విహారయాత్రలో విషాదం
జలపాతంలో ఈతకు దిగి యువకుడి గల్లంతు
గల్లంతైన యువకుడుది విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతం
సరియా వద్దకు విహారయాత్రకు వచ్చిన ఆరుగురు స్నేహితులు
వీరంతా విశాఖ రైల్వే స్టేషన్ ఫుడ్ కౌంటర్‌లో సప్లయర్లు
దేవరాపల్లి: స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు సరియా జలపాతం వద్దకు విహార యాత్రకు వచ్చిన ఓ యువకుడు గురువారం సాయంత్రం ఈతకు దిగి గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి వచ్చిన ఆరిలోవకు చెందిన మురళీ(30) ఈత కొడుతూ ఊబిలో చిక్కుకున్నాడు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని జనహరి ఫుడ్‌స సెంటర్‌లో ఫుడ్ సప్లయర్లుగా పని చేస్తున్న ఆరుగురు స్నేహితులు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు బైకులపై దేవరాపల్లి మండలం వాలాబుకు, అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీకి సరిహద్దులో ఉన్న సరియా జలపాతం వద్దకు వచ్చారు. విశాఖట్నంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆదపాక సారుు, ఆవాల అనిల్ కుమార్, చన్న సారుుకుమార్, పొట్నూరు నరసింగ్, వేంపాడ ప్రసాద్‌తో పాటు ఆరిలోవకు చెందిన మురళీ కూడా వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో వెంట తెచ్చుకున్న భోజనాలు చేసి, కొద్ది సేపు జలపాతం పరిసరాలలో ఉల్లాసంగా గడిపారు. అనంతరం వీరంతా కలిసి సరదాగా ఈతకొట్టారు. అందరూ చూస్తుండగా మురళీ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసిన ఫలించలేదు.
చీకటి పడే వరకు మురళీ కోసం స్థానికుల సహాయంతో గాలించిన ఆచూకీ లభించక పోవడంతో మిగిలిన యువకులంతా దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌ను గురువారం సాయంత్రం సంప్రదించారు. జలపాతం అనంతగిరి మండలం పరిధిలోకి రావడంతో అనంతగిరి పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైన మురళీకి ఏడాదిన్నర క్రితం వివాహం కాగా, బాబు కూడా ఉన్నట్టు తెలిసింది. కళ్లు ముందే తమ స్నేహితుడు గల్లంతవుతున్నా రక్షించుకోలేక మిగిలినవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.