పేషెంట్లు బెడ్‌పైనే ఉండక్కర్లేదు!
♦ మెడికల్ ట్యాక్సీ ద్వారా బయటకు తిప్పే సేవలు
♦ పార్టీలకు, విహారయాత్రలకూ తీసుకెళ్లే అవకాశం
♦ ఇవన్నీ అందిస్తున్న హైదరాబాదీ స్టార్టప్ ఈ–సహాయ్
♦ ఈ నెలాఖరులోగా విశాఖపట్నంలో సేవల విస్తరణ
♦ డిసెంబర్‌లో బెంగళూరు, కొచ్చిన్, పుణె, చెన్నైలకు
♦ ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ హరి భరద్వాజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
అక్కినేని నాగార్జున నటించిన ‘ఊపిరి’ సినిమా చూశారా? అందులో కుర్చీకే పరిమితమైన నాగార్జునను హీరో కార్తీ ఏకంగా విదేశాలకు తీసుకెళ్లి పారా గ్లైడింగ్ వంటి సాహస కార్యాలు చేయిస్తాడు. నాగార్జున మనసులో చోటు సంపాదించుకుంటాడు!!.
నిజానికి ఇంట్లోనో, ఆసుపత్రిలోనో బెడ్‌కే పరిమితమైన పేషెంట్లు కుటుంబ కార్యక్రమాల్లో, చిన్న చిన్న ఫంక్షన్లలో నలుగురితో కలిసి తిరిగితేనో, లేదా ప్రకృతి అందాల నడుమ విహరిస్తేనో త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతుంటారు. ఏదో సినిమా కాబట్టి అలాంటివి సాధ్యం కానీ.. మామూలుగా అయితే వారి ప్రయాణం, వైద్య సహాయం, మందుల సమయపాలన చూసుకోవటం ఇవన్నీ సాధ్యమా? అంటుంటారు చాలామంది.
.. ఇదిగో సరిగ్గా దీన్నే వ్యాపార సూత్రంగా మార్చుకుంది హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న ఈ–సహాయ్! దేశంలోనే తొలిసారిగా మెడికల్ ట్యాక్సీ సేవలను ప్రారంభించిన సంస్థ ప్రారంభం, విస్తరణ ప్రణాళికల గురించి ఈసహాయ్ వ్యవస్థాపక సీఈఓ హరి భరద్వాజ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
ఈ సహాయ్ ప్రారంభానికి కంటే ముందు అమెజాన్, యాక్సెంచర్ కంపెనీల్లో పనిచేశా. అయితే అందరిలా నేను కూడా ఏదో ఒక వ్యాపారం చేద్దామనుకోలేదు. వినూత్నంగా ఉండటంతో పాటూ సామాజిక కోణంలోనూ ఉండాలని ఆలోచించా. వైద్య రంగంలో అయితే వ్యాపారంతో పాటూ సేవ కూడా చేసినట్టుంటుందని రూ.50 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్లో ‘ఈసహాయ్.ఇన్’ సంస్థను ప్రారంభించా.
వినూత్నంగా మెడికల్ ట్యాక్సీ సేవలు
వేగనార్, ఈకో, ఇండికా వంటి హ్యాచ్‌బ్యాక్ వాహనాలను మెడికల్ ట్యాక్సీ సేవల కోసం వినియోగిస్తాం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. వాహనంలోని సీట్లు 90 డిగ్రీల్లో తిరుగుతాయి. 10–15 అంగుళాలు బయటికి వస్తాయి. వీల్‌చెయిర్‌లా పడుకోవచ్చు కూడా. దీంతో పేషెంట్లకు వాహనంలోకి ఎక్కేందుకు, దిగేందుకు సులువుగా, సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం సీటింగ్ మాత్రమే కాదు.. పేషెంట్‌తో మెడికల్ అటెండర్, వైద్య పరికరాలు, మందులూ ఉంటాయి. వినూత్న, సౌకర్యవంతమైన సేవలుండటం వల్లే కాబోలు.. వృద్ధులు, గర్భవతులు, సర్జరీ పేషెంట్లు ఈ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతి కి.మీ.కు రూ.8–10 చార్జీ ఉంటుంది. ప్రస్తుతం 6 మెడికల్ ట్యాక్సీలున్నాయి. 2 వారాల్లో మరో 10 వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఏడాదిలో 2 వేల వాహనాలకు చేర్చాలన్నది లక్ష్యం.
అంబులెన్స్, టెక్నాలజీ సేవలు కూడా..
ఈసహాయ్ ద్వారా మెడికల్ ట్యాక్సీ మాత్రమే కాకుండా మేం అంబులెన్స్‌లను అగ్రిగేట్ కూడా చేస్తున్నాం. దీన్లో స్థానిక డ్రైవర్లు తమ వాహనాలను నమోదు చేసుకోవాలి. అంబులెన్స్ బుకింగ్ ఆర్డర్ రాగానే దాన్ని స్థానికంగా అందుబాటులో ఉండే డ్రైవర్‌కు పంపిస్తాం. రోగిని సమయానికి ఆసుపత్రికి పంపించడంతో పాటూ జీపీఎస్ సహాయంతో అంబులెన్స్‌ను ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం అంబులెన్స్ ఎక్కడుంది? ఎంత సమయంలో ఆసుపత్రికి చేరతాడు? వంటి అన్ని రకాల వివరాలను ఎప్పటికప్పుడు కస్టమర్లకు చేరవేస్తాం.
ప్రస్తుతం 165 మంది అంబులెన్స్ డ్రైవర్లు నమోదయ్యారు. ఇక రవాణా నిర్వహణలో.. అంబులెన్స్ ఉన్న ఆసుపత్రులకు వాటి నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి వంటి సేవలందిస్తాం. ప్రస్తుతం యశోద, ఆర్చన, సెంచురీ, కాంటినెంటల్, ఓమినీ, ఇండస్, శ్రీశ్రీ హోలిస్టిక్, శ్రీఖర, సురక్ష, అంకుర వంటి 35 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా విభాగాల్లో సేవలకు గాను 10–15 శాతం కమీషన్ తీసుకుంటాం.
నెలకు రూ.10 లక్షల ఆదాయం..: ఇప్పటివరకు 20 వేల ఈసహాయ్ యాప్స్ డౌన్‌లోడ్ అయ్యాయి. నెలకు 600–700 వరకు ఆర్డర్లొస్తున్నాయి. ప్రతి నెలా రూ.10 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విశాఖపట్నంలో ఈ–సహాయ్ సేవలను ప్రారంభించనున్నాం. డిసెంబర్ నాటికి కొచ్చిన్, పుణె, చెన్నై, బెంగళూరు నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం.
3 నెలల్లో రూ.25–30 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం 24 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే మరో 100 మందిని నియమించుకోనున్నాం. ఏప్రిల్‌లో ఇండియా, అమెరికాలోని కొంత మంది స్నేహితులు బృందంగా కలిసి రూ.2 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు సీడ్ రౌండ్‌లో రూ.25–30 కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. బెంగళూరులోని పలు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం... అని హరి వివరించారు.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...