జనరేషన్ జెడ్.. ఖర్చులో జెట్ స్పీడు | Boston Consultancy Group and Snapchat Shows Survey | Sakshi
Sakshi News home page

జనరేషన్ జెడ్.. ఖర్చులో జెట్ స్పీడు

Published Sat, Oct 26 2024 6:05 AM | Last Updated on Sat, Oct 26 2024 6:05 AM

Boston Consultancy Group and Snapchat Shows Survey

1997–2012 మధ్య పుట్టిన ఈ తరం ఖర్చు లెక్కలేనంత.. 

వీరు ఏటా చేస్తున్న ఖర్చు రూ.74.70 లక్షల కోట్లు 

2035 నాటికి ఇది రూ.1,66,00,000 కోట్లకు చేరుతుందని అంచనా 

వీరి ఖర్చులో విహార యాత్రలదే పెద్ద వాటా 

ఆ తర్వాత ఫ్యాషన్‌ లైఫ్‌స్టైల్‌కు పెద్దపీట 

బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్, స్నాప్‌చాట్‌ షోస్‌ సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి: తరాలు మారుతున్నకొద్దీ అలవాట్లు, అభిరుచులు, అవసరాలు మారిపోతుంటాయి. కొత్త తరం కొంగొత్త ఆశలతో ముందుకు సాగిపోతుంటుంది. సమాజంలో వేగంగా వస్తున్న మార్పులు, అవకాశాలను అంతే వేగంతో అందిపుచ్చుకుంటుంది. ఆదాయమూ పెరుగుతోంది. చేతిలో డబ్బు ఆడుతున్నకొద్దీ పెట్టే ఖర్చూ పెరుగుతుంది. ఇప్పుడు ‘జనరేషన్‌ –జెడ్‌’ చేస్తున్న పని కూడా ఇదే. ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్‌.. ఇలా అన్ని రంగాల్లోనూ వీరు పెడుతున్న ఖర్చు చూస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే. ఖర్చు పెట్టడంలో ‘జెడ్‌’ తరాన్ని మించిన వారు లేరని అంతర్జాతీయ సంస్థలైన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ), స్నాప్‌చాట్‌ షోస్‌ చెబుతున్నాయి. 

ఖర్చు చేయడంలో మిలీనియల్స్‌ జనరేషన్‌ (1981–96 మధ్య పుట్టిన వారు)ను దాటుకొని జెనరేషన్‌–జెడ్‌ (1997–2012 మధ్య పుట్టిన వారు) దూసుకుపోతున్నట్లు ఈ సంస్థల సంయుక్త అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం భారత దేశ ప్రజలు ఏటా పెడుతున్న ఖర్చులో 43 శాతం జనరేషన్‌–జెడ్‌దే అని, వచ్చే పదేళ్లల్లో వీరు ఖర్చు 50 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్‌–జెడ్‌ ఏటా చేస్తున్న ఖర్చు అక్షరాలా రూ.74,70,000 కోట్లు. ఇది 2035 నాటికి  రూ.1,66,00,000 కోట్లకు చేరుతుందని ఆ సర్వే అంచనా వేసింది. 

స్నాక్స్‌ నుంచి సెడాన్‌ కార్ల వరకు దేశ ప్రజలు పెడుతున్న ఖర్చులో ప్రతి రెండో రూపాయి జనరేషన్‌–జెడ్‌ నుంచే వస్తోంది. ప్రస్తుతం దేశ జనాభాలో 1997–2012 మధ్య పుట్టిన ‘జెడ్‌’ తరం జనాభా 37.7 కోట్లు. అమెరికా మొత్తం జనాభా కంటే మన దేశంలో వీరి సంఖ్యే ఎక్కువ. ప్రస్తుతం జనరేషన్‌ ‘జెడ్‌’లో 25 శాతం మంది (ప్రతి నలుగురిలో ఒకరు) మాత్రమే సంపాదించడం మొదలు పెట్టారని, ఇది 2035 నాటికి 47 శాతానికి (దాదాపు సగం మంది) చేరుతుందని సర్వే అంచనా వేసింది.

విహారయాత్రలకే పెద్దపీట 
జెడ్‌–జనరేషన్‌ ప్రయాణాలు, విహారయాత్రలకే అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది (2024 సంవత్సరం)లో విహార యాత్రల కోసం వీరు చేసే ఖర్చు రూ.6,62,500 కోట్ల నుంచి రూ.6,64,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ట్రావెల్స్‌ సంస్థలు వీరికి ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. 

ఆ తర్వాత అత్యధికంగా ఫ్యాషన్‌ –లైఫ్‌స్టైల్‌ వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెడు­తున్నారు. ప్యాకేజ్డ్‌ ఫుడ్, ప్యాకేజ్డ్‌ పానియాలతో పాటు రెస్టారెంట్లకూ వీరు భారీగానే ఆదాయాన్ని అందిస్తున్నట్లు సర్వేలో తేలింది. స్పష్టంగా చెప్పాలంటే.. ‘జెడ్‌’ తరానికి వంట చేయడమంటే మహా చిరాకు.

సింపుల్‌గా ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ లేదా బయట నుంచి తెప్పించుకొని ఆరగించడమే ఇష్టం. ఇలా వీరు ప్యాకేజ్డ్‌∙ఫుడ్‌ కోసం రూ.2,90,500 కోట్లు, ఆహారం కోసం రెస్టారెంట్లకు మరో రూ.2,90,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు బీసీజీ సర్వే పేర్కొంది. 

ఏమిటీ జనరేషన్లు..
అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఒక జనరేషన్‌ అంటే 16 సంవత్సరాల కాలం. దీని ప్రకారం 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌గా పేర్కొన్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్‌ –జెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 

2012 నుంచి జన్మింస్తున్న వారు ఆల్ఫా జనరేషన్‌గా పరిగణిస్తున్నారు. ఈ తరాల మధ్య అంతరాలను అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు అంచనా వేస్తుంటాయి. అందులో భాగంగానే బీసీజీ, స్నాప్‌ చాట్‌ షో సంస్థలు జనరేషన్‌–జెడ్‌ పై అధ్యయనం చేసి, వారి ఖర్చులపై నివేదిక ఇచ్చాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement