Kyoto
-
ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పూలగుత్తులనుకుంటే పప్పులో కాలేసినట్లే..!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వాటిని పూలగుత్తులనుకుంటున్నారా?! అయితే పొరపాటే! ఇవి అచ్చంగా పూలగుత్తుల్లాగానే కనిపించే ఐస్‌క్రీములు. జపాన్‌లోని క్యోటో నగరానికి చెందిన షిజెన్ కేఫ్ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఇటీవల ఈ పూలగుత్తుల ఐస్‌క్రీమ్‌లను తన మెన్యూలోకి ప్రవేశపెట్టింది. జపాన్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు వీటిని అమితంగా ఇష్టపడుతుండటమే కాకుండా, వీటితో ఫొటోలు దిగుతూ వీడియోలు చేస్తుండటంతో అనతికాలంలోనే ఈ పూలగుత్తుల ఐస్‌క్రీములు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అచ్చంగా అసలైన పూలనే తలపించే రంగుల్లో, ఆకారాల్లో వీటిని కళాఖండాల్లా మలచి అందిస్తున్న తీరు కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. పూల రకాలు, ఆకారాలు, రంగులు, పరిమాణం బట్టి ఈ ఐస్‌క్రీముల ధర 200 యెన్ల నుంచి 1350 యెన్ల (రూ.113 నుంచి రూ.763) వరకు ఉంటోంది. మామూలు ఐస్‌క్రీములతో పోల్చుకుంటే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉన్నా, వీటిని ఆస్వాదించడానికి విపరీతంగా ఎగబడుతున్నారు. ఈ ఐస్‌క్రీములను అందించే షిజెన్ కేఫ్ పర్యాటక ప్రదేశాలైన క్యోటో మ్యూజియం, నిజో కోటలకు దగ్గరగా ఉండటంతో పూలగుత్తుల ఐస్‌క్రీముల అమ్మకాలు ప్రారంభించాక దీనికి విదేశీ పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. (చదవండి: ఆ గ్రామం పూల రాజధాని! అక్కడ ఎటు చూసినా..!) -
యానిమేషన్ స్టూడియోకు నిప్పు
టోక్యో: జపాన్‌లోని ప్రముఖ యానిమేషన్ స్టూడియోకు ఓ వ్యక్తి నిప్పుపెట్టడంతో మంటల్లో చిక్కుకుని 33 మంది చనిపోగా దాదాపు అంతే సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. జపాన్ వాసులను షాక్‌కు గురిచేసిన ఈ ఘటన క్యోటోలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఓ దుండగుడు స్థానిక క్యోటో యానిమేషన్ స్టూడియోలోకి ప్రవేశించాడు. ‘మీరు చస్తారు’ అని అరుచుకుంటూ ప్రవేశ ద్వారం వద్ద గుర్తు తెలియని ద్రవాన్ని చల్లి, ఆ వెంటనే నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులంతా ప్రాణ భయంతో పైనున్న మూడంతస్తులకు చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారు మంటల తీవ్రత నుంచి తప్పించుకోలేకపోయారు. మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది 33 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 20 మృతదేహాలు మూడో ఫ్లోర్‌లోనే పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 36 మంది కాలిన గాయాలపాలు కాగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. బాధితుల్లో చాలా మంది కంపెనీ ఉద్యోగులేనని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితుడి(41)ని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడు కంపెనీ ఉద్యోగి కాదని మాత్రమే పోలీసులు వెల్లడించారు. తన వస్తువును క్యోటో యానిమేషన్ కంపెనీ దొంగతనం చేసిందని నిందితుడు ఆరోపిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదానికి అతడు గ్యాసొలిన్ను వాడి ఉంటాడని భావిస్తున్నారు. ఘటన స్థలి నుంచి పోలీసులు కొన్ని కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, అవి నిందితుడివేనా కాదా అనేది తెలియరాలేదు. ప్రమాదం సమయంలో ఆ భవనంలో 70 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. లకీ స్టార్, కె–ఆన్, హరుహి సుజుమియాతోపాటు పోకెమాన్, విన్నీది పూహ్ వంటి యానిమేషన్ చిత్రాలతో క్యోటో యానిమేషన్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. కాగా, జపాన్‌లో ఇటువంటి విద్రోహ చర్యలు జరగడం చాలా అరుదు. 2001లో టోక్యోలో అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లో ఓ వ్యక్తి టోక్యోలోని నర్సింగ్ హోం వద్ద కత్తితో దాడి చేసి 19 మందిని పొట్టనబెట్టుకున్నాడు. స్టూడియో వద్ద సహాయక చర్యలు -
దారుణం: 24 మంది సజీవ దహనం
టోక్యో: జపాన్‌లోని క్యోటో నగరంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగుడు యానిమేషన్ కంపెనీకి నిప్పు పెట్టడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనం కాగా 35 మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగే సమయంలో ఆ భవనంలో 70 మంది ఉన్నట్టు స్థానిక మీడియా చెబుతోంది. కాగా ఉదయం పదిన్నర ప్రాంతంలో అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడంతస్థుల భవనంలో మంటలను అదుపులోకి తీసుకురావటానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. వారు మాట్లాడుతూ ఘటనా స్థలంలో రెండు సార్లు పేలుళ్ల శబ్ధం వినపడిందన్నారు. భవనం నుంచి ఎరుపు రంగులో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయన్నారు. ఇక జపాన్‌లో హింసాత్మక ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పేలుడు ప్రమాదానికి పాల్పడితే జపాన్‌లో మరణ శిక్ష విధిస్తారు. గతంలో జపాన్‌లోని ఒసాకాలో నిప్పంటించి 16మంది మృతికి కారణమైన ఓ వ్యక్తికి 2008లో అక్కడి కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
అదృష్ట ఆలయం!
విహారం దేశాలకు రాజధాని ఉండడం తెలుసు, రాష్ట్రాలకు రాజధాని ఉండడం తెలుసు. మరి బొమ్మలకు రాజధాని ఉంటుందనే విషయం తెలుసా? టకసాకి సిటీ గురించి తెలిసినవాళ్లు ‘ఉంటుంది’ అంటారు. జపాన్‌లోని క్యోటోకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న టకసాకీని ‘దరుమా బొమ్మల రాజధాని’ అని పిలుస్తారు. ఈ సిటీలో ఉన్న షోరింజన్ దరుమా ఆలయంలో దరుమ బొమ్మలను ఉంచితే ‘అదృష్టం’ వరిస్తుందనే బలమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకం నిన్నా మొన్నటిది కాదు... కొన్ని శతాబ్దాల నాటిది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు రకరకాల ఆకారాల్లో ఉన్న దరుమా బొమ్మలను ఈ ఆలయంలో పెడతారు. జపాన్ సంస్కృతిలో బొమ్మలు వినోదానికి మాత్రమే కాదు... రకరకాల సెంటిమెంట్లకు ప్రాముఖ్యం పొందాయి. వీటిలో ముఖ్యమైనవి... కోకేషి, హకట, దరుమా బొమ్మలు. చెక్కతో తయారు చేసిన కోకెషి, మట్టితో తయారుచేసిన హకటల కంటే ఎరుపురంగు దరుమా బొమ్మలపై ఎక్కువ సెంటిమెంట్ ఉంది. ఈ బొమ్మలపై తమ కోరికను రాయడం ఆనవాయితీగా వస్తుంది. ఒకవేళ కోరిక ఫలిస్తే మరో బొమ్మను కూడా ఇదే ఆలయంలో పెట్టాల్సి ఉంటుంది. సంవత్సరాంతంలో ఇలా పోగైన బొమ్మలను గుట్టలుగా పేర్చి కాల్చి వేస్తారు. కాల్చే ముందు ఆ బొమ్మలకు కృతజ్ఞత తెలియజేస్తారు. ఈ తంతుని ‘దరుమ క్యో’ అంటారు. టకసాకిలో ఇతర పర్యాటక ఆకర్షణలు లేకపోలేదు. 1597లో నిర్మించిన టకసాకి క్యాజిల్ చరిత్రను కళ్ల ముందు ఉంచుతుంది. టకసాకి స్టేషన్ నుంచి 90 నిమిషాలు ప్రయాణిస్తే హరున సరస్సు కనిపిస్తుంది. దీన్ని ఆనుకొని ఉంటుంది మౌంట్ హరున. ఆ సరస్సు, ఈ పర్వతాల సౌందర్యం ఒక ఛాయా చిత్రాన్ని తలపి స్తుంది. జపాన్ చక్రవర్తి యోమై సమాధిని కూడా ఎక్కువ మంది సందర్శిస్తారు. మినోవా క్యాజిల్, ‘ద మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్’... మొదలైనవి కూడా పర్యాటక ప్రాముఖ్యాన్ని సంతరించు కున్నప్పటికీ వీటన్నికంటే పర్యాటకులు షోరింజన్ దరుమా ఆలయానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దరుమా బొమ్మలను ‘ధర్మ బొమ్మలు’ అని కూడా పిలుస్తారు. ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి బోధిధర్మ చెప్పిన సిద్ధాంతాలకు, మనుషులు నమ్మే అదృష్టానికి ఈ బొమ్మలు ప్రాతినిధ్యం వహిస్తాయని చెబుతారు. ఈ బొమ్మలు బోధిధర్మ ముఖాన్ని పోలి ఉంటాయి. బోధిధర్మ తొమ్మిదేళ్ల పాటు ఒక చెట్టు కింద ధ్యానం చేశాడని, నిద్ర రాకుండా కనురెప్పలను కోసుకున్నాడని... ఇలా రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. బోధిధర్మ బొమ్మలకు, అదృష్టానికి ఉన్న సంబంధం గురించి వివరించే ప్రత్యేక కథలు లేనప్పటికీ... బోధిధర్మ పేరు మీద బొమ్మను పెడితే అదృష్టం వరిస్తుందనే నమ్మకం పెరిగిపోయింది. కొందరైతే అదృష్ట దురదృష్టాల గురించి చెప్పిన జెన్ కథలను కూడా ప్రస్తావిస్తుంటారు. ఉదా: ఒక రైతు దగ్గర ఒక బలహీనమైన గుర్రమొకటి ఉండేది. ఒకరోజు దాన్ని చూసి జాలి పడిన రైతు దానికి స్వేచ్ఛను ఇస్తూ అడవిలో వదిలి పెట్డాడు. ‘‘ఉన్న ఒక్క గుర్రాన్నీ వదులు కున్నావు... నీలాంటి దురదృష్టవంతుణ్ని మేం చూడలేదు’’ అన్నారు పొరుగువారు. అడవిలోకి వెళ్లిన గుర్రం వారం రోజుల తరువాత వెనక్కి వచ్చింది. వస్తూ వస్తూ తనతో పాటు పన్నెండు గట్టి గుర్రాలను తీసుకువచ్చింది. ‘‘నీలాంటి అదృష్టవం తుడు లేరు’’ అన్నారు. ఆ గుర్రాల్లో ఒక గుర్రం మీద స్వారీ చేయబోయి చేయి విరగొట్టుకున్నాడు రైతు కొడుకు. ‘దుర దృష్టం’ అన్నారు. ఆకస్మికంగా వచ్చిన యుద్దం కోసం రాజ్యంలోని యువకు లందరినీ సైన్యంలో చేర్చమని రాజు ఆజ్ఞాపించాడు. చేయి విరగడంతో రైతు కొడుక్కీ సైన్యంలో చేరే బాధ తప్పింది. ‘అదృష్టం’ అన్నారు పొరుగువాళ్లు. ఈ కథను ఉదహరిస్తూ ‘అదృష్ట దురదృష్టాలు అనేవి శాశ్వతం కానప్పుడు... అదృష్టం కోసం టకసాకికి వెళ్లడం దేనికి?’ అని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. వారి ప్రశ్నలు, వాదనలు అందులోని హేతువు సంగతి ఎలా ఉన్నా.. షోరింజన్ అలయా నికి వెళితే అదృష్టం వరిస్తుందన్న నమ్మకం పెరుగుతోందే తప్ప తరగట్లేదు. -
భారత్ - జపాన్ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం
క్యోటో:భారత్ - జపాన్ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే అతి పురాతన భారతీయ ఆధ్యాత్మిక నగరం వారణాసికి, వెయ్యి ఏళ్లకు పైగా జపాన్‌కు రాజధానిగా ఉంటున్న క్యోటో నగరాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిన్జో అబేల సమక్షంలో భారత రాయభారి దీపా వాధ్వా, క్యోటో మేయర్ దైసాక కాడోకవా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం వారసత్వ పరిరక్షణ, విద్య, సాంస్కృతిక రంగాలలో ఈ రెండు నగరాలు సహకరించుకుంటాయి. అంతకు ముందు అయిదు రోజుల జపాన్ పర్యటకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒసాకా ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు.