కర్ణాటక రాష్ట్రంలోని ‘కూర్గ్’ పేరు వినగానే ఎవరికైనా ఒళ్లు పులకరిస్తుంది. పలు రకాల పూల సమ్మిళిత సువాసనలు. రకరకాల కాఫీ గింజల గుబాళింపులు ముక్కు పుటాలను అదరగొడతాయి. ఊపిరితిత్తులకు కొత్త ఊపిరినిస్తాయి. అనిర్వచనీయమైన అనుభూతినిస్తాయి. అందమైన పచ్చిక బయళ్లు, గుబురైన చెట్ల సముదాయంతో బారులు తీరిన పర్వత శ్రేణులు, వాటి మధ్యనుంచి జాలువారే జలపాతాలు, కొమ్మ కొమ్మకు పలకరించే పక్షుల కిలకిలారావాలు. వన్య ప్రాణుల అలజడి మదిలో మెదులుతాయి. ఇదంతా వినడం వల్లనే, చదవడం వల్లనే మనలో కలిగే అనుభూతి. ఇక ప్రత్యక్షంగా వీక్షిస్తేనా....? ఆ అనుభూతిని ఎవరైనా మాటల్లో చెప్పడం కష్టం. ఎవరికి వారు ఆ అనుభూతిని అనుభవించి పరవశించాల్సిందే. అందుకే కూర్గ్‌ను ‘స్కాట్‌లాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణించారేమో!