కూల్‌కూర్గ్ | Best Honeymoon Destination in Coorg | Sakshi
Sakshi News home page

కూల్‌కూర్గ్

Published Sun, May 8 2016 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

కూల్‌కూర్గ్

కూల్‌కూర్గ్

వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాలి. చూస్తే కూర్గ్ అందాలనే చూడాలి. దట్టమైన అడవులు, నురుగులు కక్కే జలపాతాలు, పరవశింప జేసే పశ్చిమ కనుమలు, ఆకుపచ్చని కాఫీతోటలు, మత్తెక్కించే సుగంధ ద్రవ్యాల సువాసనలు... ఎన్నని చెప్పాలి? దక్షిణ భారత దేశంలోని పాపులర్ హిల్ స్టేషన్స్‌లో కర్ణాటకలో ఉన్న కూర్గ్‌ది ప్రత్యేక స్థానం. కొడగు, స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచే ఈ ప్రదేశం, మంచి సమ్మర్ టూరిస్టు కేంద్రమే కాదు... బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్ కూడా.
 
 ఏం చూడాలి?
  కూర్గ్ జిల్లాలో ఉన్న మడికెరీ మంచి టూరిస్ట్ ప్లేస్. పశ్చిమ కనుమల్లో ఉండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఉష్ణోగ్రత వేసవిలో కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు డిగ్రీలను మించదు. జనవరిలో అయితే పది వరకూ పడిపోతుంది. అసలీ ఈ పట్టణాన్ని గతంలో ముద్దురాజాకెరీ అని పిలిచేవారు. అంటే ముద్దురాజా పట్టణం అని అర్థం. హలేరీ వంశానికి చెందిన ముద్దురాజా కొడగును 1633 నుంచి 1687 వరకూ పాలించాడు. అతని పేరు మీద ఏర్పడిన పట్టణమిది.
 
 ఆ రాజావారి కోట ఇప్పటికీ అక్కడ ఉంది. ఈ పట్టణానికి శివారులో ఉండే ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ‘రాజాస్ సీట్’ అంటారు. నాలుగు స్తంభాల ఆధారంగా, ఓ చరియ మీద అర్ధచంద్రాకారంలో నిర్మించిన ఈ నిర్మాణం ప్రముఖ సందర్శనీయ స్థలం. ఇక్కడ్నుంచి సూర్యాస్తమయాన్ని చూడటానికి అందరూ క్యూ కడతారు.
 
  అల్లంత ఎత్తునుంచి జాలువారుతూ... గలగల సవ్వడితో పల్లాలకు పారే సెలయేటిని చూడటం కన్నులకు ఎంతటి విందు! అబ్బే అనే జలపాతం అలాంటి విందునే అందిస్తుంది. దాదాపు డెబ్భై అడుగుల ఎత్తు నుంచి నురుగులు కక్కుతూ జాలువారే ఈ జలపాతాన్ని చూస్తే ఆకాశం నుంచి పాలధారలు కురుస్తున్నాయా అనిపించక మానదు. పచ్చటి కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలకు మధ్య ఉండటం దీని అందాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. బ్రహ్మగిరి పర్వతం మీది నుంచి జాలువారే ఇరుప్పు వాటర్ ఫాల్స్ అందం కూడా తక్కువేమీ కాదు!
 
  మడికెరీకి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉండే నిసర్గధామ ఐల్యాండ్‌ను చూడకపోతే కూర్గ్ సందర్శన పూర్తి చేసినట్టు కాదు. కావేరీ జలాల మధ్య ఏర్పడిన ఈ దీవిలో వెదురు, చందనపు చెట్ల అందాలు వర్ణించతరం కాదు. కుందేళ్ల పార్క్, లేళ్ల పార్క్, నెమళ్ల పార్కులు ఈ దీవిలో తప్పక చూడాల్సిన ప్రత్యేకతలు. ఏనుగు స్వారీ, బోట్ రైడ్స్ వంటి అదనపు ఆకర్షణలూ ఉన్నాయి.
 
  ‘భాగమండల’ను టెంపుల్ టౌన్ అంటారు. ఇక్కడ ఉన్న శ్రీ భాగనందేశ్వర ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినదని అంటారు. కావేరి, కన్నికె, సుజ్యోతి నదుల త్రివేణి సంగమం వద్ద స్నానమాచరిస్తే సమస్త పాపాలూ తొలగిపోయి పుణ్యం చేకూరుతుందని నమ్మకం. అలాగే 1820లో లింగరాజేంద్ర అనే రాజు నిర్మించిన ఓంకారేశ్వర ఆలయం కూడా ఎంతో ప్రాశస్తం కలిగినది. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
 
 ఇస్లామిక్, గోథిక్ శైలులను మేళవించి నిర్మించిన ఈ ఆలయం చుట్టూ నీరు ఉంటుంది. అందులో ఉండే చేపలకు భక్తులు ఆహారం వేసి మనసులోని కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. కావేరీ నది పుట్టిన చోట నిర్మించిన ‘తలక్కావేరి’ ఆలయంలోని కావేరీ మాత భక్తుల కొంగు బంగారం. వీటన్నిటితో పాటు ‘బైలకుప్పె’ బౌద్ధాలయం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటుంటారు.
 
 ఈస్ట్ ఇండియా కంపెనీవారు నిర్మించిన సెయింట్ మార్క్స్ చర్చి నిర్మాణ సౌందర్యం గురించి వినడం కంటే స్వయంగా చూస్తేనే బాగుంటుంది.   పులిని టీవీలో చూస్తేనే కంగారు పుడు తుంది. అలాంటిది దాని ముఖంలో ముఖం పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? నాగర్‌హోల్ నేషనల్ పార్క్‌లో అలాంటి అను భవం ఎదురవుతుంది. అక్కడ ప్రత్యేక వాహనాల్లో పులుల మధ్యకు వెళ్లి, వాటిని దగ్గర నుంచి చూడవచ్చు. అదొక్కటే కాదు... ఈ పార్క్‌లో ఉన్న విభిన్న జాతుల జంతురాశిని చూడటం మంచి అనుభవం. ఈ పార్కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల లిస్టులో చేరింది.
 
  ఎప్పుడైనా మైసూర్‌లో దసరా ఉత్స వాలు చూశారా? వాటిలో గజరాజులదే ప్రధాన పాత్ర. అందంగా అలంక రించిన ఏనుగులు ఆ ఉత్సవాల్లో చేసే సందడి, వాటి విన్యాసాలు చూడ్డా నికే ఎంతోమంది వస్తుంటారు. అయితే ఆ ఏనుగులకు అలా మెలగాలని ఎవరు నేర్పు తున్నారో చాలామందికి తెలీదు. కూర్గ్‌లో ఉన్న డ్యుబేర్ ఎలిఫెంట్ క్యాంప్ ఇచ్చే తర్ఫీదే అదంతా. అక్కడ బోలెడన్ని ఏనుగులు ఉంటాయి. వాటిని సంరక్షించడంతో పాటు వాటికి ఎన్నో విషయాల్లో తర్ఫీదునిస్తుంటారు మావటులు. అవన్నీ చూసేందుకు అనుమతి ఉండటంతో కూర్గ్ వెళ్లిన సందర్శకులంతా ఆ క్యాంప్‌కు వెళ్తుంటారు. గజరాజులతో కొంత సమయం గడిపి సంతోషిస్తుంటారు.
 
  కూర్గ్ వారికి ఆటలంటే మహాప్రీతి. ముఖ్యంగా హాకీ అంటే. ఏప్రిల్ నుంచి మే నెల ముగిసే వరకూ అక్కడ హాకీ ఫెస్టివల్ జరుగుతుంది. ఎందరో హాకీ క్రీడాకారులు ఆ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. అలాగే మే నెలలో జరిగే కుండే హబ్బా పండుగ కూడా చాలా ఫేమస్. అయ్యప్పస్వామి అవతారంగా చెప్పే ‘కుండే’ స్వామిని కొలిచే గిరిజనులు ఈ పండుగను చేసుకుంటారు. ఇది ఎంతో వేడుకగా జరుగుతుంది. వారి సంప్రదాయాలను, ఆచారాలను చూడాలంటే ఈ పండుగ తప్పక చూడాలి. కెయిల్‌పోదు, కావేరీ సంక్రమణ, పుట్టారీ, దసరా, కరంగా తదితర పండుగలు కూడా వైభవంగా జరుగుతాయి.            
 
 ఏం తినాలి?
 కూర్గ్ వెళ్లేవాళ్లు ఆహారం విషయంలో ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. అక్కడ మంచి రుచికరమైన  భోజనం దొరుకుతుంది. రెయిన్‌ట్రీ రెస్టారెంట్లో స్థానికంగా పండిన మసాలా దినుసులతో చేసే పెప్పర్ చికెన్, ఘీ చికెన్, మటన్ స్ట్యూ నాన్‌వెజ్ ప్రియుల మనసులు దోచుకుంటాయి. హోటల్ క్యాపిటల్‌లో బియ్యప్పిండి రొట్టెతో పాటు పోర్క్ కర్రీని సర్వ్ చేస్తారు. కూర్గ్ వారికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైన డిష్. ఇక వెజిటేరియన్స్‌కి నచ్చే అన్ని వంటకాలూ అతిథి అనే రెస్టారెంటులో లభిస్తాయి. అలాగే కూర్గ్‌ని వదిలిపెట్టే ముందు ‘కదుమ్‌బుట్టు’ని రుచి చూడకుండా రావద్దు. బియ్యపుపిండిని ఆవిరి మీద ఉడికించి చేసే ఈ రైస్ డంప్లింగ్స్ టేస్ట్ అదరహో అనిపిస్తుంది. అలాగే వెదురు కూర. లేత వెదురు బొంగులను ముక్కలుగా కోసి... ఆవాలు, ఎండుమిర్చి, కొబ్బరి వేసి చేసే ఈ కూర అక్కడ తప్ప మరోచోట దొరికే అవకాశమే లేదు.
 
 
 ఏం కొనాలి?
  మంచి కాఫీ దొరుకుతుంది. కాఫియా అరబికా, కాఫియా రొబుస్తా అనేవి ఫేమస్  మసాలా దినుసులకు, డ్రై ఫ్రూట్స్‌కు కూర్గ్‌లో కొదువే లేదు. యాల కులు, మిరియాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, రోజ్‌మేరీ, జీడిపప్పు, కిస్‌మిస్... కొన్నవారికి కొన్నంత  కూర్గ్‌లో  ఉన్నంత మధురంగా మరెక్కడ పండిన కమలాలూ ఉండవు  పండ్ల రసాలతో ప్రత్యేకంగా తయారయ్యే చాక్లెట్లు స్పెషల్.  కొబ్బరి పాలతో చేసే ఒక విధమైన లిక్కర్, స్వచ్ఛమైన తేనెను మిస్సవకూడదు!
 
 ఏం చేయాలి?
  ట్రెక్కింగ్, రివర్ ర్యాఫ్టింగ్, పారా గ్లైడింగ్... ఏం చేయాలన్నా ఇక్కడ చక్కగా చేయవచ్చు.  మడికెరీలోని ఆయుర్వేదిక్ స్పాలో బాడీ మసాజ్ చేయించుకుంటే, ఆ హాయి కొన్ని నెలల పాటు వదిలిపెట్టదు.  మన దేశంలో ఉన్న పక్షి జాతుల్లో ఇరవై అయిదు శాతం కూర్గ్‌లోనే ఉన్నాయట. వాటన్నిటినీ చూడ్డం ఓ మంచి అనుభవం.  కుశల్‌నగర్ దగ్గర ఉన్న వల్నర్ ఫిషింగ్ క్యాంప్‌కి వెళ్తే ఫిషింగ్ చేయవచ్చు. అయితే పట్టుకుని వదిలేయాలి తప్ప వాటికి హాని చేయడానికి వీల్లేదు.  టీ, మసాలాల తోటల్లో నేచర్ వాక్ ఆహ్లాదంగా ఉంటుంది. చిక్‌లీహోల్ రిజర్వాయర్ దగ్గర సూర్యాస్తమయ సౌందర్యం చూడాల్సిందే!
 
 ఎలా వెళ్లాలి?
 బస్సులో: అన్ని ముఖ్య పట్టణాల నుంచీ డెరైక్ట్ బస్సులు ఉన్నాయి.
 రైల్లో: డెరైక్ట్ రైళ్లు లేవు. హైదరాబాద్ నుంచి మైసూర్ వరకూ రైల్లో వెళ్లి, అక్కడి నంచి క్యాబ్ లోనో, బస్సులోనో వెళ్లాలి.
 ఫ్లయిట్‌లో: నేరుగా వెళ్లే విమానాలు లేవు. మంగుళూరు వెళ్లి, అక్కణ్నుంచి  ట్యాక్సీలో కూర్గ్ వెళ్లవచ్చు.
 విడిగా కంటే ప్యాకేజీ ఉత్తమం. ఇద్దరు మనుషులకి మూడు పగళ్లు, రెండు రాత్రులకి స్టాండర్డ్ ప్యాకేజీ అయితే రూ. 18,000 వేల లోపు, డీలక్స్ అయితే రూ. 30,000 లోపు, లగ్జరీ అయితే రూ. 37,000 లోపు అవుతుంది. అన్నీ అందులోనే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement