ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆదివారం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. గత కొన్ని రోజులు క్రితం బియాస్ నదిలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. తాజా గాలింపు చర్యల్లో విద్యార్థిని శ్రీనిధి మృతదేహం లభించింది. ఈ ఘటన జరిగిన 42 రోజుల తర్వాత మరో మృతదేహం బయటపడటం గమనార్హం.
గత నెల 8 వ తేదీన హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయారు. నదీ జలాల్లో ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడింది. తేరుకునే లోపే దాదాపు 24 మంది విద్యార్థులు ఆ ప్రవాహ ఉధృతికి గల్లంతయ్యారు.