పునరుత్తేజ దర్శనం! | Excursion of White Temple! | Sakshi
Sakshi News home page

పునరుత్తేజ దర్శనం!

Published Sun, Feb 21 2016 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

పునరుత్తేజ దర్శనం!

పునరుత్తేజ దర్శనం!

విహారం
గతంలోనే పాతుకుపోవడం కంటే, భవిష్యత్ గురించి కలలు కనడం కంటే, వర్తమానం మీదే  దృష్టిని కేంద్రీకరించమని చెబుతుంది బౌద్ధం. బౌద్ధాన్ని అభిమానించి ఆరాధించే ఆరిస్ట్ కోసిట్‌పిపాట్ కూడా అంతే. థాయిలాండ్‌లోని చైయింగ్‌రాయి ప్రావిన్స్‌లో శిథిలావస్థలో ఉన్న ప్రాచీనమైన వాట్ రోంగ్ ఖున్ బౌద్ధ ఆలయాన్ని చూసినప్పుడు... ఆయన హృదయం కదిలిపోయింది. ‘మళ్లీ  ఈ బౌద్ధ ఆలయంలో కళ కనిపించాలి’ అనుకున్నాడు. ‘ఈ ఆలయానికి ఏమైంది?’ అని నిట్టూరుస్తూ కూర్చోలేదు. ‘ఇలా చేయాలి... అలా చేయాలి’ అని కలలు కనలేదు.

వర్తమానంలోనే  ఉన్నాడు. వర్తమానం గురించే ఆలోచించాడు.  తన వంతుగా ఎంత చేయగలను, ఏమి చేయలగలను? అంటూ స్పష్టమైన అంచనా వేసుకున్నాడు. ఆలయ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా తానే భరించాలని నిర్ణయించుకున్నాడు.
 ‘కొందరు ప్రయాణమే మొదలు పెట్టరు. కొందరు మజిలీ చేరుకోకుండానే ప్రయాణాన్ని అర్ధంతరంగా  ఆపేస్తారు’  అంటూ బౌద్ధం చెప్పిన సూక్తిని మరోసారి గుర్తు చేసుకున్నాడు కోసిట్‌పిపాట్. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, స్వయంగా తానే డిజైన్ చేసి మరీ ఈ ఆలయాన్ని నిర్మించాడు కోసిట్‌పిపాట్.
 
‘వైట్ టెంపుల్’ పేరుతో ప్రసిద్ధమైన ఈ ఆలయం ఆవరణలో మెడిటేషన్ హాల్, ఆర్ట్ గాల్యరీ, బౌద్ధ సన్యాసుల క్వార్టర్స్‌తో సహా తొమ్మిది భవంతులు ఉన్నాయి.  ఇక్కడికి వచ్చే పర్యాటకులలో కొందరు నిర్మాణ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వస్తారు. కొందరు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి వస్తారు. కొందరు బౌద్ధాన్ని గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వస్తారు. ఇదంతా ఒక ఎత్తయితే... నమ్మకాల పరంగా కూడా ఈ వైట్ టెంపుల్‌కు ప్రాముఖ్యత ఉంది. ఆలయ ఆవరణలో ఒక చిన్న సరస్సు ముందు వందల సంఖ్యలో చేతుల శిల్పాలు కనిపిస్తాయి. మనిషిలోని అంతులేని కోరికలకు ఈ చేతులు ప్రతీకలు. ‘కోరికలే దుఃఖానికి మూలం’ అని బౌద్ధం చెబుతుంది కదా!
 
అలా ఒక చిన్న సరస్సుపై ఉన్న బ్రిడ్జి మీది నుంచి నడిచి వెళితే... మనలోని దురాశ, స్వార్థం, అహంకారం అన్నీ దూరం అవుతాయని, తద్వారా శాంతి చేకూరుతుందని ఒక నమ్మకం. అలాగే బ్రిడ్జి దాటగానే కనిపించే కిన్నారి విగ్రహాన్ని దర్శించడాన్ని ఎంతో శుభసూచకంగా భావిస్తారు.
 
బౌద్ధపురాణంలో ఈ కిన్నారి ప్రస్తావన కనిపిస్తుంది. మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి సగం మనిషి, సగం పక్షి రూపంలో ఉన్న కిన్నారి హిమాలయాల నుంచి వస్తుందని ఒక నమ్మకం. ఇక్కడ ఉన్న గోల్డెన్ బిల్డింగ్‌ను దర్శించడం కూడా ఒక అందమైన కట్టడాన్ని దర్శించడం కాదు. ఆ భవనం నుంచి ఎన్నో తాత్విక విషయాలు మనసుకు అందుతుంటాయి.
 
మనిషి జ్ఞానం కోసం కాకుండా ధనం, కోరికలపైనే ప్రధానంగా  దృష్టి పెడుతున్న వైనాన్ని ఈ భవంతి గుర్తుకు తెస్తూ భౌతిక సుఖాల వెంట పరుగులు తీయవద్దని హితబోధ చేస్తుంది. ఇక్కడ కనిపించే అద్దాలు మన ఆత్మదర్శనాన్ని, పుర్రె, రాక్షసుడి తల... మొదలైనవి మనిషికి ఎదురయ్యే సమస్యలను, కష్టాలను ప్రతీకాత్మకంగా చెబుతుంటాయి. కేవలం బౌద్ధ పురాణ ప్రతీకలు మాత్రమే కాదు... మైకేల్ జాక్సన్ నుంచి హ్యారీ పాటర్ వరకు ఎన్నో చిత్రాలు దర్శనమిస్తాయి.

మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నాం అనేది ఇవి ప్రతీకాత్మకంగా చెబుతాయట! థాయిలాండ్‌లో ఉన్న 33,000 బౌద్ధ ఆలయాల్లో ఈ వైట్ టైంపుల్ కూడా ఒకటి కావచ్చు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే... నోరు మౌనంగా ఉండొచ్చేమో గానీ... మది బౌద్ధం వెలుగులో విరామమెరుగక ప్రయాణిస్తూనే ఉంటుంది!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement