
విహార యాత్రకు వెళ్లివస్తానని చెప్పి..
బంగారుపాళెం : ‘విహార యాత్రకు వెళ్లివస్తానని చెప్పి శవమై వచ్చావా తల్లీ.. అప్పుడే నీకు నిండు నూరేళ్లూ నిండిపోయాయా.. అమ్మా..’ అంటూ తల్లిదండ్రుల ఏడ్పులు చూపరులకు కంటతడిని తెప్పిం చాయి. ఎక్కెక్కి ఏడ్చుతున్న వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న రిథిమా పాపాని మార్చి 3న కళాశాలకు చెందిన మిత్రులతో కలసి విహారయాత్రకు వెళ్లింది. ఆపై 8వ తేదీ హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో గల్లంతైన విషయం తెలిసిందే.
బుధవారం ఆమె మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. శుక్రవారం ఆమె మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామమైన బంగారుపాళెం మండలం పాపానివారిపల్లెకు తరలించారు. రిథిమా మృతదేహానికి కుటుంబ సభ్యులు, బంధువులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి పాపాని శ్రీనివాస్ కుమార్తె అంతిమ సంస్కారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రిథిమా మృతదేహాన్ని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి నివాళులర్పించారు. బంధువులను ఓదార్చారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు లలితకుమారి, వెంకటేశ్వర చౌదరి, మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ, డీఆర్‌వో పెంచలకిషోర్, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివకుమార్, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విజయసింహారెడ్డి, బంగారుపాళెం తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐలు మధుసూదన్‌నాయుడు, శివకుమార్, టీడీపీ మండలాధ్యక్షుడు జయప్రకాష్, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు రామచంద్రారెడ్డి తదితరులు రిథిమా మృతదేహాన్ని సందర్శించారు. తిరుపతి విమానాశ్రయంలో తిరుపతి ఆర్డీవో రంగయ్య, రేణిగుంట తాహశీల్దార్ మనోహర్ విమానాశ్రయానికి చేరుకుని రిథిమా మృతదేహానికి నివాళులర్పించారు.