బడి గంట గణగణ
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
బడిబాట పట్టనున్న 10 లక్షల మంది విద్యార్థులు
సర్కారు స్కూళ్లకు సమస్యలతో స్వాగతం
సిటీబ్యూరో:ఇన్నాళ్లూ ఆటపాటలు, విహార యాత్రలతో గడిపిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. దాదాపు ఒకటిన్నర నెలల తరువాత పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.జంట జిల్లాల్లో సుమారు ఐదువేల పాఠశాలలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు తమ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, బ్యాగ్‌ల వంటివి కొనుగోలులో తల్లిదండ్రులు తలమునకలవుతున్నారు. మరోవైపు పెరిగిన ఫీజులు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి.
సమస్యల లోగిళ్లు...
హైదరాబాద్ జిల్లాలో 712, రంగారెడ్డి జిల్లాలో రెండు వేలకుపైగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సౌకర్యాలు లేవు. మరికొన్ని చోట్ల ఈ సౌకర్యాలు ఉన్నా... నీరు లేకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. ఇంకొన్ని చోట్ల మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చాలా పాఠశాలలకు ప్రహరీలు లేవు. వేసవిలో ఈ పనులు చేపట్టాల్సి ఉండగా.. పూర్తి స్థాయిలో జరుగలేదు. ఇక తాగునీటికి నోచుకోని స్కూళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. పారిశుద్ధ్యానిదీ అదే పరిస్థితి. ఈ క్రమంలో నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థులకు ఎప్పటిలాగానేసమస్యలు స్వాగతం పలకనున్నాయి.
పూర్తిగా రాని పుస్తకాలు
ఈ విద్యా సంవ త్సరానికి హైదరాబాద్ జిల్లాకు 12.33 లక్షలు, రంగారెడ్డి అర్బన్ మండలాలకు 10.39 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం. ప్రస్తుతం 19.85 లక్షల పుస్తకాలు మాత్రమే రామంతాపూర్‌లోని జిల్లా ప్రభుత్వ సేల్స్ మేనేజర్ కార్యాలయానికి చేరుకున్నాయి. గోదాం నుంచి ఇప్పటి వరకు 17.30 లక్షల పుస్తకాలను ఎంఆర్‌సీ కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని స్కూళ్లకు చేరాయని మండల విద్యా శాఖాధికారులు వెల్లడించారు. మరో 2.55 లక్షల పుస్తకాలు గోదాంలోనే మగ్గుతున్నాయి. అన్ని తరగతులకు సంబంధించినవి పూర్తి స్థాయిలో రాకపోవడంతో అక్కడే ఉంచేసినట్టు తెలుస్తోంది. అప్పటి వరకు విద్యార్థులు అరకొర పుస్తకాలతోనే కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి దాపురించింది. మిగిలిన పుస్తకాలు జిల్లాకు చేరుకోవడానికి మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
మరింత ప్రణాళికాబద్ధంగా..
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్‌లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పిల్లలు చదువుపై అధిక శ్రద్ధ పెట్టేలా కౌన్సెలింగ్ చేస్తామన్నారు. 90శాతానికి పైగా పుస్తకాలు బడులకు చేరాయని తెలుగు, ఉర్దూ మీడియానికి సంబంధించి మరికొన్ని రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వ రకు వచ్చిన పుస్తకాలను పాఠశాలలు పున:ప్రారంభం రోజునే విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. మిగిలినవి మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని, రాగానే వాటినీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.