విషాద యాత్ర
విహార యాత్రకు వెళ్లి ఏడుగురు మృతి
మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు
మరో ఇద్దరు బంధువులు
మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్లు మండలంలో ఘటన
చాంద్రాయణగుట్ట: విహార యాత్ర విషాదాంతం కావడంతో పాతబస్తీలో విషాదం నెలకొంది. విహారయాత్ర కోసం వెళ్లిన వారిని చెరువు రూపంలో మత్యువు కబళించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఇద్దరు బంధువులు మృతి చెందడంతో చాంద్రాయణగుట్ట అల్ జుబేల్ కాలనీ, ఘాజీమిల్లత్ కాలనీ, హషమాబాద్‌లలో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. అల్ జుబేల్ కాలనీకి చెందిన అహ్మద్ బేగ్ అలియాస్ బాబు బాయి ఉస్మానియా మార్చురీలో పని చేస్తున్నాడు. బుధవారం అతను కుటుంబ సభ్యులతో కలిసి ఆమనగల్లు మండల పరిధిలోని సరికొండ గౌరమ్మ చెరువుకు విహార యాత్రకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో బేగ్ ఇద్దరు కుమారులు సల్మాన్ (30), రహెమాన్ (19), కుమార్తె రొఖియా బేగం(18), కోడలు మోనా సుల్తానా (20), అల్లుడు షేక్ బాసిత్ (30), హషమాబాద్‌కు చెం దిన బంధువుల అమ్మాయి ముస్రత్ ఫాతీమా (19), వట్టేపల్లికి చెందిన ముస్కాన్ (18)లతో కలిసి మొత్తం 13 మంది రెండు వాహనాల్లో సరిగొండ గౌరమ్మ చెరువుకు వెళ్లారు. అయితే వీరిలో ఒకరు చెరువులోకి దిగుతుండగా అందులో పడి పోవడంతో వారిని కాపాడే క్రమంలో ఒకరి తరువాత ఒకరు మొత్తం ఏడు మంది చెరువులో దిగి మృతి చెందారు. దీనిపై సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం గురువారం నగరానికి తీసుకురానున్నట్లు తెలిసింది.
బేగ్ కుటుంబంలో ఐదుగురు..
కాగా ఈ ఘటనలో అహ్మద్ బేగ్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం స్థానికులను కలచివేస్తోంది. బేగ్ ఇద్దరు కుమారులతో పాటు కోడలు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. చిన్న కుమార్తె రొఖియా బేగం మృతి చెందగా, పెద్ద కుమార్తె అస్మా బేగం భర్త బాసిత్ అసువులు బాసాడు. దీంతో ఆ కుటుంబంలో బేగ్ దంపతులతో పాటు పెద్ద కుమార్తె ఒక్కరే మిగి లారు. విదేశాలకు వెళ్లిన బేగ్ భార్య గురువారం హైదరాబాద్‌కు తిరిగిరానున్నట్లు బంధువులు తెలిపారు.
పెళ్లయిన 4నెలలకే..
మృతుల్లో ఒకరైన మోనా బేగం అలియాస్ మోనా సుల్తానాకు అహ్మద్ బేగ్ కుమారుడు సల్మాన్‌తో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. కాగా సల్మాన్, మోనాలిద్దరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో మోనా కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
3నెలల క్రితమే రొఖియా బేగంకు నిశ్చితార్థం
అహ్మద్ బేగ్ చిన్న కుమార్తె రొఖియా బేగంకు మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసుకుంటూ ఇరు కుటుంబాలు ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రొఖియా బేగం ఈ ప్రమాదంలో మృతి చెందడంతో వరుడి కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.
ఆరుగురు క్షేమం
మొత్తం 13మంది విహారానికి వెళ్లగా అందులో ఆరుగురు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుం చి బయటపడిన వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. ఒకరిని కాపాడేందుకు ఒకరు చెరువులోకి వెళ్లి మరణించగా.. వీరు పిల్లలు, వృద్ధులు కావడంతో వారిని కాపాడే ప్రయత్నం చేయలేక పోయారు. దీంతో వారు ప్రమాదంలో చిక్కుకోలేదు.
నగరానికి చేరుకున్న మృతదేహాలు...
కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో పోస్టు మార్టమ్ నిర్వహించిన అనంతరం ఏడుగురి మృతదేహాలను బుధవారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలోని హషామాబాద్, ఆల్‌బుబేర్‌కాలనీ, జీఎం కాలనీలలోని వారి నివాసాలకు తరలించారు. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, మజ్లిస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
వెల్దండ: ఆమనగల్లు మండలం చరికొండ గౌరమ్మ చెరువులో పడి మృతి చెందిన ఏడు మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ శ్రీదేవితో పాటు ప్రజాప్రతినిధులు మృతదేహలను పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. మృతుల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెప్పారు.
పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రహ్మాన్
అహ్మద్ బేగ్ చిన్న కుమారుడు పదో తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. బుధవారం జరిగిన ప్రమాదంలో రహ్మాన్ మృతి చెందినట్లు తెలుసుకున్న అతని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటలోనే మృతి చెందిన హషమాబాద్‌కు చెందిన ముస్రత్ ఫాతీమా ఇంటర్ పరీక్షలు రాసింది. మరో మృతురాలు ముస్కాన్ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటున్నందున ఆమె అహ్మద్ బేగ్ ఇంటిలోనే ఆశ్రయం పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు.