అదృష్ట ఆలయం! | Lucky Temple Excursion of Kyoto! | Sakshi
Sakshi News home page

అదృష్ట ఆలయం!

Published Sun, Feb 28 2016 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

అదృష్ట ఆలయం!

అదృష్ట ఆలయం!

విహారం
దేశాలకు రాజధాని ఉండడం తెలుసు, రాష్ట్రాలకు రాజధాని ఉండడం తెలుసు. మరి బొమ్మలకు రాజధాని ఉంటుందనే విషయం తెలుసా? టకసాకి సిటీ గురించి తెలిసినవాళ్లు ‘ఉంటుంది’ అంటారు. జపాన్‌లోని క్యోటోకు వంద కిలోమీటర్ల  దూరంలో ఉన్న  టకసాకీని ‘దరుమా బొమ్మల రాజధాని’ అని పిలుస్తారు. ఈ సిటీలో ఉన్న షోరింజన్ దరుమా ఆలయంలో దరుమ బొమ్మలను ఉంచితే ‘అదృష్టం’ వరిస్తుందనే బలమైన  నమ్మకం ఉంది.

ఈ నమ్మకం నిన్నా మొన్నటిది కాదు... కొన్ని శతాబ్దాల నాటిది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే  పర్యాటకులు రకరకాల ఆకారాల్లో  ఉన్న దరుమా బొమ్మలను ఈ ఆలయంలో  పెడతారు. జపాన్ సంస్కృతిలో బొమ్మలు  వినోదానికి మాత్రమే కాదు... రకరకాల సెంటిమెంట్లకు ప్రాముఖ్యం పొందాయి. వీటిలో ముఖ్యమైనవి... కోకేషి, హకట, దరుమా బొమ్మలు. చెక్కతో తయారు చేసిన కోకెషి, మట్టితో తయారుచేసిన హకటల కంటే ఎరుపురంగు దరుమా బొమ్మలపై ఎక్కువ సెంటిమెంట్ ఉంది.

ఈ బొమ్మలపై తమ కోరికను రాయడం ఆనవాయితీగా వస్తుంది. ఒకవేళ కోరిక ఫలిస్తే మరో బొమ్మను కూడా ఇదే ఆలయంలో  పెట్టాల్సి ఉంటుంది. సంవత్సరాంతంలో ఇలా పోగైన బొమ్మలను గుట్టలుగా పేర్చి కాల్చి వేస్తారు. కాల్చే ముందు ఆ బొమ్మలకు కృతజ్ఞత తెలియజేస్తారు. ఈ తంతుని ‘దరుమ  క్యో’ అంటారు. టకసాకిలో ఇతర పర్యాటక ఆకర్షణలు లేకపోలేదు.
 
1597లో నిర్మించిన  టకసాకి క్యాజిల్ చరిత్రను కళ్ల ముందు ఉంచుతుంది. టకసాకి స్టేషన్ నుంచి 90 నిమిషాలు ప్రయాణిస్తే హరున సరస్సు కనిపిస్తుంది. దీన్ని ఆనుకొని ఉంటుంది మౌంట్ హరున. ఆ సరస్సు, ఈ పర్వతాల సౌందర్యం ఒక ఛాయా చిత్రాన్ని  తలపి స్తుంది. జపాన్ చక్రవర్తి యోమై సమాధిని కూడా ఎక్కువ మంది సందర్శిస్తారు. మినోవా క్యాజిల్, ‘ద మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్’... మొదలైనవి కూడా పర్యాటక ప్రాముఖ్యాన్ని సంతరించు కున్నప్పటికీ  వీటన్నికంటే పర్యాటకులు షోరింజన్ దరుమా ఆలయానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు.

దరుమా బొమ్మలను ‘ధర్మ బొమ్మలు’ అని కూడా పిలుస్తారు. ప్రఖ్యాత  బౌద్ధ సన్యాసి బోధిధర్మ చెప్పిన  సిద్ధాంతాలకు,  మనుషులు నమ్మే అదృష్టానికి  ఈ బొమ్మలు ప్రాతినిధ్యం వహిస్తాయని చెబుతారు. ఈ బొమ్మలు బోధిధర్మ ముఖాన్ని పోలి ఉంటాయి.
 బోధిధర్మ తొమ్మిదేళ్ల పాటు ఒక చెట్టు కింద ధ్యానం చేశాడని, నిద్ర రాకుండా కనురెప్పలను కోసుకున్నాడని... ఇలా రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి.

బోధిధర్మ బొమ్మలకు, అదృష్టానికి ఉన్న సంబంధం గురించి వివరించే ప్రత్యేక కథలు లేనప్పటికీ... బోధిధర్మ పేరు మీద బొమ్మను పెడితే అదృష్టం వరిస్తుందనే నమ్మకం పెరిగిపోయింది. కొందరైతే అదృష్ట దురదృష్టాల గురించి చెప్పిన జెన్ కథలను కూడా ప్రస్తావిస్తుంటారు. ఉదా: ఒక రైతు దగ్గర ఒక బలహీనమైన గుర్రమొకటి ఉండేది. ఒకరోజు దాన్ని చూసి జాలి పడిన రైతు దానికి స్వేచ్ఛను ఇస్తూ అడవిలో వదిలి పెట్డాడు. ‘‘ఉన్న ఒక్క గుర్రాన్నీ వదులు కున్నావు... నీలాంటి దురదృష్టవంతుణ్ని మేం చూడలేదు’’ అన్నారు పొరుగువారు.

అడవిలోకి వెళ్లిన గుర్రం వారం రోజుల తరువాత వెనక్కి వచ్చింది. వస్తూ వస్తూ తనతో పాటు పన్నెండు గట్టి గుర్రాలను తీసుకువచ్చింది. ‘‘నీలాంటి అదృష్టవం తుడు లేరు’’ అన్నారు. ఆ గుర్రాల్లో ఒక గుర్రం మీద స్వారీ చేయబోయి చేయి విరగొట్టుకున్నాడు రైతు కొడుకు. ‘దుర దృష్టం’ అన్నారు. ఆకస్మికంగా వచ్చిన యుద్దం కోసం రాజ్యంలోని యువకు లందరినీ సైన్యంలో చేర్చమని రాజు ఆజ్ఞాపించాడు. చేయి విరగడంతో రైతు కొడుక్కీ సైన్యంలో చేరే బాధ తప్పింది. ‘అదృష్టం’ అన్నారు పొరుగువాళ్లు.

ఈ కథను ఉదహరిస్తూ ‘అదృష్ట దురదృష్టాలు అనేవి శాశ్వతం కానప్పుడు... అదృష్టం కోసం టకసాకికి వెళ్లడం దేనికి?’ అని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. వారి ప్రశ్నలు, వాదనలు అందులోని హేతువు సంగతి ఎలా ఉన్నా.. షోరింజన్  అలయా నికి వెళితే అదృష్టం వరిస్తుందన్న నమ్మకం పెరుగుతోందే తప్ప తరగట్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement