‘బియాస్’ బాధితులకు న్యాయం చేయాలి | should be justice to beas river victims | Sakshi
Sakshi News home page

‘బియాస్’ బాధితులకు న్యాయం చేయాలి

Published Fri, Jul 4 2014 11:54 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

should be justice to beas river victims

జగద్గిరిగుట్ట:  హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, టీవీఎస్, ఏఎంఎస్‌ఏ సంఘాల విద్యార్థి నాయకులు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు స్టాలిన్, గౌతమ్, వీరబాబు, వెంకట్, భాస్కర్‌లు మాట్లాడుతూ 2012లో పులి చింతల ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లినపుడు జరిగిన ప్రమాదంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై ఉంటే బియాస్ నది సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 ప్రమాదం జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు.  విద్యార్థులను స్టడీ టూర్ పేరిట తీసుకువెళ్లి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. 24 మంది ప్రాణాలు పోవడానికి కారకులైన కాలేజీ యాజమాన్యంపై పోలీసులు స్పందించి వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

 ప్రిన్సిపాల్, డీన్‌తో వాగ్వాదం
 విద్యార్థులు ధర్నా చేస్తున్నా యాజమాన్యం దిగి రాకపోవడంతో విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారికి రక్షణగా పోలీసులు రావడం సిగ్గు చేటుగా ఉందని వారు ఆరోపించారు. పోలీసుల జోక్యంతో ప్రిన్సిపాల్ సీడీ నాయుడు, డీన్ రవీంద్రబాబు విద్యార్థులతో మాట్లాడడానికి వచ్చారు. బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు న్యాయం చేయడానికి జరుగుతున్న జాప్యంపై విద్యార్థులు వారిని నిలదీశారు. సరైన సమాధానం లభించకపోవడంతో విద్యార్థి నాయకులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు విద్యార్థి నాయకులను శాంతింపజేశారు.

 విలపించిన ఈశ్వర్‌రావు..
 2012లో పులి చింతల ప్రమాదంలో మృతి చెందిన మోహన్ తండ్రి ఈశ్వర్‌రావు తన కుమారుడు లేని జీవితం వ్యర్థంగా మారిందని కన్నీరు మున్నీరయ్యారు.

  తన కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పిన కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ సీడీ నాయుడు, డీన్ రవీంద్రబాబు లు మాట్లాడే సమయంలో ఈశ్వర్‌రావు ఆవేదనకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. విద్యార్థి నాయకులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement