ఇది తీరని కడుపుకోత.. | two years completed by Beas River Incident | Sakshi
Sakshi News home page

ఇది తీరని కడుపుకోత..

Published Wed, Jun 8 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

ఇది తీరని కడుపుకోత..

ఇది తీరని కడుపుకోత..

‘బియాస్’ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
వైదేహి అనాథ ఆశ్రమంలో వర్ధంతి సభ
రెండేళ్లయినా నివేదిక సమర్పించని కమిటీ

 

సిటీబ్యూరో/సైదాబాద్: ‘చేతికి అందొచ్చిన మా పిల్లలు.. చేదోడువాదోడుగా ఉంటారనుకుంటే.. తిరిగి రాని లోకాలకు వెళ్లి పుట్టెడు శోకం మిగిల్చారు. ఈ అనాథ పిల్లల్లో మా పిల్లలను చూసుకుని బాధను దిగమింగుకుంటున్నాం. ఇంజినీరింగ్ చదివి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటున్న సమయంలో లోకం విడిచి వెళ్లిపోయారు. పిల్లలే లోకంగా జీవిస్తున్న మాకు ఆ దేవుడు కడుపుకోత మిగిల్చాడు’.. 2014 జూన్ 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతయిన 24 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన ఇది. ఈ ఘోర దుర్ఘటన జరిగి బుధవారానికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మృతుల తల్లిదండ్రులు సైదాబాద్‌లోని వైదేహి అనాథ ఆశ్రమ విద్యార్థులకు వారు బహుమతులు, దుస్తులు పంపిణీ చేసి అన్నదానం ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు యూవీ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బియాస్ బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు రాధాకృష్ణ, ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి, కె. కృష్ణారెడ్డి, సూర్యకుమార్, పద్మ, అనంతలక్ష్మి, వీరన్న, కళావతి, మిట్టపల్లి సంజయ్, మాచర్ల సుదర్శన్, ఎం. రవివర్మ, రామ్మోహన్, సుధ, వైదేహి ఆశ్రమ నిర్వాహకులు ప్రకాశరావు, రాములు, మల్లికార్జున్, విద్వాన్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

 
కాగితాలపైనే  శైలజా రామయ్యర్ కమిటీ..

బియాస్ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేసేందుకు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ డిసెంబరు 2014 వరకు విచారణ చేసి దుర్ఘటనకు గల కారణాలు, స్టడీటూర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంది. కానీ ఘటన జరిగి రెండేళ్లు పూర్తయినా నివేదిక సమర్పించకపోవడం గమనార్హం. అసలు ఈ కమిటీ మనుగడలో ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కమిటీ.. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను ఒక్కసారి మినహా మరోదఫా పలకరించలేదు. అయితే ఈ దుర్ఘటనకు బాధ్యులు వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల, లార్జీ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు లోగడ ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు వీఎన్‌ఆర్ కళాశాల యాజమాన్యం నుంచి రావాల్సిన పరిహారం మినహా తెలంగాణ , ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు, లార్జీ డ్యామ్ అధికారులు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం దశలవారీగా అందడం గుడ్డిలో మెల్ల. ప్రస్తుతం వీఎన్‌ఆర్ కళాశాల యాజమాన్యం తమ వాటా పరిహారం చెల్లించేందుకు సుప్రీంకోర్టులో డబ్బులు డిపాజిట్ చేసినట్టు తెలిసింది.

 

బాధను పంచుకోడానికేవచ్చాం..
బియాస్ దుర్ఘటన జరిగి రెండేళ్లవుతున్నా ఇంకా మరచిపోలేకపోతున్నాం. మా పిల్లలు ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నారు. అసలు సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి తప్పిదం ఉందనే కోణాల్లో దర్యాప్తు చేయలేదు.          - రాధాకృష్ణ

 

మళ్లీ జరక్కుండా చూడాలి..
రెండో వర్ధంతిని ఎవరి ఇళ్లల్లో వారు జరుపుకుంటే బాధను పంచుకునే వారుండరనే ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడి విద్యార్థుల్లో మా పిల్లలను చూసుకుంటున్నాం. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి. నష్టపరిహారం కోసం ప్రాధేయపడ్డం లేదు. దేశంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటన జరగకూడదనే మా పోరాటం. - వెంకట్‌రెడ్డి


ఏ తల్లికీ ఇంత కష్టం రాకూడదు
ఈ కడుపుకోత ఏ తల్లికీరాకూడదు. విహారయాత్రకు తీసుకెళ్లిన కళాశాల యాజమాన్యానికి విద్యార్థులను క్షేమంగా తీసుకురావల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ ఈ రోజు మాకు సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నారు. 24 మంది విద్యార్థులు మరణించినా.. ఏ ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు.   - పద్మ

 

ఇది మానవతప్పిదమే..
మానవతప్పిదం వల్లే బియాస్ దుర్ఘటన జరిగింది. నీళ్లను నదిలోకి వదిలే ముందు నలుగురు సిబ్బంది నది మొత్తం పర్యవేక్షించాలి. ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు వదలడానికి లేదు. గేట్లు ఎత్తినవారిది, తీసుకెళ్లిన వారిది తప్పే. కానీ అందరు తప్పుకోడానికే ప్రయత్నిస్తున్నారు.   - బీవీ సుబ్బారావు, ఏపీ ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement