నిర్లక్ష్యం తెచ్చిన విషాదం | Hyderabad Students' Deaths Expose Himachal Pradesh's Lack of Contingency Plans | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం తెచ్చిన విషాదం

Published Wed, Jun 11 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

Hyderabad Students' Deaths Expose Himachal Pradesh's Lack of Contingency Plans

సంపాదకీయం: వేర్వేరు స్థాయిల్లో తీసుకోవలసిన చిన్న చిన్న జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంవహిస్తే ఏమవుతుందో హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో బియాస్ నదిలో మృత్యువాతపడిన విద్యార్థుల ఉదంతం తెలియజెబు తున్నది. తమ పిల్లలు మంచి చదువులు చదువుకుంటున్నారని, మరి కొన్నాళ్లలోనే ప్రయోజకులై జీవితంలో స్థిరపడతారని తల్లిదండ్రు లంతా ఆశిస్తున్న తరుణంలో ఇంతటి పెనువిషాదం వారిని చుట్టు ముట్టింది. హృదయమున్న ప్రతి ఒక్కరినీ తల్లడిల్లేలా చేసింది. యా త్రకని ఎంతో ఉత్సాహంగా వెళ్లిన పిల్లలు ఇలా శాశ్వతంగా దూరమ వుతారని, తమకు గర్భశోకం మిగులుస్తారని ఎవరూ అనుకుని ఉం డరు. హైదరాబాద్ నగర శివార్లలోని విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24మంది, ఒక టూర్ ఆపరేటరు గల్లంతుకాగా నలు గురు విద్యార్థుల మృతదేహాలు మాత్రమే ఇంతవరకూ లభించాయి. గల్లంతైనవారిలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారో లేదో ఇంతవరకూ తెలియ లేదు. అసలు విద్యార్థులు వెళ్లింది పారిశ్రామిక శిక్షణకా లేక విహార యాత్రకా అన్న స్పష్టత లేదు.
 
  కాలేజీ యాజమాన్యానికైనా ఉన్నదో లేదో తెలియదు. విహారయాత్రకైతే యూనివర్సిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జెన్‌టీయూ చెబుతున్నది. ఇలాంటి సంద ర్భాల్లో అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి నిబంధనలుగానీ, మార్గ దర్శకాలుగానీ ఇంతవరకూ లేవని జేఎన్‌టీయూ ప్రకటన చూస్తే అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు వాటికి రూపకల్పన చేస్తామంటు న్నారు. ఈ దుర్ఘటనతో పోలిస్తే చిన్నదే కావొచ్చుగానీ కొన్నాళ్లక్రితం పులిచింతల ప్రాంతంలో కూడా ఇలాగే ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. యాత్రలకు తీసుకెళ్లేటపుడు పాటించాల్సిన అంశాల విషయంలో తగిన నిబంధనలను అప్పుడే రూపొందించివుంటే కళా శాల యాజమాన్యాలకు తగిన అవగాహన వచ్చివుండేది. తల్లిదం డ్రులు కూడా అన్నివిధాలా సంతృప్తిపడిన తర్వాతే తమ పిల్లలను అనుమతించేవారు.
 
  విద్యార్థులను యాత్రలకు తీసుకెళ్లేట పుడు ఆయా ప్రాంతాల గురించిన సం పూర్ణ అవగాహన ఉన్నవారిని వారితోపాటు పంపడం కనీస ధర్మం. కనీసం స్థానికులెవరినైనా గైడ్లుగా పెట్టుకునివున్నా బాగుండేది.  ప్రమా దాలు పొంచివుండే ప్రాంతాలేమిటో, అత్యంత జాగురూకతతో మెల గవలసిన అవసరం ఉన్న ప్రదేశాలేమిటో తెలిసివున్నవారు విద్యార్థుల తోపాటు ఉంటే అది ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు విద్యార్థులు దిగిన ప్రదేశానికి 2.7 కిలోమీటర్ల ఎగువన ఒక చిన్న బరాజ్ ఉన్నదని, అక్కడ అప్పుడప్పుడు నీళ్లు వదిలే అవకాశం ఉంటుందన్న అవగాహన ఉన్నవారు విద్యార్థులకు తోడుగా ఉంటే వా రిని అప్రమత్తం చేసేవారు. కనీసం బరాజ్ ప్రదేశానికి వెళ్లి నీళ్లు వదిలే సమయం ఎప్పుడో తెలుసుకునేవారు. అటు తర్వాతే విద్యార్థులు భరోసాతో ఆ ప్రదేశానికి వెళ్లేవారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలపై శ్రద్ధవహించకపోవడం యాజమాన్యంవైపు నుంచి జరిగిన లోపం.
 
 బరాజ్ నిర్వహణ కూడా అస్తవ్యస్థంగా ఉన్నదని అక్కడినుంచి వెలువడుతున్న కథనాలు సూచిస్తున్నాయి. మలుపులతో ఉన్న బియాస్ నదీమార్గంలో విద్యుదుత్పాదన కోసమని బరాజ్ నిర్మిం చినప్పుడు, అవసరాన్నిబట్టి గేట్లు వదులుతున్నప్పుడు ఆ సంగతిని తెలియజెబుతూ నదీమార్గం పొడవునా అక్కడక్కడ హెచ్చరికల బోర్డులుంచాలని ప్రభుత్వ యంత్రాంగానికి తట్టలేదు. అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయమేమంటే గేట్లు తెరిచినప్పుడు సైరన్ మోత మోగిస్తారటగానీ అది బరాజ్ చుట్టుపక్కల కొంత దూరం మాత్రమే వినబడుతుందట! వదిలిపెట్టే నీరు ఒక్కసారిగా ఆరేడు అడుగుల ఎత్తున ఎగిసిపడుతూ బయటికొస్తుంది. ప్రవాహం ఉరవడి పెరుగుతుంది.
 
 నదీమార్గం పొడవునా క్షణాల్లో ఈ మార్పులు చోటు చేసుకుం టున్నప్పుడు... సరిగ్గా అక్కడే సందర్శకుల రద్దీ నిత్యమూ ఉంటున్న ప్పుడు ప్రమాదాలకు ఆస్కారం ఉండవచ్చునన్న ఆలోచన ప్రభుత్వ యంత్రాంగానికి కలగాలి. అందుకు తగినట్టుగా నిర్ణీత ప్రాంతాల్లో సైరన్‌లు మోగించడమో, మరోవిధమైన ఏర్పాటో చేయాలి. ప్రమా దం చోటుచేసుకున్న ప్రాంతంలో జలపాతం ఉన్నదంటేనే సందర్శ కులు ఫొటోలు తీసుకోవడానికి తప్పనిసరిగా అక్కడ ఆగుతారని అంచనా ఉండాలి. పైగా నదీమార్గం మలుపులతో ఉన్నప్పుడు ఎగువ నుంచి వచ్చే నీటి ఉరవడిని సమీపానికి వచ్చేవరకూ గమ నించడం సాధ్యంకాదు. ఇలాంటి అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం, అందుకవసరమైన చర్యలు తీసుకోకపోవడం విచా రకరం. ప్రమాదం జరిగాక అయినా అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేని తీరు చూస్తే దాన్నుంచి ఇన్ని ముందు జాగ్రత్తలను ఆశించడం వృథా ప్రయాసే.
 
 అయితే, మనకున్న విపత్తుల నివారణ సంస్థ పనితీరు కూడా అధ్వాన్నంగానే ఉన్నది. ప్రమాదాలు సంభవించాక వివిధ శాఖలను అప్రమత్తం చేయడం, సహాయబృందాలు తరలివెళ్లేలా చూడటంవంటి పనులు ఆ సంస్థ చేస్తున్నది. అవి అవసరమే. కానీ, ఇలా ప్రమాదాలు పొంచివుండే ప్రాంతాలను సర్వేచేసి స్థానిక యం త్రాంగానికి తగిన సూచనలివ్వడం, వాటి అమలు తీరును ఎప్ప టికప్పుడు పర్యవేక్షించడంవంటివి చేయడం లేదు. దేశంలో ఏ ప్రాంతం గురించి అయినా, అక్కడ ఎదురుకాగల ఇబ్బందుల గురించి అయినా సంపూర్ణ అవగాహన కలిగించేలా వెబ్‌సైట్‌ను రూపొందించి మరిన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలని అందరినీ కోరితే...వాటిని సైతం వెబ్‌సైట్‌లో ఉంచితే సందర్శకులు తాము దిగిన స్థలం ఎలాంటిదో అక్కడికక్కడే అవగాహన తెచ్చుకుంటారు. ఈ కనీస జాగ్రత్తలు లేకపోవడమే విలువైన యువ ప్రాణాలను కబళించింది. ఈ నిర్లక్ష్యం పోవాలంటే ఇంకెందరు బలికావాలో?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement