Coorg
-
కూర్గ్ అందాలు.. అక్కడ తప్పక చూడాల్సిన ప్రాంతాలివే
వేసవి కాలం వచ్చేసంది. ఈ ఎండలో చల్ల చల్లగా ఉపశమనం కోసం పర్యటక ప్రియులంతా సమ్మర్ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తుంటారు. సమ్మర్ వెకేషన్ అనగానే అందరి టక్కున గుర్తొచ్చేది నార్త్ టూర్. కునుమానాలి, సిమ్లా ఇలా నార్త్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. కానీ మన సౌత్‌లో కూడా వేసవి విడిదికి ఉత్తమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో కూర్గ్ ఒకటి. సౌత్ టూర్ అనగానే అందరికి అరకులోయ, ఊటీ, కన్యాకుమారి ఇలా గుర్తొస్తాయి. కానీ దక్షిణ కర్ణాటకలోని ఈ కూర్గ్ ప్రాంతం చాలా తక్కువ మందికి తెలుసు. భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్ ఇక్కడి ప్రత్యేకం. దీనిని ఇండియన్ స్కాట్లాండ్ అని కూడా పిలుస్తారు. అత్యంతక సుందరమైన, ఆకర్షనీయమైన పర్వతపాంతం ఇది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు ప్రత్యేకంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇవి మాత్రమే ఇక్కడ ఇంకా కూర్గ్‌లో చూడాల్సిన అందమైన ప్రాంతాలేన్నో ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలేవో ఓ సారి చూద్దాం. అబ్బే జలపాతం కూర్గ్ ముఖ్యంగా చూడాల్సిన పర్యాటక ప్రాంతం ఇది. కాఫీ తోటల మధ్య ఉండే ఈ జలపాతం చూడగానే అత్యంత అనుభూతిని ఇస్తుంది. స్వర్గాన్ని తలపించే ఈ అందమైన జలపాతాలను సందర్శించడానికి పర్యాటక ప్రియులు క్యూ కడుతుంటారు . కూర్గ్‌లో అబ్బే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం. ఈ జలపాతం ప్రాంతానికి దగ్గరలో ఉండడంతో తరచూ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. నాగర్హొళె జాతీయ పార్క్ ఈ ఉద్యానవనంలో అనేక జాతి రకాలకు చెందిన వృక్షాలు, జంతువులు దర్శనం ఇస్తుంటాయి. ఆ కారణంగా నాగర్హొళె జాతీయ ఉద్యానవనం దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మనకు అనేక జాతుల వృక్షాలతో పాటు 270 జాతుల పక్షులు దర్శనమిస్తాయి. కూర్గ్ వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవలసిన ప్రాంతాలలో ఇది ఒకటి. హనీ వాలి హనీ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన నీలకండి జలపాతం ఇది. దట్టమైన ఉష్ణమండల అడవుల మధ్య ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది మంచి రిఫ్రెషింగ్ స్పాట్. ఇక్కడ ముఖ్యంగా ట్రెక్కింగ్, అత్యుత్తమ సాహస క్రీడలు ప్రసిద్ధి. హొన్నమన కెరె లెక్ కూర్గ్ సహజ అందాలలో ఒకటి. పచ్చని కొండలు, కాఫీ తోటల, గుహల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది. సరస్సు సమీపంలోని ఆలయంలో జరుపుకునే గౌరీ పండుగ సమయంలో సరస్సును ప్రత్యేకంగా సందర్శిస్తారు. సోమవారపేట్ సోమవారపేట్ కాఫీ తొటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు, మిరియాలు. ఇక్కడి పచ్చని తోటలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది తప్పక సందర్శించవలసిన ప్రాంతం. నామ్‌డ్రోలింగ్ ఆరామం ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం నామ్‌డ్రోలింగ్ ఆరామం గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ ప్రసిద్ధి గాంచిన మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి ఆకర్షణీయంగా ఉంటుంది. విభిన్న శైలిలో కట్టడంగా ప్రసిద్ధి గాంచిన నామ్‌డ్రోలింగ్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. ఓంకారేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర అనే రాజు నిర్మించారు. ఈ ఆలయం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను ఉంది. ఇందులోని చేపలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మడికెరి కోట బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడిన ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. 1812-1814ల మధ్య కాలంలో ఇటుక, మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారని చెబుతారు. ఈ కోట ప్రవేశద్వారం చుట్టుపక్కల ఉన్న ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. -
నేచర్ లవర్స్‌కి గుడ్‌న్యూస్! కబిని, కూర్గ్‌లకు హెలికాప్టర్ సర్వీసులు
Helicopter Ride From Bangalore To Coorg: హెలికాప్టర్ సేవల సంస్థ బ్లేడ్ ఇండియా కొత్తగా బెంగళూరు–కూర్గ్, బెంగళూరు–కబిని రూట్లలో సర్వీసులను ప్రారంభించింది. బెంగళూరు నుంచి ఈ రెండు ప్రాంతాలకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు సుమారు 6–7 గంటల సమయం పడుతుంది. కర్ణాటకలో అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాలకు చేరుకోవడం ప్రయాసతో కూడుకున్నదని సంస్థ ఎండీ అమిత్ దత్తా తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల సమయమంతా ప్రయాణంలో వృధా కాకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుని, అక్కడ సరదాగా గడిపేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్‌తో జట్టు కట్టినట్లు వివరించారు. అమెరికాకు చెందిన బ్లేడ్ అర్బన్ ఎయిర్ మొబిలిటీ, దేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థ హంచ్ వెంచర్స్ కలిసి 2019లో బ్లేడ్ ఇండియాను ప్రారంభించాయి. వారాంతాల్లో ప్రైవేట్ చార్టర్ సేవలు అందించడం ద్వారా 2020 డిసెంబర్లో బ్లేడ్ ఇండియా.. కర్ణాటక రాష్ట్రంలో సర్వీసులు మొదలుపెట్టింది. దేశంలోనే ప్రముఖ హిల్ స్టేషన్‌గా కూర్గ్ ప్రకృతి అందాలకు కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఇక కబిని టైగర్ రిజర్వ్ ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా కబిని ఫారెస్ట్‌లో కనిపించే బ్లాక్ చీతాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. చదవండి: ఎల్జీ సరికొత్త ఆవిష్కరణ.. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..! -
స్విస్... స్వీట్ మెమొరీస్
స్విట్జర్లాండ్..సిటీ నుంచి విదేశాలకు క్యూకట్టే పర్యాటకుల జాబితాలో తప్పక ఉండే దేశం. ఈ సీజన్లో నగరం నుంచి మరో మూణ్నెళ్లపాటు స్విట్జర్లాండ్‌కు వెళ్లే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. చల్లగా ఉండే ఈ సీజన్లో అద్భుతమైన ప్రకృతి అంందాలతో పాటు శతాబ్ధాల నాటి వంతెనలూ, చారిత్రక ప్రదేశాలకూ నెలవైన స్విట్జర్లాండ్ గొప్ప జ్ఞాపకాలను అందిస్తుందని నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు అంటున్నారు. ల్యూసెన్స్ లేక్ మీదుగా సాగిపోయే ఓడ ప్రయాణం, దానికి సమీపంలోనే ఉండే చాక్లెట్ తయారీ కేంద్రాలు, రిగి, పిలాటాస్ పర్వతాలపై సాహసయాత్రలు, కళ్లు మూయనివ్వని మ్యూజియమ్స్, మంచు పర్వతాల నడుమ గొప్ప అనుభూతులను అందించే ఏంజెల్ బర్గ్, మౌంట్ టిట్లీస్...ఇలా ఎన్నో వైవిధ్యభరిత అనుభవాలు నగరవాసుల్ని స్విట్జర్లాండ్‌ని ఈ సీజన్లో అభిమాన టూరిస్ట్ ప్లేస్‌గా మారుస్తున్నాయి. చలో కూర్గ్... సాక్షి, సిటీబ్యూరో: పర్వత ప్రాంతాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారిని వెస్ట్రన్ ఘాట్స్‌కి రారమ్మంటోంది మడ్డీ ట్రయల్స్ సంస్థ. స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన కర్ణాటకలోని కూర్గ్ హిల్ స్టేషన్‌కు పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ అందిస్తోంది. కూర్గ్‌లోని కుశాయినగర్లో ఉన్న ఒక అరుదైన లేక్‌ని సందర్శించడం, కావేరీ నది సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్ వగైరాలన్నీ ఇందులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు ఈ ట్రిప్ నిర్వహిస్తున్నారు. -
‘కూర్గ్’ సొగసు చూడతరమా!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలోని ‘కూర్గ్’ పేరు వినగానే ఎవరికైనా ఒళ్లు పులకరిస్తుంది. పలు రకాల పూల సమ్మిళిత సువాసనలు. రకరకాల కాఫీ గింజల గుబాళింపులు ముక్కు పుటాలను అదరగొడతాయి. ఊపిరితిత్తులకు కొత్త ఊపిరినిస్తాయి. అనిర్వచనీయమైన అనుభూతినిస్తాయి. అందమైన పచ్చిక బయళ్లు, గుబురైన చెట్ల సముదాయంతో బారులు తీరిన పర్వత శ్రేణులు, వాటి మధ్యనుంచి జాలువారే జలపాతాలు, కొమ్మ కొమ్మకు పలకరించే పక్షుల కిలకిలారావాలు. వన్య ప్రాణుల అలజడి మదిలో మెదులుతాయి. ఇదంతా వినడం వల్లనే, చదవడం వల్లనే మనలో కలిగే అనుభూతి. ఇక ప్రత్యక్షంగా వీక్షిస్తేనా....? ఆ అనుభూతిని ఎవరైనా మాటల్లో చెప్పడం కష్టం. ఎవరికి వారు ఆ అనుభూతిని అనుభవించి పరవశించాల్సిందే. అందుకే కూర్గ్‌ను ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణించారేమో! పర్యాటకులు కూడా పలు రకాలుగా ఉంటారు వయసురీత్యా, అభిరుచుల రీత్యా. కొందరికి చెట్టూ పుట్టలు పట్టుకొని ట్రెక్కింగ్ చేయడం, సుడులు తిరిగే సన్నటి నదీ పాయలో రాఫ్టింగ్ చేయడం, పారా గ్లైడింగ్ చేయడం, పారా జంపింగ్ చేయడం, బోటింగ్ చేయడం, రోప్‌వేలో ప్రయాణించడం ఇష్టం. లగ్జరీ రిసార్టుల్లో ఇవి అందుబాటులో ఉన్నా అంత డబ్బు వెచ్చించని వారికి అందుబాటులో ఉండవు. మరికొందరికి ప్రశాంత వాతావరణం ఇష్టం. కంటి ముందు కనిపించే కొండ కోనల్ల నుంచి వచ్చే చల్లటి, స్వచ్ఛమైన గాలులను ఆస్వాదించడం, దట్టమైన చెట్ల మధ్య నుంచి కాలిబాటన కాస్త దూరం ప్రయాణించడం, జలపాతాలను ఆస్వాదించడం, పక్షలు, వన్య సంరక్షణ ప్రాంతాలను సందర్శించడం వారికీ హాబీ. డబ్బును దండిగా ఖర్చు పెట్టే వారి కోసం కూర్గ్ రాజధాని మడికరి ప్రాంతంలో పలు లగ్జరీ రిసార్టులుండగా, రెండో కేటగిరీ వాళ్ల కోసం కూర్గ్‌లోని కుట్టా ప్రాంతంలో సరైన కాటేజీలు ఉన్నాయి. మడికేరి ఏడు కిలోమీటర్ల దూరంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ‘అబే’ జలపాతం ఉండగా, కుట్టాకు సమీపంలో రెండవ అతిపెద్ద జలపాతం ‘ఇరుప్పు’ ఉంది. అబే జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోతుండగా, ఇరుప్పు ప్రశాంతంగా ఉంటుంది. దీని పక్కనే పక్షుల సంరక్షణ కేంద్రం ఉండగా, ట్రెక్కింగ్ చేసే కుర్రకారు కోసం నిటారైన కొండ ఉండనే ఉంది. ఇరుప్పు జలపాతం సమీపంలో పర్యాటకులు ఉండేందుకు పలు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కొండ దిగువ ప్రాంతంలో ఉండగా, పూర్తిగా కొండ ఎగువున ‘ట్రాపికల్ బూమ్స్’ అనే కాటేజీ కొత్తగా వెల్సింది ఆకర్షణీయంగానే కాకుండా, అందుబాటు ధరల్లో ఉంది (ఆసక్తిగల వారు మరిన్ని వివరాలకు 9449118698 మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చు). ఎక్కడికి వెళ్లనవసరం లేకుండానే ఈ క్యాటీజీ వసారాలో కూర్చొని ఆవలి కొండలను, కొండలను కౌగలించుకునే మబ్బులను, ఎప్పుడూ కురిసే మంచు ముత్యాలను చూడవచ్చు. ఈ కాటేజీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ‘ఇరుప్పు’ వాటర్ ఫాల్స్ ఉండగా, పది కిలోమీటర్ల దూరంలో నాగర్హోల్ నేషనల్ పార్క్, అంతే దూరంలో తోల్పట్టి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది. కాఫీ గింజల సువాసనలు, పూల గుబాళింపులు ఎల్లప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. రుతువులతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కూర్గ్‌ను సందర్శించవచ్చు. ఒక్కో రుతువులో ఒక్కో రకమైన అనుభూతిని పొందవచ్చు. నిండైన వాగులు, వంకలతోపాటు పచ్చదనం ఎక్కువగా ఉండే ‘సెప్టెంబర్ నుంచి మార్చి’ మధ్యలో సందర్శించడం మరీ బాగుంటుంది. -
కూర్గ్ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం
-
ఘనంగా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ వివాహం
సాక్షి, బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప ఓ ఇంటివారయ్యారు. వ్యాపారవేత్త, మోడల్ అయిన కరన్ మేడప్పతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో కర్ణాటకలోని కూర్గ్‌లో అశ్విని, మేడప్పలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అశ్విని వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత అక్టోబర్ 30న కరన్ మేడప్పతో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని బ్యాడ్మింటన్ ప్లేయర్ అశ్విని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత్ తరఫున పలు అంతర్జాతీయ టోర్నీల్లో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఆమె పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
కూల్‌కూర్గ్
వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాలి. చూస్తే కూర్గ్ అందాలనే చూడాలి. దట్టమైన అడవులు, నురుగులు కక్కే జలపాతాలు, పరవశింప జేసే పశ్చిమ కనుమలు, ఆకుపచ్చని కాఫీతోటలు, మత్తెక్కించే సుగంధ ద్రవ్యాల సువాసనలు... ఎన్నని చెప్పాలి? దక్షిణ భారత దేశంలోని పాపులర్ హిల్ స్టేషన్స్‌లో కర్ణాటకలో ఉన్న కూర్గ్‌ది ప్రత్యేక స్థానం. కొడగు, స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచే ఈ ప్రదేశం, మంచి సమ్మర్ టూరిస్టు కేంద్రమే కాదు... బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్ కూడా. ఏం చూడాలి? కూర్గ్ జిల్లాలో ఉన్న మడికెరీ మంచి టూరిస్ట్ ప్లేస్. పశ్చిమ కనుమల్లో ఉండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఉష్ణోగ్రత వేసవిలో కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు డిగ్రీలను మించదు. జనవరిలో అయితే పది వరకూ పడిపోతుంది. అసలీ ఈ పట్టణాన్ని గతంలో ముద్దురాజాకెరీ అని పిలిచేవారు. అంటే ముద్దురాజా పట్టణం అని అర్థం. హలేరీ వంశానికి చెందిన ముద్దురాజా కొడగును 1633 నుంచి 1687 వరకూ పాలించాడు. అతని పేరు మీద ఏర్పడిన పట్టణమిది. ఆ రాజావారి కోట ఇప్పటికీ అక్కడ ఉంది. ఈ పట్టణానికి శివారులో ఉండే ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ‘రాజాస్ సీట్’ అంటారు. నాలుగు స్తంభాల ఆధారంగా, ఓ చరియ మీద అర్ధచంద్రాకారంలో నిర్మించిన ఈ నిర్మాణం ప్రముఖ సందర్శనీయ స్థలం. ఇక్కడ్నుంచి సూర్యాస్తమయాన్ని చూడటానికి అందరూ క్యూ కడతారు. అల్లంత ఎత్తునుంచి జాలువారుతూ... గలగల సవ్వడితో పల్లాలకు పారే సెలయేటిని చూడటం కన్నులకు ఎంతటి విందు! అబ్బే అనే జలపాతం అలాంటి విందునే అందిస్తుంది. దాదాపు డెబ్భై అడుగుల ఎత్తు నుంచి నురుగులు కక్కుతూ జాలువారే ఈ జలపాతాన్ని చూస్తే ఆకాశం నుంచి పాలధారలు కురుస్తున్నాయా అనిపించక మానదు. పచ్చటి కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలకు మధ్య ఉండటం దీని అందాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. బ్రహ్మగిరి పర్వతం మీది నుంచి జాలువారే ఇరుప్పు వాటర్ ఫాల్స్ అందం కూడా తక్కువేమీ కాదు! మడికెరీకి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉండే నిసర్గధామ ఐల్యాండ్‌ను చూడకపోతే కూర్గ్ సందర్శన పూర్తి చేసినట్టు కాదు. కావేరీ జలాల మధ్య ఏర్పడిన ఈ దీవిలో వెదురు, చందనపు చెట్ల అందాలు వర్ణించతరం కాదు. కుందేళ్ల పార్క్, లేళ్ల పార్క్, నెమళ్ల పార్కులు ఈ దీవిలో తప్పక చూడాల్సిన ప్రత్యేకతలు. ఏనుగు స్వారీ, బోట్ రైడ్స్ వంటి అదనపు ఆకర్షణలూ ఉన్నాయి. ‘భాగమండల’ను టెంపుల్ టౌన్ అంటారు. ఇక్కడ ఉన్న శ్రీ భాగనందేశ్వర ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినదని అంటారు. కావేరి, కన్నికె, సుజ్యోతి నదుల త్రివేణి సంగమం వద్ద స్నానమాచరిస్తే సమస్త పాపాలూ తొలగిపోయి పుణ్యం చేకూరుతుందని నమ్మకం. అలాగే 1820లో లింగరాజేంద్ర అనే రాజు నిర్మించిన ఓంకారేశ్వర ఆలయం కూడా ఎంతో ప్రాశస్తం కలిగినది. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇస్లామిక్, గోథిక్ శైలులను మేళవించి నిర్మించిన ఈ ఆలయం చుట్టూ నీరు ఉంటుంది. అందులో ఉండే చేపలకు భక్తులు ఆహారం వేసి మనసులోని కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. కావేరీ నది పుట్టిన చోట నిర్మించిన ‘తలక్కావేరి’ ఆలయంలోని కావేరీ మాత భక్తుల కొంగు బంగారం. వీటన్నిటితో పాటు ‘బైలకుప్పె’ బౌద్ధాలయం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటుంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీవారు నిర్మించిన సెయింట్ మార్క్స్ చర్చి నిర్మాణ సౌందర్యం గురించి వినడం కంటే స్వయంగా చూస్తేనే బాగుంటుంది. పులిని టీవీలో చూస్తేనే కంగారు పుడు తుంది. అలాంటిది దాని ముఖంలో ముఖం పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? నాగర్హోల్ నేషనల్ పార్క్‌లో అలాంటి అను భవం ఎదురవుతుంది. అక్కడ ప్రత్యేక వాహనాల్లో పులుల మధ్యకు వెళ్లి, వాటిని దగ్గర నుంచి చూడవచ్చు. అదొక్కటే కాదు... ఈ పార్క్‌లో ఉన్న విభిన్న జాతుల జంతురాశిని చూడటం మంచి అనుభవం. ఈ పార్కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల లిస్టులో చేరింది. ఎప్పుడైనా మైసూర్లో దసరా ఉత్స వాలు చూశారా? వాటిలో గజరాజులదే ప్రధాన పాత్ర. అందంగా అలంక రించిన ఏనుగులు ఆ ఉత్సవాల్లో చేసే సందడి, వాటి విన్యాసాలు చూడ్డా నికే ఎంతోమంది వస్తుంటారు. అయితే ఆ ఏనుగులకు అలా మెలగాలని ఎవరు నేర్పు తున్నారో చాలామందికి తెలీదు. కూర్గ్‌లో ఉన్న డ్యుబేర్ ఎలిఫెంట్ క్యాంప్ ఇచ్చే తర్ఫీదే అదంతా. అక్కడ బోలెడన్ని ఏనుగులు ఉంటాయి. వాటిని సంరక్షించడంతో పాటు వాటికి ఎన్నో విషయాల్లో తర్ఫీదునిస్తుంటారు మావటులు. అవన్నీ చూసేందుకు అనుమతి ఉండటంతో కూర్గ్ వెళ్లిన సందర్శకులంతా ఆ క్యాంప్‌కు వెళ్తుంటారు. గజరాజులతో కొంత సమయం గడిపి సంతోషిస్తుంటారు. కూర్గ్ వారికి ఆటలంటే మహాప్రీతి. ముఖ్యంగా హాకీ అంటే. ఏప్రిల్ నుంచి మే నెల ముగిసే వరకూ అక్కడ హాకీ ఫెస్టివల్ జరుగుతుంది. ఎందరో హాకీ క్రీడాకారులు ఆ ఫెస్టివల్లో పాల్గొంటారు. అలాగే మే నెలలో జరిగే కుండే హబ్బా పండుగ కూడా చాలా ఫేమస్. అయ్యప్పస్వామి అవతారంగా చెప్పే ‘కుండే’ స్వామిని కొలిచే గిరిజనులు ఈ పండుగను చేసుకుంటారు. ఇది ఎంతో వేడుకగా జరుగుతుంది. వారి సంప్రదాయాలను, ఆచారాలను చూడాలంటే ఈ పండుగ తప్పక చూడాలి. కెయిల్‌పోదు, కావేరీ సంక్రమణ, పుట్టారీ, దసరా, కరంగా తదితర పండుగలు కూడా వైభవంగా జరుగుతాయి. ఏం తినాలి? కూర్గ్ వెళ్లేవాళ్లు ఆహారం విషయంలో ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. అక్కడ మంచి రుచికరమైన భోజనం దొరుకుతుంది. రెయిన్‌ట్రీ రెస్టారెంట్లో స్థానికంగా పండిన మసాలా దినుసులతో చేసే పెప్పర్ చికెన్, ఘీ చికెన్, మటన్ స్ట్యూ నాన్‌వెజ్ ప్రియుల మనసులు దోచుకుంటాయి. హోటల్ క్యాపిటల్‌లో బియ్యప్పిండి రొట్టెతో పాటు పోర్క్ కర్రీని సర్వ్ చేస్తారు. కూర్గ్ వారికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైన డిష్. ఇక వెజిటేరియన్స్‌కి నచ్చే అన్ని వంటకాలూ అతిథి అనే రెస్టారెంటులో లభిస్తాయి. అలాగే కూర్గ్‌ని వదిలిపెట్టే ముందు ‘కదుమ్‌బుట్టు’ని రుచి చూడకుండా రావద్దు. బియ్యపుపిండిని ఆవిరి మీద ఉడికించి చేసే ఈ రైస్ డంప్లింగ్స్ టేస్ట్ అదరహో అనిపిస్తుంది. అలాగే వెదురు కూర. లేత వెదురు బొంగులను ముక్కలుగా కోసి... ఆవాలు, ఎండుమిర్చి, కొబ్బరి వేసి చేసే ఈ కూర అక్కడ తప్ప మరోచోట దొరికే అవకాశమే లేదు. ఏం కొనాలి? మంచి కాఫీ దొరుకుతుంది. కాఫియా అరబికా, కాఫియా రొబుస్తా అనేవి ఫేమస్ మసాలా దినుసులకు, డ్రై ఫ్రూట్స్‌కు కూర్గ్‌లో కొదువే లేదు. యాల కులు, మిరియాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, రోజ్మేరీ, జీడిపప్పు, కిస్మిస్... కొన్నవారికి కొన్నంత కూర్గ్‌లో ఉన్నంత మధురంగా మరెక్కడ పండిన కమలాలూ ఉండవు పండ్ల రసాలతో ప్రత్యేకంగా తయారయ్యే చాక్లెట్లు స్పెషల్. కొబ్బరి పాలతో చేసే ఒక విధమైన లిక్కర్, స్వచ్ఛమైన తేనెను మిస్సవకూడదు! ఏం చేయాలి? ట్రెక్కింగ్, రివర్ ర్యాఫ్టింగ్, పారా గ్లైడింగ్... ఏం చేయాలన్నా ఇక్కడ చక్కగా చేయవచ్చు. మడికెరీలోని ఆయుర్వేదిక్ స్పాలో బాడీ మసాజ్ చేయించుకుంటే, ఆ హాయి కొన్ని నెలల పాటు వదిలిపెట్టదు. మన దేశంలో ఉన్న పక్షి జాతుల్లో ఇరవై అయిదు శాతం కూర్గ్‌లోనే ఉన్నాయట. వాటన్నిటినీ చూడ్డం ఓ మంచి అనుభవం. కుశల్‌నగర్ దగ్గర ఉన్న వల్నర్ ఫిషింగ్ క్యాంప్‌కి వెళ్తే ఫిషింగ్ చేయవచ్చు. అయితే పట్టుకుని వదిలేయాలి తప్ప వాటికి హాని చేయడానికి వీల్లేదు. టీ, మసాలాల తోటల్లో నేచర్ వాక్ ఆహ్లాదంగా ఉంటుంది. చిక్‌లీహోల్ రిజర్వాయర్ దగ్గర సూర్యాస్తమయ సౌందర్యం చూడాల్సిందే! ఎలా వెళ్లాలి? బస్సులో: అన్ని ముఖ్య పట్టణాల నుంచీ డెరైక్ట్ బస్సులు ఉన్నాయి. రైల్లో: డెరైక్ట్ రైళ్లు లేవు. హైదరాబాద్ నుంచి మైసూర్ వరకూ రైల్లో వెళ్లి, అక్కడి నంచి క్యాబ్ లోనో, బస్సులోనో వెళ్లాలి. ఫ్లయిట్లో: నేరుగా వెళ్లే విమానాలు లేవు. మంగుళూరు వెళ్లి, అక్కణ్నుంచి ట్యాక్సీలో కూర్గ్ వెళ్లవచ్చు. విడిగా కంటే ప్యాకేజీ ఉత్తమం. ఇద్దరు మనుషులకి మూడు పగళ్లు, రెండు రాత్రులకి స్టాండర్డ్ ప్యాకేజీ అయితే రూ. 18,000 వేల లోపు, డీలక్స్ అయితే రూ. 30,000 లోపు, లగ్జరీ అయితే రూ. 37,000 లోపు అవుతుంది. అన్నీ అందులోనే! -
చిత్తడి నేలల్లో...చినుకుతో విహారం
రుతుపవనాలు ఆలస్యంగా పలకరించడంతో అన్నిచోట్లా వరుణుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల మోస్తరు.. కొన్ని చోట్ల అడపాదడపా కురిసే వానలు తేయాకు తేటల్లో విరివిగా కురుస్తున్నాయి. చినుకుల్లో తడిసి, ఆహ్లాదం పొందాలకునేవారిని ఈ భూతల స్వర్గాలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. వానకాలం వారాంతాలకు వేదికగా మారిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి - వైత్రి హిల్ స్టేషన్, మున్నార్, కూర్గ్, మహాబలేశ్వర్, గోవా! పచ్చందనాల పరవశం వైత్రి హిల్ స్టేషన్ కేరళలోని వయనాడు జిల్లాలో ఉంది వైత్రి. ఈ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్వత ప్రాంతం ఇది. ఇక్కడ చూడదగిన అద్భుత సుందర దృశ్యాలు ఎన్నో మనస్సును కట్టిపడేస్తాయి. అందుకే పర్యాటకులకు మేలిమి పిక్నిక్ స్పాట్‌గా మారింది - వైత్రి. ఇక్కడ చూడదగిన వాటిలో ప్రధానమైనవి కరలాడ్ సరస్సు, లక్కిడి. సముద్ర మట్టం నుంచి 700 మీటర్ల ఎత్తులో ఉన్న లక్కిడి రహదారులన్నీ మలుపులు మలుపులుగా ఉంటుంది. ఈ మలుపుల్లో ప్రయాణించేటప్పుడు పవనాల తాకిడి గిలిగింతలు పెడుతుంది. వైత్రికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూకోట్ సరస్సులో పడవ ప్రయాణం, చుట్టూ అటవీ ప్రాంతం, పిల్లల పార్క్, అడవి బిడ్డల హస్తకళలు అమితంగా ఆకట్టుకుంటా యి. వయనాడు దగ్గరలో బాన్సువారా సాగర్ డ్యామ్, కురువా ద్వీపం, ఎడక్కల్ గుహల్, సూజిపరా జలపాతం, మీన్ముట్టి జలపాతం, ప్రాచీన మ్యూజియం, జైన్ దేవాలయం, కరపుజా డ్యామ్‌లు చూడదగినవి. ఇక్కడే ఉన్న చెంబ్రా పర్వతం ట్రెక్కింగ్ చేసేవారికి గొప్ప అనుభూతిని ఇస్తుంది. సమీప రైల్వేస్టేషన్ కోళిక్కోడ్ 63 కి.మీ, 73 కి.మీ దూరంలో కరిపుర అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కోళిక్కోడ్ చేరుకొని, అక్కడ నుంచి కారులో వైత్రికి చేరుకోవచ్చు. రోడ్డుమార్గాన హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరి అక్కడి నుంచి వైత్రికి చేరుకోవచ్చు. వైత్రిలో వసతుల కోసం: www.vythiriresort.com, www.the windflower.com, www.wayanadresorts.com, silenttreckకు లాగిన్ అవ్వచ్చు. వైత్రి పర్యాటక శాఖ ఫోన్ నెంబర్లు: 09497492882, 09562591233, 09447181160. ముచ్చట గొలిపే మున్నార్ ముద్రపూజ, నల్లతన్ని, కుండల.. అనే మూడు పర్వతాలు ఉన్న ప్రాంతమే కేరళలోని మున్నార్. సముద్రమట్టానికి 1,600 మీటర్ల ఎత్తులో ఈ ఉన్న ప్రాంతం తేయాకు తోటల పెంపకానికి అనువైనది. చిన్న చిన్న టౌన్లు, గాలిమరల దారులు గల ఈ ప్రాంతంలో పేరొందిన రిసార్టులు ఉన్నాయి. వర్షాలు విస్తారంగా కురిసే ఈ కాలం అటవీ ప్రాంతంలో గల గడ్డిమైదానాలు, వాటిలో పువ్వుల సోయగాలు మనసులను ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడి అనముడి ప్రాంతం పర్వతారోహకులకు అనువైనది. మరిన్ని సుందర ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఎరవికులమ్ ఉద్యానం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యానంలో అరుదైన సీతాకోకచిలుకలు, జంతువులు, పక్షులు కనువిందు చేస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే తేయాకు తోటలతో నిండి ఉన్న పర్వతసానువులు పచ్చని చీరను సింగారించుకున్నట్టు కనిపిస్తాయి. మున్నార్‌కి 13 కి.మీ దూరంలో ఉన్న మట్టుపెట్టి మరో ఆసక్తికరమైన ప్రదేశం. ఇక్కడే మసోన్రీ డ్యామ్ స్టోరేజీ వాటర్‌తో తయారైన అందమైన సరస్సు ఉంది. ఇందులో బోట్ రైడ్ ఉత్సాహకరమైన క్రీడగా చెప్పుకోవచ్చు. మట్టుపెట్టిలో చిన్నా, పెద్ద జలపాతాలకు అలవాలమైన ప్రాంతాలు చిన్నకనాల్, అనయిరంగాల్. మున్నార్‌కు 22 కి.మీ దూరంలో ఉంటాయి. కేరళ పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు మున్నార్-కొడెకైనాల్ రోడ్డు మార్గాన వెళుతుంటే ఆ ప్రయాణం పర్యాటకులకు ఊహించని ఆనందాన్నిస్తుంది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో ఎర్నాకుళం చేరుకొని, అక్కడ నుంచి 130 కి.మీ దూరంలో ఉన్న మున్నార్‌కి కారులో వెళ్లచ్చు. రైలు మార్గాన హైదరాబాద్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి కొచ్చి చేరుకొని, అక్కడ నుంచి బస్సుల ద్వారా మున్నార్ వెళ్ళవచ్చు. వసతి సదుపాయాల కోసం www.teacounty munnar.comకు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ క్లబ్ మహీంద్రా, అబద్ హోటల్స్, క్లౌడ్ 9, దేశ్దన్.. మొదలైనవి వసతి సదుపాయాలు కల్పిస్తున్నాయి. మనసు దోచే సుందరచిత్రం మడికేరి కర్నాటకలోని కొడగు జిల్లాలో ఉంది మడికేరి. ఈ ప్రాంతాన్నే అంతా కూర్గ్‌గా పేర్కొంటుంటారు. కాఫీ, ఏలకుల తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధం. పడమటి కనుమల్లో కనువిందు చేసే ఇక్కడి పచ్చదనం వర్షాకాలంలో ప్రకృతి ప్రియులను కట్టిపడేస్తుంది. హైదరాబాద్ నుంచి 797 కి.మీ దూరంలో ఉన్న కూర్గ్‌కు రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి కారులో బయల్దేరితే 13 గంటల సమయం పడుతుంది. ఇక్కడి వసతి సదుపాయాల కోసం.. www.plantationtrails.net/ www.orangecounty.in/coorg-resorts/www.kadkani.com/ KTDC Mayura hoteను సంప్రదించవచ్చు. కూర్గ్‌లో ప్లాంటేషన్ ట్రయల్స్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాల కోసం ఫోన్: +9108023560761/235606595, మొబైల్: +91-80-23346074/73లలో సంప్రదించవచ్చు ఉత్కంఠభరితం మహాబలేశ్వరం అబ్బురపరిచే శిఖరపు అంచులు, ఉత్కంఠ కలిగించే లోయలు, అచ్చెరువొందించే అటవీ వృక్ష సంపద.. వీటి మీదుగా పలకరించే వర్షపు జల్లులు మహాబలేశ్వర్ సందర్శకులను ఓ వింతైన అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాదు కొండలపై నుంచి సాగే చల్లని గాలులు మేనిని తాకి గిలిగింతలు పెడతాయి. మహారాష్ట్రలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన హిల్ స్టేషన్ ఇది. ఇక్కడికి విచ్చేసే సందర్శకులు ప్రకృతిని, చారిత్రక కట్టడాలను చూసి తరించవచ్చు. ఇక్కడ మౌంట్ మల్కోమ్, మరోజి క్యాజిల్, మహాబలేశ్వర్ క్లబ్ చూశాక సుందరమైన వెన్నా సరస్సుకు చేరుకోవాలి. అక్కడ బోటులో షికార్లు, చేపలు పట్టడం, రైడింగ్ చేయడం వంటి క్రీడల ద్వారా ఉల్లాసాన్ని పొందవచ్చు. దగ్గరలోనే పంచ్గని, స్ట్రాబెర్రీ తోటలను వీక్షించవచ్చు. మహాబలేశ్వర్ చుట్టుపక్కల పేరొందిన పంచగంగ మందిర్, కోయనా, వెన్నా, సావిత్రి, గాయత్రి, కృష్ణా నదీ పాయల సోయగం, బాబింగ్టన్ పాయింట్‌లోని దోమ్ డ్యామ్, మహాబలేశ్వర్ మందిరం దర్శించవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రాంత సందర్శన పర్యాటకులకు ఆనందానుభూతులను మిగులుస్తుంది. దీనికి దగ్గరలో పుణేలో (120 కి.మీ) విమానాశ్రయం ఉంది. వసతి సదుపాయాల కోసం ఎమ్టిడిసి హాలీడే రిసార్ట్స్‌ను సంప్రదించవచ్చు. వర్షంలో హర్షం గోవా లక్షలాది పర్యాటకులను అమితంగా ఆకట్టుకు నే ప్రాంతం గోవా. వేసవిలో నిశ్శబ్దంగా ఉండే గోవా జులై మాసాన అడుగుపెట్టే వర్షరుతువు లో అత్యద్భుతంగా కనివిందు చేస్తుంది. అందుకే వర్షాకాలంలోనూ గోవా పర్యటనకు ఆసక్తి చూపే పర్యాటకులు పెరుగుతున్నారు. ఉన్నట్టుండి మబ్బుల పట్టిన ఆకాశం, ఆ వెంటనే సూర్యకాంతి వెలుగులు ఆహ్లాదపరుస్తుంటాయి. దాదాపు 80 బీచ్‌లు, ఇసుక తీరాలు కనువిందు చేస్తుంటాయి. ప్యారాచూట్స్, బోట్‌రైడింగ్, బైక్ రైడింగ్‌లో ఉల్లాసాన్ని పొందవచ్చు. గోవాకే ప్రత్యేకమైన అతిపెద్ద ప్రాచీన చర్చ్‌నీ, సహజసిద్ధమైన జలపాతాల అందాలనూ వాన జల్లుల మధ్య ఎంత సేపు చూసినా తనివి తీరదు. గోవా సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎన్నో హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ఇవి ప్రత్యేక వర్షాకాల ప్యాకేజీలను డిస్కౌంట్ రేట్లలో ఇస్తున్నాయి. హైదరాబాద్ నుంచి రాయచూర్-భాగల్‌కోట్- బెల్గామ్ల మీదుగా గోవా చేరుకోవచ్చు. దూరం 660 కి.మీ. హైదరాబాద్ నుంచి వోల్వో బస్సు సదుపాయాలు ఉన్నాయి. పావ్లో ట్రావెల్స్ ఫోన్ నెం: +91-40-66515051/66625856/66625857, కేశినేని ట్రావెల్స్ మొబైల్ నెం: +919849051414, ఎస్విఆర్ ట్రావెల్స్ ఫోన్: 040-23735005, 23755442, 237332444. హైదరాబాద్ నుంచి రైలు మార్గాన వాస్కో-డ-గామ్ ఎక్స్‌ప్రెస్‌లో నేరుగా గోవాకు చేరుకోవచ్చు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు హైదరాబాద్ నుంచి గోవా వెళుతుంటాయి. మరిన్ని వివరాల కోసం ఇండియా పర్యాటక శాఖ వారిని సంప్రదించవచ్చు. ఫోన్ నెం: 040-23409199