తెలుగు గంగ రిజర్వాయర్‌లో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు
మృతదేహాలను వెలికితీసిన పోలీసులు
వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఘటన
మైదుకూరు/దువ్వూరు: విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. తెలుగుగంగ రిజర్వాయర్‌లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలో జరిగింది. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన పఠాన్ రహంతుల్లా(23), ఎస్‌కే ముదాతీర్(22), వేంపల్లి షాహిద్(23) ఆదివారం సాయంత్రం మైదుకూరు మండల పరిధిలోని తెలుగు గంగ సబ్సిడరీ రిజర్వాయర్–1 వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న పార్కులో కొద్దిసేపు గడిపిన తర్వాత రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఈత వేసేందుకని రిజర్వాయర్‌లోకి దిగి గల్లంతయ్యారు.
రాత్రయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు.. ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఉదయాన్నే వారి స్నేహితులను వాకబు చేశారు. ముగ్గురు యువకులూ విహార యాత్రకని తెలుగు గంగ రిజర్వాయర్‌కు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. ఆ వెంటనే అక్కడికి వెళ్లగా.. రిజర్వాయర్ కట్టపై యువకుల దుస్తులు, చెప్పులు, సెల్ ఫోన్లు ఉండటంతో చుట్టుపక్కల వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో మైదుకూరు, దువ్వూరు పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకొని.. యువకుల కోసం గాలించారు. మైదుకూరు అర్బన్, రూరల్ సీఐలు మస్తాన్, శ్రీనాథ్‌రెడ్డి అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు రిజర్వాయర్‌లో గాలించి సోమవారం మధ్యాహ్నానికి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. రిజర్వాయర్ గేట్లకు సమీపంలో.. 30 అడుగుల లోతు ఉండటంతో యువకులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment