మనాలి: ప్రకృతి విపత్తుకు ఎంతటివారైనా తలవంచాల్సిందే. అందుకు తాజా రుజువు ఈ వీడియో. నది ఒడ్డున నిలిపివుంచిన ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు వరద ప్రవాహం ఉధృతికి కాగితం పడవలా కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఆదివారం చోటు చేసుకుంది. బియాస్ నది ఒడ్డున నిలిపివుంచిన బస్సు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం ప్రాణనష్టం తప్పింది. వరద ముప్పు గురించి ముందే హెచ్చరించినా బస్సు సిబ్బంది పెడచెవిన పెట్టారని స్థానికులు వెల్లడించారు.
కాగా, శనివారం నుంచి కురుస్తున్న వర్షాలతో హిమాచల్ వాసులు కష్టాలు పడుతున్నారు. బియాస్ నదికి భారీగా వరద పోటెత్తడంతో భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల పాలకులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment