ఆ సంఘటన ఎప్పటికీ మరచిపోలేను - శారదా శ్రీనివాసన్
రాష్ట్రీయం
సుమారు 40 సంవత్సరాలపాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేసిన శారదా శ్రీనివాసన్ తన గొంతుకతో నాటకాల్లోని ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ కేంద్రంలో నాటకం ప్రసారమవుతోందంటే చాలు... అందులో ఆమె నటిస్తున్నారా లేదా అని అందరూ ఎదురు చూసేవారు! ఒక నాటకంలో నటిస్తే, అది కేవలం నటనే కదా అనుకోకుండా, ఆ పాత్రలో లీనమైపోయేవారు... తనే ఆ పాత్ర అన్నంతగా మమైకమైపోయేవారు! ఒక్కోసారి అంతర్మథన పడేవారు. తను నటించిన నాటకాలలో తనను బాగా కదిలించిన అలాంటి ఒక పాత్ర గురించి... ఆమె మాటల్లోనే...
గ్రీకు ట్రాజెడీ నాటకం ‘ఈడిపస్’ని లక్కాకుల సుబ్బారావు గారు ‘రాజా ఈడిపస్’ పేరున తెలుగులోకి అనుసృజన చేశారు. ఆ నాటకంలో నేను రాణి పాత్ర వేశాను. అది వేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. అందులో రాకుమారుడి వల్ల రాజ్యానికి విపత్తు కలుగుతుందని జ్యోతిష్యులు చెప్పడంతో, ఆ బాలుడిని చంపేయమంటాడు రాజు. ఎలాగూ జంతువులు తినేస్తాయి కదా అని, సేవకులు ఆ పిల్లవాడిని అడవిలో వదిలేసి వస్తారు. ఆ పిల్లవాడు ఆటవికుల దగ్గర పెరిగి పెద్దవాడై, దండయాత్రలు చేస్తూ, తల్లి ఉన్న రాజ్యాన్ని కూడ జయిస్తాడు. యుద్ధంలో గెలుపొందినవారికి రాజ్యంతో పాటు, రాజ్యంలోని రాణివాసం కూడా అధీనంలోకి వస్తుంది. అలా తల్లి కూడా తన అధీనంలోకి వస్తుంది. వారిద్దరికీ తాము తల్లీకొడుకులమని తెలీదు. అటువంటి సమయంలో కొడుకు తల్లి దగ్గర తప్పుగా ప్రవర్తిస్తాడు. అంతా జరిగిపోయాక తల్లికి అతడు తన కొడుకు అని తెలిసి, ఆ వేదన భరించలేక మరణిస్తుంది. కుమారుడు కళ్లు పొడిచేసుకుంటాడు.. క్లుప్తంగా ఇదీ కథ!
ఎందుకో ఆ నాటకంలో నటించాక నాకు దుఃఖం ఆగలేదు! నాటకం ప్రసారం అయినరోజు రాత్రి కూడా నాకు కంటి మీద కునుకు లేదు. తలచుకుంటే.. ఒళ్లు జలదరించేది! మానసికంగా చెప్పరానంత బాధపడ్డాను. ‘ఇది నాటకం క దా! ఎందుకు ఆ సంఘటనను పదే పదే తల్చుకుంటున్నాను. ఎందుకు మర్చిపోలేకపోతున్నాను’ అనుకున్నా తమాయించుకోలేకపోయాను. కొన్నిరోజుల పాటు అలా భయంకరమైన రాత్రులు గడిపాను. ఇలా బాధపడటం కంటె, టేపులలో నుంచి నాటకాన్ని ఇరేజ్ చేసేస్తే సరిపోతుందనుకున్నాను. అలా చేయడం వల్ల నా మనసులోని దుఃఖాన్ని దూరం చేసేయగలననుకున్నాను. నాతో పాటు అందులో నటించిన చిరంజీవిగారి వెంటపడి, నాటకాన్ని చెరిపేయమని ఒక సంవత్సరం పాటు సాధించాను. ఇక నా పోరు పడలేక ఒకరోజున ఆ నాటకాన్ని టేపులలో నుంచి తొలగించేశారు. అప్పటికి కానీ నా మనసు శాంతించలేదు!
ఒక ఆర్టిస్ట్ మనసును ఎవరూ అర్థం చేసుకోలేరు. నటించినన్ని రోజులూ వారు సైకలాజికల్‌గా ఎన్ని బాధలు పడతారో ఎవరికీ తెలియదు. పాత్రలకి ప్రాణం పోయాలని, పాత్రను మూర్తీభవింపచేయాలని అనుకుంటారు నటులు. నిజానికి ఆ నాటకంలో నేను చాలా బాగా నటించానని అందరూ నన్ను మెచ్చుకున్నారు. నాటకం టేపులలో నుంచి చెరిపిన తరవాత అర్థం అయ్యింది... పెద్ద తప్పు చేశానని!
- సంభాషణ: డా. వైజయంతి