excursion
-
జనరేషన్ జెడ్.. ఖర్చులో జెట్ స్పీడు
సాక్షి, అమరావతి: తరాలు మారుతున్నకొద్దీ అలవాట్లు, అభిరుచులు, అవసరాలు మారిపోతుంటాయి. కొత్త తరం కొంగొత్త ఆశలతో ముందుకు సాగిపోతుంటుంది. సమాజంలో వేగంగా వస్తున్న మార్పులు, అవకాశాలను అంతే వేగంతో అందిపుచ్చుకుంటుంది. ఆదాయమూ పెరుగుతోంది. చేతిలో డబ్బు ఆడుతున్నకొద్దీ పెట్టే ఖర్చూ పెరుగుతుంది. ఇప్పుడు ‘జనరేషన్ –జెడ్’ చేస్తున్న పని కూడా ఇదే. ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్.. ఇలా అన్ని రంగాల్లోనూ వీరు పెడుతున్న ఖర్చు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఖర్చు పెట్టడంలో ‘జెడ్’ తరాన్ని మించిన వారు లేరని అంతర్జాతీయ సంస్థలైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ), స్నాప్‌చాట్ షోస్ చెబుతున్నాయి. ఖర్చు చేయడంలో మిలీనియల్స్ జనరేషన్ (1981–96 మధ్య పుట్టిన వారు)ను దాటుకొని జెనరేషన్–జెడ్ (1997–2012 మధ్య పుట్టిన వారు) దూసుకుపోతున్నట్లు ఈ సంస్థల సంయుక్త అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం భారత దేశ ప్రజలు ఏటా పెడుతున్న ఖర్చులో 43 శాతం జనరేషన్–జెడ్‌దే అని, వచ్చే పదేళ్లల్లో వీరు ఖర్చు 50 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్–జెడ్ ఏటా చేస్తున్న ఖర్చు అక్షరాలా రూ.74,70,000 కోట్లు. ఇది 2035 నాటికి రూ.1,66,00,000 కోట్లకు చేరుతుందని ఆ సర్వే అంచనా వేసింది. స్నాక్స్ నుంచి సెడాన్ కార్ల వరకు దేశ ప్రజలు పెడుతున్న ఖర్చులో ప్రతి రెండో రూపాయి జనరేషన్–జెడ్ నుంచే వస్తోంది. ప్రస్తుతం దేశ జనాభాలో 1997–2012 మధ్య పుట్టిన ‘జెడ్’ తరం జనాభా 37.7 కోట్లు. అమెరికా మొత్తం జనాభా కంటే మన దేశంలో వీరి సంఖ్యే ఎక్కువ. ప్రస్తుతం జనరేషన్ ‘జెడ్’లో 25 శాతం మంది (ప్రతి నలుగురిలో ఒకరు) మాత్రమే సంపాదించడం మొదలు పెట్టారని, ఇది 2035 నాటికి 47 శాతానికి (దాదాపు సగం మంది) చేరుతుందని సర్వే అంచనా వేసింది.విహారయాత్రలకే పెద్దపీట జెడ్–జనరేషన్ ప్రయాణాలు, విహారయాత్రలకే అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది (2024 సంవత్సరం)లో విహార యాత్రల కోసం వీరు చేసే ఖర్చు రూ.6,62,500 కోట్ల నుంచి రూ.6,64,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ట్రావెల్స్ సంస్థలు వీరికి ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా ఫ్యాషన్ –లైఫ్‌స్టైల్ వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెడుతున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ పానియాలతో పాటు రెస్టారెంట్లకూ వీరు భారీగానే ఆదాయాన్ని అందిస్తున్నట్లు సర్వేలో తేలింది. స్పష్టంగా చెప్పాలంటే.. ‘జెడ్’ తరానికి వంట చేయడమంటే మహా చిరాకు.సింపుల్‌గా ప్యాకేజ్డ్ ఫుడ్ లేదా బయట నుంచి తెప్పించుకొని ఆరగించడమే ఇష్టం. ఇలా వీరు ప్యాకేజ్డ్∙ఫుడ్ కోసం రూ.2,90,500 కోట్లు, ఆహారం కోసం రెస్టారెంట్లకు మరో రూ.2,90,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు బీసీజీ సర్వే పేర్కొంది. ఏమిటీ జనరేషన్లు..అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఒక జనరేషన్ అంటే 16 సంవత్సరాల కాలం. దీని ప్రకారం 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌గా పేర్కొన్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ –జెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి జన్మింస్తున్న వారు ఆల్ఫా జనరేషన్గా పరిగణిస్తున్నారు. ఈ తరాల మధ్య అంతరాలను అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు అంచనా వేస్తుంటాయి. అందులో భాగంగానే బీసీజీ, స్నాప్ చాట్ షో సంస్థలు జనరేషన్–జెడ్ పై అధ్యయనం చేసి, వారి ఖర్చులపై నివేదిక ఇచ్చాయి. -
విషాదం మిగిల్చిన విహారం
మైదుకూరు/దువ్వూరు: విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. తెలుగుగంగ రిజర్వాయర్‌లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలో జరిగింది. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన పఠాన్ రహంతుల్లా(23), ఎస్కే ముదాతీర్(22), వేంపల్లి షాహిద్(23) ఆదివారం సాయంత్రం మైదుకూరు మండల పరిధిలోని తెలుగు గంగ సబ్సిడరీ రిజర్వాయర్–1 వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న పార్కులో కొద్దిసేపు గడిపిన తర్వాత రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఈత వేసేందుకని రిజర్వాయర్‌లోకి దిగి గల్లంతయ్యారు. రాత్రయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు.. ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఉదయాన్నే వారి స్నేహితులను వాకబు చేశారు. ముగ్గురు యువకులూ విహార యాత్రకని తెలుగు గంగ రిజర్వాయర్‌కు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. ఆ వెంటనే అక్కడికి వెళ్లగా.. రిజర్వాయర్ కట్టపై యువకుల దుస్తులు, చెప్పులు, సెల్ ఫోన్లు ఉండటంతో చుట్టుపక్కల వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైదుకూరు, దువ్వూరు పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకొని.. యువకుల కోసం గాలించారు. మైదుకూరు అర్బన్, రూరల్ సీఐలు మస్తాన్, శ్రీనాథ్‌రెడ్డి అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు రిజర్వాయర్‌లో గాలించి సోమవారం మధ్యాహ్నానికి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. రిజర్వాయర్ గేట్లకు సమీపంలో.. 30 అడుగుల లోతు ఉండటంతో యువకులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. -
‘స్కిల్’ కాదు డొల్లే
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో మాజీ సీఎం చంద్రబాబు చేసిన మోసాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2.50 లక్షల మందికి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో డొల్లతనం బయటపడింది. ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు సైతం నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చినట్లు కాగితాలపై చూపారు. పాఠశాల విద్యార్థులను విజ్ఞాన యాత్రల పేరిట సీమెన్స్‌కు తెలియకుండా ఆ కంపెనీ పేరిట ఏర్పాటు చేసిన సెంటర్లకు తరలించారు. బీసీ వెల్ఫేర్ పాఠశాలలకు చెందిన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కంప్యూటర్–ఐటీ ఫండమెంటల్స్, ఎల్రక్టానిక్స్ ఆఫీస్, ఎలక్ట్రికల్ హోమ్ లాంటి కోర్సుల్లో వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించారు. చంద్రబాబు ప్రభుత్వం వైదొలగేలోపు మొత్తం 1,21,654 మంది నైపుణ్య శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 70,000 మంది బీసీ వెల్ఫేర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం. విహారయాత్రకు వచ్చిన ఒక్కో విద్యార్థికి రూ.200 ఇచ్చినట్లు సంతకాలు పెట్టించారు. వాటిని చూపిస్తూ వారందరికి అత్యున్నత నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు తయారు చేశారు. ఇలా శిక్షణ పొందిన విద్యార్థులకు అధిక జీతాలు చెల్లించి తీసుకున్న కంపెనీలు ఏమిటో చంద్రబాబుకు బాకా ఊదుతున్న ఎల్లో మీడియానే చెప్పాలి!! ల్యాబ్‌లూ లేవు.. సీమెన్స్ పేరును తెరపైకి తీసుకొచ్చి రూ.3,300 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఘనంగా చెప్పుకున్నా వాస్తవంగా రూ.70 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్న విషయం ఫోరెన్సిక్ ఆడిట్లో బహిర్గతమయ్యింది. ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, వాటికి అనుబంధంగా 34 టీఎస్‌డీఐలు (టెక్నికల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్) ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు కాగితాల్లో చూపించారు. పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు చూపించే ఫోటోలన్నీ ఉత్తిత్తి ల్యాబుల్లో తీసినవే. సీఎన్సీ మెకానిక్, టూ వీలర్, ఫోర్ వీలర్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సర్వీస్ సెక్టార్, క్యాడ్ రామ్, ఐసీటీ, అగ్రి ఫార్మ్ మెకనైజేషన్ లాంటి కోర్సుల గురించి విద్యార్థులకు కంప్యూటర్ స్క్రీన్‌పై చూపించి శిక్షణ ముగించారు. ఒక్కో సీవోఈలో 15 ల్యాబ్‌లు, టీఎస్‌డీఐలో 10 ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు రికార్డులో చూపించారు. రాష్ట్రం వాటాగా తరలించిన రూ.371 కోట్లను కాజేసిన కేటుగాళ్లు ఒప్పందం ప్రకారం ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. ఈ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు ఆదేశించిన వెంటనే ఆగమేఘాలపై కొన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం గమనార్హం. -
విహార యాత్రలో విషాదం
సాక్షి, పాల్వంచ: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం కిన్నెరసాని కాల్వ వద్ద జరిగింది. ములకలపల్లి మండలం నాగారం యూపీఎస్‌కు చెందిన నలుగురు టీచర్లు 70మంది విద్యార్థులను కిన్నెరసాని కాల్వ వద్దకు విహార యాత్రకు తీసుకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను ముత్యాలు, నాగమణిల కుమారుడు వారం రాజేష్(11), వల్లవరపు వెంకటకృష్ణ, సౌజన్య దంపతుల కుమారుడు విజన్(10)గా గుర్తించారు. -
పేషెంట్లు బెడ్‌పైనే ఉండక్కర్లేదు!
♦ మెడికల్ ట్యాక్సీ ద్వారా బయటకు తిప్పే సేవలు ♦ పార్టీలకు, విహారయాత్రలకూ తీసుకెళ్లే అవకాశం ♦ ఇవన్నీ అందిస్తున్న హైదరాబాదీ స్టార్టప్ ఈ–సహాయ్ ♦ ఈ నెలాఖరులోగా విశాఖపట్నంలో సేవల విస్తరణ ♦ డిసెంబర్లో బెంగళూరు, కొచ్చిన్, పుణె, చెన్నైలకు ♦ ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ హరి భరద్వాజ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో అక్కినేని నాగార్జున నటించిన ‘ఊపిరి’ సినిమా చూశారా? అందులో కుర్చీకే పరిమితమైన నాగార్జునను హీరో కార్తీ ఏకంగా విదేశాలకు తీసుకెళ్లి పారా గ్లైడింగ్ వంటి సాహస కార్యాలు చేయిస్తాడు. నాగార్జున మనసులో చోటు సంపాదించుకుంటాడు!!. నిజానికి ఇంట్లోనో, ఆసుపత్రిలోనో బెడ్‌కే పరిమితమైన పేషెంట్లు కుటుంబ కార్యక్రమాల్లో, చిన్న చిన్న ఫంక్షన్లలో నలుగురితో కలిసి తిరిగితేనో, లేదా ప్రకృతి అందాల నడుమ విహరిస్తేనో త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతుంటారు. ఏదో సినిమా కాబట్టి అలాంటివి సాధ్యం కానీ.. మామూలుగా అయితే వారి ప్రయాణం, వైద్య సహాయం, మందుల సమయపాలన చూసుకోవటం ఇవన్నీ సాధ్యమా? అంటుంటారు చాలామంది. .. ఇదిగో సరిగ్గా దీన్నే వ్యాపార సూత్రంగా మార్చుకుంది హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న ఈ–సహాయ్! దేశంలోనే తొలిసారిగా మెడికల్ ట్యాక్సీ సేవలను ప్రారంభించిన సంస్థ ప్రారంభం, విస్తరణ ప్రణాళికల గురించి ఈసహాయ్ వ్యవస్థాపక సీఈఓ హరి భరద్వాజ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఈ సహాయ్ ప్రారంభానికి కంటే ముందు అమెజాన్, యాక్సెంచర్ కంపెనీల్లో పనిచేశా. అయితే అందరిలా నేను కూడా ఏదో ఒక వ్యాపారం చేద్దామనుకోలేదు. వినూత్నంగా ఉండటంతో పాటూ సామాజిక కోణంలోనూ ఉండాలని ఆలోచించా. వైద్య రంగంలో అయితే వ్యాపారంతో పాటూ సేవ కూడా చేసినట్టుంటుందని రూ.50 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్‌లో ‘ఈసహాయ్.ఇన్’ సంస్థను ప్రారంభించా. వినూత్నంగా మెడికల్ ట్యాక్సీ సేవలు వేగనార్, ఈకో, ఇండికా వంటి హ్యాచ్‌బ్యాక్ వాహనాలను మెడికల్ ట్యాక్సీ సేవల కోసం వినియోగిస్తాం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. వాహనంలోని సీట్లు 90 డిగ్రీల్లో తిరుగుతాయి. 10–15 అంగుళాలు బయటికి వస్తాయి. వీల్చెయిర్లా పడుకోవచ్చు కూడా. దీంతో పేషెంట్లకు వాహనంలోకి ఎక్కేందుకు, దిగేందుకు సులువుగా, సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం సీటింగ్ మాత్రమే కాదు.. పేషెంట్‌తో మెడికల్ అటెండర్, వైద్య పరికరాలు, మందులూ ఉంటాయి. వినూత్న, సౌకర్యవంతమైన సేవలుండటం వల్లే కాబోలు.. వృద్ధులు, గర్భవతులు, సర్జరీ పేషెంట్లు ఈ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతి కి.మీ.కు రూ.8–10 చార్జీ ఉంటుంది. ప్రస్తుతం 6 మెడికల్ ట్యాక్సీలున్నాయి. 2 వారాల్లో మరో 10 వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఏడాదిలో 2 వేల వాహనాలకు చేర్చాలన్నది లక్ష్యం. అంబులెన్స్, టెక్నాలజీ సేవలు కూడా.. ఈసహాయ్ ద్వారా మెడికల్ ట్యాక్సీ మాత్రమే కాకుండా మేం అంబులెన్స్‌లను అగ్రిగేట్ కూడా చేస్తున్నాం. దీన్లో స్థానిక డ్రైవర్లు తమ వాహనాలను నమోదు చేసుకోవాలి. అంబులెన్స్ బుకింగ్ ఆర్డర్ రాగానే దాన్ని స్థానికంగా అందుబాటులో ఉండే డ్రైవర్‌కు పంపిస్తాం. రోగిని సమయానికి ఆసుపత్రికి పంపించడంతో పాటూ జీపీఎస్ సహాయంతో అంబులెన్స్‌ను ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం అంబులెన్స్ ఎక్కడుంది? ఎంత సమయంలో ఆసుపత్రికి చేరతాడు? వంటి అన్ని రకాల వివరాలను ఎప్పటికప్పుడు కస్టమర్లకు చేరవేస్తాం. ప్రస్తుతం 165 మంది అంబులెన్స్ డ్రైవర్లు నమోదయ్యారు. ఇక రవాణా నిర్వహణలో.. అంబులెన్స్ ఉన్న ఆసుపత్రులకు వాటి నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి వంటి సేవలందిస్తాం. ప్రస్తుతం యశోద, ఆర్చన, సెంచురీ, కాంటినెంటల్, ఓమినీ, ఇండస్, శ్రీశ్రీ హోలిస్టిక్, శ్రీఖర, సురక్ష, అంకుర వంటి 35 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా విభాగాల్లో సేవలకు గాను 10–15 శాతం కమీషన్ తీసుకుంటాం. నెలకు రూ.10 లక్షల ఆదాయం..: ఇప్పటివరకు 20 వేల ఈసహాయ్ యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి. నెలకు 600–700 వరకు ఆర్డర్లొస్తున్నాయి. ప్రతి నెలా రూ.10 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విశాఖపట్నంలో ఈ–సహాయ్ సేవలను ప్రారంభించనున్నాం. డిసెంబర్ నాటికి కొచ్చిన్, పుణె, చెన్నై, బెంగళూరు నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం. 3 నెలల్లో రూ.25–30 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం 24 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే మరో 100 మందిని నియమించుకోనున్నాం. ఏప్రిల్‌లో ఇండియా, అమెరికాలోని కొంత మంది స్నేహితులు బృందంగా కలిసి రూ.2 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు సీడ్ రౌండ్లో రూ.25–30 కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. బెంగళూరులోని పలు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం... అని హరి వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
రఫేల్ ఫైటర్‌జెట్‌లో అనిల్ అంబానీ విహారం
యలహంక (బెంగళూరు): ఏరో ఇండియా–17 వైమానిక ప్రదర్శనలో రెండో రోజైన బుధవారం రిలయన్స్ గ్రూప్(అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ ఫ్రాన్స్‌లో తయారైన అత్యాధునిక ఫైటర్‌జెట్ రఫేల్‌లో విహరించారు. ఆ యుద్ధ విమానంలో సుమారు అర్ధగంటపాటు ఆకాశంలో దూసుకెళ్లారు. రఫేల్‌లో విహారం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని అనిల్ చెప్పారు. -
విహారం... విషాదం
• పెన్నాలో ఇద్దరు గల్లంతు • మరో ఇద్దరిని కాపాడిన ఓ యువకుడు విహారం విషాదాన్ని నింపింది... సరదా కోసం ఈతకెళ్లిన వారు తిరిగిరాని లోకానికి వెళ్లారు... జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పెన్నాలో ఇద్దరు గల్లంతయ్యారు... చెన్నూరు పరిధిలోని నదిలో మొదట ముగ్గురు మునిగిపోగా, ఇద్దరిని ఓ యువకుడు కాపాడారు.. ఒకరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు... సిద్దవటం వద్ద నదిలో ఓ యువకుడు ఈత కొడుతూ మునిగిపోయాడు. కర్నూలు నుంచి వలస వచ్చి... చెన్నూరు: పొట్టకూటి కోసం వలస వచ్చి బేల్దారి పని చేసుకుంటూ జీవించే వారికి విహారం, విందు.. వేదన మిగిలించాయి. పెన్నా నదిలో అందరూ చూస్తుండగానే ముగ్గురు మునిగిపోగా.. ఇద్దరిని ఓ యువకుడు కాపాడగా, ఒకరు గల్లంతైన సంఘటన ఆదివారం చెన్నూరు సమీపంలోని కొండపేట వంతెన వద్ద చోటు చేసుకుంది. వారి బంధువులు, ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నారుు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగరి గ్రామానికి చెందిన వడ్డె రామయ్య కుమారుడు రాముడు అలియాస్ బజారి(25) బేల్దారి పని చేస్తూ జీవించే వాడు. అతని కుటుంబంతోపాటు అదే మండలానికి చెందిన కొందరు యువకులు కడప రవీంద్రనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులోని ఏటిగడ్డ వీధిలో మస్తాన్ ఇంటి నిర్మాణాన్ని అదే మండలానికి చెందిన 12 మంది యువకులు ఇటీవల పూర్తి చేశారు. వారికి ఆదివారం మధ్యాహ్నం మస్తాన్ విందు ఏర్పాటు చేశాడు. విందు అయ్యాక అందరూ కలిసి సరదాగా పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో రాముడుతోపాటు రంగేష్, సురేష్ అనే యువకులు నది లోపలికి వెళ్లడంతో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఉన్న సురేష్‌కుమార్ ఇద్దరిని కాపాడాడు. రాముడును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వేగంగా వస్తున్న జల ప్రవాహానికి మునిగిపోరుు గల్లంతయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బందువులు సంఘటనా స్థలానికి చేరుకుకున్నారు. వారు తెలపడంతో పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఇప్పుడు సాధ్యం కాదని, సోమవారం జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు తిరిగి చేపడతామని ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపారు. రోదిస్తున్న బంధువులు, స్నేహితులు గల్లంతైన రాముడుకి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోగా భార్య జానకి(22) ప్రస్తుతం గర్భవతి. ‘కూలి పనులు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డావా నాయనా’ అంటూ తల్లిదండ్రులు, అక్క, బంధువులు, స్నేహితులు నది వద్ద రోదించడం అందరిని కలిచి వేసింది. కడప నుంచి వచ్చి.. సిద్దవటం: సిద్దవటం వద్ద ప్రవహిస్తున్న పెన్నాలో ఓ యువకుడు గల్లంతయ్యాడని ఎస్ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నారుు. కడప నగరంలోని ఇందిరా నగర్‌కు చెందిన వై.రామాంజనేయులు (22) ఆదివారం స్నేహితులతో కలిసి వచ్చి నదిలో ఈత కొట్టాడు. లోతుగా వున్న ప్రాంతంలోకి వెళ్లడంతో నీటిలో కొట్టుకు పోయాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రామాంజనేయులు ఎక్కడా కన్పించలేదని ఎస్ఐ అన్నారు. -
విహారం..విషాదం
- పెన్నా నదిలో మునిగిన ముగ్గురు యువకులు - ఇద్దరిని కాపాడిన మరో యువకుడు - ఒకరు గల్లంతు - గల్లంతైన వ్యక్తి ఆదోని వాసి చెన్నూరు : విహారం విషాదం నింపింది. పొట్టకూటి కోసం వలస వచ్చి బేల్దారి పని చేసుకుంటూ జీవించే వారికి విందు.. వేదనను మిగిల్చింది. పెన్నా నదిలో అందరూ చూస్తుండగానే ముగ్గురు మునిగిపోగా.. ఇద్దరిని ఓ యువకుడు కాపాడాడు. ఒకరు గల్లంతైన సంఘటన ఆదివారం చెన్నూరు సమీపంలోని కొండపేట వంతెన వద్ద చోటు చేసుకొంది. వారి బంధువులు, ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగేరి గ్రామానికి చెందిన వడ్డె రామయ్య కుమారుడు రాముడు అలియాస్ బజారి(25) బేల్దారి పని చేస్తూ జీవించే వాడు. అతని కుటుంబంతోపాటు అదే మండలానికి చెందిన కొందరు యువకులు కడప రవీంద్రనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులోని ఏటిగడ్డ వీధిలో మస్తాన్ ఇంటి నిర్మాణాన్ని అదే మండలానికి చెందిన 12 మంది యువకులు ఇటీవల పూర్తి చేశారు. వారికి ఆదివారం మధ్యాహ్నం మస్తాన్ విందు ఏర్పాటు చేశాడు. విందు అయ్యాక అందరూ కలిసి సరదాగా పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో రాముడుతోపాటు రంగేష్, సురేష్ అనే యువకులు నది లోపలికి వెళ్లడంతో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఉన్న సురేష్‌కుమార్ ఇద్దరిని కాపాడాడు. రాముడును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వేగంగా వస్తున్న జల ప్రవాహానికి మునిగిపోయి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బందువులు సంఘటనా స్థలానికి చేరుకుకున్నారు. వారు తెలపడంతో పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఇప్పుడు సాధ్యం కాదని, సోమవారం జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు తిరిగి చేపడతామని ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపారు. రోదిస్తున్న బంధువులు, స్నేహితులు గల్లంతైన రాముడుకి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోగా భార్య జానకి(22) ప్రస్తుతం గర్భవతి. ‘కూలి పనులు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డావా నాయనా’ అంటూ తల్లిదండ్రులు, అక్క, బంధువులు, స్నేహితులు నది వద్ద రోదించడం అందరిని కలిచి వేసింది. -
విహారయాత్రలో విషాదం
జలపాతంలో ఈతకు దిగి యువకుడి గల్లంతు గల్లంతైన యువకుడుది విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతం సరియా వద్దకు విహారయాత్రకు వచ్చిన ఆరుగురు స్నేహితులు వీరంతా విశాఖ రైల్వే స్టేషన్ ఫుడ్ కౌంటర్లో సప్లయర్లు దేవరాపల్లి: స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు సరియా జలపాతం వద్దకు విహార యాత్రకు వచ్చిన ఓ యువకుడు గురువారం సాయంత్రం ఈతకు దిగి గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి వచ్చిన ఆరిలోవకు చెందిన మురళీ(30) ఈత కొడుతూ ఊబిలో చిక్కుకున్నాడు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని జనహరి ఫుడ్స సెంటర్లో ఫుడ్ సప్లయర్లుగా పని చేస్తున్న ఆరుగురు స్నేహితులు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు బైకులపై దేవరాపల్లి మండలం వాలాబుకు, అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీకి సరిహద్దులో ఉన్న సరియా జలపాతం వద్దకు వచ్చారు. విశాఖట్నంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆదపాక సారుు, ఆవాల అనిల్ కుమార్, చన్న సారుుకుమార్, పొట్నూరు నరసింగ్, వేంపాడ ప్రసాద్‌తో పాటు ఆరిలోవకు చెందిన మురళీ కూడా వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో వెంట తెచ్చుకున్న భోజనాలు చేసి, కొద్ది సేపు జలపాతం పరిసరాలలో ఉల్లాసంగా గడిపారు. అనంతరం వీరంతా కలిసి సరదాగా ఈతకొట్టారు. అందరూ చూస్తుండగా మురళీ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసిన ఫలించలేదు. చీకటి పడే వరకు మురళీ కోసం స్థానికుల సహాయంతో గాలించిన ఆచూకీ లభించక పోవడంతో మిగిలిన యువకులంతా దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌ను గురువారం సాయంత్రం సంప్రదించారు. జలపాతం అనంతగిరి మండలం పరిధిలోకి రావడంతో అనంతగిరి పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైన మురళీకి ఏడాదిన్నర క్రితం వివాహం కాగా, బాబు కూడా ఉన్నట్టు తెలిసింది. కళ్లు ముందే తమ స్నేహితుడు గల్లంతవుతున్నా రక్షించుకోలేక మిగిలినవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
విహారయాత్రలో విషాదం
ఏకేబీఆర్ మెయిన్ కెనాల్లో పడి వ్యక్తి మృతి – పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఘటన పెద్దఅడిశర్లపల్లి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తన బంధువులతో కలిసి ఆదివారం ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు) విహారయాత్రకు వచ్చిన వ్యక్తి మెయిన్ కెనాల్లో పడి తినిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన మహమ్మద్ ఖలీల్‌ఖాన్ (41) స్థానికంగా ఉంటూ వ్యాపారం నిర్వహించేవాడు. మహమ్మద్ ఖలీల్‌ఖాన్ తన సోదరులతో కలిసి సెలవు దినం కావడంతో పీఏపల్లి మండలంలోని ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు) విహారయాత్రకు వచ్చారు. ఖలీల్‌ఖాన్ తన సోదరులతో కలిసి భోజనం చేసి స్నానం చేయడానికి ఏఎమ్మార్పీ మెయిన్ కాల్వలోకి దిగాడు. కాగా ఖలీల్‌ఖాన్ నీటిలో ఈత కొడుతూ అలిపిరి వచ్చి ఊపిరాడక మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కాల్వలోకి దూకి బయటకు తీయగా అప్పటికే ఖలీల్‌ఖాన్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకుని గుడిపల్లి ఎస్ఐ భోజ్యానాయక్, హెడ్‌కానిస్టేబుళ్లు మహమూద్, సిబ్బంది వెంకట్, జాని, హోంగార్డు సైదులుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యూకే విహారయాత్ర 10 శాతం చౌక
బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో పౌండ్ విలువ క్షీణించడం వల్లే... విహార యాత్ర కోసం యూకే వెళ్లాలనుకుంటున్నారా? అయితే తక్షణమే ప్యాకేజీ సొమ్మును పూర్తిగా చెల్లించేయండి. ఎందుకంటే... బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో రూపాయితో పౌండ్ మారకం విలువ 10 శాతం క్షీణించడంతో మీ విహార యాత్ర ఖర్చు ఆ మేరకు తగ్గనుంది. పౌండ్ విలువలో క్షీణత వల్ల ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్‌లకు హాలిడే ట్రిప్పులు 10 శాతం చౌకగా లభించనున్నాయి. ఇప్పటికే హాలిడే ప్యాకేజీలు బుక్ చేసుకొని బస, స్థానిక రవాణా, పర్యాటక ప్రదేశాల సందర్శన వంటి వాటికి ఇంకా సొమ్ము చెల్లించని వారూ చార్జీల్లో 10 శాతం మేర లబ్ధి పొందొచ్చు. ఉదాహరణకు ఏడు రోజుల యూకే ప్యాకేజీ (రూ. 1.1 లక్షలు)పై రూ. 5 వేల నుంచి రూ. 6 వేలు, 10 రోజుల ప్యాకేజీ (రూ. 1.44 లక్షలు)పై రూ. 7 వేల నుంచి రూ. 8 వేలు తగ్గనుంది. -
విషాదం నింపిన విహార యాత్ర
- ఏలూరు సమీపంలో లారీని ఢీకొట్టిన వ్యాన్ - హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది దంపతుల దుర్మరణం.. 15 మందికి గాయాలు ఏలూరు అర్బన్: విహార యాత్ర విషాదంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం దెందులూరు చెక్‌పోస్ట్ వద్ద శనివారం వేకువజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లో స్థిరపడిన న్యాయవాది కందుకూరి హరిప్రసాద్ (49), ఆయన భార్య గీతాభవాని (42) అక్కడిక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డ వరంగల్ జిల్లా జనగాంకి చెందిన కందుకూరి హరిప్రసాద్ తల్లి సావిత్రమ్మ, భార్య గీతాభవాని, కుమారులు హరిదీప్, రాహుల్ కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి జనగాంలో ఉంటున్న ఆయన తమ్ముడు నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి నాగేశ్వరరావు, ఆయన భార్య విమల, వారి ముగ్గురు కుమార్తెలు కీర్తి, నిధి, సిరి, మేనమామ షణ్ముఖాచారి, కుమారుడు ఎం.శ్రీకాంత్, భార్య శ్రీలత, వారి పిల్లలు సూర్యతేజ, శివరామ్తేజ, వారి సమీప బంధువు అరుణతో కలిసి శుక్రవారం రాత్రి టాటా వింగర్ వ్యాన్‌లో అరకు లోయ బయలుదేరారు. శనివారం వేకువజామున ఏలూరులో దెందులూరులోని చెక్ పోస్ట్ ప్రాంతంలో ముందు వెళుతున్న లారీని వ్యాన్ డ్రైవర్ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వ్యాన్ అదుపుతప్పి లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న హరిప్రసాద్, ఆయన భార్య గీతా భవాని అక్కడికక్కడే మృత్యువాతపడగా, డ్రైవర్ గుడ్లపల్లి నరేష్ సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. -
స్వర్గం నుంచి దిగి వచ్చి'నది'!
విహారం ‘భవబంధాలకు దూరంగా ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్న మునిపుంగవుడిలా ఉంటుంది’ ‘ప్రకృతిలో చలనమే కాదు చిత్రలేఖనం కూడా అంతర్లీనమై ఉంది అని చెప్పడానికి ఇదో ఉదాహరణ’ ‘ఇంద్రధనసులు ఆకాశంలోనే కాదు...నదిలో కూడా కనిపిస్తాయి’ ‘స్వర్గం నుంచి దిగి వచ్చిన నది’ ‘కానో క్రిస్టేల్స్’ నది గురించి ఇలా భావుకతతోనో, కవితాత్మకంగానో చెబుతుంటారు పర్యాటకులు. ‘మోస్ట్ బ్యూటిఫుల్ రివర్ ఇన్ ది వరల్డ్’గా ప్రఖ్యాతిగాంచిన ‘కానో క్రిస్టేల్స్’ నది కొలంబియాలోని సెరనియ దె లా మకరెనా పర్వత శ్రేణుల మధ్యలో ఉంది. జూలై, నవంబర్ మాసాల మధ్యలో ప్రకృతిదేవత తన కుంచెతో చిత్రాలు గీస్తుందని, దాని ఫలితమే కానో క్రిస్టేల్స్ నది, దాని పరిసర ప్రాంతాల అందమనే నమ్మకం ఉంది. ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలి, ఎరుపు, నలుపు వర్ణాలతో ఈ నది పంచరంగుల నది అని పేరు తెచ్చుకుంది. ఈ ప్రకృతి వర్ణమాల అనేది యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదని, ఆ రంగుల వెనుక పరమార్థం ఉందని తాత్వికకోణాన్ని జోడించేవారు కూడా ఉన్నారు. పసుపు రంగు....ఆనందం, ఆశావాదదృక్పథాన్ని, ఆకుపచ్చ రంగు...సమన్వయ శక్తి, సామరస్య దృష్టిని, నీలిరంగు... నిజాయితీ, నమ్మకాలను, నలుపురంగు... శక్తి, నియంత్రణను,ఎరుపు రంగు... నాయకత్వ లక్షణాలు, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందనే తాత్విక అర్థం ఉంది. ప్రకృతి ఆరాధకులు అందమైన ప్రకృతి చిత్రాలను మాత్రమే చూసి ఆనందించగా, కొందరు మాత్రం ఈ పంచరంగుల నదిని వీక్షించడం వల్ల ఆ రంగులలోని సానుకూల అంశాలు, శక్తులు తమలో వచ్చి చేరుతాయని విశ్వసిస్తారు. నది గర్భంలో పెరిగే మకెరేనియ క్లవిగేరాలాంటి తాజా నీటి మొక్కల వల్లే నది పంచరంగుల్లో కనిపిస్తుంది. సూర్యకాంతి ప్రకారం కూడా నదీ రంగుల అందాలు మారుతుంటాయి. కొలంబియన్ జర్నలిస్ట్, అన్వేషకుడు ఆండ్రూ హుర్టాడో గార్షియా ఈ పంచరంగుల నది సౌందర్యాన్ని గురించి ప్రపంచానికి మొట్ట మొదటిసారిగా పరిచయం చేశాడు. పర్యావరణ రక్షణ చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా ఈ నది 2009 వరకు ‘నో-గో ఏరియా’గా ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతం కొలంబియా మిలటరీ అధీనంలో ఉంది. ఈ నది పుణ్యమా అని లా మకరెనా నేషనల్ అండ్ ఎకోలాజికల్ రిజర్వ్ పార్క్ కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ నది దగ్గరికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. చిన్నదైన లా మకరెనా విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నడిచికాని, గుర్రం మీదకాని నది సమీపానికి చేరాల్సి ఉంటుంది. ‘‘ఇది నదే అని నమ్మడానికి చాలాసేపు పడుతుంది’’ అంటాడు ఒక పర్యాటకుడు ఆశ్చర్యంగా. రంగుల విచిత్రాలు మాత్రమే కాదు...ప్రాచీన శిలల గంభీర మౌనం, సరిగమల జలపాత సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ‘‘అక్కడి నుంచి బయటి రాగానే ఒక అందమైన కల నుంచి మేలుకున్నట్లుగా అనిపిస్తుంది తప్ప వాస్తవదృశ్యాలను దర్శించినట్లు అనిపించదు. మడుగులు, గుహలు నాటకీయంగా కనిపిస్తాయి’’ అని కానో క్రిస్టేల్స్ గురించి చెబుతాడు బ్రిటన్ రచయిత టామ్ హాల్. రకరకాల కారణాల రీత్యా ‘మీ భద్రతకు మా పూచీ లేదు’ అని ఈ ప్రాంతాన్ని కొలంబియా ప్రభుత్వం ‘రెడ్ జోన్’గా ప్రకటించింది. అయినప్పటికీ ఈ పంచరంగుల నదిని చూడడానికి పర్యాటకులు ఉత్సాహపడుతూనే ఉన్నారు. అక్కడి ఊహలతో గుసగుసలాడుతూనే ఉన్నారు. -
అదృష్ట ఆలయం!
విహారం దేశాలకు రాజధాని ఉండడం తెలుసు, రాష్ట్రాలకు రాజధాని ఉండడం తెలుసు. మరి బొమ్మలకు రాజధాని ఉంటుందనే విషయం తెలుసా? టకసాకి సిటీ గురించి తెలిసినవాళ్లు ‘ఉంటుంది’ అంటారు. జపాన్‌లోని క్యోటోకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న టకసాకీని ‘దరుమా బొమ్మల రాజధాని’ అని పిలుస్తారు. ఈ సిటీలో ఉన్న షోరింజన్ దరుమా ఆలయంలో దరుమ బొమ్మలను ఉంచితే ‘అదృష్టం’ వరిస్తుందనే బలమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకం నిన్నా మొన్నటిది కాదు... కొన్ని శతాబ్దాల నాటిది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు రకరకాల ఆకారాల్లో ఉన్న దరుమా బొమ్మలను ఈ ఆలయంలో పెడతారు. జపాన్ సంస్కృతిలో బొమ్మలు వినోదానికి మాత్రమే కాదు... రకరకాల సెంటిమెంట్లకు ప్రాముఖ్యం పొందాయి. వీటిలో ముఖ్యమైనవి... కోకేషి, హకట, దరుమా బొమ్మలు. చెక్కతో తయారు చేసిన కోకెషి, మట్టితో తయారుచేసిన హకటల కంటే ఎరుపురంగు దరుమా బొమ్మలపై ఎక్కువ సెంటిమెంట్ ఉంది. ఈ బొమ్మలపై తమ కోరికను రాయడం ఆనవాయితీగా వస్తుంది. ఒకవేళ కోరిక ఫలిస్తే మరో బొమ్మను కూడా ఇదే ఆలయంలో పెట్టాల్సి ఉంటుంది. సంవత్సరాంతంలో ఇలా పోగైన బొమ్మలను గుట్టలుగా పేర్చి కాల్చి వేస్తారు. కాల్చే ముందు ఆ బొమ్మలకు కృతజ్ఞత తెలియజేస్తారు. ఈ తంతుని ‘దరుమ క్యో’ అంటారు. టకసాకిలో ఇతర పర్యాటక ఆకర్షణలు లేకపోలేదు. 1597లో నిర్మించిన టకసాకి క్యాజిల్ చరిత్రను కళ్ల ముందు ఉంచుతుంది. టకసాకి స్టేషన్ నుంచి 90 నిమిషాలు ప్రయాణిస్తే హరున సరస్సు కనిపిస్తుంది. దీన్ని ఆనుకొని ఉంటుంది మౌంట్ హరున. ఆ సరస్సు, ఈ పర్వతాల సౌందర్యం ఒక ఛాయా చిత్రాన్ని తలపి స్తుంది. జపాన్ చక్రవర్తి యోమై సమాధిని కూడా ఎక్కువ మంది సందర్శిస్తారు. మినోవా క్యాజిల్, ‘ద మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్’... మొదలైనవి కూడా పర్యాటక ప్రాముఖ్యాన్ని సంతరించు కున్నప్పటికీ వీటన్నికంటే పర్యాటకులు షోరింజన్ దరుమా ఆలయానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దరుమా బొమ్మలను ‘ధర్మ బొమ్మలు’ అని కూడా పిలుస్తారు. ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి బోధిధర్మ చెప్పిన సిద్ధాంతాలకు, మనుషులు నమ్మే అదృష్టానికి ఈ బొమ్మలు ప్రాతినిధ్యం వహిస్తాయని చెబుతారు. ఈ బొమ్మలు బోధిధర్మ ముఖాన్ని పోలి ఉంటాయి. బోధిధర్మ తొమ్మిదేళ్ల పాటు ఒక చెట్టు కింద ధ్యానం చేశాడని, నిద్ర రాకుండా కనురెప్పలను కోసుకున్నాడని... ఇలా రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. బోధిధర్మ బొమ్మలకు, అదృష్టానికి ఉన్న సంబంధం గురించి వివరించే ప్రత్యేక కథలు లేనప్పటికీ... బోధిధర్మ పేరు మీద బొమ్మను పెడితే అదృష్టం వరిస్తుందనే నమ్మకం పెరిగిపోయింది. కొందరైతే అదృష్ట దురదృష్టాల గురించి చెప్పిన జెన్ కథలను కూడా ప్రస్తావిస్తుంటారు. ఉదా: ఒక రైతు దగ్గర ఒక బలహీనమైన గుర్రమొకటి ఉండేది. ఒకరోజు దాన్ని చూసి జాలి పడిన రైతు దానికి స్వేచ్ఛను ఇస్తూ అడవిలో వదిలి పెట్డాడు. ‘‘ఉన్న ఒక్క గుర్రాన్నీ వదులు కున్నావు... నీలాంటి దురదృష్టవంతుణ్ని మేం చూడలేదు’’ అన్నారు పొరుగువారు. అడవిలోకి వెళ్లిన గుర్రం వారం రోజుల తరువాత వెనక్కి వచ్చింది. వస్తూ వస్తూ తనతో పాటు పన్నెండు గట్టి గుర్రాలను తీసుకువచ్చింది. ‘‘నీలాంటి అదృష్టవం తుడు లేరు’’ అన్నారు. ఆ గుర్రాల్లో ఒక గుర్రం మీద స్వారీ చేయబోయి చేయి విరగొట్టుకున్నాడు రైతు కొడుకు. ‘దుర దృష్టం’ అన్నారు. ఆకస్మికంగా వచ్చిన యుద్దం కోసం రాజ్యంలోని యువకు లందరినీ సైన్యంలో చేర్చమని రాజు ఆజ్ఞాపించాడు. చేయి విరగడంతో రైతు కొడుక్కీ సైన్యంలో చేరే బాధ తప్పింది. ‘అదృష్టం’ అన్నారు పొరుగువాళ్లు. ఈ కథను ఉదహరిస్తూ ‘అదృష్ట దురదృష్టాలు అనేవి శాశ్వతం కానప్పుడు... అదృష్టం కోసం టకసాకికి వెళ్లడం దేనికి?’ అని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. వారి ప్రశ్నలు, వాదనలు అందులోని హేతువు సంగతి ఎలా ఉన్నా.. షోరింజన్ అలయా నికి వెళితే అదృష్టం వరిస్తుందన్న నమ్మకం పెరుగుతోందే తప్ప తరగట్లేదు. -
పునరుత్తేజ దర్శనం!
విహారం గతంలోనే పాతుకుపోవడం కంటే, భవిష్యత్ గురించి కలలు కనడం కంటే, వర్తమానం మీదే దృష్టిని కేంద్రీకరించమని చెబుతుంది బౌద్ధం. బౌద్ధాన్ని అభిమానించి ఆరాధించే ఆరిస్ట్ కోసిట్‌పిపాట్ కూడా అంతే. థాయిలాండ్‌లోని చైయింగ్రాయి ప్రావిన్స్‌లో శిథిలావస్థలో ఉన్న ప్రాచీనమైన వాట్ రోంగ్ ఖున్ బౌద్ధ ఆలయాన్ని చూసినప్పుడు... ఆయన హృదయం కదిలిపోయింది. ‘మళ్లీ ఈ బౌద్ధ ఆలయంలో కళ కనిపించాలి’ అనుకున్నాడు. ‘ఈ ఆలయానికి ఏమైంది?’ అని నిట్టూరుస్తూ కూర్చోలేదు. ‘ఇలా చేయాలి... అలా చేయాలి’ అని కలలు కనలేదు. వర్తమానంలోనే ఉన్నాడు. వర్తమానం గురించే ఆలోచించాడు. తన వంతుగా ఎంత చేయగలను, ఏమి చేయలగలను? అంటూ స్పష్టమైన అంచనా వేసుకున్నాడు. ఆలయ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా తానే భరించాలని నిర్ణయించుకున్నాడు. ‘కొందరు ప్రయాణమే మొదలు పెట్టరు. కొందరు మజిలీ చేరుకోకుండానే ప్రయాణాన్ని అర్ధంతరంగా ఆపేస్తారు’ అంటూ బౌద్ధం చెప్పిన సూక్తిని మరోసారి గుర్తు చేసుకున్నాడు కోసిట్‌పిపాట్. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, స్వయంగా తానే డిజైన్ చేసి మరీ ఈ ఆలయాన్ని నిర్మించాడు కోసిట్‌పిపాట్. ‘వైట్ టెంపుల్’ పేరుతో ప్రసిద్ధమైన ఈ ఆలయం ఆవరణలో మెడిటేషన్ హాల్, ఆర్ట్ గాల్యరీ, బౌద్ధ సన్యాసుల క్వార్టర్స్‌తో సహా తొమ్మిది భవంతులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులలో కొందరు నిర్మాణ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వస్తారు. కొందరు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి వస్తారు. కొందరు బౌద్ధాన్ని గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వస్తారు. ఇదంతా ఒక ఎత్తయితే... నమ్మకాల పరంగా కూడా ఈ వైట్ టెంపుల్‌కు ప్రాముఖ్యత ఉంది. ఆలయ ఆవరణలో ఒక చిన్న సరస్సు ముందు వందల సంఖ్యలో చేతుల శిల్పాలు కనిపిస్తాయి. మనిషిలోని అంతులేని కోరికలకు ఈ చేతులు ప్రతీకలు. ‘కోరికలే దుఃఖానికి మూలం’ అని బౌద్ధం చెబుతుంది కదా! అలా ఒక చిన్న సరస్సుపై ఉన్న బ్రిడ్జి మీది నుంచి నడిచి వెళితే... మనలోని దురాశ, స్వార్థం, అహంకారం అన్నీ దూరం అవుతాయని, తద్వారా శాంతి చేకూరుతుందని ఒక నమ్మకం. అలాగే బ్రిడ్జి దాటగానే కనిపించే కిన్నారి విగ్రహాన్ని దర్శించడాన్ని ఎంతో శుభసూచకంగా భావిస్తారు. బౌద్ధపురాణంలో ఈ కిన్నారి ప్రస్తావన కనిపిస్తుంది. మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి సగం మనిషి, సగం పక్షి రూపంలో ఉన్న కిన్నారి హిమాలయాల నుంచి వస్తుందని ఒక నమ్మకం. ఇక్కడ ఉన్న గోల్డెన్ బిల్డింగ్‌ను దర్శించడం కూడా ఒక అందమైన కట్టడాన్ని దర్శించడం కాదు. ఆ భవనం నుంచి ఎన్నో తాత్విక విషయాలు మనసుకు అందుతుంటాయి. మనిషి జ్ఞానం కోసం కాకుండా ధనం, కోరికలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్న వైనాన్ని ఈ భవంతి గుర్తుకు తెస్తూ భౌతిక సుఖాల వెంట పరుగులు తీయవద్దని హితబోధ చేస్తుంది. ఇక్కడ కనిపించే అద్దాలు మన ఆత్మదర్శనాన్ని, పుర్రె, రాక్షసుడి తల... మొదలైనవి మనిషికి ఎదురయ్యే సమస్యలను, కష్టాలను ప్రతీకాత్మకంగా చెబుతుంటాయి. కేవలం బౌద్ధ పురాణ ప్రతీకలు మాత్రమే కాదు... మైకేల్ జాక్సన్ నుంచి హ్యారీ పాటర్ వరకు ఎన్నో చిత్రాలు దర్శనమిస్తాయి. మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నాం అనేది ఇవి ప్రతీకాత్మకంగా చెబుతాయట! థాయిలాండ్‌లో ఉన్న 33,000 బౌద్ధ ఆలయాల్లో ఈ వైట్ టైంపుల్ కూడా ఒకటి కావచ్చు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే... నోరు మౌనంగా ఉండొచ్చేమో గానీ... మది బౌద్ధం వెలుగులో విరామమెరుగక ప్రయాణిస్తూనే ఉంటుంది! -
పసుపు పచ్చని రోడ్డు తోడుంటే...
విహారం ‘‘అక్కడ ఏయే ప్రదేశాలు చూసి వచ్చారు?’’ అని ఒకప్పుడు నెదర్లాండ్స్‌కు వెళ్లి వచ్చిన పర్యాటకులను అడిగితే.... వైబ్రెంట్ క్యాపిటల్ ‘ఆమ్స్టర్డమ్’ గురించి... అక్కడ ఉన్న గొప్ప చారిత్రక ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియమ్ల గురించి చెప్పేవారు. అంతేనా? టులిప్ పువ్వుల గురించి కూడా. టులిప్ పుష్పాలను చూడాలంటే నెదర్లాండ్సలోనే చూడాలి అంటుంటారు. ‘ద గార్డెన్ ఆఫ్ యూరప్’గా పేరున్న లిస్సే నగరంలోని కెకెన్హాప్ గార్డెన్ గురించి మాత్రమే కాదు... హాగే నేషనల్ పార్క్ గురించి కూడా ప్రత్యేకంగా చెబుతుం టారు. 13,800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి స్కీడామ్ మాటేమిటి! అసలింతకీ అదేమిటి అంటారా? ‘బీద నగరం’ అంటే చప్పున గుర్తుపడతారేమో! నెదర్లాండ్‌సలోని స్కీడామ్ నగరంలో చారిత్రాత్మకమైన కాలువలు, ప్రపంచం లోనే ఎత్తై గాలిమరలు తదితర ఆకర్షణలు ఉన్నప్పటికీ... పర్యాటకుల దృష్టిలోకి ఈ నగరం ఎప్పడూ వెళ్లలేదు. కానీ ఇప్పుడు మాత్రం నెదర్లాండ్‌సకు వచ్చే పర్యాటకులు స్కీడామ్ గురించి తప్పని సరిగా ఆరా తీస్తున్నారు. దీనికి కారణం.... ఎల్లో బ్రిక్ రోడ్డు! స్కీడామ్లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఎల్లో రోడ్ రూపు దిద్దుకుంది. పసుపురంగు సంతోషానికి, సేఫ్టీకి, సక్సెస్‌కి చిహ్నాలుగా అక్కడ భావిస్తారట. అందువల్లే ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే... పనిలో విజయం సిద్ధిస్తుందని, ఐశ్వర్యం ఇంటి తలుపు తడుతుందని బలంగా నమ్ముతారు స్కీడామ్ వాసులు. ఇది ఎంత వరకు నిజమో తెలియదుగానీ ‘ఎల్లో బ్రిక్ రోడ్డు’ పుణ్యమా అని ఎవరూ పట్టించు కోని స్కీడామ్పై నేడు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ‘‘ఎప్పుడూ మా నగరం ముఖం చూడనివాళ్లు కూడా ఇక్కడికి పదే పదే వస్తూండటం నాకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’’ అంటున్నాడు స్కీడామ్ నివాసి రోనాల్డ్. ‘‘నెదర్లాండ్‌సలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు ఈ స్కీడామ్ గురించి చెప్పాడు. ఆసక్తితో అక్కడికి వెళ్లాను. నా ప్రేమ ఫలించాలని మనసులో అనుకుంటూ ఎల్లో రోడ్డు మీద ప్రయాణిం చాను. ఏదో సరదా కోసం చేసిన పని ఇది. కానీ చిత్రమేమిటంటే కొద్ది కాలంలోనే నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి జరిగిపోయింది’’ అంటున్నాడు యువ ఆస్ట్రేలియన్ ఇంజినీర్ హ్యారిసన్. ‘ఎల్లో బ్రిక్ రోడ్డు మీద ప్రయాణిం చడం వల్ల మంచి జరుగుతుంది’ అనే ప్రచారాన్ని ఖండిస్తున్నవారు కూడా లేక పోలేదు. అయితే వారి ఖండన మండనల మాట ఎలా ఉన్నా....‘ఇదేదో వింత రోడ్డు’ అనుకునేవాళ్లు, ‘ఒక ప్రయత్నం చేద్దాం’ అనుకునేవాళ్లు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఈ పసుపు పచ్చని రోడ్డు మీద ప్రయాణించి తమ సరదాను తీర్చుకుంటున్నారు. అమెరికన్ రచయిత ఎల్.ఫ్రాంక్ బామ్ రాసిన ‘ద వండర్ఫుల్ విజార్డ్ ఆఫ్ ఓజ్’ నవల చాలా ప్రాచుర్యం పొందింది. 1900 సంవత్సరంలో విడుదలైన ఈ పుస్తకం పాఠక ఆదరణ చూరగొనడమే కాదు... అమెరికన్ పాపులర్ కల్చర్‌లో భాగమై పోయింది. ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో 1939లో హాలీవుడ్లో కామెడీ-డ్రామా ఫాంటసీ సినిమా రూపుదిద్దుకుంది. ‘ద విజార్డ్’లో ఎల్లో బ్రిక్ రోడ్డు ఒక ముఖ్య ఆకర్షణ. కాలక్రమంలో ఈ రోడ్డు నవలలో నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది. రెస్టారెంట్ల నుంచి ప్రచురణ సంస్థల వరకు ‘ఎల్లో బ్రిక్ రోడ్’ పేరును వాడుకున్నాయి. స్కీడామ్లోని పసుపు పచ్చని రోడ్డుకు ‘ఎల్లో బ్రిక్ రోడ్’ అని పేరు పెట్టింది కూడా అందుకే అని చెబుతుంటారు. -
విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు క్షేమం
ఆదిలాబాద్ : విహార యాత్రకు వెళ్లిన తమ పిల్లల ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ఓ ప్రయివేట్ స్కూలుకు చెందిన 52మంది విద్యార్థులు ఈనెల 6వ తేదీన విహార యాత్రకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. కాగా గత రాత్రి విద్యార్థులు ఎక్కాల్సిన ట్రయిన్ మిస్ కావడంతో వారి ఆచూకీ కొద్దిసేపు తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లల ఆచూకీ తెలిపాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఎట్టకేలకు తాము క్షేమం అంటూ విద్యార్థుల నుంచి ఫోన్ కాల్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. -
బడి గంట గణగణ
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం బడిబాట పట్టనున్న 10 లక్షల మంది విద్యార్థులు సర్కారు స్కూళ్లకు సమస్యలతో స్వాగతం సిటీబ్యూరో:ఇన్నాళ్లూ ఆటపాటలు, విహార యాత్రలతో గడిపిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. దాదాపు ఒకటిన్నర నెలల తరువాత పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.జంట జిల్లాల్లో సుమారు ఐదువేల పాఠశాలలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు తమ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, బ్యాగ్‌ల వంటివి కొనుగోలులో తల్లిదండ్రులు తలమునకలవుతున్నారు. మరోవైపు పెరిగిన ఫీజులు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి. సమస్యల లోగిళ్లు... హైదరాబాద్ జిల్లాలో 712, రంగారెడ్డి జిల్లాలో రెండు వేలకుపైగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సౌకర్యాలు లేవు. మరికొన్ని చోట్ల ఈ సౌకర్యాలు ఉన్నా... నీరు లేకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. ఇంకొన్ని చోట్ల మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చాలా పాఠశాలలకు ప్రహరీలు లేవు. వేసవిలో ఈ పనులు చేపట్టాల్సి ఉండగా.. పూర్తి స్థాయిలో జరుగలేదు. ఇక తాగునీటికి నోచుకోని స్కూళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. పారిశుద్ధ్యానిదీ అదే పరిస్థితి. ఈ క్రమంలో నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థులకు ఎప్పటిలాగానేసమస్యలు స్వాగతం పలకనున్నాయి. పూర్తిగా రాని పుస్తకాలు ఈ విద్యా సంవ త్సరానికి హైదరాబాద్ జిల్లాకు 12.33 లక్షలు, రంగారెడ్డి అర్బన్ మండలాలకు 10.39 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం. ప్రస్తుతం 19.85 లక్షల పుస్తకాలు మాత్రమే రామంతాపూర్‌లోని జిల్లా ప్రభుత్వ సేల్స్ మేనేజర్ కార్యాలయానికి చేరుకున్నాయి. గోదాం నుంచి ఇప్పటి వరకు 17.30 లక్షల పుస్తకాలను ఎంఆర్సీ కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని స్కూళ్లకు చేరాయని మండల విద్యా శాఖాధికారులు వెల్లడించారు. మరో 2.55 లక్షల పుస్తకాలు గోదాంలోనే మగ్గుతున్నాయి. అన్ని తరగతులకు సంబంధించినవి పూర్తి స్థాయిలో రాకపోవడంతో అక్కడే ఉంచేసినట్టు తెలుస్తోంది. అప్పటి వరకు విద్యార్థులు అరకొర పుస్తకాలతోనే కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి దాపురించింది. మిగిలిన పుస్తకాలు జిల్లాకు చేరుకోవడానికి మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. మరింత ప్రణాళికాబద్ధంగా.. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్‌లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పిల్లలు చదువుపై అధిక శ్రద్ధ పెట్టేలా కౌన్సెలింగ్ చేస్తామన్నారు. 90శాతానికి పైగా పుస్తకాలు బడులకు చేరాయని తెలుగు, ఉర్దూ మీడియానికి సంబంధించి మరికొన్ని రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వ రకు వచ్చిన పుస్తకాలను పాఠశాలలు పున:ప్రారంభం రోజునే విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. మిగిలినవి మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని, రాగానే వాటినీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. -
విషాద యాత్ర
విహార యాత్రకు వెళ్లి ఏడుగురు మృతి మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు మరో ఇద్దరు బంధువులు మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్లు మండలంలో ఘటన చాంద్రాయణగుట్ట: విహార యాత్ర విషాదాంతం కావడంతో పాతబస్తీలో విషాదం నెలకొంది. విహారయాత్ర కోసం వెళ్లిన వారిని చెరువు రూపంలో మత్యువు కబళించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఇద్దరు బంధువులు మృతి చెందడంతో చాంద్రాయణగుట్ట అల్ జుబేల్ కాలనీ, ఘాజీమిల్లత్ కాలనీ, హషమాబాద్లలో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. అల్ జుబేల్ కాలనీకి చెందిన అహ్మద్ బేగ్ అలియాస్ బాబు బాయి ఉస్మానియా మార్చురీలో పని చేస్తున్నాడు. బుధవారం అతను కుటుంబ సభ్యులతో కలిసి ఆమనగల్లు మండల పరిధిలోని సరికొండ గౌరమ్మ చెరువుకు విహార యాత్రకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో బేగ్ ఇద్దరు కుమారులు సల్మాన్ (30), రహెమాన్ (19), కుమార్తె రొఖియా బేగం(18), కోడలు మోనా సుల్తానా (20), అల్లుడు షేక్ బాసిత్ (30), హషమాబాద్‌కు చెం దిన బంధువుల అమ్మాయి ముస్రత్ ఫాతీమా (19), వట్టేపల్లికి చెందిన ముస్కాన్ (18)లతో కలిసి మొత్తం 13 మంది రెండు వాహనాల్లో సరిగొండ గౌరమ్మ చెరువుకు వెళ్లారు. అయితే వీరిలో ఒకరు చెరువులోకి దిగుతుండగా అందులో పడి పోవడంతో వారిని కాపాడే క్రమంలో ఒకరి తరువాత ఒకరు మొత్తం ఏడు మంది చెరువులో దిగి మృతి చెందారు. దీనిపై సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం గురువారం నగరానికి తీసుకురానున్నట్లు తెలిసింది. బేగ్ కుటుంబంలో ఐదుగురు.. కాగా ఈ ఘటనలో అహ్మద్ బేగ్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం స్థానికులను కలచివేస్తోంది. బేగ్ ఇద్దరు కుమారులతో పాటు కోడలు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. చిన్న కుమార్తె రొఖియా బేగం మృతి చెందగా, పెద్ద కుమార్తె అస్మా బేగం భర్త బాసిత్ అసువులు బాసాడు. దీంతో ఆ కుటుంబంలో బేగ్ దంపతులతో పాటు పెద్ద కుమార్తె ఒక్కరే మిగి లారు. విదేశాలకు వెళ్లిన బేగ్ భార్య గురువారం హైదరాబాద్‌కు తిరిగిరానున్నట్లు బంధువులు తెలిపారు. పెళ్లయిన 4నెలలకే.. మృతుల్లో ఒకరైన మోనా బేగం అలియాస్ మోనా సుల్తానాకు అహ్మద్ బేగ్ కుమారుడు సల్మాన్‌తో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. కాగా సల్మాన్, మోనాలిద్దరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో మోనా కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 3నెలల క్రితమే రొఖియా బేగంకు నిశ్చితార్థం అహ్మద్ బేగ్ చిన్న కుమార్తె రొఖియా బేగంకు మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసుకుంటూ ఇరు కుటుంబాలు ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రొఖియా బేగం ఈ ప్రమాదంలో మృతి చెందడంతో వరుడి కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆరుగురు క్షేమం మొత్తం 13మంది విహారానికి వెళ్లగా అందులో ఆరుగురు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుం చి బయటపడిన వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. ఒకరిని కాపాడేందుకు ఒకరు చెరువులోకి వెళ్లి మరణించగా.. వీరు పిల్లలు, వృద్ధులు కావడంతో వారిని కాపాడే ప్రయత్నం చేయలేక పోయారు. దీంతో వారు ప్రమాదంలో చిక్కుకోలేదు. నగరానికి చేరుకున్న మృతదేహాలు... కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో పోస్టు మార్టమ్ నిర్వహించిన అనంతరం ఏడుగురి మృతదేహాలను బుధవారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలోని హషామాబాద్, ఆల్బుబేర్కాలనీ, జీఎం కాలనీలలోని వారి నివాసాలకు తరలించారు. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, మజ్లిస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్దండ: ఆమనగల్లు మండలం చరికొండ గౌరమ్మ చెరువులో పడి మృతి చెందిన ఏడు మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ శ్రీదేవితో పాటు ప్రజాప్రతినిధులు మృతదేహలను పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. మృతుల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెప్పారు. పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రహ్మాన్ అహ్మద్ బేగ్ చిన్న కుమారుడు పదో తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. బుధవారం జరిగిన ప్రమాదంలో రహ్మాన్ మృతి చెందినట్లు తెలుసుకున్న అతని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటలోనే మృతి చెందిన హషమాబాద్‌కు చెందిన ముస్రత్ ఫాతీమా ఇంటర్ పరీక్షలు రాసింది. మరో మృతురాలు ముస్కాన్ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటున్నందున ఆమె అహ్మద్ బేగ్ ఇంటిలోనే ఆశ్రయం పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
విహార యాత్రలో విద్యార్థిని మృతి
భీమ్‌గల్: విహార యాత్ర విషాదం నింపింది. భీమ్‌గల్ మండలంలోని బాచన్పల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆకుల నిఖిత(15) పాఠశాల నుంచి వెళ్లిన విహార యాత్రలో మృతి చెందింది. వివరాల్లోకెలితే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులను సంక్రాతి సెలవుల్లో విహార యాత్రకు తీసుకువెళ్లారు. సుమారు 50 మంది విద్యార్థులను 7 గురు ఉపాధ్యాయుల సంరక్షణలో ప్రయివేటు టూరిస్టు బస్సులో శనివారం బయలుదేరి వెళ్లారు. ఆదివారం తమిళనాడులోని వేలూరుకు సమీపంలో వయాఅంబాడి గ్రామ సమీపంలో నిఖిత అస్వస్థతకు గురైంది. పాఠశాల సిబ్బంది స్థానికంగా వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. చికిత్స అనంతరం కొద్దిగా ఆరోగ్యం కుదుటపడిందన్నారు. తెల్లవారు జామున మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైందని, ఫిట్స్ రాగా వేలూర్‌లోని వైద్యకళాశాలకు తరలించామన్నారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు తెలిపారన్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
విషాదం నింపిన విహారయాత్ర
⇒జీపును ఢీకొన్న కంటైనర్ వాహనం: నలుగురి దుర్మరణం ⇒మృతుల్లో ముగ్గురు మహిళలు,కంటైనర్ డ్రైవర్ ⇒ హైదరాబాద్‌ను సందర్శించి కర్ణాటక వెళ్తుండగా ప్రమాదం ⇒శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ వద్ద ఘటన శంషాబాద్ రూరల్: వారంతా ఒకే గ్రామానికి చెందిన బంధువులు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా హైదరాబాద్‌కు విహారయాత్రకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మధుర స్మృతులు నెమరువేసుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే వారిపై మృత్యువు పంజా విసిరింది. వారు ప్రయాణిస్తున్న జీపును కంటైనర్ వాహనం రూపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న ముగ్గురు మహిళలతో పాటు కంటైనర్ డ్రైవర్ దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ప్రాంతంలోని ఫర్తాబాద్కు చెందిన రాజశేఖర్‌కు తన సొంత జీపును నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బంధువులు 12 మంది ఆదివారం ఉదయం 7 గంటలకు విహారయాత్ర నిమిత్తం హైదరాబాద్‌కు బయలుదేరారు. సాయంత్రం వరకు చార్మినార్, బిర్లా మందిర్ తిలకించారు. రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూసేందుకు వచ్చారు. అక్కడే రాత్రి 12 గంటల వరకు సరదాగా గడిపారు. మరోమార్గంలో వెళ్తూ.. ఉదయం హైదరాబాద్ కు వీరు బీజాపూర్ మార్గంలో చేవెళ్ల మీదుగా వచ్చారు. శంషాబాద్ నుంచి షాద్‌నగర్-పరిగి దారిలో కర్ణాటక వెళ్లొచ్చని ఎయిర్‌పోర్ట్‌లో ఓ డ్రైవర్ వీరికి చెప్పాడు. దీంతో వారు బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఘాంసిమియాగూడకు చేరుకున్నారు. చీకటి కావడంతో జీపు డ్రైవర్ రాజశేఖర్ దారి తప్పినట్లు భావించాడు. దీంతో ఘాంసిమియాగూడ వద్ద బస్టాప్ వద్ద యూటర్న్ తీసుకుని అక్కడ ఉన్న ఓ హోటల్లో దారి గురించి వాకబు చేద్దామని జీపును రోడ్డు పక్కన నిలిపాడు. ఇదే సమయంలో షాద్‌నగర్ నుంచి బైక్‌ల లోడుతో శంషాబాద్ వైపు వస్తున్న ఓ కంటైనర్ వాహనం వీరి జీపును వెనక నుంచి ఢీకొంది. ప్రమాద తీవ్రతకు జీపు వెనక వైపు డోరు ఊడిపోయింది. కంటైనర్ జీపును సుమారు వంద అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత జీపు రోడ్డు అవతలి వైపు ఉన్న గుంతలో పడిపోగా కంటైనర్ ప్రమాద స్థలం నుంచి సుమారు 250 అడుగుల వరకు డివైడర్ మీదుగా వెళ్లి అదుపుత ప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ సంఘటనతో జీపులో ఉన్న వారు తీవ్రగాయాలతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తోడికోడళ్లు మృతి.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జీపు వెనక వైపు కూర్చున్న గీత(29)కు తీవ్రగాయాలవడంతో శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈమె తోడికోడలు కమలాబాయి(33), ప్రియాంక(20), కవిత, ఐశ్వర్య, బసమ్మకు తీవ్రగాయాలవడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కమలాబాయి, ప్రియాంక సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. జీపులో ఉన్న బస్వరాజు, శర ణు, రేణుక, అన్నపూర్ణ, లక్ష్మీబాయి, కవిత, జీపు డ్రైవర్ రాజశేఖర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృత్యువుతో పోరాడి.. ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ వైపు బోల్తాపడింది. దీంతో వాహనం డ్రైవర్ జ్ఞానేశ్వర్(50) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. జాకీ సహాయంతో పోలీసులు అతి కష్టం మీద డ్రైవర్‌ను బయటకు తీశారు. అతని రెండు కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో కాళ్లకు తీవ్ర రక్తస్రావమైంది. అపస్మారక స్థితికి చేరుకున్న అతణ్ని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా సోమవారం ఉదయం మృతి చెందాడు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన జ్ఞానేశ్వర్‌కు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. పోలీసులు సోమవారం నలుగురి మృతదేహాలకు ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. ట్రాఫిక్‌కు అంతరాయం.. రోడ్డు ప్రమాదంలో కంటైనర్ వాహనం రహదారిపై బోల్తా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం భారీ క్రేన్ సహాయంతో కంటైనర్‌ను రహదారిపై నుంచి తొలగించారు. -
స్కూలు బస్సు బోల్తా
15 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం విహారయాత్రలో విషాదం శంషాబాద్: ఓ స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో 15మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని సాయితేజ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన సుమారు వంద మంది విద్యార్థు లు శుక్రవారం విహారయాత్రకు వెళ్లారు. పాఠశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో వేరే పాఠశా లలకు చెందిన మూడు బస్సులను తీసుకెళ్లారు. బస్సుల్లో విద్యార్థులతో పాటు పది మంది పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. విజ యవాడ రోడ్డులోని మౌంట్ ఒపేరా నుంచి వీరు తిరిగి వస్తూ పెద్దఅంబర్‌పేట్ వద్ద ఔటర్‌పైకి చేరుకున్నారు. పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ దా టగానే ఓ బస్సు టైర్ పంక్చర్ అయింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. బస్సులో సుమారు 32 మంది విద్యార్థులున్నారు. దాదాపు 15 మందికి గాయాల య్యాయి. విద్యార్థులు హీనా(15), ప్రత్యూష(15) పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో శంషాబాద్‌లోని ఓ ్రైపైవేట్ ఆస్పత్రికి తరలించారు. బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన సేఫ్‌గార్డును ఢీకొట్టడంతో టైర్ పంక్చర్ అయి బోల్తా పడినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. క్షతగాత్రుల వివరాలు వెల్లడించడానికి ఉపాధ్యాయులు నిరాకరించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం పెద్దగోల్కొండ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన స్కూలు బస్సు ప్రమాదంపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కమిషన్ సభ్యులు అచ్యుతరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాద కేసు ను సుమోటోగా స్వీకరించినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా విహారయాత్రకు తీసుకెళ్లిన పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి, జిల్లా ఎస్పీ, కలెక్టరుకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆయుర్వేదం... అద్భుత విషయాలు!
వైద్యుడిగా పరిణతి సాధించాలని అనుకునేవాడు ఏదో ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాకూడదు. అప్పుడతడు పాక్షిక వైద్యుడవుతాడు. పాక్షిక వైద్యుడు చికిత్స చేయడానికి పనికిరాడు. అందుకే నిష్పాక్షికంగా అతడు అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం సాధించి పరిపూర్ణజ్ఞానాన్ని పొందాలంటుంది ఆయుర్వేదం. ఇదీ నాడీ ప్రవీణ, డెరైక్టర్ ఆఫ్ మహర్షి ఆయుర్వేద, డాక్టర్ జె.ఆర్. రాజు ఉద్బోధించే విషయాలు. ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే... ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం వారు సూచించే పరీక్షలే రోగిని ఎక్కువగా భయపెడుతుంటాయి. కానీ వైద్యాచార్య డాక్టర్ రాజు ఇలాంటి రక్తపరీక్షలూ, మూత్రపరీక్షలూ, ఈసీజీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలను చేయించరు. కేవలం నాడిని చూడటం ద్వారానే వ్యాధినిర్ధారణ చేస్తారు. తద్వారా రోగుల ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ఆయన ఎన్నెన్నో దేశాల్లో అల్లోపతి వైద్యులకూ ఆయుర్వేదం గొప్పదనాన్ని వివరించి, ఆ విధానంలో నయంకాని (క్యూర్ లేదనే) వ్యాధులకు ఆయుర్వేద విధానంలో నయం చేసే విధానాలను బోధిస్తుంటారు. ఆయుర్వేదాన్ని ఆచరిస్తూ వస్తున్న ఆయన మన రోజువారీ దినచర్యల్లో అత్యంత సులభంగానూ, సూక్ష్మంగానూ, పైసా ఖర్చులేకుండా ఆరోగ్యాన్ని పొందే అనేక విషయాలను విపులంగా వివరిస్తున్నారు. దైనందిన జీవనశైలిలోనే ఆయుర్వేదం... ఆయుర్వేద జ్ఞానం చాలా విస్తృతం. దానిని ఔపోసన పట్టడం కంటే అభ్యాసం చేయడం మేలని ఎంచారు మన పూర్వికులు. అందుకే ఆయుర్వేదాన్ని మన నిత్యజీవన శైలిగా మార్చారు. స్నానం, పానం, ఆహారం, విహారం... ఇలా ప్రతి అంశంలోనూ మనకు తెలియకుండానే మనం ఆయుర్వేదాన్ని ఆచరిస్తుంటాం. ఇంగ్లిష్ మందులు, ఇతర ఔషధాలకు కొన్ని దుష్ర్పభావాలు ఉంటాయి. వాటినే సైడ్ ఎఫెక్ట్స్ అని అందరూ వ్యవహరిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్థాలన్నీ స్వాభావికాలు. ప్రకృతి సహజాలు. ఉదాహరణకు మన వంటగదిలో ఉపయోగించే వాము, జీలకర్ర, దాల్చినచెక్క వంటివన్నీ ఆయుర్వేదంలో ఔషధాలే. అలాక్కాకుండా వంటింటి దినుసులుగా ఉపయోగిస్తే అప్పుడవి రోజువారీగా ఉపయోగించే పదార్థాలే. అందుకే ఆయుర్వేదం వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ సైడ్ బెనిఫిట్సే. కాబట్టే ఆయుర్వేదం మన నిత్యజీవితంలో భాగం అయ్యేలా చూశారు మన పూర్వికులు, ఆచార్యులు. అందుకే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైసా ఖర్చులేకుండా పొందగలిగే ఆరోగ్యాన్ని స్నానం నుంచి ప్రారంభిద్దాం. రోజులో తొలి కార్యక్రమం...వ్యాయామం వ్యాయామం అతిగా చేయకూడదు. నుదుట చెమట రావడం మొదలు కాగానే లేదా అధికశ్రమతో శ్వాస తీసుకోవడం మొదలుకాగానే వ్యాయామాన్ని ఆపేయాలి. ఇలా చేయడాన్నే శరీర అర్ధబలమంటారు. బాగా శరీర పరిశ్రమ (కఠిన వ్యాయామం) లేదా రన్నింగ్ లేదా వాకింగ్ చేసి వచ్చాక... వెంటనే నీరు తాగకూడదు. శరీరం, శ్వాస నెమ్మదించాక మాత్రమే నీరు తాగాలి. వ్యాయామ, విహారాలకు అనువైనది ప్రాతఃకాలమే. ఆహారం తీసుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాయామం చేయకూడదు. స్నానం...ప్రాధాన్యం..! స్నానానంతరం మనకు కలిగే ఆహ్లాదం అంతా ఇంతా కాదు. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే చేయదు. అనేక సమస్యలనుంచి సాంత్వన కలిగిస్తుందీ స్నానం. అయితే స్నానం ఆరోగ్యకరం కావాలంటే కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోండి. అవి... తలపై మరీ ఎక్కువ వేన్నీళ్లతో స్నానం వద్దు. స్టీమ్ బాత్, సౌనా బాత్ వంటివి ఆరోగ్యకరం కాదు. స్టీమ్‌బాత్, సౌనాబాత్‌లో తలకు ఆవిరి పెడతారు. అది చాలా ప్రమాదకరం. ఏదైనా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. స్నానం తర్వాతే ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. రెండు, మూడు గంటల తర్వాతే స్నానం చేయండి. బలహీనంగా ఉన్నవాళ్లు, వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో స్నానంగాని వద్దు. చన్నీళ్ల స్నానం ఆరోగ్యకరమనే అపోహ వద్దు. గోరువెచ్చని నీళ్లే మంచివి. తప్పనిసరి పరిస్థితుల్లో చన్నీళ్లతో స్నానం చేస్తే... దానికి ముందర చన్నీళ్లు తాగవద్దు. చన్నీళ్ల స్నానంలో నీరు ఎంత చల్లటివైతే... స్నానం వ్యవధిని అంతగా తగ్గించడం మంచిది. గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది. ఏ నీళ్లతో (చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లు) అయినా స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకోండి. నీరూ... ఆరోగ్యప్రదాయనే! నీటిని మనం ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం. నీరూ ఒక ఓషధే. సరైన పాళ్లలో సరైన విధంగా తీసుకుంటే దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఉదాహరణకు... స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గించుకోడానికి ఆచరించదగిన నీటి చికిత్స (వాటర్ థెరపీ) ఏమిటంటే... ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మూడో వంతు ఆవిరయ్యేలా చేసి, మిగతా నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అలాగే లావెక్కాలని భావించే అతిసన్నటి శరీరం ఉన్నవారు... ఒక పాత్రలో నీటిని తీసుకుని కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యేలా చేసి, మిగతా నీటిని చల్లార్చి తాగితే క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా ఒకే నీరు... దాన్ని ఉపయోగించే అతి సాధారణ, అతి సులభ పద్ధతుల్లో రెండు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రతి అరగంటకొకసారి వేడి నీళ్లను టీ తాగినట్లుగా రోజూ సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి... కాచిన పాలనూ, కాచిన నీళ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. అన్నపానాదులను సంస్కరించాకే ఉపయోగించాలి. ఇలాంటి సంస్కరణకు ప్రధానంగా ఉపయోగపడేది నీరే. నీళ్లు లేకుండా ఘన పదార్థాల సంస్కారం వీలు కాదు. చాలా రోగాలకు ముఖ్యకారణం కూడా నీరే. తమ ఆవాసంగా నీటిలో ఉండే జంతుజాలం ప్రసవించే సమయంలో వెలువడే విషపదార్థాలు నీళ్లలో కరిగి రోగకారకాలు కావచ్చు. అందుకే నీటి స్వచ్ఛపరిచాకే ఉపయోగించాలి. నీటిని స్వచ్ఛపరచడం అంటే... తొలుత మంచి పరిశుభ్రమైన నిర్మల వస్త్రంతో వడగట్టడం, ఆ తర్వాత నీటిని బాగా కాచి చల్లార్చి తాగడం. ఇలా నీటిని స్వచ్ఛపరిచాకే తాగాలి. భోజనానికి ముందు నీరు తాగితే అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది శరీర స్థౌల్యం (ఊబకాయం) కలిగిస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మధ్యమ స్థితి (అంటే కృశ - స్థౌల్య... ఈ రెంటినీ కలిగించేదిగా) సంభవిస్తుంది. ఇలా మధ్య మధ్యన నీరుతాగడం రస, రక్తాధి ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. ఇలా తాగిన నీరు సులభంగా, సుఖంగా జీర్ణమవుతుంది. చల్లని నీళ్లు జీర్ణం కవడానికి 45 నిమిషాలు, వేడి నీరు జీర్ణం కావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. దురలవాట్లనుదూరం చేసుకోండిలా... భోజనం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. భోజనం ‘ఆత్మ’కు ఇంపుగా ఉండాలి. మంచి కవిత్వం రాయడం ఎప్పుడు సాధ్యమన్న విషయాన్ని అల్లసాని పెద్దన సరదాగా చెప్పినా ఆ మాటల్లోని వాస్తవం గమనించారా? ‘ఆత్మకింపైన భోజనం...’ తినాలంటారాయన. అలాగే అన్నం తిన్న తర్వాత కలిగే తృప్తిని వర్ణించడానికి చెప్పే మాట... ‘ఆత్మారాముడు శాంతించాడు’ అనే. అంటే ఇక్కడ తాను అనే అర్థంలో ఆత్మ అనే మాటను వాడినా... విస్తృతార్థంలోనూ ఆత్మకింపైన, ఆత్మకు మేలు చేకూర్చే భోజనమే తీసుకోవాలన్నది వాస్తవం. ఇందులో భాగంగా శరీరానికీ, నాలుకకూ రుచిగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి అంతగా మేలు చేసేది కానప్పుడు దాన్ని వర్జించాలి. ఇలా వర్జించే సమయంలోనూ దాన్ని అకస్మాత్తుగా వర్జించకూడదు. దురలవాటునూ, దుర్వ్యసనాన్ని దూరం చేసుకోనే సమయంలో దాని పరిమాణాన్ని రోజూ శోడశ పాద భాగాన్ని విడవాలి. అంటే ప్రతిరోజూ ఒకటిలో పదహారోవంతును తగ్గించుకుంటూ... ఇలా క్రమంగా మేలు చేయని ఆహారాన్ని వర్జించాలన్నమాట. భోజనం తర్వాత మొక్కజొన్న కండె, మొక్కజొన్న అటుకులు తినకూడదు. వండటానికి పనికొచ్చే కూరలను వండే తినండి... ఇటీవల చాలా మంది పచ్చి కూరలు తినడం వల్లనే ఆరోగ్యం ఇనుమడిస్తుందంటూ చెబుతుంటారు. ఇది కేవలం పాక్షిక సత్యం మాత్రమే. వండి తినడం (పచనం చేయడం) నాగరక పరిణామక్రమంలో వచ్చిన అభివృద్ధి. అందువల్ల దాన్ని అభివృద్ధి సూచకంగానే పరిగణించాలి. క్యారెట్, బీట్రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీన లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్వాలేదు. ఎందుకంటే అవి అందుకు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి. కానీ సొర, బీర, కాకర వంటి కూరగాయలను వండి మాత్రమే తినండి. వండటానికి మాత్రమే వాటిని ఉపయుక్తంగా తయారు చేసింది ప్రకృతి. ఉదాహరణకు కూరగాయలుగా మనం వాడేవాటిలో కాకరనే తీసుకుందాం. దానికి చికిత్సాపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం. దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది, డయాబెటిస్ లాంటి దీర్ఘవ్యాధులను తగ్గిస్తుందన్నది కూడా పరమ సత్యం. అయితే అలాగని దాన్ని పచ్చిగా తినడం చాలా హానికరం. అందులో ఔషధగుణాలతో పాటు కొన్ని ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో లేదా అదేపనిగా రోజూ కాకర రసం తీసుకుని తాగడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే కూరగాయలను, ఆకుకూరలను వండే తినండి. సలాడ్స్‌గా తీసుకోదగ్గ క్యారెట్, బీట్రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం వంటివాటికి మిగతా కూరలను జత చేయకండి. పొన్నగంటికూర కళ్లకు చాలా మంచిది. భోజనం తీసుకోండిలా... అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే దాన్ని గౌరవిస్తూ వీలైతే తూర్పునకు ముఖం చేసి తినండి. ఆహారాన్ని దూషిస్తూ, అశాంతితో తినకూడదు. భోజనంలో మొదట తీపి తీసుకోండి. ఆ తర్వాత భోజనంలో హెవీఫుడ్‌గా మీరు భావించేదాన్ని తినాలి. అలా క్రమంగా భోజనం సాగుతున్న కొద్దీ హెవీ నుంచి లైట్‌కు వస్తూ ఉండాలి. మొదట హెవీ అనే క్రమంలో నెయ్యిని తీసుకోండి. ఎందుకంటే నేతికి రెండు రకాల గుణాలుంటాయి. అది అగ్నిని ప్రజ్వలిస్తుంది. (అగ్నికి ఆజ్యం తోడైనట్లు అనేది అందుకే). అంటే మొదట అగ్నిగుణాన్ని కలిగించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. అగ్నిగుణం కలిగిన ఆ నెయ్యే... కారాలతో నాలుక భగభగలాడేప్పుడూ... ఆహారంలో కారం మంట అధికంగా ఉన్నప్పుడూ దాన్ని శాంతింపజేయడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నంలో నేతికి తొలి వరస. ఈ క్రమంలో అన్నింటికన్నా తేలికైన మజ్జిగది తుది వరస. అన్నం తినేప్పుడు కొందరు మంచినీళ్లు అస్సలు తాగరు. కానీ మధ్యలో నీళ్లు తాగడమే మంచిది. లేకపోతే మనం తీసుకునే అన్నంలోని ఘనపదార్థాలు మధ్యలో చిక్కుకుపోయి (స్తంభించి), జీర్ణక్రియకు అవరోధం కలిగిస్తాయి. అందుకే గొంతులో/ కడుపులో ఏదైనా అడ్డంపడ్డట్లు ఉన్నప్పుడు నీళ్లు తాగడమే మంచిది. అన్నాన్ని కళ్లతో చూడగానే నోట్లో నీళ్లూరతాయి. జ్ఞానేంద్రియాలలో కలిగే స్పందనల్లో ఇదొకటి. మంచి శ్రేష్ఠమైన ఆహారం రుచులను వినగానే వాటిని రుచిచూడాలనిపిస్తుంది. ఇది మరో జ్ఞానేంద్రియం చేసే పని. ఇక ఎలాగూ నాల్క రుచిచూస్తుంది. అలాగే అన్నాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల కూడా కొన్ని స్పందనలు కలుగుతాయి. అందుకే అన్నాన్ని స్పూన్లూ, ఫోర్కులూ, నైఫ్‌ల వంటి ఉపకరణాలతో తినే బదులు చేతి ఐదువేళ్లతో స్పర్శిస్తూ తినండి. ఈ స్పర్శజ్ఞానమూ మెదడులో కొన్ని స్పందనలు కలిగించి అన్నం పట్ల హితవును కలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కలగడానికి మిగతా జ్ఞానేంద్రియాలతో పోలిస్తే కాస్త ఎక్కువ వ్యవధి పడుతుంది. భోజనం చివరన చల్ల (మజ్జిగ) వాడటం చాలా మంచిది. దీనికి కొద్దిగా శుంఠి, సైంధవ లవణం కలుపుకుని తింటే మరింత శ్రేష్ఠం. ఇక అన్నం తిన్న తర్వాత చేయి కడిగి... ఆ చేయి తుడుచుకున్న తర్వాత ఉండే కాస్తంత తడితో కళ్లుమూసుకుని, కన్రెప్పలను తుడుచుకుంటే కొన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇది కళ్లకు చాలా మంచిది. భోజనం చేయండిలా... భోజనం చేసే సమయంలో మీ కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోండి. అందులోని రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకూ, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవండి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని లేదా ఉసిరిక లేదా ముద్గయూషం (పెసరకట్టు) కలుపుకుని లేదా చిలికి తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం. పెరుగు తన గురుగుణం వల్ల శోఫ (వాపు)ను, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫలాలు...ఫలితాలు కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. (అరటి శ్రేష్టమైన పండే అయినప్పటికీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది బరువైన పండు, బరువైన ఆహారాలు ముందే తినాలి కాబట్టి దీన్ని భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్నభోజనం అయ్యాక... చాలాసేపటి తర్వాత ఈవినింగ్ శ్నాక్స్ టైమ్‌లో (ఉజ్జాయింపుగా సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో) తినాలి. బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తీసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు. పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదు. ఆహారం భాగమైన పండ్ల విషయంలోనూ దేశ, కాలాత్మాది విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని ప్రాంతాల్లో పండేవి అక్కడి వారికి తేలిగ్గా జీర్ణమవుతాయి. అవి వారికి మంచిది. ఇక కొన్ని పండ్లూ, ఆహారాలు కొన్ని ప్రాంతాలవారికి పరాయివి. దేశకాలాలను బట్టి మనకు ఏది అనువైనదో వాటినే తీసుకోవాలి. రోజులో చివరి కార్యకలాపం నిద్ర గురించి... నియమానుసారంగా నిద్రపోవాలి. తద్వారా ఆరోగ్యం, పుష్టి, బలం కలుగుతాయి. అకాల నిద్ర లేదా అతినిద్ర లేదా బొత్తిగా నిద్రమానినా అది ఆయువును హరించివేస్తుంది. నిద్ర వేళలు / నిద్ర అలవాట్లు సరిగా లేకపోతే అది రోగాన్ని, కృశింపజేసే తత్వాన్ని, బలహీనతను, అజ్ఞానాన్ని, మరణాన్ని కలగజేస్తుంది. నిద్రలేమి అనేది రోగాన్ని కలగజేస్తుంది. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. సరైన నిద్ర లేకుండటం అన్నది దీర్ఘకాలంలో మనిషిని క్రమంగా కుంగదీస్తుంది. నిద్ర వేళలన్నవి వారి వారి సౌకర్యాన్ని బట్టి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండకుండా చూసుకోవాలి. అతినిద్ర, నిద్రలేమి ఈ రెండూ ప్రమాదకరమే అని గ్రహించండి. అవీ ఇవీ... సత్తుపిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు. నువ్వుల నూనెకు సత్వరం వ్యాపించే గుణం ఉంది. అందుకే అభ్యంగం (మసాజ్)లో దీన్ని వాడటం వల్ల అనేక రోగాలు తగ్గడానికి దోహదం చేస్తుంది. బక్కచిక్కిన వాళ్లు దీనితో మసాజ్ చేసుకుంటే బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. బియ్యం లాంటి ఆహారధాన్యాలు ఒక సంవత్సరం కిందటివి అంటే పాతవి శ్రేష్ఠం. కొత్తపంటలు ప్రమేహానికి (డయాబెటిస్)కు కారకాలు. ధాన్యాలు, ఘృతం (నెయ్యి), తేనె, బెల్లం, పిప్పలి ఇవి తప్ప... ఇతర ద్రవ్యాలు ఒక ఏడాదిపైబడినవే శ్రేష్ఠం. పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం. పుట్టగొడుగులు మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి. లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం, ముదురు వంకాయ రోగకారకం. ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం. బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి. పైన పేర్కొన్నవన్నీ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్రి నిద్రించే వరకు ఒక క్రమపద్ధతిలో చేయడానికి వీలుగా ఆయుర్వేదం ఈ అలవాట్లన్నింటినీ మనందరి దైనందిన జీవితంలో ప్రవేశపెట్టింది. కొందరు ఏమీ తెలియకుండానే వీటన్నింటినీ ఆచరిస్తుండవచ్చు. మరికొందరు తెలియక కొన్నింటిని ఆచరించక, రుగ్మతలకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయుర్వేద సదాచారాలను అర్థం చేసుకుని ఆరోగ్యంగా జీవించండి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి ‘తేనె’లొలికే ఆరోగ్య సూచనలు ఉదయం వేళ ఆరోగ్యదాయని అంటూ చాలామంది తేనెను స్వీకరిస్తుంటారు. వేన్నీళ్లలో కాస్తంత తేనెనూ, నిమ్మరసాన్ని వేసి తాగుతారు. ఇలా తీసుకోవడం చాలా ప్రమాదకరం. తేనెను ఆరోగ్యప్రదాయనిగా స్వీకరించదలచినవారు వేన్నీళ్లలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదు. చన్నీళ్లతోనే స్వీకరించాలి. మీ శరీరం ఎంత తేనెను స్వీకరించడానికి సిద్ధంగా ఉందో ఆ మోతాదునే ఎప్పుడూ కొనసాగించాలి. అంతేగానీ తేనె మధురంగా ఉంటుందని అతిగా తీసుకోవడం సరికాదు. తేనె, నెయ్యి... ఈ రెండింటినీ సమానపాళ్లలో కలిసి తీసుకోకూడదు. ఏదో ఒకదాని మోతాదు ఎక్కువో, తక్కువో ఉండాలి. ఆ రెండూ సమానంగా ఉంటే అది విషంతో సమానం. తేనె ‘యోగవాహి’. అంటే తేనెను దేనితోనైనా కలిపి తీసుకుంటే, అది చేరిన పదార్థం గుణాలను అధికం చేస్తుంది. కానీ తన స్వీయ గుణాల వల్ల ఉద్దేశిత కార్యానికి విరుద్ధంగా పనిచేయదు. ఉదాహరణకు కరక్కాయతో కలిసిన తేనె విరేచనాన్ని కలిగిస్తుంది. కానీ తన స్వభావమైన విరేచన కార్యాన్ని ఆపదు. పాల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే... చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితోగాని అరటిపండు తీసుకోవడం సరికాదు. అది స్లోపాయిజన్ వంటిది. చాలామంది భోజనం అనంతరం అరటిపండును తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటిపండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి. లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిదికాదని గుర్తుంచుకోండి. కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వేడిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి... ఇలా చేయడం దీర్ఘకాలంలో హానికరం. పాలు, పనసపండు కలిపి తినకూడదు. పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగుగాని తింటే దీర్ఘకాలంలో ఆరోగ్యభంగం అయ్యే అవకాశం ఉంది. పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు. -
మీపై గూగుల్ కన్నేసింది!
లండన్: వారాంతంలో ఏదైనా విహార యాత్రకు వెళ్లారా..? లేదా ఏదైనా పనిమీద మరో ప్రాంతానికి వెళ్లారా..? ఇలా మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళుతున్నా... ఒకరు కనిపెట్టేస్తున్నారు! మీరు వెళ్లే చోట్ల వివరాలను దాచిపెడుతున్నారు.. జాగ్రత్త మరి! ఇలా మీపై నిఘా పెట్టిందెవరో తెలుసా?.. గూగుల్ సంస్థ. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, ‘గూగుల్ నవ్’ను వినియోగిస్తున్నవారు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్లినా.. అది మీ గూగుల్ అకౌంట్లో నిక్షిప్తమైపోతుంది. కొద్ది నెలల పాటు ఆ వివరాలు గూగుల్ సర్వర్లలో ఉంచుతారు కూడా. కావాలంటే ‘గూగుల్ నవ్’లోకి వెళ్లి చూసుకుంటే... మీరు కొద్దిరోజులుగా ఎక్కడెక్కడికి వెళ్లినదీ మ్యాప్‌పై ఎరుపురంగు చుక్కలతో చూపిస్తుంది. అయితే గూగుల్‌లో ఈ సర్వీసు తప్పనిసరేమీ కాదని, కావాలంటే ఈ మొబైల్ ట్రాకింగ్‌ను ఆఫ్ చేసుకోవచ్చని గూగుల్ సంస్థ చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ వినియోగిస్తేనే ఇదంతా జరుగుతుంది. -
చిత్తడి నేలల్లో...చినుకుతో విహారం
రుతుపవనాలు ఆలస్యంగా పలకరించడంతో అన్నిచోట్లా వరుణుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల మోస్తరు.. కొన్ని చోట్ల అడపాదడపా కురిసే వానలు తేయాకు తేటల్లో విరివిగా కురుస్తున్నాయి. చినుకుల్లో తడిసి, ఆహ్లాదం పొందాలకునేవారిని ఈ భూతల స్వర్గాలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. వానకాలం వారాంతాలకు వేదికగా మారిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి - వైత్రి హిల్ స్టేషన్, మున్నార్, కూర్గ్, మహాబలేశ్వర్, గోవా! పచ్చందనాల పరవశం వైత్రి హిల్ స్టేషన్ కేరళలోని వయనాడు జిల్లాలో ఉంది వైత్రి. ఈ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్వత ప్రాంతం ఇది. ఇక్కడ చూడదగిన అద్భుత సుందర దృశ్యాలు ఎన్నో మనస్సును కట్టిపడేస్తాయి. అందుకే పర్యాటకులకు మేలిమి పిక్నిక్ స్పాట్‌గా మారింది - వైత్రి. ఇక్కడ చూడదగిన వాటిలో ప్రధానమైనవి కరలాడ్ సరస్సు, లక్కిడి. సముద్ర మట్టం నుంచి 700 మీటర్ల ఎత్తులో ఉన్న లక్కిడి రహదారులన్నీ మలుపులు మలుపులుగా ఉంటుంది. ఈ మలుపుల్లో ప్రయాణించేటప్పుడు పవనాల తాకిడి గిలిగింతలు పెడుతుంది. వైత్రికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూకోట్ సరస్సులో పడవ ప్రయాణం, చుట్టూ అటవీ ప్రాంతం, పిల్లల పార్క్, అడవి బిడ్డల హస్తకళలు అమితంగా ఆకట్టుకుంటా యి. వయనాడు దగ్గరలో బాన్సువారా సాగర్ డ్యామ్, కురువా ద్వీపం, ఎడక్కల్ గుహల్, సూజిపరా జలపాతం, మీన్ముట్టి జలపాతం, ప్రాచీన మ్యూజియం, జైన్ దేవాలయం, కరపుజా డ్యామ్‌లు చూడదగినవి. ఇక్కడే ఉన్న చెంబ్రా పర్వతం ట్రెక్కింగ్ చేసేవారికి గొప్ప అనుభూతిని ఇస్తుంది. సమీప రైల్వేస్టేషన్ కోళిక్కోడ్ 63 కి.మీ, 73 కి.మీ దూరంలో కరిపుర అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కోళిక్కోడ్ చేరుకొని, అక్కడ నుంచి కారులో వైత్రికి చేరుకోవచ్చు. రోడ్డుమార్గాన హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరి అక్కడి నుంచి వైత్రికి చేరుకోవచ్చు. వైత్రిలో వసతుల కోసం: www.vythiriresort.com, www.the windflower.com, www.wayanadresorts.com, silenttreckకు లాగిన్ అవ్వచ్చు. వైత్రి పర్యాటక శాఖ ఫోన్ నెంబర్లు: 09497492882, 09562591233, 09447181160. ముచ్చట గొలిపే మున్నార్ ముద్రపూజ, నల్లతన్ని, కుండల.. అనే మూడు పర్వతాలు ఉన్న ప్రాంతమే కేరళలోని మున్నార్. సముద్రమట్టానికి 1,600 మీటర్ల ఎత్తులో ఈ ఉన్న ప్రాంతం తేయాకు తోటల పెంపకానికి అనువైనది. చిన్న చిన్న టౌన్లు, గాలిమరల దారులు గల ఈ ప్రాంతంలో పేరొందిన రిసార్టులు ఉన్నాయి. వర్షాలు విస్తారంగా కురిసే ఈ కాలం అటవీ ప్రాంతంలో గల గడ్డిమైదానాలు, వాటిలో పువ్వుల సోయగాలు మనసులను ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడి అనముడి ప్రాంతం పర్వతారోహకులకు అనువైనది. మరిన్ని సుందర ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఎరవికులమ్ ఉద్యానం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యానంలో అరుదైన సీతాకోకచిలుకలు, జంతువులు, పక్షులు కనువిందు చేస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే తేయాకు తోటలతో నిండి ఉన్న పర్వతసానువులు పచ్చని చీరను సింగారించుకున్నట్టు కనిపిస్తాయి. మున్నార్‌కి 13 కి.మీ దూరంలో ఉన్న మట్టుపెట్టి మరో ఆసక్తికరమైన ప్రదేశం. ఇక్కడే మసోన్రీ డ్యామ్ స్టోరేజీ వాటర్‌తో తయారైన అందమైన సరస్సు ఉంది. ఇందులో బోట్ రైడ్ ఉత్సాహకరమైన క్రీడగా చెప్పుకోవచ్చు. మట్టుపెట్టిలో చిన్నా, పెద్ద జలపాతాలకు అలవాలమైన ప్రాంతాలు చిన్నకనాల్, అనయిరంగాల్. మున్నార్‌కు 22 కి.మీ దూరంలో ఉంటాయి. కేరళ పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు మున్నార్-కొడెకైనాల్ రోడ్డు మార్గాన వెళుతుంటే ఆ ప్రయాణం పర్యాటకులకు ఊహించని ఆనందాన్నిస్తుంది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో ఎర్నాకుళం చేరుకొని, అక్కడ నుంచి 130 కి.మీ దూరంలో ఉన్న మున్నార్‌కి కారులో వెళ్లచ్చు. రైలు మార్గాన హైదరాబాద్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి కొచ్చి చేరుకొని, అక్కడ నుంచి బస్సుల ద్వారా మున్నార్ వెళ్ళవచ్చు. వసతి సదుపాయాల కోసం www.teacounty munnar.comకు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ క్లబ్ మహీంద్రా, అబద్ హోటల్స్, క్లౌడ్ 9, దేశ్దన్.. మొదలైనవి వసతి సదుపాయాలు కల్పిస్తున్నాయి. మనసు దోచే సుందరచిత్రం మడికేరి కర్నాటకలోని కొడగు జిల్లాలో ఉంది మడికేరి. ఈ ప్రాంతాన్నే అంతా కూర్గ్‌గా పేర్కొంటుంటారు. కాఫీ, ఏలకుల తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధం. పడమటి కనుమల్లో కనువిందు చేసే ఇక్కడి పచ్చదనం వర్షాకాలంలో ప్రకృతి ప్రియులను కట్టిపడేస్తుంది. హైదరాబాద్ నుంచి 797 కి.మీ దూరంలో ఉన్న కూర్గ్‌కు రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి కారులో బయల్దేరితే 13 గంటల సమయం పడుతుంది. ఇక్కడి వసతి సదుపాయాల కోసం.. www.plantationtrails.net/ www.orangecounty.in/coorg-resorts/www.kadkani.com/ KTDC Mayura hoteను సంప్రదించవచ్చు. కూర్గ్‌లో ప్లాంటేషన్ ట్రయల్స్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాల కోసం ఫోన్: +9108023560761/235606595, మొబైల్: +91-80-23346074/73లలో సంప్రదించవచ్చు ఉత్కంఠభరితం మహాబలేశ్వరం అబ్బురపరిచే శిఖరపు అంచులు, ఉత్కంఠ కలిగించే లోయలు, అచ్చెరువొందించే అటవీ వృక్ష సంపద.. వీటి మీదుగా పలకరించే వర్షపు జల్లులు మహాబలేశ్వర్ సందర్శకులను ఓ వింతైన అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాదు కొండలపై నుంచి సాగే చల్లని గాలులు మేనిని తాకి గిలిగింతలు పెడతాయి. మహారాష్ట్రలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన హిల్ స్టేషన్ ఇది. ఇక్కడికి విచ్చేసే సందర్శకులు ప్రకృతిని, చారిత్రక కట్టడాలను చూసి తరించవచ్చు. ఇక్కడ మౌంట్ మల్కోమ్, మరోజి క్యాజిల్, మహాబలేశ్వర్ క్లబ్ చూశాక సుందరమైన వెన్నా సరస్సుకు చేరుకోవాలి. అక్కడ బోటులో షికార్లు, చేపలు పట్టడం, రైడింగ్ చేయడం వంటి క్రీడల ద్వారా ఉల్లాసాన్ని పొందవచ్చు. దగ్గరలోనే పంచ్గని, స్ట్రాబెర్రీ తోటలను వీక్షించవచ్చు. మహాబలేశ్వర్ చుట్టుపక్కల పేరొందిన పంచగంగ మందిర్, కోయనా, వెన్నా, సావిత్రి, గాయత్రి, కృష్ణా నదీ పాయల సోయగం, బాబింగ్టన్ పాయింట్‌లోని దోమ్ డ్యామ్, మహాబలేశ్వర్ మందిరం దర్శించవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రాంత సందర్శన పర్యాటకులకు ఆనందానుభూతులను మిగులుస్తుంది. దీనికి దగ్గరలో పుణేలో (120 కి.మీ) విమానాశ్రయం ఉంది. వసతి సదుపాయాల కోసం ఎమ్టిడిసి హాలీడే రిసార్ట్స్‌ను సంప్రదించవచ్చు. వర్షంలో హర్షం గోవా లక్షలాది పర్యాటకులను అమితంగా ఆకట్టుకు నే ప్రాంతం గోవా. వేసవిలో నిశ్శబ్దంగా ఉండే గోవా జులై మాసాన అడుగుపెట్టే వర్షరుతువు లో అత్యద్భుతంగా కనివిందు చేస్తుంది. అందుకే వర్షాకాలంలోనూ గోవా పర్యటనకు ఆసక్తి చూపే పర్యాటకులు పెరుగుతున్నారు. ఉన్నట్టుండి మబ్బుల పట్టిన ఆకాశం, ఆ వెంటనే సూర్యకాంతి వెలుగులు ఆహ్లాదపరుస్తుంటాయి. దాదాపు 80 బీచ్‌లు, ఇసుక తీరాలు కనువిందు చేస్తుంటాయి. ప్యారాచూట్స్, బోట్‌రైడింగ్, బైక్ రైడింగ్‌లో ఉల్లాసాన్ని పొందవచ్చు. గోవాకే ప్రత్యేకమైన అతిపెద్ద ప్రాచీన చర్చ్‌నీ, సహజసిద్ధమైన జలపాతాల అందాలనూ వాన జల్లుల మధ్య ఎంత సేపు చూసినా తనివి తీరదు. గోవా సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎన్నో హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ఇవి ప్రత్యేక వర్షాకాల ప్యాకేజీలను డిస్కౌంట్ రేట్లలో ఇస్తున్నాయి. హైదరాబాద్ నుంచి రాయచూర్-భాగల్‌కోట్- బెల్గామ్ల మీదుగా గోవా చేరుకోవచ్చు. దూరం 660 కి.మీ. హైదరాబాద్ నుంచి వోల్వో బస్సు సదుపాయాలు ఉన్నాయి. పావ్లో ట్రావెల్స్ ఫోన్ నెం: +91-40-66515051/66625856/66625857, కేశినేని ట్రావెల్స్ మొబైల్ నెం: +919849051414, ఎస్విఆర్ ట్రావెల్స్ ఫోన్: 040-23735005, 23755442, 237332444. హైదరాబాద్ నుంచి రైలు మార్గాన వాస్కో-డ-గామ్ ఎక్స్‌ప్రెస్‌లో నేరుగా గోవాకు చేరుకోవచ్చు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు హైదరాబాద్ నుంచి గోవా వెళుతుంటాయి. మరిన్ని వివరాల కోసం ఇండియా పర్యాటక శాఖ వారిని సంప్రదించవచ్చు. ఫోన్ నెం: 040-23409199