్స్ అధికారులు సీఐ మద్దయ్య ఆచారి, ఎస్ఐ ఆశోక్ కుమార్, రేంజర్ విశ్వేశ్వరరావు, డీఆర్ఓ వెంకటరామిరెడ్డి, ఫారెస్టర్ నాగరాజు, మొబైల్ పార్టీ అధికారి థాయన్న, అహోబిలం, మహనంది డీఆర్ఓలు వేణు ప్రసాద్, దేవరాజు, సెక్షన్ అధికారులు నాగ తిరుపాలు, జాకీర్ ఉశ్సేన్, రామాంజనేయులు పాల్గొన్నారు. -
బ్రహ్మంసాగర్‌లో డెడ్ స్టోరేజి
బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్: తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గింది. సాగర్ నీటి సామర్థ్యం 17.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.3 టీఎంసీలు నిల్వ ఉంది. డెడ్ స్టోరేజి ఉన్నా ఆర్టీపీపీకి మాత్రం బ్రహ్మంసాగర్ నుంచి ఆర్టీపీపీకి 40 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది పాలకుల నిర్లక్ష్యం వలన బ్రహ్మంసాగర్‌కు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేయకపోవడంతో ఈ ఏడాది సాగుకు నీరు వస్తుందా రాదా అనేది రైతుల్లో ఆందోళన నెలకొంది. బ్రహ్మంసాగర్‌లో నీటి కొరత ఉన్నా అధికారులు మాత్రం సాగర్ కుడికాలువ ద్వారా ఆర్టీపీపీకి మాత్రం మరో టీఎంసీ నీటిని విడుదల చేయమని ఉత్తర్వులు ఇవ్వడంతో నెల రోజులుగా ప్రతి రోజు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే ఒక టీఎంసీ నీటిని విడుదల చేసినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు. 1.46 టీఎంసీ నీరు నిల్వ ఉన్నంత వరకు ఆర్టీపీపీకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. బ్రహ్మంసాగర్‌కు ఇంకా నీరు రాకపోవడంతో రైతులు వరి పంటను సాగు చేసుకునేందుకు నీరును ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇంత వరకు పోతిరెడ్డిపాడుకు నీరు చేరకపోవడంతో బ్రహ్మంసాగర్‌కు నీరు చేరాలంటే మరో 20 రోజులైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదైనా సాగర్ నీటి సామర్థ్యంలో కనీసం 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.