= సీఎల్‌పీ సమావేశంలో భగ్గుమన్న ఎమ్మెల్యేలు
= మంత్రుల పనితీరుపై అసంతృప్తి
= ముఖ్యమంత్రి తీరుపై కూడా ధ్వజం
= పథకాల్లోని లోపాలపై విమర్శలు
= పథకాలను ప్రకటించడానికి ముందు తమను సంప్రదించాలంటూ హితవు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలో జరుగుతున్న శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా బుధవారం రెండో రోజు కూడా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అసమ్మతి భగ్గుమంది. సుమారు. 30 మంది ఎమ్మెల్యేలు మంత్రుల పని తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి మంత్రులేమీ చేయలేక పోతున్నారని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైందని, మరో ఆరు నెలల్లో లోక్‌సభ సమావేశాలు ముంచుకొస్తున్నాయని చెబుతూ, మంత్రులు ఇంకా బద్ధకాన్ని వీడలేక పోతున్నారని విమర్శించారు.
దీనిపై అధిష్టానానికి లేఖ రాస్తామని హెచ్చరించారు. మరో వైపు షాదీ భాగ్య, ప్రతిపాదిత మూఢాచారాల నిరోధక బిల్లు, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విహార యాత్ర... లాంటి అంశాలపై కూడా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు. కోస్తా, మలెనాడు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు మూఢాచారాల ముసాయిదా బిల్లును ఎండగట్టారు. బీజేపీకి గట్టి పట్టున్న ఈ ప్రాంతాల్లో ఈ బిల్లు వల్ల పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండిందని అభిప్రాయపడ్డారు. మరో వైపు షాదీ భాగ్య పథకంపై ముస్లిం ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేశారు. రోషన్ బేగ్, తన్వీర్ సేఠ్, రఫిక్ అహ్మద్‌లు మాట్లాడుతూ ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందు ప్రభుత్వం తమ మత పెద్దలను సంప్రదించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ఈ పథకానికి కేవలం రూ.5 కోట్లు కేటాయించిందని, ఒక్కో పెళ్లికి రూ.50 వేల వంతున వెయ్యి మంది మాత్రమే లబ్ధి పొందుతారని వివరించారు. స్థూలంగా చెప్పాలంటే, నియోజక వర్గానికి నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి కలుగుతుందని, తద్వారా ఈ మొత్తం అందని వారిలో కలిగే అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోలేదని నిష్టూరమాడారు. ప్రధాన పథకాలను ప్రకటించడానికి ముందు తమను సంప్రదించాలని, లేనట్లయితే నియోజక వర్గాల్లో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేమని వారు వాపోయారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులను మాత్రమే విహార యాత్రలకు పంపడం వల్ల ఇతర వర్గాల విద్యార్థుల్లో అసూయ, ద్వేషాలు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు ఎమ్మెల్యేలు హెచ్చరించారు.
చల్లారని అసమ్మతి
Published Thu, Nov 28 2013 4:26 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement