
పోరాట స్వరం @100
పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా లిబియా లోబో సర్దేశాయ్ పేరు వార్తల్లోకి వచ్చింది. నిజానికి లిబియా లోబో సర్దేశాయ్ అనేది ఒక పేరు కాదు. స్వాతంత్య్ర పోరాట స్వరం. గోవా స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన లోబో సర్దేశాయ్ పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి అటవీప్రాంతంలో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే రేడియో స్టేషన్‌నిప్రారంభించారు.
పద్మశ్రీ (Padma Shri) పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా... పోర్చుగీస్ పాలన నుంచి గోవాకు విముక్తి లభించిన రోజు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది గోవా స్వాతంత్య్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయ్(lobo sardesai).
గోవాకు విముక్తి లభించిన రోజున తన సహోద్యోగి, ఆ తర్వాత భర్త వామన్ సర్దేశాయ్‌తో కలిసి భారత వైమానిక దళం విమానంలో పనాజీ, గోవాలోని ఇతర ప్రాంతాల మీదుగా ప్రయాణించింది. అందులోని రేడియో ట్రాన్సిస్టర్‌కు లౌడ్ స్పీకర్ అమర్చి పోర్చుగీస్, కొంకిణి భాషల్లో ప్రకటనలు చేసి వారు కరపత్రాలు విసిరారు.
‘పోర్చుగీసు వారు లొంగిపోయారు. 451 సంవత్సరాల వలస పాలన తరువాత గోవా స్వాతంత్య్రం పొందింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం.
‘ఈరోజు కూడా అలాంటి సంతోషమే నాకు కలిగింది. ఇలాంటి క్షణాలు నా జీవితంలో అరుదు. ఈ అవార్డు ఆశ్చర్యకరమైన ఆనందాన్ని కలిగించింది. నేనెప్పుడూ ఊహించలేదు. కోరుకోలేదు. ఈ అవార్డు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని, స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను’ అంటుంది లోబో సర్దేశాయ్. గత ఏడాది మేలో ఆమె శతవసంతాన్ని పూర్తి చేసుకుంది.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో (lobo sardesai)లోబో సర్దేశాయ్... ఇటాలియన్ యుద్ధ ఖైదీలు రాసిన రహస్య లేఖలను అర్థం చేసుకుంటూ, సెన్సార్ చేస్తూ ట్రాన్స్‌లేటర్ గా పనిచేసింది. బొంబాయిలోని ఆల్ ఇండియా రేడియోలో స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్‌గా పనిచేసింది. తరువాత న్యాయవాద వృత్తిలోకి వచ్చింది. కాలేజీలో చదివే రోజుల్లో గోవా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేది. విమోచనానంతరం న్యాయవాదిగా ప్రాక్టిస్ చేయడంతో పాటు మహిళా సహకార బ్యాంకును స్థాపించింది. రాష్ట్ర పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన తొలి టూరిజం డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ఆమెకు ‘పద్మ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై పణాజీలోని సర్దేశాయ్ నివాసానికి వెళ్లి ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందించి, అభినందించారు. ఆమె మరింతకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సర్దేశాయ్ జీవన గాథను శ్రద్ధగా అధ్యయనం చేసి, దానినుంచి స్ఫూర్తిని పొందవలసిందిగా విద్యార్థులకు సూచించారు. ‘మీరు చెబుతున్నంత గొప్పదాన్నేమీ కాదు, నా మార్గంలోకి ఏమి వచ్చిందో, నేను అదే చేసుకుంటూ పోయాను అంతే’ అని నిండుగా నవ్వారామె.
మేలు బొమ్మలు@98
‘తోలు బొమ్మలాట’ ఆడిస్తూనే 98 ఏళ్లకు చేరుకున్న భీమవ్వ చిర్నవ్వు నవ్వింది. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటించారు. టీవీలు, సినిమాలు, ఓటీటీలు వచ్చినా భారతీయ సంప్రదాయకళను ఏ ప్రయోజనం ఆశించక ఆమె కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ‘పద్మశ్రీ’ ఇస్తే ఆమె చేతి వేళ్లు కదిలి తోలుబొమ్మలు చప్పట్లు కొట్టొచ్చు. కాని నిజమైన చప్పట్లు జనం నుంచి ఆమెకు ఎప్పుడో దక్కాయి. భీమవ్వ లాంటి వాళ్లు రుషులు. పురస్కారాలకే వీరి వల్ల గౌరవం.
భక్తులకు పుణ్యక్షేత్రాలు ఉంటాయి. కానీ ‘తోలుబొమ్మలాట’కు ఒక పుణ్యక్షేత్రం ఉందీ అంటే అది కర్నాటకలోని కొప్పల్ జిల్లాలోని ‘మొరనాల’ అనే పల్లెలో ఉన్న భీమవ్వ ఇల్లే. ఆ ఇంట్లో ఎవర్ని కదిలించినా తోలుబొమ్మలాట వచ్చు అని చెబుతారు. భీమవ్వకు ఇప్పుడు 96 సంవత్సరాలు. ఆమె కొడుకు కేశప్ప, మనవలు, మునిమనవలు అందరూ తోలుబొమ్మలాటలో నిమగ్నమై ఉన్నారు.
ఎందుకంటే వారి వంశం కనీసం రెండు వందల ఏళ్లుగా తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంది. ‘నేను 14 ఏళ్ల వయసులో తోలుబొమ్మలాట నేర్చుకున్నాను’ అంటుంది భీమవ్వ. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటన వచ్చాక ఆమె ఇల్లు, ఊరు మాత్రమే కాదు మొత్తం కొప్పల్ జిల్లా సంబరం చేసుకుంటూ ఉంది. ఎందుకంటే భీమవ్వ ఆట కట్టని పల్లె ఆ జిల్లాలో లేదు. కర్నాటకలో లేదు. భీమవ్వ అందరికీ తెలుసు. ఉత్సవాలకు, జాతర్లకు భీమవ్వ ఆట ఉందంటే జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడూ ఆ ఘనత చెరగలేదు.
‘నేను రామాయణ, మహాభారతాలను పొల్లు పోకుండా పాడగలను. భారతంలోని పద్దెనిమిది పర్వాలకూ ఆట కడతాను. అయితే కురుక్షేత్రం, కర్ణ పర్వం, ద్రౌపది వస్త్రాపహరణం, ఆది పర్వం ఇవి ఎక్కువగా చె΄్తాను. జనం వీటిని బాగా అడుగుతారు. రామాయణంలో లవకుశుల కథ చాలామందికి ఇష్టం’ అని చెప్పింది భీమవ్వ.
గ్రామీణ కళ, జానపద కళ అయిన తోలుబొమ్మలాటను కర్నాటకలో ‘తొగలు గొంబెయాట’ అంటారు.
తెలుగులో ఒకప్పుడు ప్రసిద్ధంగా ఉన్నట్టే కర్నాటకలో కూడా ఈ కళ ప్రసిద్ధం. అయితే భీమవ్వ వంశం దాని కోసం జీవితాలను అంకితం చేసింది. కనుక అక్కడ ఇంకా ఆ ఆట వైభవం కొనసాగుతూ ఉంది. ‘తోలు బొమ్మలాటలో నేనే రాముణ్ణి, సీతను, లక్ష్మణున్ని. అందరి పాటలూ పాడతాను. నా ఆట గొప్పదనం తెలిసిన ప్రపంచ దేశాలు నన్ను పిలిచి ఆట చూపించమన్నాయి. అమెరికా, పారిస్, ఇటలీ, ఇరాన్, ఇరాక్, స్విట్జర్లాండ్ ఈ దేశాలన్నింటికి వెళ్లి తోలుబొమ్మలాట ఆడాను’ అందామె. అదొక్కటే కాదు ఆమె దగ్గర 200 ఏళ్ల కిందటి తోలుబొమ్మలు భద్రపరిచి ఉన్నాయి.
శిక్షణ ఇస్తున్నా
తనకు తెలిసిన విద్య తన వాళ్లకే అనుకోలేదు భీమవ్వ(Bhimavva). ప్రతి ఏటా కొంతమంది యువతను ఎంపిక చేసి తోలుబొమ్మలాట(puppeteer)లో శిక్షణ ఇస్తుంది. అది నేర్చుకున్నవారు ఆటను కొనసాగిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం ఈ కృషిని గుర్తించి ఎన్నో పురస్కారాలు ఇచ్చింది. జనం భీమవ్వను గుండెల్లో పెట్టుకున్నారు. ‘ఇది మనదైన విద్య. దీనిని పోగొట్టుకోకూడదు. మన గ్రామీణ కళల్లో నీతి ఎంతో ఉంటుంది. మనిషికి నీతి చెప్పడానికైనా ఇలాంటి కళలను కాపాడుకోవాలి’ అంది భీమవ్వ.
భీమవ్వ ఎన్నోసార్లు విమానం ఎక్కింది. కాని ఈసారి ఎక్కబోయే విమానం ఆమెను ‘పద్మశ్రీ’ ఇవ్వనుంది. ప్రధాని, కేంద్ర మంత్రులు, పెద్దలు కరతాళధ్వనులు చేస్తుండగా రాష్ట్రపతి చేతుల మీద ఆమె పద్మశ్రీ అందుకుని తోలు బొమ్మల ఆటకు కిరీటం పెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment