చిత్తడి నేలల్లో...చినుకుతో విహారం | Chinu excursion wetland ... | Sakshi
Sakshi News home page

చిత్తడి నేలల్లో...చినుకుతో విహారం

Published Fri, Jul 25 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

చిత్తడి నేలల్లో...చినుకుతో విహారం

చిత్తడి నేలల్లో...చినుకుతో విహారం

రుతుపవనాలు ఆలస్యంగా పలకరించడంతో అన్నిచోట్లా వరుణుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల మోస్తరు.. కొన్ని చోట్ల అడపాదడపా కురిసే వానలు తేయాకు తేటల్లో విరివిగా కురుస్తున్నాయి. చినుకుల్లో తడిసి, ఆహ్లాదం పొందాలకునేవారిని ఈ భూతల స్వర్గాలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.  వానకాలం వారాంతాలకు వేదికగా మారిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి - వైత్రి హిల్ స్టేషన్, మున్నార్, కూర్గ్, మహాబలేశ్వర్, గోవా!
 
 పచ్చందనాల పరవశం వైత్రి హిల్ స్టేషన్

 కేరళలోని వయనాడు జిల్లాలో ఉంది వైత్రి. ఈ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్వత ప్రాంతం ఇది. ఇక్కడ చూడదగిన అద్భుత సుందర దృశ్యాలు ఎన్నో మనస్సును కట్టిపడేస్తాయి. అందుకే పర్యాటకులకు మేలిమి పిక్నిక్ స్పాట్‌గా మారింది - వైత్రి. ఇక్కడ చూడదగిన వాటిలో ప్రధానమైనవి కరలాడ్ సరస్సు, లక్కిడి. సముద్ర మట్టం నుంచి 700 మీటర్ల ఎత్తులో ఉన్న లక్కిడి రహదారులన్నీ మలుపులు మలుపులుగా ఉంటుంది. ఈ మలుపుల్లో ప్రయాణించేటప్పుడు పవనాల తాకిడి గిలిగింతలు పెడుతుంది. వైత్రికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూకోట్ సరస్సులో పడవ ప్రయాణం, చుట్టూ అటవీ ప్రాంతం, పిల్లల పార్క్, అడవి బిడ్డల హస్తకళలు అమితంగా ఆకట్టుకుంటా యి. వయనాడు దగ్గరలో బాన్సువారా సాగర్ డ్యామ్, కురువా ద్వీపం, ఎడక్కల్ గుహల్, సూజిపరా జలపాతం, మీన్‌ముట్టి జలపాతం, ప్రాచీన మ్యూజియం, జైన్ దేవాలయం, కరపుజా డ్యామ్‌లు చూడదగినవి. ఇక్కడే ఉన్న చెంబ్రా పర్వతం ట్రెక్కింగ్ చేసేవారికి గొప్ప అనుభూతిని ఇస్తుంది. సమీప రైల్వేస్టేషన్ కోళిక్కోడ్ 63 కి.మీ, 73 కి.మీ దూరంలో కరిపుర అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి.  హైదరాబాద్ నుంచి కోళిక్కోడ్ చేరుకొని, అక్కడ నుంచి కారులో వైత్రికి చేరుకోవచ్చు. రోడ్డుమార్గాన హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరి అక్కడి నుంచి వైత్రికి చేరుకోవచ్చు.

వైత్రిలో వసతుల కోసం: www.vythiriresort.com, www.the windflower.com, www.wayanadresorts.com, silenttreckకు లాగిన్ అవ్వచ్చు. వైత్రి పర్యాటక శాఖ ఫోన్ నెంబర్లు: 09497492882, 09562591233, 09447181160.
 
 ముచ్చట గొలిపే మున్నార్

 ముద్రపూజ, నల్లతన్ని, కుండల.. అనే మూడు పర్వతాలు ఉన్న ప్రాంతమే కేరళలోని మున్నార్. సముద్రమట్టానికి 1,600 మీటర్ల ఎత్తులో ఈ ఉన్న ప్రాంతం తేయాకు తోటల పెంపకానికి అనువైనది. చిన్న చిన్న టౌన్లు, గాలిమరల దారులు గల ఈ ప్రాంతంలో పేరొందిన రిసార్టులు ఉన్నాయి. వర్షాలు విస్తారంగా కురిసే ఈ కాలం అటవీ ప్రాంతంలో గల గడ్డిమైదానాలు, వాటిలో పువ్వుల సోయగాలు మనసులను ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడి అనముడి ప్రాంతం పర్వతారోహకులకు అనువైనది. మరిన్ని సుందర ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఎరవికులమ్ ఉద్యానం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యానంలో అరుదైన సీతాకోకచిలుకలు, జంతువులు, పక్షులు కనువిందు చేస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే తేయాకు తోటలతో నిండి ఉన్న పర్వతసానువులు పచ్చని చీరను సింగారించుకున్నట్టు కనిపిస్తాయి. మున్నార్‌కి 13 కి.మీ దూరంలో ఉన్న మట్టుపెట్టి మరో ఆసక్తికరమైన ప్రదేశం. ఇక్కడే మసోన్రీ డ్యామ్ స్టోరేజీ వాటర్‌తో తయారైన అందమైన సరస్సు ఉంది. ఇందులో బోట్ రైడ్ ఉత్సాహకరమైన క్రీడగా చెప్పుకోవచ్చు. మట్టుపెట్టిలో చిన్నా, పెద్ద జలపాతాలకు అలవాలమైన ప్రాంతాలు చిన్నకనాల్, అనయిరంగాల్. మున్నార్‌కు 22 కి.మీ దూరంలో ఉంటాయి. కేరళ పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు మున్నార్-కొడెకైనాల్ రోడ్డు మార్గాన వెళుతుంటే ఆ ప్రయాణం పర్యాటకులకు ఊహించని ఆనందాన్నిస్తుంది.
 
హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో ఎర్నాకుళం చేరుకొని, అక్కడ నుంచి 130 కి.మీ దూరంలో ఉన్న మున్నార్‌కి కారులో వెళ్లచ్చు. రైలు మార్గాన హైదరాబాద్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి కొచ్చి చేరుకొని, అక్కడ నుంచి బస్సుల ద్వారా మున్నార్ వెళ్ళవచ్చు. వసతి సదుపాయాల కోసం www.teacounty munnar.comకు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ క్లబ్ మహీంద్రా, అబద్ హోటల్స్, క్లౌడ్ 9, దేశ్‌దన్.. మొదలైనవి వసతి సదుపాయాలు కల్పిస్తున్నాయి.
 
మనసు దోచే సుందరచిత్రం మడికేరి

కర్నాటకలోని కొడగు జిల్లాలో ఉంది మడికేరి. ఈ ప్రాంతాన్నే అంతా కూర్గ్‌గా పేర్కొంటుంటారు. కాఫీ, ఏలకుల తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధం. పడమటి కనుమల్లో కనువిందు చేసే ఇక్కడి పచ్చదనం వర్షాకాలంలో ప్రకృతి ప్రియులను కట్టిపడేస్తుంది. హైదరాబాద్ నుంచి 797 కి.మీ దూరంలో ఉన్న కూర్గ్‌కు రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి కారులో బయల్దేరితే 13 గంటల సమయం పడుతుంది. ఇక్కడి వసతి సదుపాయాల కోసం.. www.plantationtrails.net/ www.orangecounty.in/coorg-resorts/www.kadkani.com/ KTDC Mayura hoteను సంప్రదించవచ్చు. కూర్గ్‌లో ప్లాంటేషన్ ట్రయల్స్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాల కోసం ఫోన్: +9108023560761/235606595, మొబైల్: +91-80-23346074/73లలో సంప్రదించవచ్చు
 
ఉత్కంఠభరితం మహాబలేశ్వరం

అబ్బురపరిచే శిఖరపు అంచులు, ఉత్కంఠ కలిగించే లోయలు, అచ్చెరువొందించే అటవీ వృక్ష సంపద.. వీటి మీదుగా పలకరించే వర్షపు జల్లులు మహాబలేశ్వర్ సందర్శకులను ఓ వింతైన అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాదు కొండలపై నుంచి సాగే చల్లని గాలులు మేనిని తాకి గిలిగింతలు పెడతాయి. మహారాష్ట్రలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన హిల్ స్టేషన్ ఇది. ఇక్కడికి విచ్చేసే సందర్శకులు ప్రకృతిని, చారిత్రక కట్టడాలను చూసి తరించవచ్చు. ఇక్కడ మౌంట్ మల్‌కోమ్, మరోజి క్యాజిల్, మహాబలేశ్వర్ క్లబ్ చూశాక సుందరమైన వెన్నా సరస్సుకు చేరుకోవాలి. అక్కడ బోటులో షికార్లు, చేపలు పట్టడం, రైడింగ్ చేయడం వంటి క్రీడల ద్వారా ఉల్లాసాన్ని పొందవచ్చు. దగ్గరలోనే పంచ్‌గని, స్ట్రాబెర్రీ తోటలను వీక్షించవచ్చు. మహాబలేశ్వర్ చుట్టుపక్కల పేరొందిన పంచగంగ మందిర్, కోయనా, వెన్నా, సావిత్రి, గాయత్రి, కృష్ణా నదీ పాయల సోయగం, బాబింగ్టన్ పాయింట్‌లోని దోమ్ డ్యామ్, మహాబలేశ్వర్ మందిరం దర్శించవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రాంత సందర్శన పర్యాటకులకు ఆనందానుభూతులను మిగులుస్తుంది.
  దీనికి దగ్గరలో పుణేలో (120 కి.మీ) విమానాశ్రయం ఉంది. వసతి సదుపాయాల కోసం ఎమ్‌టిడిసి హాలీడే రిసార్ట్స్‌ను సంప్రదించవచ్చు.
 
 వర్షంలో హర్షం గోవా

 లక్షలాది పర్యాటకులను అమితంగా ఆకట్టుకు నే ప్రాంతం గోవా. వేసవిలో నిశ్శబ్దంగా ఉండే గోవా జులై మాసాన అడుగుపెట్టే వర్షరుతువు లో అత్యద్భుతంగా కనివిందు చేస్తుంది. అందుకే వర్షాకాలంలోనూ గోవా పర్యటనకు ఆసక్తి చూపే పర్యాటకులు పెరుగుతున్నారు. ఉన్నట్టుండి మబ్బుల పట్టిన ఆకాశం, ఆ వెంటనే సూర్యకాంతి వెలుగులు ఆహ్లాదపరుస్తుంటాయి. దాదాపు 80 బీచ్‌లు, ఇసుక తీరాలు కనువిందు చేస్తుంటాయి. ప్యారాచూట్స్, బోట్‌రైడింగ్, బైక్ రైడింగ్‌లో ఉల్లాసాన్ని పొందవచ్చు. గోవాకే ప్రత్యేకమైన అతిపెద్ద ప్రాచీన చర్చ్‌నీ, సహజసిద్ధమైన జలపాతాల అందాలనూ వాన జల్లుల మధ్య ఎంత సేపు చూసినా తనివి తీరదు. గోవా సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎన్నో హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ఇవి ప్రత్యేక వర్షాకాల ప్యాకేజీలను డిస్కౌంట్ రేట్లలో ఇస్తున్నాయి.  హైదరాబాద్ నుంచి రాయచూర్-భాగల్‌కోట్- బెల్గామ్‌ల మీదుగా గోవా చేరుకోవచ్చు. దూరం 660 కి.మీ. హైదరాబాద్ నుంచి వోల్వో బస్సు సదుపాయాలు ఉన్నాయి. పావ్‌లో ట్రావెల్స్ ఫోన్ నెం: +91-40-66515051/66625856/66625857, కేశినేని ట్రావెల్స్ మొబైల్ నెం: +919849051414, ఎస్‌విఆర్ ట్రావెల్స్ ఫోన్: 040-23735005, 23755442, 237332444. హైదరాబాద్ నుంచి రైలు మార్గాన వాస్కో-డ-గామ్ ఎక్స్‌ప్రెస్‌లో నేరుగా గోవాకు చేరుకోవచ్చు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు హైదరాబాద్ నుంచి గోవా వెళుతుంటాయి.  మరిన్ని వివరాల కోసం ఇండియా పర్యాటక శాఖ వారిని సంప్రదించవచ్చు. ఫోన్ నెం: 040-23409199
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement