విషాదం నింపిన విహారయాత్ర
⇒జీపును ఢీకొన్న కంటైనర్ వాహనం: నలుగురి దుర్మరణం
⇒మృతుల్లో ముగ్గురు మహిళలు,కంటైనర్ డ్రైవర్
⇒ హైదరాబాద్‌ను సందర్శించి కర్ణాటక వెళ్తుండగా ప్రమాదం
⇒శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ వద్ద ఘటన
శంషాబాద్ రూరల్: వారంతా ఒకే గ్రామానికి చెందిన బంధువులు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా హైదరాబాద్‌కు విహారయాత్రకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మధుర స్మృతులు నెమరువేసుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే వారిపై మృత్యువు పంజా విసిరింది. వారు ప్రయాణిస్తున్న జీపును కంటైనర్ వాహనం రూపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న ముగ్గురు మహిళలతో పాటు కంటైనర్ డ్రైవర్ దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ప్రాంతంలోని ఫర్తాబాద్‌కు చెందిన రాజశేఖర్‌కు తన సొంత జీపును నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బంధువులు 12 మంది ఆదివారం ఉదయం 7 గంటలకు విహారయాత్ర నిమిత్తం హైదరాబాద్‌కు బయలుదేరారు. సాయంత్రం వరకు చార్మినార్, బిర్లా మందిర్ తిలకించారు. రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూసేందుకు వచ్చారు. అక్కడే రాత్రి 12 గంటల వరకు సరదాగా గడిపారు.
మరోమార్గంలో వెళ్తూ..
ఉదయం హైదరాబాద్ కు వీరు బీజాపూర్ మార్గంలో చేవెళ్ల మీదుగా వచ్చారు. శంషాబాద్ నుంచి షాద్‌నగర్-పరిగి దారిలో కర్ణాటక వెళ్లొచ్చని ఎయిర్‌పోర్ట్‌లో ఓ డ్రైవర్ వీరికి చెప్పాడు. దీంతో వారు బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఘాంసిమియాగూడకు చేరుకున్నారు. చీకటి కావడంతో జీపు డ్రైవర్ రాజశేఖర్ దారి తప్పినట్లు భావించాడు. దీంతో ఘాంసిమియాగూడ వద్ద బస్టాప్ వద్ద యూటర్న్ తీసుకుని అక్కడ ఉన్న ఓ హోటల్‌లో దారి గురించి వాకబు చేద్దామని జీపును రోడ్డు పక్కన నిలిపాడు.
ఇదే సమయంలో షాద్‌నగర్ నుంచి బైక్‌ల లోడుతో శంషాబాద్ వైపు వస్తున్న ఓ కంటైనర్ వాహనం వీరి జీపును వెనక నుంచి ఢీకొంది. ప్రమాద తీవ్రతకు జీపు వెనక వైపు డోరు ఊడిపోయింది. కంటైనర్ జీపును సుమారు వంద అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత జీపు రోడ్డు అవతలి వైపు ఉన్న గుంతలో పడిపోగా కంటైనర్ ప్రమాద స్థలం నుంచి సుమారు 250 అడుగుల వరకు డివైడర్ మీదుగా వెళ్లి అదుపుత ప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ సంఘటనతో జీపులో ఉన్న వారు తీవ్రగాయాలతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.
తోడికోడళ్లు మృతి..
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జీపు వెనక వైపు కూర్చున్న గీత(29)కు తీవ్రగాయాలవడంతో శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈమె తోడికోడలు కమలాబాయి(33), ప్రియాంక(20), కవిత, ఐశ్వర్య, బసమ్మకు తీవ్రగాయాలవడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కమలాబాయి, ప్రియాంక సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. జీపులో ఉన్న బస్వరాజు, శర ణు, రేణుక, అన్నపూర్ణ, లక్ష్మీబాయి, కవిత, జీపు డ్రైవర్ రాజశేఖర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృత్యువుతో పోరాడి..
ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ వైపు బోల్తాపడింది. దీంతో వాహనం డ్రైవర్ జ్ఞానేశ్వర్(50) క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. జాకీ సహాయంతో పోలీసులు అతి కష్టం మీద డ్రైవర్‌ను బయటకు తీశారు. అతని రెండు కాళ్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో కాళ్లకు తీవ్ర రక్తస్రావమైంది. అపస్మారక స్థితికి చేరుకున్న అతణ్ని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా సోమవారం ఉదయం మృతి చెందాడు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన జ్ఞానేశ్వర్‌కు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. పోలీసులు సోమవారం నలుగురి మృతదేహాలకు ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
ట్రాఫిక్‌కు అంతరాయం..
రోడ్డు ప్రమాదంలో కంటైనర్ వాహనం రహదారిపై బోల్తా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం భారీ క్రేన్ సహాయంతో కంటైనర్‌ను రహదారిపై నుంచి తొలగించారు.