radio station
-
అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు..ఉగ్రవాదుల పనే..?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ల్లో ఇటీవల అనుమానాస్పద రేడియో సంకేతాలను గుర్తించారు. ఇవి దేశంలో త్వరలో జరగబోయే ఉగ్రదాడులకు సంబంధించిన సంకేతాలేనని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ యాసలో ఉర్దూ,బెంగాలీ,అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను గత రెండు నెలలుగా తమ ఆపరేటర్లు గుర్తించారని తెలిపింది.పశ్చిమ బెంగాల్‌తో సరిహద్దులున్న బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు నెలకొనడం, ఇదే సమయంలో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ అధికారులు సన్నిహితంగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. మళ్లీ ఇటువంటి సిగ్నల్స్ వస్తే తమకు తెలియజేయాని రేడియో ఆపరేటర్లకు పోలీసులు సూచించారు.గతేడాది డిసెంబర్లో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హట్,బొంగావ్,దక్షిణ 24 పరగణాలలోని సుందర్బన్స్ ప్రాంతాల నుంచిఉర్దూ, అరబిక్ భాషలను వాడి వివిధ కోడ్లలో మాట్లాడుకుంటున్నట్లు తాము గుర్తించినట్లు హామ్ రేడియో సంస్థ అధికారులు తెలిపారు. మరికొన్ని సార్లు ఇతర భాషల్లోనూ సిగ్నల్స్ అందుతున్నాయన్నారు.అయితే, తాము తొలుత వీటిని పట్టించుకోలేదన్నారు.జనవరిలో జరిగిన గంగాసాగర్ మేళా సమయంలో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమై కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.ఈ కోడ్ భాష అర్థం తెలుసుకోవడానికి కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్ (రేడియో)కి సమాచారం పంపినట్లు బీఎస్ఎఫ్ అధికారి పేర్కొన్నారు. స్మగ్లర్లు,తీవ్రవాద గ్రూపులు రహస్య చర్చల కోసం ఇటువంటి సంకేతాలను వినియోగించుకుంటారన్నారు. వీటిని ట్రాక్ చేయడం కష్టమయినప్పటికీ డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 2002-03లో కూడా ఇదే విధంగా వచ్చిన అనుమానాస్పద సంకేతాలను ట్రాక్ చేసి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగాసాగర్ ప్రాంతం నుంచి అక్రమ రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న ఆరుగురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నామన్నారు.2017లో బసిర్‌హట్‌లో మత ఘర్షణలు జరగడానికి ముందు హామ్ రేడియో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలను వినిపిస్తున్నాయని తెలిపినట్లు చెప్పారు. హామ్ రేడియో దేశ భద్రత విషయంలో అనేకసార్లు కీలక పాత్ర పోషించిందన్నారు. -
ఈ అమ్మల ఒడికి చేరిన పద్మాలు
పోరాట స్వరం @100పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా లిబియా లోబో సర్దేశాయ్ పేరు వార్తల్లోకి వచ్చింది. నిజానికి లిబియా లోబో సర్దేశాయ్ అనేది ఒక పేరు కాదు. స్వాతంత్య్ర పోరాట స్వరం. గోవా స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన లోబో సర్దేశాయ్ పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి అటవీప్రాంతంలో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే రేడియో స్టేషన్నిప్రారంభించారు.పద్మశ్రీ (Padma Shri) పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా... పోర్చుగీస్ పాలన నుంచి గోవాకు విముక్తి లభించిన రోజు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది గోవా స్వాతంత్య్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయ్(lobo sardesai).గోవాకు విముక్తి లభించిన రోజున తన సహోద్యోగి, ఆ తర్వాత భర్త వామన్ సర్దేశాయ్తో కలిసి భారత వైమానిక దళం విమానంలో పనాజీ, గోవాలోని ఇతర ప్రాంతాల మీదుగా ప్రయాణించింది. అందులోని రేడియో ట్రాన్సిస్టర్‌కు లౌడ్ స్పీకర్ అమర్చి పోర్చుగీస్, కొంకిణి భాషల్లో ప్రకటనలు చేసి వారు కరపత్రాలు విసిరారు.‘పోర్చుగీసు వారు లొంగిపోయారు. 451 సంవత్సరాల వలస పాలన తరువాత గోవా స్వాతంత్య్రం పొందింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం.‘ఈరోజు కూడా అలాంటి సంతోషమే నాకు కలిగింది. ఇలాంటి క్షణాలు నా జీవితంలో అరుదు. ఈ అవార్డు ఆశ్చర్యకరమైన ఆనందాన్ని కలిగించింది. నేనెప్పుడూ ఊహించలేదు. కోరుకోలేదు. ఈ అవార్డు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని, స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను’ అంటుంది లోబో సర్దేశాయ్. గత ఏడాది మేలో ఆమె శతవసంతాన్ని పూర్తి చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో (lobo sardesai)లోబో సర్దేశాయ్... ఇటాలియన్ యుద్ధ ఖైదీలు రాసిన రహస్య లేఖలను అర్థం చేసుకుంటూ, సెన్సార్ చేస్తూ ట్రాన్స్‌లేటర్ గా పనిచేసింది. బొంబాయిలోని ఆల్ ఇండియా రేడియోలో స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్‌గా పనిచేసింది. తరువాత న్యాయవాద వృత్తిలోకి వచ్చింది. కాలేజీలో చదివే రోజుల్లో గోవా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేది. విమోచనానంతరం న్యాయవాదిగా ప్రాక్టిస్ చేయడంతో పాటు మహిళా సహకార బ్యాంకును స్థాపించింది. రాష్ట్ర పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన తొలి టూరిజం డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.ఆమెకు ‘పద్మ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై పణాజీలోని సర్దేశాయ్ నివాసానికి వెళ్లి ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందించి, అభినందించారు. ఆమె మరింతకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సర్దేశాయ్ జీవన గాథను శ్రద్ధగా అధ్యయనం చేసి, దానినుంచి స్ఫూర్తిని పొందవలసిందిగా విద్యార్థులకు సూచించారు. ‘మీరు చెబుతున్నంత గొప్పదాన్నేమీ కాదు, నా మార్గంలోకి ఏమి వచ్చిందో, నేను అదే చేసుకుంటూ పోయాను అంతే’ అని నిండుగా నవ్వారామె. మేలు బొమ్మలు@98‘తోలు బొమ్మలాట’ ఆడిస్తూనే 98 ఏళ్లకు చేరుకున్న భీమవ్వ చిర్నవ్వు నవ్వింది. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటించారు. టీవీలు, సినిమాలు, ఓటీటీలు వచ్చినా భారతీయ సంప్రదాయకళను ఏ ప్రయోజనం ఆశించక ఆమె కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ‘పద్మశ్రీ’ ఇస్తే ఆమె చేతి వేళ్లు కదిలి తోలుబొమ్మలు చప్పట్లు కొట్టొచ్చు. కాని నిజమైన చప్పట్లు జనం నుంచి ఆమెకు ఎప్పుడో దక్కాయి. భీమవ్వ లాంటి వాళ్లు రుషులు. పురస్కారాలకే వీరి వల్ల గౌరవం.భక్తులకు పుణ్యక్షేత్రాలు ఉంటాయి. కానీ ‘తోలుబొమ్మలాట’కు ఒక పుణ్యక్షేత్రం ఉందీ అంటే అది కర్నాటకలోని కొప్పల్ జిల్లాలోని ‘మొరనాల’ అనే పల్లెలో ఉన్న భీమవ్వ ఇల్లే. ఆ ఇంట్లో ఎవర్ని కదిలించినా తోలుబొమ్మలాట వచ్చు అని చెబుతారు. భీమవ్వకు ఇప్పుడు 96 సంవత్సరాలు. ఆమె కొడుకు కేశప్ప, మనవలు, మునిమనవలు అందరూ తోలుబొమ్మలాటలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే వారి వంశం కనీసం రెండు వందల ఏళ్లుగా తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంది. ‘నేను 14 ఏళ్ల వయసులో తోలుబొమ్మలాట నేర్చుకున్నాను’ అంటుంది భీమవ్వ. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటన వచ్చాక ఆమె ఇల్లు, ఊరు మాత్రమే కాదు మొత్తం కొప్పల్ జిల్లా సంబరం చేసుకుంటూ ఉంది. ఎందుకంటే భీమవ్వ ఆట కట్టని పల్లె ఆ జిల్లాలో లేదు. కర్నాటకలో లేదు. భీమవ్వ అందరికీ తెలుసు. ఉత్సవాలకు, జాతర్లకు భీమవ్వ ఆట ఉందంటే జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడూ ఆ ఘనత చెరగలేదు.‘నేను రామాయణ, మహాభారతాలను పొల్లు పోకుండా పాడగలను. భారతంలోని పద్దెనిమిది పర్వాలకూ ఆట కడతాను. అయితే కురుక్షేత్రం, కర్ణ పర్వం, ద్రౌపది వస్త్రాపహరణం, ఆది పర్వం ఇవి ఎక్కువగా చె΄్తాను. జనం వీటిని బాగా అడుగుతారు. రామాయణంలో లవకుశుల కథ చాలామందికి ఇష్టం’ అని చెప్పింది భీమవ్వ.గ్రామీణ కళ, జానపద కళ అయిన తోలుబొమ్మలాటను కర్నాటకలో ‘తొగలు గొంబెయాట’ అంటారు. తెలుగులో ఒకప్పుడు ప్రసిద్ధంగా ఉన్నట్టే కర్నాటకలో కూడా ఈ కళ ప్రసిద్ధం. అయితే భీమవ్వ వంశం దాని కోసం జీవితాలను అంకితం చేసింది. కనుక అక్కడ ఇంకా ఆ ఆట వైభవం కొనసాగుతూ ఉంది. ‘తోలు బొమ్మలాటలో నేనే రాముణ్ణి, సీతను, లక్ష్మణున్ని. అందరి పాటలూ పాడతాను. నా ఆట గొప్పదనం తెలిసిన ప్రపంచ దేశాలు నన్ను పిలిచి ఆట చూపించమన్నాయి. అమెరికా, పారిస్, ఇటలీ, ఇరాన్, ఇరాక్, స్విట్జర్లాండ్ ఈ దేశాలన్నింటికి వెళ్లి తోలుబొమ్మలాట ఆడాను’ అందామె. అదొక్కటే కాదు ఆమె దగ్గర 200 ఏళ్ల కిందటి తోలుబొమ్మలు భద్రపరిచి ఉన్నాయి.శిక్షణ ఇస్తున్నాతనకు తెలిసిన విద్య తన వాళ్లకే అనుకోలేదు భీమవ్వ(Bhimavva). ప్రతి ఏటా కొంతమంది యువతను ఎంపిక చేసి తోలుబొమ్మలాట(puppeteer)లో శిక్షణ ఇస్తుంది. అది నేర్చుకున్నవారు ఆటను కొనసాగిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం ఈ కృషిని గుర్తించి ఎన్నో పురస్కారాలు ఇచ్చింది. జనం భీమవ్వను గుండెల్లో పెట్టుకున్నారు. ‘ఇది మనదైన విద్య. దీనిని పోగొట్టుకోకూడదు. మన గ్రామీణ కళల్లో నీతి ఎంతో ఉంటుంది. మనిషికి నీతి చెప్పడానికైనా ఇలాంటి కళలను కాపాడుకోవాలి’ అంది భీమవ్వ.భీమవ్వ ఎన్నోసార్లు విమానం ఎక్కింది. కాని ఈసారి ఎక్కబోయే విమానం ఆమెను ‘పద్మశ్రీ’ ఇవ్వనుంది. ప్రధాని, కేంద్ర మంత్రులు, పెద్దలు కరతాళధ్వనులు చేస్తుండగా రాష్ట్రపతి చేతుల మీద ఆమె పద్మశ్రీ అందుకుని తోలు బొమ్మల ఆటకు కిరీటం పెట్టనుంది. -
వనస్థలిపురంలో రేడియో స్టేషన్ టవర్ ఎక్కి వక్తి హల్ చల్..
-
రేడియో స్టేషన్‌పై రష్యా కన్నెర్ర
మాస్కో: రష్యాలోని ఉదారవాద ఎకో మాస్కీ రేడియో స్టేషన్‌పై అధికారులు కన్నెర్ర జేశారు. దీంతో ప్రసారాలు నిలిపివేస్తున్నామని గురువారం రేడియో స్టేషన్ ఎడిటర్ ఇన్ చీఫ్ అలెక్సీ వెనిడిక్టోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై పలు కీలక కథనాలను ఈ రేడియో ప్రసారం చేసింది. దీంతో తమపై అధికారులు గుర్రుగా ఉన్నట్లు ముందే తెలిసిందని అలెక్సీ చెప్పారు. ఈ నేపథ్యంలో రేడియో ఛానెల్‌ను, వెబ్‌సైట్‌ను మూసేయాలని నిర్ణయించామన్నారు. ఉక్రెయిన్‌పై కథనాలకుగాను ఎకో మాస్కీతో పాటు రైన్ టీవీని మూసేయాలని గతంలో రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం డిమాండ్ చేసింది. వీటి మూసివేత మీడియా స్వేచ్ఛను హరించడమేనని అమెరికా దుయ్యబట్టింది. నిజాలు చెప్పడాన్ని రష్యా సహించలేకపోయిందని విమర్శించింది. ఇప్పటికే ఇన్‌స్టా, ఫేస్బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై రష్యా నియంత్రణలు విధించింది. తమది దురాక్రమణ కాదని, కేవలం ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ చేయడమే ఉద్దేశమని రష్యా పేర్కొంది. ఇకపై రష్యాలో ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తే 15 ఏళ్ల జైలుశిక్ష విధించేందుకు చర్యలు ప్రారంభించింది. (చదవండి: అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చిన రష్యా!) -
అదృశ్యవాణి: మిస్టరీ రేడియో స్టేషన్
రష్యాలో ఒక రేడియో స్టేషన్ దాదాపు నలభయ్యేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తోంది. దీని నుంచి ఇరవై నాలుగు గంటలూ సిగ్నల్స్ వెలువడుతూనే ఉంటాయి. రేడియో సెట్లు, ట్రాన్సిస్టర్లలో ఈ స్టేషన్‌ను ట్యూన్ చేస్తే, ఆగి ఆగి నిమిషానికి 25 సార్లు ఒక విచిత్రమైన ధ్వని వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరో ఒకరి గొంతు నుంచి ప్రత్యక్ష ప్రసారాలు కూడా దీని నుంచి వెలువడుతూ ఉంటాయి. దీనిని ఎవరు నడుపుతున్నదీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. తొలిసారిగా దీని ఉనికిని 1982లో జనాలు తెలుసుకున్నారు. అప్పటి నుంచి గమనిస్తున్నా, ఏనాడూ దీని నుంచి వెలువడే విచిత్రమైన ధ్వనికి, అప్పుడప్పుడు వెలువడే ప్రసారాలకుగాని ఏమాత్రం అంతరాయం కలగలేదు. ఇది ఆర్మీ రహస్య కార్యకలాపాలకు చెందినది కావచ్చనే ఊహాగానాలూ ఉన్నాయి. అయితే, దీనిని నిర్వహిస్తున్నట్లుగా రష్యా ప్రభుత్వం గాని, సైన్యం గాని ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. వారానికి రెండు మూడుసార్లు ఈ రేడియో స్టేషన్ నుంచి వ్యవసాయ నిపుణుల సలహాలు, పశువుల పెంపకం వంటి కార్యక్రమాలు కూడా ప్రసారమవుతూ ఉంటాయి. ఈ రేడియో స్టేషన్ ప్రసారాలు 4625 కిలోహెర్ట్›్జ ఫ్రీక్వెన్సీలో ప్రసారమవుతుంటాయని మాత్రమే జనాలకు తెలుసు. అంతకు మించిన వివరాలేవీ ఎవరికీ తెలీదు. దీని పేరేమిటో కూడా తెలీదు. దీని నుంచి వెలువడే సిగ్నల్ ధ్వని కారణంగా జనాలే దీనికి ‘ఎండీజెడ్హెచ్బీ’ (ఎంజేబీ అని పలకాలి) అని పేరు పెట్టుకున్నారు. రష్యన్ మాటలో ఈ మాటకు ‘బజర్’ అనే అర్థం ఉంది. ∙ -
లైవ్‌లోనే పండంటి బిడ్డకు జననం
ఓ రేడియో ప్రజెంటర్ తాను లైవ్ షోలో ఉండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మధురమైన క్షణాలని కూడా ఈ రేడియో ప్రజెంటర్ లైవ్‌లో తన శ్రోతలతో పంచుకుంది. సెయింట్ లూయిస్ నగరంలోని ''ది ఆర్చ్ స్టేషన్''లో కాస్డేడే ప్రోక్టర్ ఉదయం వ్యాఖ్యాతగా పనిచేస్తోంది. సోమవారం రోజు ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి విభాగంతో పనిచేసే తమ రేడియో స్టేషన్, సిజేరియన్ విభాగం ద్వారా ఆమె బిడ్డ జననాన్ని ప్రసారం చేసింది. రెండు వారాల ముందుగానే బిడ్డ జన్మించినట్టు ప్రోక్టర్ చెప్పారు. రేడియో శ్రోతలతో తన జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను పంచుకోవడం చాలా అద్భుతంగా ఉందని ప్రోక్టర్ ఆనందం వ్యక్తంచేశారు. ప్రతి రోజూ లాగా తన జీవితం గురించి అన్ని విషయాలను రేడియో శ్రోతలతో పంచుకునే తాను.. ఈ విషయాన్ని కూడా శ్రోతలకు ఎయిర్‌లోనే తెలిపానన్నారు. రేడియో అభిమానులు సైతం బేబికి పేరు పెట్టడంలో ఫుల్‌గా పోటీపడుతున్నారు. 12 సిల్లీ పేర్లను, 12 పేర్లను కపుల్ ఎంపికచేశారని ది రివర్‌ఫ్రంట్ టైమ్స్ న్యూస్‌పేపర్ ప్రొగ్రామ్ డైరెక్టర్ స్కాట్ రోడి చెప్పారు. ఎయిర్‌లోనే జన్మనివ్వడం ఓ మ్యాజికల్ మూమెంట్ అని ప్రోక్టర్ కో హోస్ట్ స్పెన్సార్ గ్రేవ్స్ అన్నారు. ప్రస్తుతం ప్రోక్టర్ ప్రసూతి సెలవులు తీసుకోనున్నారు. -
ఐఎస్ ఉగ్రవాదుల సొంత రేడియో స్టేషన్!
కాబూల్: ఆప్ఘనిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ అనుకూల ఉగ్రవాదులు సొంతంగా ఓ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. రేడియో కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ.. యువతను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని ఆప్ఘనిస్తాన్ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఉగ్రవాదులు 'వాయిస్ ఆఫ్ ఖలీఫా' పేరిట రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేసి స్థానిక 'పాష్తో' భాషలో తమ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. జలాలాబాద్, ఇతర జిల్లాల్లో ఈ రేడియో ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలంతో ప్రసారాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు రేడియో స్టేషన్ కార్యకలాపాలు ఎక్కడి నుండి నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే రేడియో ప్రసారాలు ప్రజలకు చేరకుండా తగు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. -
ఆర్జె రానా
హీరో రానా రెడ్ ఎఫ్ఎమ్ కోసం ఆర్జేగా మారారు. బంజారాహిల్స్‌లోని రేడియోస్టేషన్కు వచ్చిన ఆయన.. దృశ్యం సినిమాపై ఆర్జే కాజల్, శ్రోతలు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. బాబాయ్ వెంకటేష్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని... ఆయన తనకు బ్రదర్ లాంటివాడు కూడానన్నారు. దృశ్యం మళయాళ మాతృక బాబాయ్‌తో పాటు తాను కూడా చూశానని, చూసిన వెంటనే తప్పకుండా చేద్దామని బాబాయ్‌తో అన్నానన్నారు. ఈ సందర్భంగా శ్రోతల కోరిక మేరకు ‘కృష్ణం వందే...’లోని ఒక పద్యం ఆలపించి అలరించారు. సాక్షి, సిటీప్లస్ -
ఆ సంఘటన ఎప్పటికీ మరచిపోలేను - శారదా శ్రీనివాసన్
రాష్ట్రీయం సుమారు 40 సంవత్సరాలపాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేసిన శారదా శ్రీనివాసన్ తన గొంతుకతో నాటకాల్లోని ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ కేంద్రంలో నాటకం ప్రసారమవుతోందంటే చాలు... అందులో ఆమె నటిస్తున్నారా లేదా అని అందరూ ఎదురు చూసేవారు! ఒక నాటకంలో నటిస్తే, అది కేవలం నటనే కదా అనుకోకుండా, ఆ పాత్రలో లీనమైపోయేవారు... తనే ఆ పాత్ర అన్నంతగా మమైకమైపోయేవారు! ఒక్కోసారి అంతర్మథన పడేవారు. తను నటించిన నాటకాలలో తనను బాగా కదిలించిన అలాంటి ఒక పాత్ర గురించి... ఆమె మాటల్లోనే... గ్రీకు ట్రాజెడీ నాటకం ‘ఈడిపస్’ని లక్కాకుల సుబ్బారావు గారు ‘రాజా ఈడిపస్’ పేరున తెలుగులోకి అనుసృజన చేశారు. ఆ నాటకంలో నేను రాణి పాత్ర వేశాను. అది వేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. అందులో రాకుమారుడి వల్ల రాజ్యానికి విపత్తు కలుగుతుందని జ్యోతిష్యులు చెప్పడంతో, ఆ బాలుడిని చంపేయమంటాడు రాజు. ఎలాగూ జంతువులు తినేస్తాయి కదా అని, సేవకులు ఆ పిల్లవాడిని అడవిలో వదిలేసి వస్తారు. ఆ పిల్లవాడు ఆటవికుల దగ్గర పెరిగి పెద్దవాడై, దండయాత్రలు చేస్తూ, తల్లి ఉన్న రాజ్యాన్ని కూడ జయిస్తాడు. యుద్ధంలో గెలుపొందినవారికి రాజ్యంతో పాటు, రాజ్యంలోని రాణివాసం కూడా అధీనంలోకి వస్తుంది. అలా తల్లి కూడా తన అధీనంలోకి వస్తుంది. వారిద్దరికీ తాము తల్లీకొడుకులమని తెలీదు. అటువంటి సమయంలో కొడుకు తల్లి దగ్గర తప్పుగా ప్రవర్తిస్తాడు. అంతా జరిగిపోయాక తల్లికి అతడు తన కొడుకు అని తెలిసి, ఆ వేదన భరించలేక మరణిస్తుంది. కుమారుడు కళ్లు పొడిచేసుకుంటాడు.. క్లుప్తంగా ఇదీ కథ! ఎందుకో ఆ నాటకంలో నటించాక నాకు దుఃఖం ఆగలేదు! నాటకం ప్రసారం అయినరోజు రాత్రి కూడా నాకు కంటి మీద కునుకు లేదు. తలచుకుంటే.. ఒళ్లు జలదరించేది! మానసికంగా చెప్పరానంత బాధపడ్డాను. ‘ఇది నాటకం క దా! ఎందుకు ఆ సంఘటనను పదే పదే తల్చుకుంటున్నాను. ఎందుకు మర్చిపోలేకపోతున్నాను’ అనుకున్నా తమాయించుకోలేకపోయాను. కొన్నిరోజుల పాటు అలా భయంకరమైన రాత్రులు గడిపాను. ఇలా బాధపడటం కంటె, టేపులలో నుంచి నాటకాన్ని ఇరేజ్ చేసేస్తే సరిపోతుందనుకున్నాను. అలా చేయడం వల్ల నా మనసులోని దుఃఖాన్ని దూరం చేసేయగలననుకున్నాను. నాతో పాటు అందులో నటించిన చిరంజీవిగారి వెంటపడి, నాటకాన్ని చెరిపేయమని ఒక సంవత్సరం పాటు సాధించాను. ఇక నా పోరు పడలేక ఒకరోజున ఆ నాటకాన్ని టేపులలో నుంచి తొలగించేశారు. అప్పటికి కానీ నా మనసు శాంతించలేదు! ఒక ఆర్టిస్ట్ మనసును ఎవరూ అర్థం చేసుకోలేరు. నటించినన్ని రోజులూ వారు సైకలాజికల్‌గా ఎన్ని బాధలు పడతారో ఎవరికీ తెలియదు. పాత్రలకి ప్రాణం పోయాలని, పాత్రను మూర్తీభవింపచేయాలని అనుకుంటారు నటులు. నిజానికి ఆ నాటకంలో నేను చాలా బాగా నటించానని అందరూ నన్ను మెచ్చుకున్నారు. నాటకం టేపులలో నుంచి చెరిపిన తరవాత అర్థం అయ్యింది... పెద్ద తప్పు చేశానని! - సంభాషణ: డా. వైజయంతి